బడిపంతులు రైలెక్కి రాజబాబు అయ్యాడు!
రాజమండ్రిలో రైలెక్కి...ఒక చిన్న బడిపంతులు ఉద్యోగం చేస్తూ, పిల్లలకి నవ్వుతూ, నవ్విస్తూ పాఠాలు చెప్పే రాజబాబు, రాజమండ్రి నుంచి మద్రాసు చేరాడు. సినిమాల్లో నటించాలని నాటకాల్లో హాస్యపాత్రలు వేస్తున్నాడు, నవ్విస్తున్నాడు, మద్రాసులో దిగి, ఎక్కడో వుంటూ వేషాల కోసం ప్రయత్నం మొదలుపెట్టాడు. నిర్మాతలు, దర్శకుల దగ్గర రకరకాల గొంతులతో మాట్లాడ్డం, మిమిక్రీ చేసి నవ్వించడం చేసినా, వెంటనే ఎవరూ వేషాలు ఇచ్చేసి అగ్రిమెంట్లు రాయించేసుకుని అడ్వాన్సులు ఇచ్చేయలేదు. తిరుగుతున్నాడు. పొట్టిప్రసాద్‌, రాజబాబూ ఇద్దరూ కె. వెంకటేశ్వరరావు బృందం ప్రదర్శించిన ‘దొంగవీరడు’ నాటకంలో నటించారు. ఇద్దరూ మద్రాసులో తిరుగుతున్నారు. అప్పుడు నేను ‘కథకంచికి’ అనే నాటిక రాసి. దాన్ని ఆంధ్రమహాసభ నాటిక పోటీల్లో ప్రదర్శించాలన్న ప్రయత్నాల్లో ఉన్నాను. రాధాకుమారి, పి.జె.శర్మ, పొట్టిప్రసాద్‌, నేనూ మా పాత్రలు చదువుకుంటున్నాము. అందులో, ఆఫీసు కుర్రాడి వేషం ఉంది. చాలా ఉషారైన వేషం, అది సరైన వాడికి ఇవ్వాలని, ఆ వేషం మాత్రం ఆలా వుంచేశాను. ‘‘చలాకీ ఐనవాడిని చూడ్రా’’ అన్నాను ప్రసాద్‌తో. ‘‘రాజబాబు అని వున్నాడ్రా. ఈ వేషానికి బాగుంటాడు, తీసుకొస్తాను చూడు అన్నాడు ప్రసాద్‌. ‘‘తొందరగా తీసుకురా’’ అన్నాను. ‘‘వాడు ఎక్కడుంటాడో తెలీదు పాండీబజార్‌ వెళ్లి పట్టుకోవాలి’’ అని, పాండీబజార్‌లో మకాం వేసి, రాజబాబుని పట్టి తీసుకొచ్చాడు. ఒక కొండనిండా గుబురు చెట్లుంటే ఎలా వుంటుందో అలా వుంది రాజుబాబు జుట్టు. కూచోబెట్టి నాటిక, వాడి వేషం చదివి వినిపించాను. ‘‘వెయ్యండి, సినిమావాళ్లు నాటిక చూస్తారు. అవకాశం రావడానికి అవకాశం వుంది. జుట్టు బాగా దగ్గరగా క్షవరం చేయిచండి’’ అన్నాడు. రాజబాబు పుస్తకం తీసుకుని డైలాగులు రాసుకున్నాడు. చదివాడు రిహార్సల్స్‌ మొదలుపెట్టాము. ఆ వేషాల్ని రకరకాల భావాలు, భంగిమలతో రాజబాబు పండిస్తున్నాడు. వీలున్నప్పుడల్లా రిహార్సలు వేస్తూ వచ్చాం. నేను అప్పుడు సహాయ దర్శకుడిగా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా వున్నాను. ఖాళీగా వున్న సినిమా ఆఫీసుల్లో రిహార్సల్సు ప్రదర్శన దగ్గరవుతున్న కొద్దీ. రాత్రులు రిహార్సలు, ఎవరికీ వాహనాలు లేవు. బస్సులు కూడా తిరగవు. అలాగే నడుచుకుంటూనే వెళ్లి ఓపిగ్గా పట్టుదలతో రిహార్సల్సు చేసి, ప్రదర్శిస్తే మా నాటికకి ‘‘ఉత్తమ ప్రదర్శన’’, రాధాకుమారికి ఉత్తమ నటి బహుమతులు వచ్చాయి. మా నాటిక కాగానే, ఆలిండియా రేడియోలో వున్న జనమంచి రామకృష్ణ గారు లోపలికి వచ్చి మమ్మల్ని అభినందించి, ‘‘ఎల్లుండి రేడియో స్టేషన్‌కి రండి. రికార్డు చేద్దాం’’ అని పిలిచేసరికి అందరికీ ఆనందం. (అప్పట్నుంచి జనమంచి రామకృష్ణ గారి పోత్రాహంతో, రేడియోకి ఎన్నో నాటికలు రాశాను) వెంటనే వాణీమహల్‌లో, (నాగయ్యగారి దయవల్ల థియేటర్‌ ఉచితం) ఇంకో రెండు నాటికలతో, ‘కథకంచికి’ ప్రదర్శించాము. సినిమా ప్రముఖులకి ఆహ్వానాలు పంపిస్తే, చాలామంది వచ్చారు. ముఖ్యంగా కె.వి.రెడ్డిగారు ఆయన వెళ్లబోతూ, మళ్లీ అగి నిలబడే, కొంతసేపు చూశారని, ఆయన దగ్గర సహాయకుడిగా పనిచేస్తున్న సింగీతం గారు చెప్పారు. మర్నాడే రాజబాబును కె.వి.రెడ్డి గారింటికి వెళ్లమన్నాను. వెళ్లాడు. ఆయన అభినందించి, ‘‘హరిశ్చంద్ర’’లో (1965) కాలకౌశికుడి శిష్యుల్లో ఒకడిగా వేషం ఇచ్చారు. పి.జె.శర్మకి కూడా ఇచ్చారు. అంతకుముందే రాజబాబు ‘‘సహజం’’ (1960) మొదటి సినిమా, (రేలంగి నిర్మాత అని కాకపోయినా, సమర్పకుడు) మరికొన్ని సినిమాల్లోనూ చిన్నచిన్న వేషాలు వేశాడు. రానురాను, రాటుదేలాడు. డాక్టర్‌ రాజారావు గారి ‘‘అల్లూరి సీతారామరాజు’’ నాటకం, నేడు రాసిన ‘నాలుగిళ్ల చావిడి’ నాటకం మంచి పేరుతేవడంతో, హాస్యనటుడిగా పేరొచ్చి, సినిమాలు వచ్చి ‘‘స్టార్‌’’ అయ్యాడు. మంచి గుణాలు గలవాడు ఎందరినో చదించాడు, దానధర్మాలు చేసే వాడు. హాస్యంతోపాటు ఏడిపించే పాత్రలు కూడా చేశాడు.


* అమ్మవారికి మొక్కులు...
‘కానిస్టేబుల్‌ కూతురు’ (1963) అని ఒక సినిమా వచ్చింది. ‘పోలీస్‌ కారన్‌ మంగళ్‌’ అనే తమిళ చిత్రానికి అనుకరణ. తమిళ చిత్రంలో నాగేష్‌ మంచి హాస్యపాత్ర చేశాడు. మంచి పేరు వచ్చింది, తెలుగులో ఆ పాత్ర తనకి వస్తే బాగుంటుందని రాజబాబు, తిరిగాడు. ఆ చిత్రం దర్శకుడు తాపీ చాణక్య ఆయన్ని కలిశాడు. ‘‘ఏమో, ఇంకా ఎవరా ఏమిటా అని ఏమీ అనుకోలేదు’’ అన్నాడు. ‘నాకివ్వండి’ అని అడిగితే, ‘చూద్దాం’ అన్నారుట. ఆ వేషం తనకి రావాలి. ఎవరెవరిచేత చెప్పించుకుటే వస్తుందో అందరి దగ్గరకీ వెళ్లాడు.
మా యింటికి దగ్గర్లోనే, ముప్పాత్తమ్మ అని అమ్మవారి గుడి వుంది. నా భార్య తరచు వెళ్లేది. ఒకరోజు రాజబాబు వచ్చి- ‘‘అక్కా! నువ్వు రోజూ అమ్మవారి గుడికి వెళతావు కదా, నాగేష్‌ వేషం నాకు వచ్చేలా చెయ్యమని కొబ్బరికాయ కొట్టి ప్రార్ధించావూ- కొబ్బరికాయ నేను కొని ఇస్తాను’’ అన్నాడు. ‘‘నేను ప్రార్ధిస్తాను సరేరా, నువ్వు రోజూ ఇలాగే వెళతావు కదా ఏడురోజుల పాటు వరసగా గుడికి వెళ్లి - ప్రదక్షిణలు చేసి ప్రార్థించు. అమ్మవారు అనుగ్రహిస్తుంది’’ అని చెప్పింది రాధాకుమారి. రాజుబాబు, శ్రద్ధగా పట్టుదలతో వారం రోజులూ ప్రదక్షిణలు చేశాడు. మొత్తానికి ఆ వేషం వాడికే వచ్చింది. అప్పట్నుంచి, ముప్పాత్తమ్మకి రోజూ వెళ్లి, హారతులు ఇచ్చేవాడు. అక్కడున్న బిచ్చగాళ్లకి చేతికి ఎంతవస్తే అంతా వేసేసేవాడు. ‘కానిస్టేబుల్‌ కూతరు’ వేషం బాగా చేశాడని రాజబాబుకి పేరొచ్చింది. అలా, పట్టుదల పట్టి కొన్ని వేషాలు సాధించి ‘‘రాజబాబు ప్రతి సినిమాలో వుండాలి’’ అన్న పేరు సంపాదించుకున్నాడు. మంచి పనులు కొన్ని చేస్తున్నా చెడ్డ అలవాట్లు కొన్ని వస్తాయి. సిగరెట్టు లేదుగాని, నిదానంగా మద్యం వాడిని వరించింది. దాంతో వేషాలు సరిగా చెయ్యలేకపోయేవాడు. ఫలితంగా తగ్గాయి. చిన్న వయసులోనే రాజబాబుని వ్యసనం పొట్టన పెట్టుకుంది. ఇవాళ నాటి సినిమాలు చూస్తూవుంటే, రాజబాబు నవ్వించిన నవ్వు ఆగదు. చిట్టిబాబు, అనంత్‌బాబు, రాజబాబు తమ్ముళ్లు ఇద్దరూ నటులయ్యారు- సినిమాల్లోనూ, సీరియల్స్‌లోనూ నటిస్తున్నారు. రాజబాబు నిర్మాతగా ‘మనిషి రోడ్డున పడ్డాడు’ (1976) అనే సినిమా తీశాడు. నాకు, నా భార్యకీ వేషాలు ఇచ్చాడు. కృతజ్ఞత!


* నవ్వుల నాగేష్‌ వేదాంతి కూడా...
నాగేష్‌ మాతృభాష కన్నడం అయినా, తమిళనటుడుగానే స్థిరపడ్డాడు బాలచందర్‌ నాటకాల్లో ఎక్కువగా నటించేవాడు తమిళం, కన్నడం, తెలుగు, మలయాళ చిత్రాలన్నింటిలో హాస్యపాత్రలు ధరించాడు. నవ్విస్తూనే ఏడిపించే పాత్రలు ఎన్నో చేసి, ‘గొప్పనటుడు’ అనిపించుకున్నాడు. నాటకం ప్రాణం. పాత్రని పైపైకి తీసుకెళ్లే ప్రజ్ఞ వుంది నాగేష్‌ దగ్గర. కొన్ని సినిమాల్లో అతనికి తండ్రిగా నేను నటించినప్పుడు చూసేవాడిని. రాసిన సీను మొత్తం మారిపోయేది. దానికి కొత్తరూపం తెచి, హాస్యానికి సానబట్టేవాడు. చతురుడు, నిత్యం హాస్యమే. ప్రాక్టికల్‌ జోక్స్‌ ఎన్నో అనాటి తమిళచిత్రాలు టీవీలో వస్తే, నాగేష్‌ వున్నాడంటే- చూసి తీరవలసిందే. చందమామ విజయా కంబైన్స్‌ ‘‘నమ్మవర్‌’’ అని తమిళంలో (కమలహాసన్‌ నాయకుడు) తీసిన సినిమాల్లో నాగేష్‌ వున్నాడు. కాలేజీలో లెక్చరరు పాత్ర. తన కూతురు చనిపోయిన దృశ్యంలో నాగేష్‌- ప్రేక్షకుల కళ్లని తడి చేసేశాడు. ‘నవ్వించ వలసిన వాడు ఏడిపించాడా!’ అనిపించాడు. సాధారణంగా హాస్యనటుడు ఏడిస్తే ప్రేక్షకులు నవ్వుతారు. అందులోనూ వాళ్లకి హాస్యమే కనిపిస్తుంది. కానీ నాగేష్‌ విసాదాన్ని వినోదాన్నీ సమపాళ్లలో పండిస్తాడు. వేదాంతి. ఎన్నో సుభాషితాలు రాశాడు. వాటిలో సత్యంతోపాటు వ్యగ్యం కూడా వుంటుంది. ‘‘చేతి రేఖల్లో నాకు నమ్మకం లేదు. కోతుల చేతుల్లో కూడా రేఖలుంటాయి’’, ‘‘కొందరు రచయితలు ఎలాంటి రాతయినా చదవగలరు, కాపీ కొట్టగలరు. బ్రహ్మరాతని మాత్రం కాపీ కొట్టలేరు, చెరిపేయనూ లేరు’’ లాంటివి.

ఓసారి చెప్పాడు! ‘‘స్కూల్లో చదువుకుంటున్నప్పుడు టీచరు, ‘ఒక మణుగు ఇనుము బరువా, దూది బరువా?’ అని అడిగారు. ‘అందరూ రెండూ ఒకటే బరువు’’ అన్నారు. నేను మాత్రం ‘ఇనుము బరువన్నాను’ టీచరుకి కోపం వచ్చి- ‘‘ఎలారా?’’ అన్నారు. ‘‘మీరు ఒక అరుగు కింద కూచోండి. నేను అరుగు మీద నిలబడి మీ తలమీద పడేస్తాను. అప్పుడు చెప్పండి ఏది బరువో!’’ అన్నాను. అనగానే టీచరు- నవ్వి ‘‘ఓరి భఢవా! బలే చెప్పావురా. నువ్వు మంచి చమత్కారివి అవుతావురా’’ అని దీవించారు’’. ఒక దశలో ఎంతో బిజీగా ఉండేవాడు. రోజుకి ఐదారు సినిమాల్లో నటించేవాడు. అతని కారులో, ఆయా సినిమాలకి సంబంధించిన, విగ్గులు, దుస్తులూ వేసుకుని, మేకప్‌మాన్‌ని కూచోబెట్టుకుని, ఒక్కో చోటా రెండుగంటలూ మూడుగంటలూ పనిచేసేవాడు. అందరికీ నాగేష్‌ కావాలి. అందరూ నాగేష్‌కి కావాలి. నాగేష్‌ షూటింగ్‌కి ఏటైముకి వస్తాడో చెప్తే- ఆ వేళకి ఆ దృశ్యాలు సిద్ధం చేసి వుంచుకుని, రాగానే చిత్రికరణ అరంభించేవారు - దర్శకులు.
- రావికొండల రావు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.