మీసాల పులి హెచ్‌.ఎం.రెడ్డి సినిమా తెనాలి రామకృష్ణ
భారతదేశంలో టాకీయుగం ప్రారంభమైనప్పుడు అర్దేషిర్‌ ఇరాని భారతదేశపు తొలి టాకీ చిత్రం ‘‘ఆలం ఆరా’’ (14, మార్చి 1931) ను నిర్మించారు. దానికి హెచ్‌.ఎం.రెడ్డి అనే హనుమప్ప మునియప్ప రెడ్డి సహాయ దర్శకుడిగా వ్యవహరించారు. అదే సంవత్సరం అర్దేషిర్‌ ఇరాని దక్షిణాన తొలి తమిళ సినిమా ‘‘కాళిదాసు’’ (31, అక్టోబరు 1931)ను నిర్మించారు. ఆ సినిమాకు దర్శకత్వం నిర్వహించిన ఘనత హెచ్‌.ఎం.రెడ్డిది. అలాగే తెలుగులో తొలి టాకీ ‘‘భక్తప్రహ్లాద’’ (6, ఫిబ్రవరి 1932) చిత్రాన్ని కృష్ణా ఫిలిం కంపెనీ పేరిట సొంతంగా నిర్మించి దర్శకత్వం వహించిన ఘనత కూడా హెచ్‌.ఎం.రెడ్డిదే. 1938లో రోహిణి పిక్చర్స్‌ను స్థాపించి ‘‘గృహలక్ష్మి’’ సినిమా నిర్మించక ముందు, దాని తర్వాత ఆయన ఎన్నో హిందీ, తమిళ, తెలుగు టాకీలకు దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. 1940లో మొక్కపాటి నరసింహశాస్త్రి నవల ‘‘బారిస్టర్‌ పార్వతీశం’’ సినిమాకు దర్శకత్వం వహించాక, హెచ్‌.ఎం.రెడ్డి ‘‘పాండురంగ మహాత్మ్యం’’ వంటి అద్భుత గ్రంధాన్ని రచించిన అష్ట దిగ్గజాలలో ఒకడైన ‘‘తెనాలి రామకృష్ణ’’ జీవితాన్ని సినిమాగా మలిచారు. ఈ సినిమా 22, మార్చి 1941 విడుదలై విజయం సాధించింది. ఈ సినిమా విశేషాలు ఇవీ...


రామకృష్ణ బాల్యం...
ఇది రెండంచెల సినిమా. తొలి అంచె రామకృష్ణుని బాల్యం. మలి అంచె రామకృష్ణుని పండిత జీవనం. రామకృష్ణుని తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోతే, అతడు తెనాలి గ్రామంలో మేనమామ వద్ద పెరుగుతాడు. వీధిబడిలో చదువుకుంటున్నప్పుడు సహ విద్యార్థులతో కలిసి ‘‘భగవద్గీత’’ నాటకం వేస్తే, యదార్థం చెప్పినుందుకు ఆ ఊరి పెద్దమనుషులు రామకృష్ణున్ని కొట్టబోతారు. గోముఖవ్యాఘ్రాల వంటి ఆ చీడపురుగుల దురాక్రమాలను ఎదిరించడం రామకృష్ణుడు ఒక పనిగా పెట్టుకుంటాడు. అప్పటికే ఇద్దరు భార్యల్ని పొట్టనబెట్టుకున్న వృద్ధుడు కరణం, తొమ్మిదేళ్ల సౌభాగ్యం అనే బాలికను పెళ్లాడాలని ప్రయత్నిస్తాడు. సౌభాగ్యం తమ్ముడు రామకృష్ణుడికి స్నేహితుడు. వారు సౌభాగ్యాన్ని దాచేసి, పెళ్లికూతురు వేషంలో రామకృష్ణుడు కరణం చేత తాళి కట్టించుకొని అతనికి బుద్ధిచెబుతాడు. ఇక పుష్ప అనే సాని కులస్తురాలిని బడిపంతులు భూతవైద్యం పేరుతో లొంగదిసుకొని, ఆ ఊరి దుకాణదారుకు ఉంపుడుగత్తెగా నియోగిస్తాడు. రామకృష్ణుడు, తన సహపాఠి సాయంతో వారి చెవులు మూయించి బుద్ధి చెబుతాడు. రామకృష్ణుని మేనమామ భార్య పరమ గయ్యాళి. భర్తను వేధించుకు తినేది. ఒకనాడు ఆమె తన భర్తలోపాటు రామకృష్ణుని కూడా ఇంట్లోంచి వెళ్లగొడుతుంది. ఆమెకు బుద్ధి చెప్పాలని రామకృష్ణుడు తన మేనమామను దాచేసి, అతణ్ణి పులి మింగేసిందని అత్తతో చెప్పి, ఆమెకు తాత్కాలిక వైధవ్వం ఇప్పించి, శిరోముండనం చేయిస్తాడు. సాంబడు అనే స్నేహితునికి సాధువు వేషం తగిలించి మేనమామను బ్రతికించి తీసుకువచ్చినట్లు నటించి, గయ్యాళి అత్తను పతిసేవా పరాయణురాలుగా మారుస్తాడు. కరణం, పంతులు, సానిపిల్ల కలిసి ఆలయ మహంతుతో కుట్రపన్ని రామకృష్ణుని ఇంటిల్లిపాదికీ కులబహిష్కరణ శిక్షను విధిస్తారు. రామకృష్ణుడు ఎదిరించి గుళ్లోకి ప్రవేశిస్తే మహంతు కొట్టిస్తాడు. రక్తం ధారగా కారుతూ ఉంటే రామకృష్ణుడు కాళికాదేవి విగ్రహానికి తన తలను బాదుకుంటాడు. దేవి ప్రత్యక్షమై రామకృష్ణుని ఆశీర్వదించి అంతర్థానమవుతుంది. ఇది రామకృష్ణుని చిన్నతనం.


వికటకవి కథ...
రామకృష్ణుడు పెరిగి పెద్దవాడయ్యాక శ్రీకృష్ణదేవరాయలు పాలించే విద్యానగరం చేరుతాడు.అప్పుడు రాయలవారి ఆస్థానంలో అష్టదిగ్గజ కవులను నియమించే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. తాతాచార్యులు రాయలవారి ఆస్థాన కులగురువు. అతడి ఆధ్వర్యంతో ఆరుగురు మహాకవుల నియామకం జరిగిపోతుంది. రామకృష్ణుడు ఒక జానపద వర్తకుడి వేషంలో రాయలవారి కొలువులో ప్రవేశించి, తనకు దేవీప్రసాద వరంతో అబ్బిన లబ్దకవిత్వంతో రాయలవారిని మెప్పించి అష్టదిగ్గజ కవుల సరసన చోటు సంపాదిస్తాడు. అంతేకాక ఆంధ్రభోజుడికి ఆంతరంగిక సహాయకుని స్థాయికి ఎదుగుతాడు. అది కులగురువుకు ఇష్టం ఉండదు. తాతాచార్యులు రామకృష్ణుని ఇంటిలో దొంగతనం చేయించ ప్రయత్నిస్తే, రామకృష్ణుడు యుక్తితో ఆ దొంగల్ని పట్టుకుని దేహశుద్ధి చేయిస్తాడు. అతడిపై కక్ష పెంచుకున్న తాతాచార్యులు రాయలవారి మనసు మార్చి రామకృష్ణుని రాజమహేంద్రవరం వెళ్లగొట్టిస్తాడు. తాతాచార్యులు సాంబడి భార్య సౌభాగ్యాన్ని బలాత్కరించబొతుండగా, రాత్రిపూట నగర సంచారం చేస్తున్న రాయలవారి కంటపడి, రాజ్య బహిష్కరణకు గురౌతాడు. కక్షతో తాతాచార్యులు రాయలవారికి శత్రురాజైన గజపతిని ఆశ్రయిస్తాడు. శారదా సంపన్నుడైన గోవర్ధనా చార్యులను విద్యానగరం పంపిస్తాడు. ఆ పండితుడు రాయల రాజ్యంలో ఉన్న పండితులందరినీ ఓడించి, దానికి ప్రతిఫలంగా విద్యానగర రాజ్యాన్ని తనకు ధారాదత్తం చేయమంటాడు. ఈ క్లిష్ట సమయంలో మహామంత్రి తిమ్మరుసు రామకృష్ణుని కోసం వెదికించి పిలిపించి ఆ కవిని ఓడిస్తాడు. మరోవైపు బాబరు సాయంతో బహమనీ రాజులు గూఢచర్యం పన్ని రాయల రాజ్యంలోకి క్రిష్ణసాని అనే నర్తకిని పంపుతారు. ఆమె రాయలవారిని లోబరుచుకొనే ప్రయత్నం చేస్తుంది. రామకృష్ణుడు, తిమ్మరుసు సాయంతో యుక్తిని పన్ని ఆ యుద్ధ ప్రయత్నాన్ని వమ్ముచేసి, నర్తకిని వెళ్లగొట్టించి రాయల వారి రాజ్యాన్ని కాపాడుతాడు. ఇదీ డెబ్బై ఐదు సంవత్సరాల నాడు రోహిణీ పతాకంపై హెచ్‌.ఎం.రెడ్డి నిర్మించిన సినిమా కథ.


నటులు, సాంకేతిక నిపుణులు
ఈ సినిమాలో రామకృష్ణునిగా ఎస్‌.పి.లక్ష్మణస్వామి, శ్రీకృష్ణదేవరాయలుగా పారుపల్లి సుబ్బారావు, మంత్రి తిమ్మరుసు, కరటక శాస్త్రిగా, ప్రఖ్యాత దర్శక నిర్మాత ఎల్‌.వి.ప్రసాద్‌, తాతాచార్యులుగా కె.వి.సుబ్బారావు, కరణంగా పి.కోటేశ్వరరావు, గజపతి రాజుగా నరసింహం, చిన్నాదేవిగా అనసూయ, సౌభాగ్యంగా తిలకం ప్రధాన పాత్రలు పోషించారు. ముఖ్య సాంకేతిక శాఖల్లో సదాశివ బ్రహ్మం మాటలు, పాటలు సమకూర్చగా పి. శ్రీదర్‌ ఫోటోగ్రఫీ నిర్వహించారు.

సినిమా విశిష్టతలు
* బి.ఎన్‌.రెడ్డి, కమలాకర కామేశ్వరరావు, ఎల్‌.వి.ప్రసాద్‌, కె.వి.రెడ్డి వంటి ప్రతిభావంతులైన దర్శకులను, కాంతారావు, రాజనాల వంటి నటులను చిత్రసీమకు పరిచయం చేసిన ఘనత హెచ్‌.ఎం.రెడ్డిది.


*
తెనాలి రామకృష్ణ కథను సినిమాగా రెండు సంస్థలు నిర్మించాయి. రోహిణీ పతాకంపై హెచ్‌.ఎం.రెడ్డి తొలిసారి (1941) ‘‘తెనాలి రామకృష్ణ’’ సినిమా నిర్మించగా, 1956లో బి.ఎస్‌.రంగా అదే పేరుగో భారీ తారాగణంతో సినిమా తీసి విజయం సాధించారు.

* తెనాలి రామకృష్ణుడు కేవలం వికటకవే కాదు, గొప్ప వేదాంతి కూడా. రామకృష్ణుని జనహితం కోరే మనిషిగా, సంఘ సంస్కర్తగా, దీనజన బాంధవుడిగా చూపించడం తమ ఉద్దేశ్యమని హెచ్‌.ఎం.రెడ్డి ఈ సినిమా ప్రకటనలో పేర్కొన్నారు.

* శతవధానిగా, హరిదాసుగా, పౌరాణికుడుగా పేరు గడించిన వెంపటి సదాశివబ్రహ్మంకు రచయితగా ఇది తొలి సినిమా. ఆయన ఈ సినిమాకు మాటలు, పాటలు రాయడమే కాకుండా, చిత్రానువాద రూపకల్పనలో కూడా హెచ్‌.ఎం.రెడ్డికి సహకరించారు. ఈ సినిమా విజయంతో వెంటనే పి.కె.రాజా శాండో నర్మించిన ‘‘చూడామణి’’ (1941) చిత్రానికి రచయితగా పనిచేసారు. సినిమాకు కథలు కావాలంటే సదాశివబ్రహ్మం ఇంటికి వెళ్తే సరిపోతుంది.అని ఆ రోజుల్లో ఆయన గురించి గొప్పగా చెప్పుకునేవారు. అనతికాలంలో అతడు ‘‘కథాశివబ్రహ్మం’గా పేరు గడించారు. ప్రముఖ దర్శక నిర్మాత బి.ఎస్‌.రంగా నిర్మించిన ‘‘తెనాలి రామకృష్ణ’’ (1956) సినిమాకు సముద్రాల రాఘవాచార్య రచయితగా వ్యవహరించారు.

* ముఖ్యంగా ఇందులో పాటలు గ్రాంధిక భాషలో వుండడం విశేషం. ‘తృవ్వట బాబా తలపై వువ్వట జాబిల్లి వల్వ బూదెట చేదే’; ‘గంజాయి త్రాగి తురకల సంజాయముచేత కల్లు చవిగొన్నావా’; ‘రంజన చెడి పాందవులరి భంజనులై విరటు కొల్వు పాలైరకటా’; ‘మేక తోకకు మేక మేక తోకా మేక తోక మేక’; వంటి పద్యాలు ఈ సినిమాలో లేకపోవడం కూడా ఒక విచిత్రమేనని చెప్పవచ్చు.

* హెచ్‌.ఎం.రెడ్డి నిర్మించిన ‘‘తెనాలి రామకృష్ణ’’ సినిమా కథకు, బి.ఎస్‌.రంగా తీసిన సినిమా కథకు ఎంతో వ్యత్యాసముంది. ఈ సినిమాలో రామకృష్ణుని బాల్యాన్ని ఒక కోణంతో, రాయలవారి ఆస్థాన కవిని మరో కోణంతో సదాశివబ్రహ్మం ప్రతిష్టింపజేశారు. రామకృష్ణుని బాల్యంతో ఈ హాస్య ప్రధాన చిత్రం ఆరంభమవుతుంది. అయితే బి.ఎస్‌.రంగా సినిమాకు సముద్రాల మలచిన కథా నేపధ్యమే విభిన్నంగా వుంటుంది. బి.ఎస్‌.రంగా సినిమాకు కన్నడ రచయిత సి.హెచ్‌.వెంకట్రామయ్య రచించిన నాటకం ఆధారం. రంగా ‘‘తెనాలి రామకృష్ణ’’ సినిమాను అటు తెలుగు ఇటు తమిళంలో ఏకకాలంలో నిర్మించారు.


*
ఈ చిత్రానికి వెండితెర వరప్రసాదం ఎల్‌.వి.ప్రసాద్‌ సహాయ దర్శకునిగా వ్యవహరించారు. సినిమాకు స్క్రీన్‌ ప్లే రూపొందించడంలో హెచ్‌.ఎం.రెడ్డికి, సదాశివబ్రహ్మంకి సహకరించారు. అంతేకాకుండా ఈ సినిమాలో మహామంత్రి తిమ్మరుసుగా, దురాశాపరుడైన కరటకశాస్త్రిగా రెండు పాత్రలను పోషించారు.

* ఇందులో రామకృష్ణగా నటించిన ఎస్‌.పి.లక్ష్మణస్వామి ఆలపించిన ‘‘అతడు అంబకు మగండు యితడు అమ్మకు మగండు’’; ‘‘చల్లారిపోయిన జాతి రగుల్గోల్పి చైతన్య మొనగూర్చు కైత’’: అనే పద్యాలు ఆరోజుల్లో ఆకాశవాణి ద్వారా విశేషంగా ప్రసారమవుతూ ఉండేవి.

* హాస్యనటుడు సీతారాంకు ఇది తొలి సినిమా. నాటకాల్లో వేషాలు వేస్తూ సినిమాల్లో వేషాలకు ప్రయత్నిస్తున్న సీతారాంను హెచ్‌.వి.బాబు, హెచ్‌.ఎం.రెడ్డికి పరిచయం చేసారు. ఫలితంగా సీతారాంకు ఇందులో కాజాసా (మోతాడు) పాత్ర దక్కింది. ఈ సినిమాతో సీతారాం సినిమా రంగంలో నిలదొక్కున్నాడు.

* బొంబాయి సినిమా రంగంలో ఎక్కువ కాలం వుండడం చేత హెచ్‌.ఎం.రెడ్డి హిందీ టెక్నీషియన్ల మీద ఆధారపడేవారు. స్వయంగా నటుడైన గుండోపంత్‌ వాలవాల్కర్‌కు సంగీత దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. అతనికి పి.మునుస్వామి సహకారం అందించారు. ఇందులో ఎక్కువగా హిందుస్తానీ సంగీత బాణీలే వినిపించడానికి కారణం కూడా గుండోపంత్‌ ఉత్తరాది సంగీతకారుడు కావడమే.

* అలాగే పండిట్‌ బోల్‌నాథ్‌ శర్మ నృత్య దర్శకత్వ శాఖను, శ్రీకాంత్‌ సుతార్‌ కళా దర్శకత్వ శాఖను నిర్వహంచడం కూడా విశేషమే. ధ్వని ముద్రణ ఎ.జి.టైలర్‌ నిర్వహణలో జరిగింది.

* ఈ చిత్రానికి సారథిగా పేకేటి శివరాం వ్యవహరించడం మరో విశేషం.

- ఆచారం షణ్ముఖాచారి


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.