బాలయ్యతో ఆ సీన్‌ చేయించడం తప్పే..

చి
త్రసీమలో బాలకృష్ణ - బి.గోపాల్‌ల కలయికకు మంచి క్రేజ్‌ ఉంది. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘లారీ డ్రైవర్‌’, ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహానాయుడు’ బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించాయి. అయితే ఈ ఇద్దరి నుంచి వచ్చిన ‘పల్నాటి బ్రహ్మనాయుడు’ మాత్రం దారుణ పరాజయాన్ని అందుకొంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు మరీ అతిగా అనిపించినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఆ చిత్రంలో బాలయ్య తొడ కొడితే ట్రైన్‌ వెనక్కు వెళ్లిపోవడం.. కుర్చీ దానంతటదే ముందుకు రావడం వంటి సీన్లు బాగా నవ్వుల పాలయ్యాయి. అయితే ఆ సన్నివేశాలు అలా తీయడం నిజంగా చాలా తప్పని ఒప్పుకున్నారు దర్శకుడు బి.గోపాల్‌. తాజాగా ‘అలీతో సరదాగా’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ‘పల్నాటి బ్రహ్మనాయుడు’ చిత్ర ఫలితంపై స్పందించారు. ‘‘ఆ సినిమా పరాజయానికి పూర్తి బాధ్యత నాదే. అందులోని చాలా సన్నివేశాలపై విమర్శలొచ్చాయి. ముఖ్యంగా బాలయ్య తొడకొడితే ట్రైన్‌ వెనక్కు వెళ్లిపోయే సీన్‌ను అసలు పెట్టకుండా ఉండాల్సిందనిపించింది. ఆ సీన్‌ గురించి ఇప్పటికీ బాధ పడుతుంటా. ఆ సీన్‌ విషయంలో తప్పంతా నాదే’’ అని గుర్తుచేసుకున్నారు బి.గోపాల్‌.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.