అనారు పూలతోటలో.. ‘అనార్కలి’ ప్రేమగీతిక
మనకు తెలిసిన ప్రేమకథలు అధిక శాతం విషాదాంతాలే. ఒక ఆరేబియన్‌ ప్రేమకథ ‘లైలా-మజ్ను’, ఒక మొగలాయీ సామ్రాజ్య భావి యువరాజు ప్రేమకథ ‘అనార్‌ కలి’, ఒక బెంగాలీ సంపన్న కుటుంబీకుని ప్రేమకథ ‘దేవదాసు’ కేవలం కొన్ని ఉదంతాలు మాత్రమే. తెలుగులో వచ్చిన ‘లైలా-మజ్ను’, ‘దేవదాసు’, ‘అనాక్‌ కలి’వంటి విషాదాంత ప్రణయ దృశ్యకావ్యాలను రూపకల్పన చేసి, వాటిని అజరామరం చేసిన ఒకే ఒక సినిమా కవి సముద్రాల రాఘవాచారైతే, ఈ సినిమాలన్నిటిలోనూ ప్రేమికుని పాత్రలో జవీంచిన విలక్షణ నటుడు అక్కినేని నాగేశ్వరరావు. స్వయంగా సంగీత ప్రియుడైన పెనుపాత్రుని ఆదినారాయణరావు 1952లో అంజలీ పిక్చర్స్‌ సంస్థను నెలకొల్పి ప్రధమ ప్రయత్నంగా ‘పరదేశి’ సినిమాను నిర్మించి, మలి ప్రయత్నంగా ‘అనార్‌ కలి’ చిత్రాన్ని తీశారు. జీవితమే మధురంగా, రాగ సుధాభరితంగా రసజ్ఞుల హృదయాంతరాళాలను స్పృశిస్తూ సాగిన ఈ ప్రేమకావ్యం ఏప్రిల్‌ 28, 1955న విడుదలై వజ్రోత్సవం పూర్తి చేసుకున్నది. ప్రేమ వైఫల్యానికి, ప్రేమరాహిత్యానికి మధ్య జరిగిన ఆ సంఘర్షణను ఒకసారి గుర్తుచేసుకుందాం.


* కథలోకి వెళ్తే..
పర్షియా దేశంలో పుట్టిన నాదిరా (అంజలీదేవి) అదృష్టరేఖ వక్రించి ఆగ్రా నగరంలో తన జట్టుతో చేరుతుంది. ఒకనాటి సాయంకాలం అక్బరు పాదుషాకు చెందిన దానిమ్మతోటలో ఉద్యానవన అందాలను ఆస్వాదిస్తూ ‘‘అనురాగ సుధాభరితమైన జీవితమే మధుర’’మని పాడుకుంటుంటే, ఆ దారినపోయే యువరాజు సలీం అనే జహంగీరు (అక్కినేని) ఆమె అందానికి, పాడుతున్న పాటకు పరవశుడై తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. తను ఒక సాధారణ సిపాయినని నమ్మబలికి ఆమెతో స్నేహం పెంచుకుంటాడు. అక్బరు చక్రవర్తి (యస్‌.వి.రంగారావు) పూదోటకు వ్యాహాళి కోసం వచ్చినప్పుడు నాదిరా గానం విని ముగ్దుడై అనారు పూలతోబాటు ఆమెకు ‘అనార్‌ కలి’ అని బిరుదు ప్రసాదిస్తాడు. సలీం నాదిరాను ప్రేమిస్తున్న విషయం సర్వ సైన్యాధ్యక్షుడు రాజా మాన్‌సింగ్‌ (చిత్తూరు నాగయ్య)కు తెలుస్తుంది. యువరాజును మందలించి నాదిరాను మరచిపోవలసిందిగా ఆదేశిస్తాడు. ఆ సమయానికి కాబూలులో ప్రబలిన అల్లకల్లోలాన్ని అణచివేయడానికి అక్బరు చక్రవర్తి సైన్యసమేతంగా మాన్‌సింగ్‌తోబాటు సలీంను కూడా యుద్ధానికి పుంపుతాడు. ప్రియుడు లేని జీవితాన్ని భరించలేని నాదిరా సలీంను వెదుక్కుంటూ బయలుదేరి, దారిలో బందిపోటు దొంగలకు చిక్కుతుంది. ఆమెను బానిసగా విక్రయిస్తుండగా, సైనిక శిబిరంలో ఉన్న సలీం ఆమెను విడిపిస్తాడు. శత్రువులు సైనిక శిబరం మీద చేసిన దాడిలో సలీం గాయపడి ఆగ్రా చేరకుంటాడు. స్పృతి తప్పిన సలీం నాదిరా గానంతో చైతన్యవంతుడౌతాడు. అక్బరు పాదుషా ఆమెను యువరాజు పూర్తిగా కోలుకునేంతవరకు అతిథిగా ఉండమని కోరడంతో, సలీం భావి చక్రవర్తి జహింగీరు అని తెలుసుకున్న నాదిరా దిగ్భ్రమకు లోనవుతుంది. అక్బరు నాదిరాను ఆస్థాన నర్తకిగా నియమిస్తాడు. సలీంను ప్రేమిస్తున రాజనర్తకి గుల్నార్‌ (సురభి బాలసరస్వతి) ఈర్ష్యతో యువరాజ పట్టాభిషేకం నాడు నాదిరాకు పానీయంలో మత్తుమందు కలుపుతుంది. దర్బారులో నాదిరా నాట్యం చేస్తూ మత్తుమందు ప్రభావంతో సలీం వద్ద శృంగార ప్రదర్శన చేస్తుంది. అక్బర్‌ ఆగ్రహించి ఆమెకు జైలుశిక్ష విధిస్తాడు. విషయం తెలుసుకున్న సలీం, తన జోధాబాయి (కన్నాంబ)తో నాదిరాను ప్రేమిస్తున్నానని చెబుతాడు. మహారాణి ఎంత చెప్పిన పాదుషా తిరస్కరించడంతో, సలీం పట్టరాని కోపంతో అక్బర్‌ చక్రవర్తిపైనే యుద్ధానికి దిగుతాడు. అక్బర్‌ సలీంను బంధించి, నాదిరాతోబాటు ఇద్దరికీ మరణశిక్ష విధిస్తాడు. స్వయంగా సలీం తల నరికేందుకు ఉపక్రమించిన అక్బరు, అతని బాల్యచేష్టలు గుర్తుకురాగా స్పృహతప్పి పడిపోతాడు. అనార్‌ కలిని సజీవసమాధి చేస్తున్నారని తెలిసి సలీం పరుగెత్తుతాడు. కానీ అప్పటికే నాదిరా గోరీలో సజీవ సమాధి అవుతుంది. ఆ సమాధికి తల బాదుకుంటూ సలీం పడిపోవడంతో సినిమా ముగుస్తుంది.

* సినిమా విశిష్టతలు..
ఫిల్మిస్తాన్‌ సంస్త 1953లో ‘అనార్కలి’ సినిమాను హిందీలో నిర్మించింది. అందులో నాదిరాగా బీనారయ్, సలీంగా ప్రదీప్‌కుమార్, అక్బరుగా ముబారక్, జోధాబాయిగా సులోచన, రాజు మాన్‌సింగ్‌గా యస్‌.యల్‌.పూరి నటించారు. అప్పటికే ‘మొఘల్‌-యే-ఆజాం’ (1950) సినిమా షూటింగ్‌ మొదలైంది. కానీ దాని నిర్మాణానికి ఏకంగా పదేళ్లు పట్టి, చివరకు 1960లో విడుదలైంది. ఈ రెండు సినీమాలు సంగీతభరితాలుగా పేరుగాంచి సూపర్‌హిట్లుగా నిలిచాయి. హిందీ ‘అనార్కలి’ సినిమాకు మొదట వసంత్‌ ప్రకాష్‌ సంగీత దర్శకునిగా నియమించారు. ‘‘ఆ జానే వఫా..కెహతేహై కిసే ప్యార్‌ జమానే కో దిఖాదే’’ పాటను ఆయనే రికార్డు చేశారు. వసంత్‌ ప్రకాష్‌ ఆకాల మరణం చెందడంతో సి.రామచంద్ర సంగీత దర్శకత్వ నిర్వాహణకు పూనుకున్నాడు. హిందీ సినిమా ప్రేరణతోనే ఆదినారాయణరావు తెలుగులో సొంత బ్యానరుపై మలి చిత్రంగా ‘అనార్‌ కలి’ని నిర్మించారు. ఈ సినిమా తీసేందుకు ముందు ఒక జానపద చిత్రాన్ని తీయాలని ఆదినారాయణరావు రచయిత కొవ్వలిని పిలిపించి కథ రాయించారు. ఈలోగా హిందీ ‘అనార్కలీ’ సినిమా విజయం సాధించడంతో దానినే తెలుగలో తీసేందుకు నిర్ణయించారు. కొవ్వలి చేత రాయించిన కథే తరువాతి కాలంలో ‘సువర్ణ సుందరి’గా నిర్మితమై అఖండ విజయాన్ని సాధించిందనేది వేరే విషయం! ఈ సినిమా షూటింగు 11 మార్చి 1954న మద్రాసు నెప్ట్యూన్‌ స్టూడియోలో మొదలై, 28 ఏప్రిల్‌ 1955న విడుదలైంది. అవుట్‌-డోర్‌ సన్నివేశాలన్నీ మైసూరుల తీశారు. తమిళంలోకి అననువంచిన ‘అనార్‌ కలి’ సినిమా కూడా విజయవంతమైంది. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో ఒక ఎనిమిదేళ్ల అమ్మాయి తిన్నగా డ్రెస్సింగు రూముకు వెళ్లి, అంజలీదేవి ధరించాల్సిన అనార్కలి దుస్తుల్ని తొడుక్కుని, తలపై తురాయి పువ్వుతో బయటకు వస్తే, అంజలీదేవి ఆశ్చర్యపోయి ఎవరిని అడిగిందట. ఆమే ‘ఊర్వశి’గా మన్ననలందుకున్న మేటి నటి శారద. ఈ సినిమాకు స్క్రీన్‌ ప్లేతో బాటు దర్శకత్వ బాధ్యతలు నిర్వహించిన వేదాంతం రాఘవయ్య దర్శకత్వ ప్రతిభ, నిర్మాత సంగీత దర్శకుడు ఆదినారాయణరావు సంగీత దర్శకత్వ సామర్థ్యం ఒక దానితో ఒకటి పోటీపడ్డాయి. కమల్‌ఘోష్‌ సినిమాటోగ్రఫీ అద్భుతంగా అమరింది. ఈ చిత్ర ప్రారంభ సన్నివేశమే చాలా గొప్పగా ఉంటుంది.


మరణశిక్షకు గురైన నాదిరా సమాధి ఎదురుగా దీపం వెలుగుతుంటే ఆ సమాధి పక్కనే నిలబడి అనార్‌ కలిని స్మరిస్తూ ముకుళిత వదనంతో సలీం పాడుకోవడాన్ని ప్రారంభ షాట్‌ ద్వారా చూపడం వేదాంతం రాఘవయ్య దర్శకత్వ ప్రతిభే! ప్రేమను సమర్ధించకుంటూ సలీం ఎదిరించే సన్నివేశం, జోధాబాయి - అక్బరు - సలీంల మధ్య వచ్చే సన్నివేశాల చిత్రీకరణ వేదాంతం రాఘవయ్య దర్శకత్వ ప్రతిభకు గీటురాళ్లుగా నిలిచాయి. సముద్రాల రాఘవాచారి ఈ చిత్రానికి సమకూర్చిన సంభాషణలు మొఘలాయీ పాలానాకాలాన్ని తలపిస్తాయి. సౌరు, మధుపాయి, బేజారు, ఖుదా, హమేషా వంటి ఉర్దూపదాల మార్దవ్యం ఆయన సంభాషణల్లో అడుగడుగునా కానవస్తుంది. ‘‘ప్రేమతో పోటీ పడకండి. ప్రేమను జయించడం దేశాలను జయించడం కాదు ప్రభూ..దేవతలు కూడా తలవంచారు’’ అంటూ అనార్‌ కలి అక్బరుతో వాదించడం; మారువేషంలో వున్న సలీంతో ‘‘ఆడది ఒక్కసారే ప్రేమిస్తుంది. ఒక్కరినే ప్రేమస్తుంది. ఆ ప్రేమ కోసమే జీవిస్తుంది. అది లభించకపోతే మరణిస్తుంది’’ అని చెప్పించడం; సలీం తల్లి జోధాబాయి చేత ‘‘ఏనాడు వలపు తీపే కానీ, కడుపు తీపి తెలుసుకోలేవయ్యా’’ అని చెప్పించడం; సందర్భానుసారంగా లోకోక్తులు చెప్పడం సముద్రాల సాహితి పటిమను గుర్తుచేస్తుంది. ముఖ్యంగా అనార్‌ కలి పాత్రలో అంజలీదేవి ఒదిగిపోయిన తీరు, నర్తకి పాత్రలో ప్రదర్శించిన హావభావాలు మరెవరూ ఆ పాత్రకు సాటిరారని చెప్పకనే చెబుతాయి. ఇక అక్బరు చక్రవర్తిగా పైకి కఠినంగా కనిపించినా అందరినీ సమాదరించే సున్నిత మనస్కునిగా, సౌందర్యారాధకునిగా, సమర్థ పాలకునిగా, ఆవేదనకు గురైన తండ్రిగా, నాదిరా ప్రేమకు పట్టం కడుతూనే ఆ ప్రేమను సమర్థిస్తే తన రాచమర్యాదలకు భంగం కలుగుతుందని వేదనకు గురయ్యే సంక్లిష్ట పాత్రలో యస్వీ రంగారావు తన సహజ హావభావాలను అద్భుతంగా చూపారు. జోధాబాయి పాత్రలో కన్నాంబ జీవించిందని చెప్పాలి. ఇక చిత్తూరు నాగయ్య నటనకు నూరు మార్కులు తక్కువే! ఈ పాత్రలన్నింటికీ సంధానకర్త నిస్సందేహంగా దర్శకుడే! నాగేశ్వరరావు ధరించిన సలీం పాత్ర కొంత మొండితనం, కొంత పిరికితనం మేళవించిన వింత మనస్తత్వపు పాత్ర. ఒక రకంగా చెప్పాలంటే వినోదావారి ‘దేవదాసు’ పాత్రవంటిదే. అది అక్కినేనికి కొట్టిన పిండి. తల్లి మాటకు ఎదురు చెప్పలేక, తన ప్రేమను పండించుకోలేక యుద్ధరంగం నుంచి వెనుదిరిగే సన్నివేశంలో అక్కినేని కంటినీరు తెప్పించారు. ఈ సినిమాకు సహాకార దర్శకుడు గాదిరాజు కేశవరావు ఉస్తాద్‌ తాన్సేన్‌ పాత్రలో ‘‘రాజశేఖరా నీపై మోజు తీరలేదురా’’ పాటలో కనిపిస్తారు. యన్టీ రామరావు గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్‌ కాలేజీలో చదివేరోజుల్లో ముద్దుకృష్ణ రాసిన ‘అనార్కలి’ నాటకంలో సలీం పాత్రను ప్రతిభావంతంగా పోషించేవారు. ఆ కథపై మోజు తీరక 1978లో ‘అక్బర్‌-సలీం-అనార్కలి’ సినిమా నిర్మించి వయసుకు తగ్గ అక్బరు పాత్రను పోషించడం తెలిసిందే. హిందీ ‘అనార్కలి’ సినిమాకు సంగీతం సమకూర్చిన సి.రామచంద్ర యన్టీఆర్‌ సినిమాకు తెలుగులో సంగీత దర్శకత్వం నిర్వహించడం విశేషంగా చెప్పుకోవాలి! విజయవాడ విజయా టాకీసులో ‘అనార్‌ కలి’ సినిమా వందరోజుల పండుగ జరుపుకుంది.
 
                         

* రాగసుధా భరితాలు
తెలుగు ‘అనార్‌ కలి’ సంగీత దర్శకుడు పి.ఆదినారాయణరావు కొన్ని హిందీ ‘అనార్కలి’ బాణీలను ఈ సినిమాకు వాడుకున్నారు. సముద్రాల సీనియర్‌ రాసిన పాటలు చారిత్రాత్మక కాలానికి అనుగుణంగా ఉన్నట్లు గోచరిస్తుంది. ఈ సినిమాలో అత్యంత ప్రజాదరణ పొంది, ఘంటసాల, జక్కిలకు మంచి పేరు తెచ్చిపెట్టిన యుగళగీతం ‘‘రాజశేఖరా నీపై మోజు తీరలేదురా.. రాజసాన యేలరా’’ను ఆదినారాయణరావు కొన్ని అన్యస్వరాలను చేర్చి హిందోళ రాగంలో స్వరపరచారు. హిందీలో హేమంత్‌ కుమార్, లతాజీ పాడిన ‘‘జాగ్‌ దర్ద్‌ ఇష్క్‌ జాగ్‌’’ పాటను ప్రేరణగా తీసుకొని ఈ పాటను నృత్యదర్శకుడు హీరాలాల్‌ కథక్‌ నాట్యకళారూపంలో నృత్యానికి రూపకల్పన చేశారు. ఈ సినిమాకు ప్రారంభ గీతం ‘‘ఓ అనార్కలీ.. ప్రేమకై బ్రతుకును బలిచేసిన అమరజీవి’’ అనే నేపథ్యగీతం. దీనినే ముగింపు గీతంగా వాడుకున్నారు. పాట చివరలో ‘‘అమరమై, ఆదర్శమై ఈ భారతావనిని నీ పవిత్ర ప్రణయ గాధ నిలిచిపోవు’’ అని వస్తుంది. భీంపలాస్‌ (అభేరి) రాగంలో స్వరపరచి, జిక్కి ఆలపించిన ‘‘జీవితమే సఫలము... రాగసుధా భరితము.. ప్రేమకథా మధురము’’ పాట ఒక ప్రేమగీతం. అరవై ఏళ్లయినా సంగీత ప్రియులను ఈ పాట మలయ సమీరంగా వెంటాడుతూనే ఉంది. హిందీలో ఉన్న ‘‘యేజిందగీ ఉసీకీ హై...జో కిసీ కా హో గయా’’కు ఈ పాట అనుకరణే అయినా, హిందీ మాతృకకు ఆదినారాయణరావు అక్కడక్కడా చిన్నచిన్న మార్పులు చేశారు. ఇక మరో పాట ‘‘రావోయి సఖా.. నీ ప్రియసఖి చేరగదోయి’’ కూడా అంజలీదేవి కోసం జిక్కి పాడిందే. మోహన రాగంలో కల్యాణి రాగ స్వరాలనను మేళవిస్తూ మట్లు కట్టిన ఈ పాట హిందీలో ‘‘ఆ జానే వఫా..కెహతేహై కిసే ప్యార్‌ జమానే కో దిఖాదే’’ అనే గీతాదత్‌ పాడిన పాటకు అనుసరణ. ఇక రాజా ఆలపించిన ‘‘సోజా నా మనోహరి.. సోజా సుకుమారి.. సోజా’’ పాటపై ‘జిందగీ’ సినిమా కోసం కెయల్‌ సైగల్‌ పాడిన ‘‘సోజా రాజకుమారీ సోజా’’ పాట ప్రభావం ఎంతైనా ఉంది. ఈ పాట పల్లవి బహార్‌ రాగంలో, చరణాలు మధ్యమావతి రాగంలో అమరడంతో రాజా పాడిన ఈ పాటకు మార్దవం చేకూరింది. అంజలీదేవి మీద చిత్రీకరించిన మరో జిక్కి పాట ‘‘ఆనందమే..అందాలు చిందేటి ఆనందమే’’ను పహాడి రాగంలో స్వరపరచారు. ‘‘కలిసె నెలరాజు కలువ చెలిని..కలిసే యువరాజు అనార్కలి’’ని పాట తెలుగు పదాల గుబాళింపుతో అమరిన సంగీత బాణం.

- ఆచారం షణ్ముఖాచారి


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.