ఆయన కంచుకంఠం మోగితే... చప్పట్లే చప్పట్లు!
article imageఆయ‌నది కంచు‌కంఠం.‌ ఆ కంఠం ఎంత‌పైకి వెళ్లి గిర‌గిర తిరిగి మైమ‌ర‌పి‌స్తుందో అంచాన వెయ్య‌లేము.‌ అందుకే ఆయన్ని ‌‘కంచు‌కంఠం’‌ సూరి‌బా‌బుగా చెప్పు‌కుం‌టారు.‌
నాటి చిత్రాల్లో నార‌దుడు అంటే సూరి‌బాబు.‌ పాటలు, పద్యాలూ నార‌దుడి సొంతం.‌ ఆ నార‌దుడు పువ్వుల సూరి‌బాబు సొంతం.‌ ‌‘ద్రౌపది వస్త్రా‌ప‌హ‌రణం’‌ (1936), ‌‘కన‌క‌తార’‌ (1937), ‌‘మాల‌పిల్ల’‌ (1938), ‌‘రైతు‌బిడ్డ’‌ (1939), ‌‘ఇల్లాలు’‌ (1940), ‌‘తారా‌శ‌శాంకం’‌ (1941), ‌‘జీవ‌న‌ముక్తి’‌ (1942), ‌‘శ్రీకృ‌ష్ణ‌తు‌లా‌భారం’‌ (1955), ‌‘కృష్ణ‌లీ‌లలు’‌ (1959), ‌‘శ్రీకృ‌ష్ణ‌రా‌య‌భారం’‌ (1960), ‌‘శ్రీవెం‌క‌టే‌శ్వర మహత్యం’‌ (1960), ‌‘మహా‌కవి కాళి‌దాసు’‌ (1961), ‌‘దక్ష‌యజ్ఞËం’‌ (1962) మొద‌లైన చిత్రాలు గుర్తున్న వాళ్లకి సూరి‌బాబు గుర్తుం‌టారు.‌ ఎక్కు‌వగా పౌరా‌ణి‌కా‌ల్లోనే నటిం‌చారు.‌ మూడే సాంఘి‌కాలు.‌ ఆ రోజుల్లో ‌‘మాల‌పిల్ల’‌ ఘన‌వి‌జయం సాధిం‌చ‌డంతో సూరి‌బాబు పేరు మారు‌మో‌గింది.‌ అందులో ఆయన చౌదరి అనే పేరు‌గల గాంధీ‌య‌వాది పాత్రని ధరించి, పాటలు, పద్యాలూ పాడారు.‌ ముఖ్యంగా బస‌వ‌రాజు అప్పా‌రావు రాసిన ‌‘కొల్లా‌యి‌క‌ట్టి‌తే‌యేమీ మన గాంధి మాలడై తిరి‌గి‌తే‌నేమీ’‌ అన్న పాట ఎంతో ప్రసి‌ద్ధి‌పొం‌దింది.‌ బ్రిటి‌ష్‌వారి పాల‌నలో ఉన్న సమ‌యంలో నిర్మించిన చిత్రం గనక ‌‘మాల‌పిల్ల’‌లో దేశా‌నికి స్వతంత్రం రావా‌లన్న భావాలు రాకుండా జాగ్రత్త పడ్డారు.‌ ముఖ్యంగా, హరి‌జ‌ను‌లకు దేవా‌లయ ప్రవేశం కల్పిం‌చడం కథాం‌శంగా పెట్టు‌కు‌న్నారు.‌ ‌‘రైతు‌బిడ్డ’‌లో కూడా సూరి‌బాబు పాడిన పాటలు ‌‘నిద్రమే‌ల్గొ‌నర తమ్ముడా, గాఢ‌నిద్ర మేల్గొ‌నర తమ్ముడా’‌ వంటివి ప్రసిద్ధి పొందాయి.‌ పై రెండు చిత్రాలే కాకుండా, ‌‘ఇల్లాలు’‌ కూడా గూడ‌వల్లి రామ‌బ్రహ్మం నిర్మిం‌చి‌నదే.‌
సిని‌మా‌లకు రాక‌ముందు, వచ్చిన తర్వాతా కూడా సూరి‌బాబు రంగ‌స్థల నటుడు.‌ మైకు‌లు‌లేని ఆ రోజుల్లో సూరి‌బాబు పద్యం‌పా‌డితే, రాత్రి‌వేళ ‌‘రెండు‌మైళ్ల దూరా‌నికి విని‌పిం‌చేది’‌ అని చెప్పు‌కు‌నే‌వారు.‌ అలాంటి కంఠంతో మళ్లీ ఎవరూ పాడ‌లేదు.‌
article imageసూరి‌బాబు జననం ఫిబ్రవరి 22, 1915.‌ గుడి‌వాడ తాలూకా బొమ్మ‌లూ‌రులో.‌ ఆరో ఏట నుంచి రంగ‌స్థలం మీద నటనే.‌ చదవు సాధ్యం కాలేదు.‌ మేన‌మామ హను‌మాన్లు దగ్గర సంగీ‌తా‌భ్యా‌సమే ఆయ‌నకి చదువు.‌ రాగాలు, స్వరాలూ నేర్చు‌కు‌న్నారు.‌ బాల‌పా‌త్రలు ధరిస్తూ, పద్యాలు చదు‌వుతూ వుంటే, వన్స్‌‌మోర్లు చెల‌రే‌గే‌విట.‌ గద్యాల నాట‌కాల్లో నటిస్తూ అను‌భవం సంపా‌దిం‌చారు.‌ గుంటూరు తిరి‌గొచ్చి పిల్ల‌లతో నడు‌స్తున్న ‌‘బాల‌మి‌త్రసభ’‌లో నటు‌డిగా చేరారు.‌
కొప్ప‌రపు సుబ్బా‌రావు సంగీత శిక్ష‌ణలో సూరి‌బాబు మరిన్ని రాగాలూ ఆలా‌ప‌నలూ నేర్చు‌కు‌న్నారు.‌ కేవలం బాలలు మాత్రమే ప్రద‌ర్శించే ఆ నాట‌కాల్లో సూరి‌బాబు నార‌దుడు, వసు‌దే‌వుడు, కుచే‌లుడు, కంసుడు మొద‌లైన భిన్న‌మైన పాత్రలు ధరిస్తూ పద్యాలు చదు‌వుతూ ఆక‌ర్షిం‌చారు.‌ ఆరవ ఏట ఆరం‌భ‌మైన అను‌భవం అలా కొన‌సా‌గింది.‌ రంగ‌స్థల నటనే జీవి‌త‌మై‌పో‌యింది.‌ కొన్నా‌ళ్లకు నాట‌కంలో నటిం‌చని రాత్రి లేదు!
article imageమరి కొన్నే‌ళ్లకి సూరి‌బా‌బుకి కోరిక కలిగి, సొంతంగా బృందం ఏర్పాటు చేసు‌కు‌న్నారు.‌ ‌‘సంపా‌దిం‌చు‌కున్న డబ్బుతో వెయ్యి‌కా‌సుల బంగారం కొన్నాను.‌ ఆ బంగారం అమ్మేసి సొంత కంపెనీ ఆరం‌భిం‌చాను.‌ పద‌మూడు వేల రూపా‌య‌లతో.‌ అన్ని నాట‌కా‌లకీ పని‌కొ‌చ్చేలా, సీన‌రీలు రాయిం‌చాను.‌ హార్మో‌నిస్టు, తబలా వాళ్లని ఏర్పాటు చేసి నెల జీతాలు ఇచ్చాను.‌ నటు‌లకి కూడా జీతాలు ఇచ్చాను.‌ నాట‌కాలు పడ్డాయి కాని, ఆర్థి‌కంగా నష్ట‌పో‌యాను.‌ మూడే‌ళ్లకి నా కంపెనీ మూల‌ప‌డి‌పో‌యింది’‌ అని ఒక సంద‌ర్భంలో సూరి‌బాబు చెప్పారు.‌ ‌‘మహా‌కవి కాళి‌దాసు’‌ చిత్ర నిర్మా‌ణంలో సూరి‌బాబు పాలు‌పం‌చు‌కు‌న్నారు.‌ ఆ సమ‌యంలో ఆయన్ని కలు‌సు‌కొని, కొన్ని వివ‌రాలు అడి‌గాను.‌ పద్యం పాడుతూ రాగం మొద‌లు‌పె‌డితే, ఆగేది కాదుట! మైమ‌రచి పోయే‌వా‌రుట.‌
తెనా‌లిలో ఎన్నో నాటక సమా‌జాలు ఉండేవి.‌ సూరి‌బాబు తెనాలి చేరు‌కొని, అక్కడ నాటక సంస్థలో అనేక పాత్రలు ధరిం‌చారు.‌ ముఖ్యంగా నారద పాత్ర ఉంటే ఆయనే.‌
రాజ‌రా‌జే‌శ్వరి అని ఒక రంగ‌స్థల నటి.‌ మగ, ఆడ పాత్రలు ధరిం‌చే‌వారు.‌ కృష్ణుడు, నార‌దుడు, తార, చంద్రమతి వంటివి ఎన్నో.‌ తెనా‌లిలో వున్న‌ప్పుడు సూరి‌బాబు ఆమెతో నాట‌కాలు ప్రద‌ర్శిం‌చిన పరి‌చ‌యంతో ఆమెను వివాహం చేసు‌కు‌న్నారు.‌ రాజ‌రా‌జే‌శ్వరి నాట్య‌మం‌డలి పేరుతో నాటక ప్రద‌ర్శ‌నలు ఇచ్చారు.‌ తారా‌శ‌శాంకం, భూకై‌లాస్, కురు‌క్ష్రేతం, విప్రనా‌రా‌యణ, కృష్ణ‌తు‌లా‌భారం మొద‌లైన నాట‌కా‌లని ఆంధ్రదే‌శం‌లోనే కాకుండా, కల‌కత్తా, మైసూరు, బెంగ‌ళూరు, ముంబై మొద‌లైన ప్రదే‌శా‌ల్లోనూ వేశారు సూరి‌బాబు.‌ ‌‘తారా‌శ‌శాంకం’‌ వంద‌లాది ప్రద‌ర్శ‌న‌లకి నోచు‌కుంది.‌
article image
సూరి‌బాబు కంఠం, నటన సినిమా వారిని ఆక‌ర్షిం‌చింది.‌ 1936లో వచ్చిన ‌‘ద్రౌపదీ వస్త్రా‌ప‌హ‌రణం’‌లో నార‌దు‌డిగా నటించి, కంచు‌కం‌ఠంతో అల‌రిం‌చారు.‌ అంతే! తదా‌దిగా అనేక చిత్రాలు.‌ ఒక పక్క నాట‌కాలు, ఇంకో పక్క సిని‌మాలు.‌ ‌‘జీవ‌న్ముక్తి’‌ జెమి‌ని‌వారి చిత్రం.‌ అందులో సూరి‌బాబు చెప్పులు కుట్టే‌వాడి పాత్ర వేస్తూ, ఆయన, మాస్టర్‌ విశ్వం కలిసి పాడిన ‌‘జోడు‌కొం‌టారా బాబూ జోడు కొంటారా’‌ పాట అప్పట్లో ప్రసిద్ధి.‌ రాజ్యం పిక్చర్స్‌ ‌‘హరి‌శ్చంద్ర’‌ తీసి‌న‌ప్పుడు (1956) అందు‌లోని పద్యా‌లకి రాగాలు ఎన్నిక చేసి, పాడిం‌చి‌నట్టు లక్ష్మీ‌రాజ్యం చెప్పారు.‌ అలాగే ‌‘మహా‌కవి కాళి‌దాసు’‌లోనూ పెండ్యా‌ల‌గా‌రితో కూచుని రాగ నిర్ణ‌యాలు చేశారు సూరి‌బాబు.‌
article image
సూరి‌బా‌బుకి ఎన్నో ఘన సన్మా‌నాలు జరి‌గాయి.‌ 1946లో మైసూరు మహా‌రాజా ముందు, నాలుగు నాట‌కాలు ప్రద‌ర్శించి, రాజా‌వారి చేత అఖండ సన్మానం పొందారు.‌ 1957లో తెనా‌లిలో గజా‌రో‌హణం జరి‌గింది.‌ అప్పుడే ఆయ‌నకు కన‌కా‌భి‌షేకం చేసి, గండ‌పెం‌డేరం తొడి‌గారు.‌ గాన‌ గం‌ధర్వ, కళా‌వి‌శా‌రద మొద‌లైన బిరు‌దులు సూరి‌బా‌బును వరిం‌చాయి.‌
article imageరాజ‌రా‌జే‌శ్వరి నాట‌క‌సంస్థ−‌విజ‌య‌వం‌తంగా ఇరవై అయిదు సంవ‌త్స‌రా‌ల‌పాటు కొన‌సా‌గింది.‌ నటీ‌న‌టు‌లకీ, ఇతర సహా‌య‌కు‌లకీ నెల‌జీ‌తాలు ఇచ్చే వారనీ, అందర్నీ తండ్రిలా ఆద‌రిం‌చా‌రనీ చెప్పు‌కు‌నే‌వారు.‌ రంగ‌స్థలం మీద ఆయన ధరిం‌చిన ఎన్నో పాత్రల్లో నార‌దుడు, కంసుడు, ధృత‌రా‌ష్ట్రుడు, భవానీ శంక‌రుడు, బిల్వ‌మం‌గ‌ళుడు, భీముడు, భీష్ముడు, అర్జు‌నుడు, ధర్మ‌రాజు కొన్ని.‌ నటి లక్ష్యీ‌రా‌జ్యా‌నికి సూరి‌బాబు బంధువు రాజ్యం పిక్చర్స్‌ నిర్మిం‌చిన చిత్రా‌లకు చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన మద్రా‌సు‌లోనే స్థిర‌ప‌డ్డారు.‌ శ్రీరం‌జని భర్త నాగు‌మణి కూడా బంధువు కావ‌డంతో, వారి చిత్రని‌ర్మా‌ణంలో కూడా ఆయన పాలు‌పం‌చు‌కు‌న్నారు.‌ సినిమా, నాట‌క‌రం‌గాల్లో విశేష ఖ్యాతి సంపా‌దిం‌చిన పి.‌ సూరి‌బాబు మార్చి 28, 1968న కీర్తి శేషు‌ల‌య్యారు.‌


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.