అలనాటి 'భీష్మ'కు డెబ్భై ఐదేళ్లు...
గతంలో ‘మాయాబజార్‌’ సినిమా అనేక భాషల్లో అనేక సార్లు నిర్మితమై విజయాలను అందుకొని ప్రేక్షకులను సమ్మోహితులను చేసింది. అదే కోవలో ‘భీష్మ’ కథ కూడా అనేక భాషల్లో విజయాలను చేజిక్కించుకుంది. ముఖ్యంగా తెలుగులో మీర్జాపురం రాజా ‘భీష్మ’ చిత్రాన్ని తొలిసారి నిర్మించగా పదిహేడేళ్ళ తరువాత దర్శక నిర్మాత బి.ఏ.సుబ్బారావు ‘భీష్మ’ చిత్రాన్ని ఎన్‌.టి.రామారావు హీరోగా నిర్మించి విశేష ఆదరణ చూరగొన్నారు. మీర్జాపురం రాజా చిత్రం 10-02-1945న విడుదలై 75 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ‘భీష్మ’ చిత్ర విశేషాలు సితార పాఠకుల కోసం...

శోభనాచల చిత్రాలు...
మేకా వెంకట్రామయ్య అప్పారావు బహద్దూర్‌ అంటే ఎక్కువ మందికి తెలియదేమోగాని మీర్జాపురం రాజా అంటే తెలుగు సినీ ప్రియులకు... ముఖ్యంగా పాతతరం వారికి ఇట్టే తెలిసిపోతుంది. ‘కీలుగుర్రం’ సినిమా వెంటనే స్ఫురణకు వస్తుంది. రాజా వారికి సినిమా నిర్మాణం మీద చాలా మోజు. మద్రాసు ఆళ్వార్‌ పేటలో ‘జయా ఫిలిమ్స్‌’ పేరుతో పెద్ద స్టూడియో నిర్మించి తొలి ప్రయత్నంగా మూడు నెలల వ్యవధిలో రెండు సినిమాలను నిర్మించి విడుదలచేశారు. వాటిలో మొదటిది ‘తుకారాం’ (08-01-1938) కాగా రెండవది ‘కృష్ణ జరాసంధ’ (17-03-1938). బలిజేపల్లి లక్ష్మీకాంతం పాటలు, వేలూరి శివరామశాస్త్రి మాటలు, గాలి పెంచల నరసింహారావు సంగీతం, చిత్రపు నరసింహారావు దర్శకత్వం వహించిన ‘కృష్ణ జరాసంధ’ సినిమా బాగా ఆడింది. వేమూరి గగ్గయ్య జరాసంధుడుగా, కొచ్చెర్లకోట సత్యనారాయణ శ్రీకృష్ణుడుగా నటించి మెప్పించిన ఈ సినిమా విజయంతో మీర్జాపురం రాజా వారు వరసగా ‘మహానంద’ (1939), ‘కాళిదాస’ (1940), ‘జీవనజ్యోతి’ (1940) చిత్రాలను నిర్మించిన తరవాత తమ నిర్మాణ సంస్థ పేరును ‘శోభనాచల’గా మార్చి తొలి చిత్రంగా ‘దక్షయజ్ఞం’ (01-05-1941) నిర్మించారు. స్టూడియో పేరును కూడా ‘శోభనాచల’గా మార్చారు. తరువాత వరసగా ‘భక్త ప్రహ్లాద’ (1942), ‘సంసార నారది’ (1944) సినిమాలు నిర్మించిన తరువాత ‘భీష్మ’ చిత్రాన్ని నిర్మించారు. చమ్రియా టాకీ వారిచే పంపిణీ చేయబడిన ‘భీష్మ’ సినిమా 10-02-1945న విడుదలైంది. బలిజేపల్లి లక్ష్మీకాంతం, బి.టి.నరసింహాచారి సంయుక్తంగా మాటలు, పాటలు సమకూర్చిన ఈ సినిమా విజయవంతమైంది.

మూకీ యుగం నుంచే ‘భీష్మ’ సినిమా మొదలు...
‘భీష్మ’ కథ సుమారు పది సార్లు మూకీ మాధ్యమంలో వివిధ భాషల్లో తయారై విజయవంతమైంది. అలా 1921లో తొలి మూకీ సినిమాగా ‘భీష్మ’ చిత్రం విడుదలైంది. ఆ సినిమాకు దర్శకుడు ఆర్‌.ప్రకాష్‌ అని పిలవబడే ఆర్‌.సూర్యప్రకాష్‌ (ఆర్‌.ఎస్‌.ప్రకాష్‌) కావడం విశేషం. 1922లో ‘భీష్మ ప్రతిజ్ఞ’ పేరుతో రెండు మూకీ సినిమాలు విడుదలయ్యాయి. అయితే తొలి టాకీ చిత్రంగా ‘భీష్మ’ 1936లో తమిళ మాధ్యమంలో విడుదలైంది. ఆ సినిమాను నిర్మించింది సేలం ఫిలిమ్స్‌ తరఫున ప్రఖ్యాత సౌండ్‌ ఇంజనీర్‌ పి.వై.ఆల్తేకర్‌. ఈ సినిమా రెండు పేర్లతో విడుదల కావడం విశేషం. ‘భీష్మ’ తొలి టైటిల్‌ కాగా దానికి ఉపమకుటంగా ‘భీష్మ ప్రతిజ్ఞై’ అనే పేరును జోడించారు. తరువాత 1937లో ‘భీష్మ’ చిత్రం హిందీలో, 1942లో బెంగాలీలో వచ్చింది. బెంగాలీ భీష్మ చిత్రంలో జహర్‌ గంగూలీ భీష్ముడి పాత్రను పోషించారు.

తమిళ ‘భీష్మ’...
సేలం ఫిలిమ్స్‌ వారు నిర్మించిన తమిళ ‘భీష్మ’ చిత్రంలో శంతన మహారాజుగా దామోదరరావు, గంగగా ప్రముఖ రంగస్థల నటీమణి కాంతిమతి బాయి, సత్యవతిగా టి.ఎస్‌.జయ నటించారు. హిందీ సినిమాలోని బాణీలను ఆధారం చేసుకొని ఈ చిత్రంలో ఇరవైకి పైగా పాటలను ప్రవేశపెట్టారు. అయితే ఈ పాటల్లో ‘అచ్ఛా’, ‘కుషీ’ , ‘భేష్‌ భేష్‌’ వంటి కొన్ని హిందీ పదాలు చోటుచేసుకోవడం విశేషం. ఈ చిత్రానికి పాపనాశం శివం పాటలతోబాటు సంగీతం కూడా సమకూర్చడం మరోవిశేషం. ఆరోజుల్లో ఈ సినిమాని కలకత్తా నగరంలోని ఈస్ట్‌ ఇండియా ఫిలిమ్‌ స్టూడియోలో నిర్మించారు.

తెలుగు ‘భీష్మ’ చిత్ర విశేషాలు...
‘భీష్మ’ చిత్రానికి చిత్రపు నారాయణమూర్తి కథ, సినేరియో సమకూర్చి దర్శకత్వంతోబాటు ఎడిటింగ్‌ బాధ్యతలు కూడా నిర్వహించారు. గాలి పెంచల నరసింహారావుకు మోతీబాబు సంగీత సహకారం అందించగా, డి.ఎస్‌.కొట్నీస్‌ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహించారు. టి.వి.ఎస్‌.శర్మ ఆర్ట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన ‘భీష్మ’ చిత్రంలో భీష్ముడుగా జంధ్యాల గౌరీనాథ శాస్త్రి అద్భుతమైన పాత్రను పోషించారు. శ్రీక్లృష్ణుడుగా సి.ఎస్‌.ఆర్‌ ఆంజనేయులు, వ్యాసుడుగా పారుపల్లి సత్యనారాయణ, పరశురాముడిగా బలిజేపల్లి లక్ష్మీకాంతం, దాశరాజుగా రామిరెడ్డి, సాళ్వరాజుగా ఏ.వి.సుబ్బారావు నటించగా, మహిళల పాత్రల్లో అంబగా మీర్జాపురం రాజా సతీమణి సి.కృష్ణవేణి, గంగగా లక్ష్మీరాజ్యం, సత్యవతిగా జూనియర్‌ శ్రీరంజని నటించారు. మహాభారత యుద్ధంలో భీష్ముని పరాక్రమానికి శ్రీకృష్ణుడు సైతం నిలబడలేక పోగా తుదకు అర్జునుడు వదిలిన బాణాలతో అంపశయ్యను నిర్మింపజేసి ఉత్తరాయణ పుణ్యకాలం వరకు వేచివుండి మాఘ శుక్ల ఏకాదశి నాడు స్వచ్ఛంద మరణం కోరుకొని నిర్యాణం చెందంతో ‘భీష్మ’ చిత్రానికి శుభం కార్డు పడుతుంది. నిర్యాణం పొందే ముందు భీష్ముడు కృష్ణుని ప్రార్ధిస్తూ ‘‘బలమునీవ నాకు భక్తుండ నీయెడ, ఆలి బిడ్డ లేనియట్టివాడ, కావు నన్ను అధిక కారుణ్యమున, ఇమ్ము అనుజ్ఞ కమలదళ మనోబ్జనయనా’’ అనే తేటగీతిలో పద్యాన్ని పాడిన గౌరీనాథశాస్త్రికి ఆ రోజుల్లో ప్రేక్షకులు లేచినిలబడి నమస్కరించడం గొప్పగా చెప్పుకున్నారు.

                             

పదిహేడేళ్ళ తరవాత...
బి.ఏ.ఎస్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ అధిపతి, దర్శకుడు బి.ఏ.సుబ్బారావు పదిహేడేళ్ళ తరవాత ‘భీష్మ’ కథను తెలుగులో సినిమాగా నిర్మించారు. ఇందులో భీష్ముడి పాత్రను ఎన్‌.టి.రామారావు పోషించడం ఆరోజుల్లో వింతగా చెప్పుకున్నారు. ఎన్‌.టి.ఆర్‌ అరవై దశకంలో సూపర్‌ స్టార్‌గా వెలుగుతున్న రోజుల్లో ఒక ముదుసలి పాత్ర పోషించేందుకు ముందుకు రావడం గొప్ప విషయం. దర్శక నిర్మాత బి.ఏ.సుబ్బారావు మీద గల గౌరవంతో రామారావు ఆ పాత్రను పోషించేందుకు ఒప్పుకున్నారు. 19-04-1962న విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని సాధించింది. మహాభారత కథను ఆధారంగా చేసుకొని అల్లిన కథకు తాపీ ధర్మారావు నాయుడు మాటలు సమకూర్చగా ఆరుద్ర పాటలను రాశారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ ప్లే తాపీ, ఆరుద్ర, సుబ్బారావులతోబాటు కౌండిన్య కూడా కలిసి రాయడం, ఆ చిత్రాన్ని సుబ్బారావు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఎం.ఏ.రెహమాన్‌ ఛాయాగ్రహణం నిర్వహించగా సాంబశివరావు ఆపరేటివ్‌ కెమెరామన్‌గా వ్యవహరించారు. ఎప్పటిలాగే టి.వి.ఎస్‌.శర్మ కళా దర్శకత్వం నిర్వహించారు. ఈ చిత్రాన్ని వాహిని, విజయా, వీనస్‌ స్టూడియోల్లో ప్రత్యేక సెట్టింగులు వేసి నిర్మించారు. విజయాలో షూటింగు జరుగుతున్నప్పుడు నిర్మాతకు చక్రపాణి తారసపడితే ‘‘రామారావు గారు భీష్ముడి పాత్రను పోషిస్తున్నారు. ఆ గెటప్‌లో రామారావుని ఎవరూ గుర్తు పట్టలేనంతగా మేకప్‌ అదిరింది. ఒకసారి చూస్తారా?’’ అని అడిగితే చక్రపాణి ‘‘ఎవరూ గుర్తుపట్టలేనప్పుడు రామారావు అయితే యేం... ఎవరైనా ఒకటేగా’’ అంటూ తనదైన రీతిలో స్పందించారు. ఆరోజుల్లో రామారావు భీష్మ పాత్ర స్టిల్స్‌ అన్నీ పత్రికల్లో ప్రత్యేకంగా ముద్రించి ప్రచారం కల్పించారు. ‘భీష్మ’ చిత్రానికి సాలూరు రాజేశ్వరరావు సంగీతం అందించారు. తెలుగు చిత్రసీమను యేలిన అతిరథ మహారథులందరూ ఇందులో నటించడం విశేషం. శ్రీకృష్ణుడుగా హరనాథ్, కర్ణుడుగా గుమ్మడి, ధర్మరాజుగా సుబ్రహ్మణ్యం, దుర్యోధనుడుగా ధూళిపాళ్ళ, శంతనుడుగా ప్రభాకరరెడ్డి, సాల్వుడుగా కాంతారావు, నారదుడుగా రేలంగి, పరశురాముడుగా నాగభూషణం, అర్జునుడుగా శోభన్‌ బాబు, శల్యుడుగా సి.ఎస్‌.ఆర్‌ ఆంజేయులు, అశ్వథ్థామగా రాజారెడ్డి, విచిత్రవీర్యుడుగా పేకేటి, అంబగా అంజలీదేవి, కుంతీదేవిగా జి.వరలక్ష్మి, దాశరాజు భార్యగా సూర్యకాంతం, అంబికాగా సుశీల, దృపదుని భార్యగా నిర్మలమ్మ నటించారు. ఇందులో అధికశాతం పద్యాలు కాగా అద్భుతమైన పాటలు కూడా వున్నాయి. ముఖ్యంగా నారదుడికి ఘంటసాల పాడిన ‘తెలియగరారెనీలీలలు కలహములంటారేల నాలీల’, గంగ పాత్రకోశం సుశీల ఆలపించిన ‘జోజో జోలా గారాల బాలా’, సత్యవతి పాత్రకోశం కె.జమునారాణి పాడిన ‘హైలో హైలేసా హంసకదా నా పడవ’ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సాల్వుడు, అంబ పాత్రలకు పి.బి.శ్రీనివాస్, సుశీల ‘మనసులోని కోరిక తెలుసు నీకు ప్రేమిక’ అనే డ్యూయట్‌ పాడారు. ఈ పాట రేడియోలో ఇప్పటికీ వినిపిస్తున్న ఒక అద్భుత గీతం. అలాగే అంబ పాత్రకోసం సుశీల ఆలపించిన ‘మహాదేవ శంభో మహేశా గిరీశా ప్రభో దేవదేవ’ పాటకూడా మంచి ప్రాచుర్యానికి నోచుకుంది. మహాభారతం, భాగవతం గ్రంధాలలోని కొన్ని పద్యాలను ఈ సినిమాకోసం వాడుకున్నారు. ఈ చిత్రంలో అంజలీదేవి అంబ పాత్రను పోషించడమే కాకుండా శిఖండి పాత్రను కూడా పోషించి మెప్పించడం అసలైన విశేషం.


- ఆచారం షణ్ముఖాచారి  


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.