బి.ఎన్‌.రెడ్డి భాగ్యరేఖ
సినిమా కాసులు రాల్చే వినోద సాధనం కాకూడదని, దానిని ఒక కళా రూపంగానే పరిగణించాలనే సిద్ధాంతాన్ని ఆచరించి చూపిన మహనీయుడు బి.ఎన్‌.రెడ్డి అనే పేరెన్నికగన్న బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి. బాక్సాఫీసు సూత్రాలను ఏనాడూ దృష్టిలో వుంచుకొని బి.ఎన్‌ సినిమాలు తీయలేదు. ముప్ఫై ఏళ్ల సినిమా అనుభవంతో బి.ఎన్‌ దర్శకత్వం వహించిన సినిమాలు కేవలం పదకొండే! అందులో తొమ్మిది చిత్రాలు సొంత సంస్థ వాహినీ బ్యానర్‌ మీద నిర్మించినవైతే, కేవలం రెండు సినిమాలు మాత్రం ఇతర సంస్థలకు దర్శకత్వం వహించినవి. ఆ రెండింటిలో తొలి ప్రాధాన్యం పొన్నలూరి బ్రదర్స్‌ వారి ‘భాగ్యరేఖ’ సినిమాది కాగా, రెండవది శంభూ ఫిలిమ్స్‌ వారి ‘పూజాఫలం’ సినిమా కావడం విశేషం. పొన్నలూరి బ్రదర్స్‌ సంస్థకు కాసులు రాల్చిన చిత్రంగా ‘భాగ్యరేఖ’ పేరు తెచ్చుకుంది. తొలి విడత 17 కేంద్రాల్లో 20 ఫిబ్రవరి 1957న, మలి విడత ఎనిమిది కేంద్రాలలో మార్చి 13న విడుదలైన భాగ్యరేఖ సినిమా నాలుగు ముఖ్య కేంద్రాలలో శత దినోత్సవం జరుపుకుంది. ఈ సినిమా విశేషాలు సితార పాఠకుల కోసం....


బయటి సంస్థకు బి.ఎన్‌. దర్శకత్వం
తొలి సినిమా ‘వందేమాతరం’ (1939) నుంచి చివరి చిత్రం ‘బంగారు పంజరం’ (1969) వరకూ బి.ఎన్‌.రెడ్డి నిర్మించిన సినిమాలు వేటికవే ప్రత్యేకం. కథాంశాల ఎంపిక, పాత్రల సృష్టి, దృశ్యాల అల్లిక వంటి అంశాలలో బి.ఎన్‌ది ఒక ప్రత్యేక ఒరవడి. అరవై ఎనిమిదేళ్ల క్రితం నిర్మించిన ‘మల్లీశ్వరి’ (1951) సినిమాగాని, డెబ్బైనాలుగేళ్ల ‘స్వర్గసీమ’ సినిమాగానీ ఇప్పటికీ కొత్తగానే వుంటాయి. ‘మల్లీశ్వరి’ సినిమా ఖండాంతరాలలో ప్రసిద్ధి పొందితే, ‘స్వర్గసీమ’ చిత్రం తమిళనాడు వంటి అన్యభాషా ప్రాంతాలలో కూడా ఆదరణ చూరగొంది. వాహినీ సంస్థ నెలకొల్పిన తరువాత బి.ఎన్‌ నిర్మించిన ‘వందేమాతరం’ సంచలనం సృష్టిస్తే, తరువాత వచ్చిన ‘సుమంగళి’, ‘దేవత’, ‘స్వర్గసీమ’ సినిమాలు కూడా బి.ఎన్‌ స్థాయిని నిలబెట్టాయి. ఈ చిత్రం తరువాత బి.ఎన్‌ వాహినీ స్టూడియోని నిర్మించారు. అయితే ప్రధాన పెట్టుబడిదారుడు మూలా నారాయణస్వామి వ్యాపారంలో దెబ్బతిని ఆర్థిక చిక్కుల్లో ఇరుక్కోవడంతో స్టూడియోని విజయా సంస్థకు గుత్తకు ఇవ్వాల్సివచ్చింది. అప్పుడే ‘మల్లీశ్వరి’ చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం తరువాత జార్జి ఇలియట్‌ రచించిన సైలాస్‌ మార్నర్‌ నవల ఆధారంగా నిర్మించిన ‘బంగారు పాప’ (1954) సినీ పండితుల నీరాజనాలందుకున్నా, ఆర్థికంగా అపజయం పాలవడంతో బి.ఎన్‌ చాలా వ్యాకులత చెందారు. అయితే బి.ఎన్‌ సమర్థత మీద నమ్ముకమున్న తారాచంద్‌ బర్‌జాత్యా వంటి హిందీ నిర్మాతలతో సహా కొందరు తెలుగు నిర్మాతలు కూడా తమకు సినిమాలు తీసిపెట్టమని అడుగుతూ వుండేవారు. అపుడే నెల్లూరుకు చెందిన పొన్నలూరి వసంతకుమార రెడ్డి సోదరులు సినిమాలు నిర్మించాలని మద్రాసు వచ్చి బి.ఎన్‌తో పరిచయం పెంచుకున్నారు. తమ తొలి సినిమా బి.ఎన్‌తో తీయించుకోవాలనే కోరిక వెలిబుచ్చడంతో బి.ఎన్‌ సరే అనక తప్పలేదు. ‘పెద్దమనుషులు’ చిత్రనిర్మాణం సాగుతుండగా, ‘బంగారుపాప’ సినిమా స్క్రిప్టు రూపొందించక ముందే పాలగుమ్మి పద్మరాజు చేత బి.ఎన్‌కు మరొక కథను కూడా తయారు చేయించి స్క్రిప్టు సిద్ధంచేసి ఉంచారు. అదే ‘భాగ్యరేఖ’ సినిమా స్క్రిప్టు. బి.ఎన్‌కు ‘భాగ్యరేఖ’ స్క్రిప్టు అంత తృప్తిగా అనిపించక పోవడంతో ముందుగా ‘బంగారుపాప’ నిర్మించడం, అది పరాజయం పాలవడం జరిగిపోయింది. పొన్నలూరి వసంతకుమారరెడ్డికి ‘భాగ్యరేఖ’ స్క్రిప్టు నచ్చడంతో సినిమా నిర్మాణం మొదలైంది. వింత ఏమిటంటే బి.ఎన్‌ ఎంతో నమ్మకముంచిన బంగారుపాప నిరాశ పరిస్తే, ప్రక్కన పెట్టిన ‘భాగ్యరేఖ’ సినిమా సూపర్‌ హిట్టయింది.


భాగ్యరేఖ కథ
లక్ష్మి (జమున) చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోవడంతో పినతండ్రి నారాయణరావు (సి.ఎస్‌.ఆర్‌), పిన్ని జగదాంబ (సూర్యకాంతం)ల వద్ద పెరుగుతుంటుంది. జగదాంబ గంప గయ్యాళి. నారాయణరావుకు కోటయ్య (మాస్టర్‌ వర్మ/నాగభూషణం) అనే కుమారుడు, కాత్యాయని (బేబీ భారతి/జానకి) అనే కూతురు వుంటారు. కోటయ్య బుద్ధిమంతుడు. కానీ కాత్యాయని మాత్రం తల్లిలాగే గయ్యాళి. తల్లి వ్యవహారం నచ్చని కోటయ్య ఇంటి నుంచి వెళ్లిపోయి సైన్యంలో చేరుతాడు. పినతల్లి ఆరళ్లు తెలుసుకున్న లక్ష్మి తాత ముసలయ్య (గోవిందరాజుల సుబ్బారావు) ఆమెను తమ వూరికి తీసుకెళతాడు. కాలచక్రంతోబాటు లక్ష్మి పెద్దదవుతుంది. వయోభారంతో ముసలయ్య మరణిస్తాడు. విధిలేని పరిస్థితుల్లో లక్ష్మి మరలా నారాయణరావు ఇంటికి చేరుతుంది. జగదాంబ తన బంధువుల అబ్బాయితో కూతురు కాత్యాయని పెళ్లి జరిపించాలని పెళ్లిచూపులు ఏర్పాటుచేస్తుంది. ఆ అబ్బాయి లక్ష్మిని పెళ్లి చేసుకుంటానంటాడు. జగదాంబ పెద్ద గొడవచేయడంతో లక్ష్మి ఇల్లు వదలి తిరుపతి చేరుకుంటుంది. జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు సిద్ధపడుతుంది. అంతలోనే ఒక తప్పిపోయిన శశి (బేబీ శశికళ) అనే కలవారి అమ్మాయి లక్ష్మి చెంత చేరుతుంది. శశి బంధువర్గం ఆమెను వెతుక్కుంటూ వస్తారు. లక్ష్మి శశిని ఆమె తల్లి సీతమ్మ (హేమలత), తండ్రి (కె.వి.ఎస్‌.శర్మ)లకు అప్పజెప్పుతుంది. సీతమ్మ, లక్ష్మి కథను విని ఆమెను తన వెంట ఇంటికి తీసుకొని వెళుతుంది. ఆమె కుమారుడు రవి (ఎన్‌.టి.రామారావు) తన పైచదువులు పూర్తి చేసుకొని ఇంటికి వస్తాడు. తొలిచూపులోనే లక్ష్మిని ప్రేమిస్తాడు. వీరిద్దరి పెళ్లికి సీతమ్మ అంగీకరిస్తుంది. కానీ రవిని అల్లుడుగా చేసుకోవాలని ఆశలు పెట్టుకున్న ఆవూరి షావుకారు జగన్నాథం (శివరామకృష్ణయ్య), తన వద్ద గుమాస్తాగా పనిచేసే రంగయ్య (అల్లు రామలింగయ్య)ను రంగంలోకి దింపి జగదాంబ, ఆమె అన్న సాంబయ్య (రమణారెడ్డి) సాయంతో లక్ష్మికి చిన్నప్పుడే పెళ్లయిందని నమ్మబలికిస్తారు. పెళ్లి ఆగిపోగా లక్ష్మి మరల తిరుపతి వెళ్లి ఒక స్కూల్లో టీచరుగా చేరుతుంది. జగదాంబ కూతురు కాత్యాయని పుల్లయ్య (రేలంగి) అనే ఒక కోతలరాయుడితో ప్రేమలోపడి అతడితో లేచిపోయి బస్తీలో వున్న అన్నయ్య కోటయ్య కంటపడుతుంది. కాత్యాయని ద్వారా లక్ష్మి విషయం తెలుసుకున్న కోటయ్య రవిని, లక్ష్మిని కలిపి శుభం పలుకుతాడు. ఈ సినిమాలో బి.ఎన్‌. సోదరుడు బి.ఎన్‌.కొండారెడ్డి ఫోటోగ్రఫీ ఆద్యంతం హృద్యంగా వుంటుంది. టి.వి.ఎస్‌.శర్మ కళాదర్శకునిగా, వెంపటి పెదసత్యం నృత్య దర్శకునిగా ఈ చిత్రానికి పనిచేశారు.

పెండ్యాల రాగాలు
‘భాగ్యరేఖ’ సినిమాకు దేవులపల్లి కృష్ణశాస్త్రి, కొసరాజు రాఘవయ్య చౌదరి, ఎరమాకుల ఆదిశేషారెడ్డి పాటలు రాయగా పెండ్యాల నాగేశ్వరరావు మొదటిసారి బి.ఎన్‌ చిత్రానికి సంగీతదర్శకునిగా పనిచేశారు. ఎ.ఎం.రాజా, మాధవపెద్ది, మల్లిక్, మోహనరాజ్, సుశీల, జిక్కి, వైదేహి, సత్యవతి పాటలు ఆలపించారు. ఈ సినిమాలో పెండ్యాల హిందీ సినిమా బాణీని అనుకరించి సంగీతం సమకూర్చడం వింతగా చెప్పుకోవాలి. కారణమేమైనా అనుకరణ పాటకు బి.ఎన్‌. సినిమాలో బీజం పడటం విశేషమే! అది కృష్ణశాస్త్రి రచించిన ‘మనసూగే సఖ, తనువూగే ప్రియ, మదిలో సుఖాల డోలలూగే... ఏ మధువా నేనోయి ప్రియా’ పాట. దానిని ఎ.ఎం.రాజా, సుశీల అలపించారు. ‘నాగిన్‌’ సినిమాలో లతామంగేష్కర్‌ ఆలపించగా హేమంతకూమార్‌ స్వరపరచిన ‘మన్‌ డోలే మేరె తన్‌ డోలే మేరె దిల్‌కా గయా ఖరారే ఏ కౌన్‌ బాజాయే బాసురియా’ పాటకు మక్కికి మక్కి అనుసరణ. ఈనాటికీ చెక్కుచెదరని ఆదరణతో వినిపించే పాట సుశీల ఆలపించిన కృష్ణశాస్త్రి గీతం ‘నీవుండేదా కొండపై నాస్వామి నేనుండేదీ నేలపై’. అయితే ఇందులోనే కృష్ణశాస్త్రి రాయగా రాజా పాడిన ‘నీ సిగ్గే సింగారమే ఓ చెలియ నీ సొగసు బంగారమే’ పాట కూడా ఇదే ట్యూనులో స్వరపరచడం కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రాజా, సుశీల ద్విగళ గీతం ‘కన్నీటి కడలిలోన చుక్కానిలేని నావ’ పాట ఎన్టీఆర్, జమున మీద చిత్రీకరించారు. ఎరమాకుల ఆదిశేషారెడ్డి రచించిన ‘లోకం గమ్మత్తురా ఈలోకం గమ్మత్తురా... చెయ్యాలి ఏదో మరమ్మత్తురా’ అనే గమ్మత్తు పాటను మాధవపెది,్ద సత్యవతి ఆలపించారు. కొసరాజు గీతం ‘ఆన్‌ మేరే ఆన్‌ మేరే దేఖోజి మందు మజా’ మాధవపెద్ది ఆలపించారు. మరో దేవులపల్లి గీతం ‘తిరుమల మందిర సుందరా’ను మల్లిక్‌ ఆలపించారు. అంతర్నాటకంలో వచ్చే తిలోత్తమ, సుందోపసుందుల కొసరాజు పాట ‘అందాల రాజెవడురా నా వన్నెకాడు ఎందుదాగి యున్నాడురా’ను జిక్కి, మోహనరాజ్‌ పాడారు. జిక్కి ‘కన్నె ఎంతో సుందరి సన్నజాజి పందిరి’ అనే కృష్ణశాస్త్రి పాటను కూడా పాడింది.

మరిన్ని విశేషాలు

*
పెండ్యాల నాగేశ్వరరావు బి.ఎన్‌.రెడ్డి సినిమాకు సంగీతం సమకూర్చడం ఇదే తొలిసారి. ‘బంగారుపాప’ సినిమా నుంచి తరువాత నిర్మించిన సినిమాలకు సంగీత దర్శకులను బి.ఎన్‌.రెడ్డి మార్చుతూ వచ్చారు. ‘బంగారు పాప’కు అద్దేపల్లి రామారావు, ‘రాజమకుటం’కు మాస్టర్‌ వేణు, ‘పూజాఫలం’, ‘రంగులరాట్నం’, ‘బంగారుపంజరం’ సినిమాలకు సాలూరు రాజేశ్వరరావు సంగీతం సమకూర్చారు. వసంతకుమార రెడ్డికి ఎ.ఎం.రాజా అంటే ఎంతో అభిమానం. అందుకే ఎన్టీఆర్‌కు రాజా చేతనే పాడించారు. వీరి రెండవ చిత్రం ‘శోభ’కు ఎ.ఎం.రాజానే సంగీత దర్శకునిగా నియమించారు.

* సూర్యకాంతం, గోవిందరాజుల సుబ్బారావు, సి.ఎస్‌.ఆర్, కె.వి.ఎస్‌. శర్మ వీరంతా బి.ఎన్‌.రెడ్డి దర్శకత్వంలో మొదటిసారి నటించారు. వాహినీ బ్యానర్‌లో నిర్మించిన గుణసుందరి కథ సినిమాలో గోవిందరాజుల సుబ్బారావు నటించినా, ఆ చిత్ర దర్శకుడు కె.వి.రెడ్డి. అలాగే సూర్యకాంతం, సి.ఎస్‌.ఆర్‌ జోడీగా నటించడం కూడా తొలిసారే! ఇందులో సాంబయ్యగా నటించిన రమణారెడ్డికి బి.ఎన్‌తో ఇది రెండవచిత్రం.

* బేబీ శశికళకు ‘భాగ్యరేఖ’ రెండవ సినిమా. అంతకు ముందు ‘చిరంజీవులు’ సినిమాలో ఆమె నటించింది. ప్రస్తుతం లండన్‌లో స్థిరపడిన శశికళ ఇందులో ఎన్టీఆర్‌ చెల్లెలు శశి పాత్రను పోషించింది. పినతండ్రి ఇంటిలో ఉంటూ చీపురుతో ఇల్లు ఊడ్చే సన్నివేశాన్ని బేబీ శశికళ మీద తొలి

సన్నివేశంగా చిత్రీకరించారు.

*
ఈ సినిమాలో ఎన్టీఆర్‌ది హీరోగా చాలా చిన్న పాత్ర. అయినా బి.ఎన్‌.మీద వున్న గౌరవంతోనే ఇందులో ఎన్టీఆర్‌ నటించారు. అలాగే ‘రోజులు మారాయి’ సినిమాలో అక్కినేని ప్రక్కన హీరోయిన్‌గా నటించిన షావుకారు జానకి కూడా బి.ఎన్‌.రెడ్డి మీద భక్తిప్రపత్తులతోనే ‘భాగ్యరేఖ’ సినిమాలో రేలంగికి జోడీగా నటించింది.

*
ఇందులో శివరామకృష్ణయ్య కూతురుగా నటించినది లక్ష్మీకాంత. ‘పాతాళభైరవి’ సినిమాలో ‘వగలోయ్‌ వగలు’ అనేపాటలో నర్తించినది ఈ లక్ష్మీకాంతే. అల్లు రామలింగయ్య, గరికిపాటి రాజారావు నిర్మించిన ‘పుట్టిల్లు’తో పరిచయమైన విషయం తెలిసిందే. కానీ రామలింగయ్యకు గుర్తింపు తెచ్చిపెట్టిన చిత్రం ‘భాగ్యరేఖ’. ఇదే సంవత్సరం విడుదలైన ‘మాయాబజార్‌’ సినిమాతో రామలింగయ్య సహాయనటుడిగా స్థిరపడ్డారు. జమున తిరుమల వెళ్లి బాలాజీ దర్శనంతరం ఆత్మహత్య చేసుకోబోతున్నప్పుడు ఒక బైరాగి వచ్చి ఆమెను వారిస్తాడు. అతడు ఏడుకొండల శ్రీనివాసుడే అని పరోక్షంగా మనకు బి.ఎన్‌.తెలియజెప్పారు. ఆ బైరాగి పాత్ర ధరించింది కస్తూరి నరసింహారావు. ఇతడు 1937లో వచ్చిన ‘విప్రనారాయణ’ సినిమాలో హీరో వేషం వేశారు.

*
బి.ఎన్‌.రెడ్డి సంప్రదాయవాది కావడంతో తన సినిమాలలో రెండు రకాల మనస్తత్వాలు గల మహిళల పాత్రలను సృష్టించడం ఆయనకు ఇష్టంగా వుండేది. ఒక పాత్ర అష్టకష్టాలు పడుతుంది. చివర్న సిరిసంపదలు అనుభవిస్తుంది. ఈ సినిమాలో జమున పాత్ర అలాంటిదే. రెండవ పాత్ర అతిశయంతోను, ఆడంబరంతోను మెలుగుతూ చివర్న నానా ఇక్కట్లు పడుతుంది. జానకిది ఇందులో అటువంటి పాత్రే. బి.ఎన్‌. నిర్మించిన ‘దేవత’, ‘స్వర్గసీమ’లో కూడా ఈ మనస్తత్వం వుండే పాత్రలే మనకు కనిపిస్తాయి.

* విజయా సంస్థ అధిపతి, బి.ఎన్‌.తమ్ముడు బి.నాగిరెడ్డి ఈ సినిమా నిర్మించిన రోజుల్లో, తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలిలో సభ్యునిగా వుండేవారు. అలా టిటిడి యాజమాన్యం బి.ఎన్‌ రెడ్డికి తిరుమలలో షూటింగు చేసుకునేందుకు అనుమతినిచ్చింది. ఇందులో తిరుమల మాడవీధులు, స్వామివారి పుష్కరిణి, డోలీలు కట్టించుకొని వచ్చే యాత్రికుల ప్రయాణం వంటి ఎన్నో అరుదైన దృశ్యాలను చిత్రీకరించారు. ఈ చిత్రం పుణ్యమా అంటూ వాటిని చూడవచ్చు.

* ‘భాగ్యరేఖ’ సినిమాకు జాతీయస్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా రాష్ట్రపతి ప్రశంసాపత్రం లభించింది.

- ఆచారం షణ్ముఖాచారి


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.