అక్కినేని, సావిత్రిల విశ్వరూపం!
ప్రముఖ చలన చిత్ర నిర్మాత, రచయిత చక్రపాణి పుణ్యమా అంటూ బెంగాలీ సాహిత్యం తెలుగు ఇంట అనువాద పంటగా వెల్లివిరిసింది. ముఖ్యంగా 50-60 దశకాల్లో శరత్‌చంద్ర చటర్జీ, తారాశంకర బెనర్జీ, మణిలాల్‌ బెనర్జీ, ఆశా పూర్ణాదేవి వంటి బెంగాలీ సాహిత్య సామ్రాట్టుల రచనలు తెలుగులో అనేక చిత్రాల నిర్మాణానికి సోపానాలై నిలిచి, విజయాలను అందించాయి. దేవదాసు నవల అదే పేరుతో, నిష్కృతి నవల ‘తోడికోడళ్ళు’ పేరుతో, అగ్నిపరీక్ష నవల ‘మాంగల్యబలం’ పేరుతో, కాశీనాథ్‌ నవల ‘ఇల్లరికం’ పేరుతో, బడదీదీ నవల ‘బాటసారి’ పేరుతో, తదత్త నవల ‘వాగ్దానం’ పేరుతో, తాషేఘర్‌ నవల ‘ఇద్దరుమిత్రులు’ పేరుతో తెలుగులో సినిమాలుగా రూపొంది విజయానికి బాటలు వేసాయి. ఈ పరంపరలో మణిలాల్‌ బెనర్జీ రాసిన ‘స్వయంసిద్ధ’ నవలను మద్దిపట్ల సూరి అనువదించడంతో అది కూడా ‘అర్ధాంగి’ పేరుతో తెలుగులో సినిమాగా రాగలిగింది. రాగిణీ సంస్థ అధిపతి పి.పుల్లయ్య దర్శకత్వం వహించి నిర్మించిన ఈ సినిమా 1955 జనవరి 26న విడుదలై ఐదు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంటుంది. ‘అర్థాంగి’ సినిమా విశేషాలివీ...


* అర్థాంగి మూలకథ..
బెంగాలీ సాహిత్యవేత్త మణిలాల్‌ బెనర్జీ రచించిన అమృత కన్య, జారకందేరర్షి వంటి నవలల సరసన చేరిన ‘స్వయంసిద్ధ’ చాలా పెద్ద నవల. జాతీయోద్యమం తొలిరోజులలో స్త్రీలలో కలిగిన చైతన్యాన్ని ప్రతిబింబింపజేసిన నవల ఇది. ప్రముఖ తెలుగు సాహితివేత్త మద్దిపట్ల సూరి ఈ నవలను అదే పేరుతో అనువాదం చేసి రెండు భాగాలుగా వెలువరించారు. ఈ నవల ఆంధ్ర పత్రిక (సచిత్ర వారి పత్రిక)లో వనితా లోకానికి ప్రత్యేక కానుకగా 1954 నుంచి సీరియల్‌గా వెలువడింది. అయితే స్వయంసిద్ధ నవలను అదే పేరుతో ఇండియన్‌ నేషనల్‌ ఆర్ట్‌ పిక్చర్స్‌ వారు బెంగాలీ భాషలో సినిమాగా నిర్మించి 1947లో విడుదల చేసారు. ఇదే సినిమాను 1949లో ఇండియన్‌ నేషనల్‌ ఆర్ట్‌ పిక్చర్స్‌ తరపున మొనీగుహ సమర్పించగా హిందీలో నిర్మించారు. చిత్రానికి ప్రముఖ బెంగాలీ దర్శకుడు శ్యాందాస్‌ దర్శకత్వం వహించగా సమర్‌ రాయ్, శాంతా ఆప్టే, ప్రీతి మజందార్, మోలినా, హీరాలాల్, బిపిన్‌ గుప్త, ఇందుబాల ముఖ్య భూమికలు పోషించారు. ఇందులో తలత్‌ మెహమూద్‌ ఆలపించిన ‘గో బిత్‌ గుయా సో బీగ్‌ గయా’, ‘దిన్‌ బిత్‌ చలే యే రాహిమన్చాహీ కర్నే’ పాటలు ఆ రోజుల్లో శ్రోతల్ని అలరించాయి. ‘స్వయంసిద్ధ’ను మరొకసారి 1975లో బెంగాలీ భాషలో నిర్మించారు. 1955లో పి.పుల్లయ్య ‘అర్థాంగి’ నిర్మించాక, ఆయనే తమిళంలో ‘అర్థాంగి’ని రీమేక్‌ చేసారు. జెమినీగణేశ్‌ అక్కినేని పాత్రను, శివాజీగణేశన్‌ జగ్గయ్య పాత్రను, నాగయ్య గుమ్మడి పాత్రను పోషించగా సావిత్రి, శాంతకుమారి అవే పాత్రల్ని ధరించారు. తాతినేని ప్రకాశరావు 1963లో ఈ సినిమాని హిందీలో ‘బహురాణి’ పేరుతో పునర్నిర్మించారు. ఇందులో అక్కినేని పాత్రను గురుదుత్, సావిత్రి పాత్రను మాలాసిన్హా, జగ్గయ్య పాత్రను ఫిరోజ్‌ ఖాన్, గుమ్మడి పాత్రను నాజిర్‌ హుస్సేన్, శాంతకుమారి పాత్రను లలితా పవార్‌ పోషించారు. పద్మ పాత్రలో నటించిన మాలాసిన్హా ఫిలింఫేర్‌ ఉత్తమ నటి పురస్కారానికి నామినేట్‌ అయింది.


* కథా ప్రస్థానం..
జమీందారు భుజంగరావు (గుమ్మడి)కు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు రఘు (అక్కినేని) మొదటి భార్య సంతానం. చిన్నవాడు నాగు (జగ్గయ్య) రెండవ భార్య రాజేశ్వరి (శాంతకుమారి) కొడుకు. నాగు గారాబంగా పెరిగి పొగరుబోతుగా మారుతాడు. తల్లిలేని రఘుని ఆయమ్మ (విజయలక్ష్మి) పెంచుతుంది. ఆమె రఘుకు నల్లమందు కలపిన పాలు పట్టించడం అలవాటు చేస్తుంది. ఆ నల్లమందు ప్రభావం వలన రఘుకు జడత్వం ఆవహించి బుద్ధిమాంద్యంతో పెరుగుతాడు. రఘు అశక్తుడవటంతో వృద్ధుడైన జమీందారు కుటుంబ బాధ్యతలను చిన్నవాడైన నాగుకు అప్పగిస్తాడు. రామాపురంలో జమీందారుకు భూవసతి వుంటుంది. పంటలు పండకపోవడంతో కోటయ్య (వై.వి.రాజు) అనే రైతు జమీందారుకు బకాయి పడతాడు. బాకీ వసూలుకు రామాపురం వచ్చిన నాగు, కోటయ్యను పొలం విడిచి వెళ్ళమని ఆదేశిస్తాడు. ఆ ఊరిపెద్ద మీద చెయ్యి చేసుకుంటాడు. భూషయ్య (దొరస్వామి) కూతురు పద్మ (సావిత్రి) నాగుచేసే అన్యాయాన్ని ప్రతిఘటించి నాగును వెనుదిరగి వెళ్లేలా చేస్తుంది. నౌకరు భీముడు (కుటంబరావు) రామాపురంలో జరిగిన విషయాన్ని జమీందారుకు విన్నవిస్తాడు. పద్మను నాగుకిచ్చి పెళ్లిచేస్తే అతడి ప్రవర్తనలో మార్పు రాగలదని ఆశించిన జమీందారు రామాపురం వెళ్లి భూషయ్య అంగీకారంతో నాగు-పద్మల పెళ్లి ముహూర్తం నిశ్చయిస్తాడు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించిన రాజేశ్వరి, నాగుకు నిశ్చయమైన పెళ్లిని రఘుతో జరిపిస్తుంది. పెళ్లి పీటలమీదే రఘు అమాయకత్వాన్ని గ్రహించిన పద్మ అర్ధాంగిగా తన ధర్మాన్ని గుర్తెరిగి రఘులో పరివర్తన తీసుకు వచ్చేందుకు కంకణం కట్టుకుంటుంది. అడుగడుగునా ఆమెకు రాజేశ్వరి, నాగులు అడ్డు తగులుతుంటారు. పద్మ దీక్షతో శ్రమించి రఘుకు చదువు మీద ఆసక్తిని పెంచి ప్రయోజకుణ్ణి చేస్తుంది. రఘు ప్రయోజకుడైనందుకు జమీందారు సంతోషించి పరిపాలనా బాధ్యతను రఘుకు అప్పగిస్తారు. ద్వేషాగ్నితో నాగు రఘుపై చెయ్యి చేసుకుంటే పద్మ ప్రతిఘటిస్తుంది. రాజేశ్వరి కినుక వహించి ఇల్లు వదలి వెళ్తుంది. ఆమెను ఆపే ప్రయత్నంలో జమీందారు కాలుజారి మంచాన పడతాడు. నాగు చెడు అలవాట్లకు దాసుడై నీలవేణి (రావు బాలసరస్వతి) అనే వేశ్య చెంతజేరి ఆస్తి పంపకానికి నోటీసు ఇస్తాడు. జమీందారు ఆస్తి మొత్తం రఘు పేరిట రాసి నాగును దూరం చేసుకోవద్దని చెప్పి మరణిస్తాడు. రఘు నాగుని ఇంటికి రమ్మని బ్రతిమాలితే, పద్మ వుండగా ఇంట్లో అడుగుపెట్టనని నాగు భీష్మించుకుంటాడు. దాంతో రఘు ఆస్తినంతా సవతి తల్లి రాజేశ్వరికి అప్పగించి పద్మతో బాటు రామాపురం చేరుతాడు. నాగు నీలవేణిని ఏకంగా ఇంటికే తీసుకొచ్చి కాపురంపెట్టి, ఆస్తినంతా తగలేస్తూ, తల్లి వద్ద వున్న తాళంచెవులు దౌర్జన్యంగా లాగేసుకుంటాడు. వారించిన దివాన్జీ (కామరాజు)ని వుద్యోగం నుంచి తొలగిస్తాడు. ఆశ్రితుడైన శివకామయ్య (డా।। శివరామకృష్ణయ్య)ను కొత్త దివానుగా ప్రకటించి రామాపురంలో రావలసిన శిస్తులు వసూలు చేసుకొని రమ్మంటాడు. ఈలోగా మాజీ దివాను రామాపురం వెళ్లి రఘుకి తమ్ముడి పతనావస్థను గురించి తెలియజేస్తాడు. శిస్తు వసూళ్లకు రామాపురం వచ్చిన కొత్త దివాన్జీకి రైతులు తమ చెల్లింపులు రఘుకే అందజేస్తామని చెబుతారు. విషయం తెలిసిన నాగు, రఘును కడతేర్చాలని తుపాకి తీసుకొని రామాపురం వెళ్తాడు. అదే సమయానికి రఘు శిస్తు వసూళ్ల పైకం సవతి తల్లికి ఇచ్చేందుకు నగరు చేరుకుంటాడు. నాగు భూషయ్య మీదకు తుపాకి గురిపెట్టి అడ్డువచ్చిన పద్మను తూలనాడుతాడు. అంతలో తల్లితో కలిసి రఘు ఆ ప్రాంతానికి చేరుకుంటాడు. నాగు తుపాకిని అన్న మీదకు గురిపెడతాడు. అడ్డు వచ్చిన తల్లిని తుపాకితో కొడతాడు. తల్లి తుపాకి తీసుకొని కన్నకొడుకును కడతేర్చడానికి సిద్ధపడితే, పద్మ అడ్డుకొని మానవ సంబంధాల విలువల్ని గుర్తుచేస్తుంది. నాగు పశ్చాత్తాపపడి రఘు మంచితనాన్ని గ్రహిస్తాడు. తల్లి ఆశీర్వాదంతో కథ కంచికి చేరుతుంది.


* అర్ధాంగి చిత్ర విశేషాలు..
1947లో పి.పుల్లయ్య, శాంతకుమారి దంపతులు సంగీత దర్శకుడు భీమవరపు నరసింహారావు (బియ్యన్నార్‌)ను కలుపుకొని ‘రాగిణి’ పేరిట చిత్రనిర్మాణ సంస్థను ప్రారంభించి ‘భక్తజన’ అనే తమిళ సినిమాను, ‘తిరుగుబాటు’, ‘ధర్మదేవత’ అనే తెలుగు సినిమాలను నిర్మించారు. సినిమాలు గొప్పగా ఆడలేదు. తరువాత మద్దిపట్ల సూరి అనువాద నవల ‘స్వయంసిద్ధ’ను సినిమాగా తీద్దామని నటుల కోసం అన్వేషణ మొదలుపెట్టారు. ‘పిచ్చి పుల్లయ్య’ (1953) సినిమాలో అమాయకునిగా నటించిన ఎన్టీఆర్‌ చేత రఘ పాత్ర వేయిద్దామనుకున్నా, దేవదాసు చిత్ర ప్రభావంతో అక్కినేని, సావిత్రిలను ఎంపిక చేసారు. జమిందారు రెండో భార్య పాత్రకు శాంతకుమారిని ముందే అనుకున్నా ఆమెకు జంటగా ఎవరిని తీసుకోవాలో నిర్ణయం జరగలేదు. ఆ సమయంలోనే ‘తోడుదొంగలు’ సినిమా విడుదలై గుమ్మడికి మంచి పేరొచ్చింది. అప్పుడు ప్రతిభాశాస్త్రి గుమ్మడి పేరు సూచించారు. వయసు మళ్లిన పాత్రలో నిండా ముప్పై ఏళ్లు కూడా లేని గుమ్మడి శాంతకుమారి సరసన నిలవగలడా అనే సందేహం కూడా వచ్చింది. తొలిరోజే షూటింగ్‌లో అక్కినేని, జగ్గయ్య, శాంతకుమారి, గుమ్మడి పాల్గొన్నారు. మేకప్‌లో వున్న గుమ్మడిని శాంతకుమారి చూసి ‘ఆ రోజు ఆఫీసుకు వచ్చిన కుర్రోడివేనా బాబూ’’ అని అడిగి మరీ సంశయ నివృత్తి చేసుకుంది. షూటింగు జరిగినప్పుడల్లా ఆ పాత్ర హుందాతనాన్ని, పెద్దరికాన్ని అడుగడుగునా గుర్తుచేస్తూ గుమ్మడిని పుల్లయ్య ‘‘జమీందారు గారూ’’ అని సంబోధిస్తూ వుండేవారు. సావిత్రి నటనలో సహజత్వం, పరిపక్వత పతాక స్థాయిలో వుంటుంది. ‘‘పెళ్లి ముహూర్తం కుదిరిందా పిల్లా నీ పొగరణిగిందా’’ పాటలో గంతులు వేసేటప్పుడు, పెళ్లి పీటలమీద భర్త వెర్రివాడని తెలిసి కుంగిపోయినప్పుడు, నాగును ధైర్యంగా ఎదిరించినప్పుడు, అప్పగింతల సమయంలో బేలతనం చూపినప్పుడు, భర్తను చిన్న పిల్లవాడిలా భావించి విద్యాబుద్ధులు నేర్పినప్పుడు సావిత్రి వైవిధ్యభరిత నటనకు జేజేలు పలకాల్సిందే. మాటల్లో చెప్పలేని భావాలను ముఖకవళికల్లో చూపిన విధానం ఆమెకే చెల్లింది. సినిమా జరుగుతున్నంతసేపూ సావిత్రి నటనకు యెక్కువ మార్కులు పడినా, హాలు బయటకు వచ్చాక అక్కినేని నటనకే ప్రేక్షకులు మొగ్గుచూపారు. సగం సినిమా వరకు రఘు అమాయకత్వం మూర్తీభవించిన పిరికివాడు... బొమ్మలతో ఆడుకొనే బాలుడు. ఆ తరవాత గాంభీర్యం అలముకొన్న చూపులతో తమ్ముణ్ణి నిలువరించగల స్థాయికి ఎదుగుతాడు. ఇంతటి వైవిధ్యాన్ని అక్కినేని ఒక క్రమపద్ధతిలో అంచెలంచెలుగా నిర్మిస్తూ వచ్చారు. అసహజం అనిపించకుండా నెమ్మదిగా పాత్రకు నిండుతనం తెచ్చారు. అలా నటించాలంటే మాటలు కాదు. అక్కినేని తన నటనలో మోతాదు మించని నిస్సహాయత, అమాయకత్వం, బేలతనం, జడత్వం, గాంభీర్యం, వీరత్వం, హుందాతనం, పెద్దరికం, కఠినత్వం చూపించారు. పెళ్లిపీటల మీద మంగళ సూత్రాన్ని కళ్ళకద్దుకోడం, తన మెడలో కట్టుకోబోవడం, పెళ్ళి కూతురికి కట్టమన్నప్పుడు ఆయమ్మ వైపు చూడడం, పెళ్ళయ్యాక చెక్కపెట్టెలో కూర్చొని అరటిపండు తినడం, శోభనం గదిలో పెళ్ళామంటే ఆడుకొనేందుకు వచ్చిన నేస్తంగా భావించి నవ్వుకోవడం, భార్య గంభీరంగా వుండడం చూసి ‘‘ఆయా’’ అంటూ తలుపు తీసుకొని వెళ్ళడం వంటి సన్నివేశాల్లో నటించడం అంత తేలికకాదు. అర్హత వుండటం చేతనే అక్కినేని నటసామ్రాట్, సావిత్రి కళాభినేత్రి కాగలిగారు. ఈ సినిమా విజయానికి ఆచార్య ఆత్రేయ సంభాషణలు యెంతో ఉపకరించాయి. ఆత్రేయ తేలిక మాటలతో సినిమాను జనరంజకం చేసారు.


* అర్థవంతమైన సంగీతం..
ఆత్రేయ రాసిన పాటలకు అర్థవంతమైన సంగీతాన్ని అందించిన ఘనత బియ్యన్నార్‌ అనే భీమవరపు నరసింహారావుది. అయితే అందులో సగం ఘనత సహాయకుడు అశ్వత్థామకు, ఆర్కెస్టా నిర్వహించిన మాస్టర్‌ వేణుకు దక్కాలి. ఇందులో ‘‘రాధను రమ్మన్నాడు- రాసక్రీడకు మాధవ దేవుడు’’ అనే పాటను ఆకు నరసింహారావు పాడారు. ఓ హరిదాసుపై చిత్రీకరించిన ఈ పాటను యమన్, ఖమాజ్‌ ఛాయలున్న మోహన రాగంలో స్వరపరిచారు. పాట చరణాల్లో మరాఠీ సంగీత పోకడలు సూత్రప్రాయంగా చంద్రడూ...చుక్కలారా, అక్కలారా నిక్కినిక్కి చూతురేలా’’ పాటను జిక్కి గొప్పగా పాడింది. ‘‘పెరుగునాడు తరుగునాడు ప్రేమమారని సామి నేడు పదము పాడి బ్రతిమిలాడి పలుకరించిన పలుకడేమి’’ అంటూ చంద్రుణ్ణి అడుగుతున్నట్లు తన దీనావస్థను తెలియజేసిన విధాన్ని అలతి పదాలతో చిరంతరంగా నిలిచేలా రాయడం ఆత్రేయకే చెల్లింది. జిక్కి పాడిన ‘‘వద్దురా కన్నయ్యా ఈ పొద్దు ఇదువదిలి పోవద్దురా అయ్యా’’ పాట అక్కినేని సావిత్రికి తెలియకుండా బయటకు వెళ్ళే సందర్భంలో వస్తుంది. ఈ పాట కూడా అశ్వత్థామ స్వరకల్పన చేసిందే. సంపూర్ణ ఆరోగ్యంతో విద్యావంతుడుగా మారిన భర్త సమక్షంలో సావిత్రి చందమామ ఎదుట హుషారుగా పాడే ‘‘రాకరాక వచ్చావు చందమామ లేకలేక నవ్వింది కలువ భామ’’ అనే ఆత్రేయ గీతంలో పల్లవికి యమన్‌ రాగాన్ని చరణాలకు యమన్, మోహన మిశ్రమ రాగాలను వాడారు. ‘‘సిగ్గేస్తదోయ్‌ బావా సిగ్గేస్తది’’ అంటూ బాలసరస్వతి నటించే పాటను లీలచేత పాడించడం విశేషం. ‘‘పెళ్లి ముహూర్తం కుదిరిందా....పిల్లా నీ పొగరనిగిందా’’ కోరస్‌ పాట, ‘‘తరలినావా త్యాగమూర్తీ ధర్మానికి నీ తల వంచీ’’ నేపథ్య గీతం కూడా చక్కని పాటలే. ‘‘అర్థాంగి’ సినిమా పుల్లయ్యకు పేరు తీసుకురావడమే కాకుండా ‘పద్మశ్రీ పిక్చర్స్‌’ ఆవిర్భావానికి బాటలు పరిచింది. 1956లో ఈ సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ప్రశంసా పత్రం లభించింది.- ఆచారం షణ్ముఖాచారి


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.