వీర చరిత్రకు దర్పణం... బొబ్బిలియుద్ధం

బొబ్బిలి యుద్ధం మనరాష్ట్ర చరిత్రలో ఒక ప్రముఖ ఘట్టం. ఇది 1757 జనవరి 24న జరిగిన చారిత్రాత్మక సంఘటన. వంచనకు, వీరత్వానికి మధ్య జరిగిన యుద్ధమది. సువిశాల భారతదేశంలో ఎన్నో పెద్దరాజ్యాలు, వాటికింద సామంత దేశాలు, సంస్థానాల మధ్య వైరుధ్యాలున్న నేపథ్యంలో, ఇరుగుపొరుగు రాజ్యాల మధ్య అసూయ ద్వేషాల ఫలితంగా రక్తపుటేరులు పారిన విషాద యుద్ధ సంఘటనే ‘బొబ్బిలి యుద్ధ’ం. పౌరుషానికి ప్రతీకగా నిలిచిన బొబ్బిలి వీరగాధలు హరికథ, నాటకం, బుర్రకథల రూపాల్లో తెలుగు ప్రజలను వుత్తేజ పరుస్తూనే వున్నాయి. పరస్పర విద్వేషాలు ఆత్మహత్యా సదృశ్యమైన సర్వనాశనానికి దారితీస్తాయని. విదేశి పాలనను హతమార్చడంలో బొబ్బిలి వీరులు చిందించిన ఒక్కొక్క రక్తపుబొట్టు గొడ్డలిపెట్టుగా మారాలని అభిలషించిన తాండ్ర పాపారాయుడి శౌర్యానికి గుర్తుగా దర్శక నిర్మాత సి. సీతారాం రిపబ్లిక్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై మలిచిన చారిత్రాత్మక చిత్రం ‘బొబ్బిలి యుద్ధం’, 1964, డిసెంబరు 4న విడుదలైన ఆ చిత్ర విశేషాలు మీకోసం.


వీరోచిత కథ వీర బొబ్బిలి                  
బొబ్బిలి, విజయనగరం ఇరుగుపొరుగు సంస్థానాలు. డెభ్బైరెండు మాన్యాలకు మన్నే సుల్తానుగా, నాటి హైదరాబాదు నిజాం సలాబత్‌ జంగ్, విజయనగర ప్రభువు రాజా పూసపాటి విజయరామరాజు (రాజనాల)ను నియమించాడు. బొబ్బిలి సంస్థానానికి అధిపతి రాజా దామెర్ల గోపాలకృష్ణ రంగారావునాయుడు (ఎన్టీఆర్‌). రంగారావు భార్యామణి మల్లమదేవి (భానుమతి). రాజాం సంస్థానాధీశుడు తాండ్రపాపారాయుడు (ఎస్‌.వి.రంగారావు) బొబ్బిలి రాజ్యానికి అండగా వున్నాడు. విజయరామరాజు తన భార్య రాణి చంద్రాయమ్మ (జయంతి)తో కలిసి బొబ్బిలి రాజకుమారుడు వేంకట రాయల జన్మదిన వేడుకలకు బొబ్బిలికి వస్తాడు. వేడుకల సందర్భంగా జరిగిన మల్లయుద్ధం, కోడిపందేల పోటీల్లో బొబ్బిలి వీరులు విజయం సాధిస్తారు. విజయరామరాజు అసూయతో బొబ్బిలి రాజవంశాన్ని అణగదొక్కాలని అదను కోసం ఎదురుచూస్తుంటాడు. పాపారాయుడు చెల్లెలు సుభద్ర (జమున)కు రంగారావు నాయుని తమ్ముడి వెంగళరాయుడు (సీతారం)తో వివాహం నిశ్చయిస్తారు. ఈలోగా ఫ్రెంచ్‌ జనరల్‌ బుస్సీదొర (ముక్కామల) రాజమహేంద్రవరంలో మకాంవేసి బొబ్బిలి రాజుకు కప్పం కట్టవలసిందిగా తాఖీదులు పంపుతాడు. బొబ్బిలి రాజు తాము సామంతులము కామని, కప్పం కట్టమని కబురు పంపుతాడు. ఈ అవకాశాన్ని అనుకూలంగా మలచుకొని విజయరామరాజు బుస్సీ అనుచరుడు హైదర్‌జంగ్‌ (ఎం.ఆర్‌.రాధ) సాయంతో బుస్సీకి బొబ్బిలిపై చాడీలు చెప్పి, బొబ్బిలి కొటను జయుంచి తనకు అప్పగిస్తే మొత్తం పరగణాల మాన్యం తానే చెల్లిస్తానని బుస్సీని యుద్ధానికి పుసిగొల్పుతాడు. బుస్సీతో రంగారాయుడు సంధి కోసం చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టగా, పదుకొండువేల సైన్యంతో, మర ఫిరంగులతో బుస్సీ సేనలు బొబ్బిలి కోటను ముట్టడిస్తాయి. రాజాం మీదుగా వచ్చే సైనికుల్ని అడ్డగించే వ్యూహంతో పాపారాయుడు రాజాంలోనే ఉండిపోతాడు. కానీ, బుస్సీ సేనలు అడవి మార్గం గుండా వచ్చి బొబ్బిలి కోటపై దండెత్తుతాయి. బొబ్బిలి వీరులు గట్టిగా ప్రతిఘటించినా ఓటమి ఎదురౌతుంది. కోట లోపలికి శత్రుసైన్యం ప్రవేశించేలోపు బొబ్బిలికోటలోని వీరులు భార్యలు, తల్లులు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు, వృద్ధులు తమని తాము కత్తులతో పొడుచుకుని, మంటల్లో దూకి పది వేలమందికి పైగా ప్రాణత్యాగం చేస్తారు. శత్రువులను ఎదురొడ్డిన బొబ్బిలి వీరులు రంగారావునాయుడుతో సహా ప్రాణాలు విడిచి అమరత్వం పొందుతారు. రాజాంకోటలో ఎంతసేపు ఎదురుచూసినా శత్రువుల జాడ తెలియక పోవడంతో పాపారాయుడు బొబ్బిలి వచ్చి విగత జీవులైన రంగారాయుడు, మల్లమాంబను, అమరులైన అశేష వీరసైనికుల మృతదేహాలను చూచి చలించి ప్రతీకారేచ్ఛతో, ఆ చీకటి రాత్రి తన గుడారంలో నిద్రపోతున్న విజయరామరాజును 32 కత్తిపోట్లు పొడిచి చంపి, తనుకూడా ఆత్మార్పణ కావించుకుంటాడు. పరస్పర విద్వేషాలు సర్వనాశనానికి దారితీస్తాయని ఈర్ష్యాద్వేషాలుమాని సఖ్యతగా ఉండమని బొబ్బిలి, విజయనగర యువరాజులకు బోధనచేసి చంద్రాయమ్మ ఆత్మార్పణ చేసుకుంటుంది. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించడం, ఆ వేడుకలు చూపడంతో సినిమాకు శుభం కార్డు పడుతుంది.

యవనికపై సొంత సినిమా చూడాలని...
‘బొబ్బిలి యుద్ధం’ నిర్మాత దర్శరుడు చోడవరపు సీతారాం స్వస్థలం బందరు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన సీతారాం గుంటూరు ఆంధ్రక్రైస్తవ కళాశాలలో చదువుకున్నారు. విజయనగరంలో కొంతకాలం ర్యాలీ కంపెనీలో, మరి కొంతకాలం స్థానిక ఆయిల్‌ కంపెనీలోనూ పనిచేసారు. ఆయన మంచి ఫోటోగ్రాఫర్‌ కూడా. సీతారాం తీసిన కొన్ని కథలు కూడా ప్రచురితమయ్యాయి. 1952లో పూర్ణాపిక్చర్స్‌ కామరాజు సీతారాంను తమ మద్రాసు కార్యాలయ మేనేజరుగా నియమించారు. అప్పుడే సీతారాంకు సినిమా తీయాలనే సంకల్పం కలిగింది. పూర్ణాసంస్థలో పనిచేయడం వలన సీతారాంకు సినిమా వాళ్లతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. మిత్రులు తగిర్చి హనుమంతరావు, దొప్పులపూడి వీరయ్యచౌదరిల ప్రోత్సాహంతో రిపబ్లిక్‌ ప్రొడక్షన్స్‌ పేరిట చలనచిత్ర సంస్థను ప్రారంభించారు. సుందర్లాల్‌ సహతా సహకారంతో తొలి ప్రయత్నంగా 1959తో అక్కినేని, అంజలీదేవి, బి.సరోజాదేవి ముఖ్య తారాగాణంగా యోగానంద్‌ దర్శకత్వంలో ‘పెళ్లిసందడి’ కామెడీ సినిమా నిర్మించారు. సినిమా బాగానే ఆడింది. గోన గన్నారెడ్డి హరిజన్‌ వంటి సినిమాలను కూడా నిర్మించాలని సీతారాం కథలను సిద్ధంచేసుకున్నారు. ఆరుద్ర చేత ‘సత్యం శివం సుందరం’ అనే సినిమా స్క్రిప్టు సిద్ధం చేయించి రమేష్‌నాయుడు సంగీత దర్శకత్వంతో ఒక పాటని కూడా రికార్డు చేయించారు. ఎందుకో ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఐదేళ్ల విరాయం తరువాత భారీ తారాగాణంతో బొబ్బిలియుద్ధం సినిమాను స్వీయదర్శకత్వంతో నిర్మించారు. ఎన్నో ఆటుపోట్లుకు తట్టుకొని ఈ సినిమా విడుదలైంది.
మహాయజ్ఞంలో అతిరధులు
సముద్రాల (సీ) పర్యవేక్షణలో గబ్బిట వెంకట్రావు ఈ సినిమాకు మాటలు సమకూర్చగా శ్రీశ్రీ, ఆరుద్ర, సినారే, కొసరాజు, సముద్రాల (జూ) అద్భుతమైన పాటలు రాసారు. వెంపటి సత్యంతో బాటు పసుపర్తి వేణుగోపాల్‌ నృత్యదర్శకత్వ బాధ్యతలు చెపట్టారు. విజయవాహిని, నెప్ట్యూన్, న్యూటోన్‌ స్టూడియోల్లో సమాంతరంగా సెట్లువేసి కాలహరణం కాకుండా సినిమా నిర్మాణం చేపట్టారు. చారిత్రక ఘట్టాలను మార్పుచేయకుండా సినిమా తీసేందుకు శ్రమించారు. ఈ సినిమా టైటిల్స్‌కు ముందు 1756లో బొబ్బిలి ప్రాంతాన్ని గుర్తిస్తూ భారత దేశ పటం కనిపిస్తుంది. ఆ తరువాత నేపథ్యంతో ‘‘అఖండ భారతావనికి ఆనాడు పాలకులు మొగలాయీలు. వారి ప్రభావం క్షీణదశతో ఉన్నందున దక్కనులో వారి సుబేదారులైన నవాబులు ఇంచుమించు సర్వ స్వతంత్రులుగా వ్యవహరిస్తున్నారు. అధికారవాంఛతో నవాబు కుటుంబంలో కలహాలు రేగి చివరకు ఉద్దండుడైన ఫ్రెంచిసేనాని బుస్సీ సాయంతో సలబాత్‌ జంగ్‌ సుల్తాన్‌ సింహాసనమెక్కి దక్కన్‌ పాలిస్తున్నారు. కానీ, బుస్సీకి వాగ్దానం చేసిన సిబ్బంది ఖర్చు జమచేయకుండా కొన్ని సంవత్సరాలు బకాయి పడ్డాడు. ఆగ్రహించిన బుస్సీ సైనిక దర్పంచూపగా, అతనికి రోక్ఖం ఇవ్వలేక తెలుగు కోస్తా జిల్లాలపై జమాబందీ వసూలు చేసుకునే అధికార దత్తం చేసాడు. భారతదేశంలో పాశ్చ్యాత్యుల పాలనకు అదే నాంది. బుస్సీ తనకు సంక్రమించిన అధికారాన్ని అమలు పరచుకొనేందుకు బలగంతో బెదిరిస్తూ, బయలుదేరాడు తెలుగు జిల్లాలకు’’ అనే సందేశం వినపడుతుంది. విరోచితమైన సినిమా చూసేందుకు ప్రేక్షకుల్ని సంసిద్ధుల్ని చేయడానికి ఈ ప్రయోగం బాగా ఉపకరించింది. ఒకవైపు దర్శకత్వ బాధ్యతలన్నీ మోస్తూ, సినిమాలో కీలకమైన వెంగళరాముని పాత్రను సీతారాం పోషించడం విశేషం. వెంగళరాయుని పాత్రకు వుండే ఆవేశాన్ని, పరాక్రమాన్ని సహజంగా చూపేందుకు సీతారం మంచి ప్రయత్నం చేశారు. తమ్ముడైన వెంగళరాయుని ఆవేశాన్ని అడ్డుకట్ట వేసే సోదరిగా, ప్రజాసంక్షేమం కోరే ప్రభువుగా, సామ, దాన, ధీర గంభీరంగా ఉండే రంగారావునాయుడు పాత్రలో ఎన్‌.టి.రామారావు తన సహజ నటన ప్రదర్శించారు. ఈ సినిమాలో కొద్దిసేపు కనిపించే తాండ్రపాపారాయుని పాత్రకు యశస్వి ఎస్‌.వి.రంగారావు ఎంతో వన్నె తెచ్చారు. ముఖ్యంగా వి.జయరామరాజును సంహరించే సమయంలో పులి...పులి అని గాండ్రిస్తూ శత్రు సైన్యాలను ఛేదిస్తూ వెళ్లి అతని గుండెలపై కూర్చోని, బాకుతో పొడుస్తూ ‘నీ పేరాశకిదే నా బహుమతి. ఒక్కొక్క పోటు’ అంటూ 32 తూట్లు పొడిచి, తనకి తాను ఆత్మార్పణగావించుకొనే సందర్భంగా ‘‘మాతృభూమి కోసం ఈనాడు వీరులు కార్చిన రక్తబిందువులు ఏనాటికైనా విదేశి పాలన అంతానికి కారణం కాకపోవు’’ అంటూ ఎస్వీఆర్‌ చెప్పే డైలాగులు, అమరవీరుల ఆత్మశాంతికి తర్పణం వదిలిన తీరు ప్రేక్షకులను రోమాంచితులను చేస్తాయి. హైదర్‌జంగ్‌ పాత్రకు తమిళనటుడు ఎం.ఆర్‌.రాధాను ఎంపిక చేయడం మరో విశేషం. ఆ పాత్రలోగల యుక్తికి హాస్యంతో మేళవించి మెప్పించిన రాధా కూడా అభినందనీయుడే. ధర్మారాయుడు పాత్రలో బాలయ్య సంధికోసం బుస్సీ వద్దకు రాజదూతగా వెళ్లినప్పుడు పలికే వీరోచిత సంభాషణలు, సైన్యాన్ని ఎదిరించి వచ్చినప్పుడు వెంగళరాయుడు చేసే వ్యంగ్య సంభాషణకు సహనం కోల్పోకుండా సంయమనాన్ని పాటిస్తూ అదే సమయంలో వీరత్వాన్ని ప్రదర్శించిన తీరు చిత్రీకరణ అమోఘంగా వుంటుంది. నరపారాయుడుగా ధూళిపాళ్ల, ఆడిదం సూరకవిగా కె.వి.ఎస్‌.శర్మ, మల్లయోధుడుగా నెల్లూరు కాంతారావు, దుబాసీ లక్ష్మన్నగా సీ.ఎస్‌.ఆర్‌. ఆంజనేయులు, మొరాసిందొరగా ప్రభాకరరెడ్డి, వరహాలుగా పద్మనాభం, వెంకటలక్ష్మీగా బాలసరస్వతి, చారులుగా బాలకృష్ణ, నర్తకిగా ఎల్‌.విజయలక్ష్మీ, ఇతర పాత్రల్లో డాక్టర్‌ శివ రామకృష్ణయ్య, రాజబాబు నటించిన ఈ చిత్రం మేటి నటుల సమాగమం. గొల్ల వృద్ధుడుగా చిత్తూరు నాగయ్య అతిధి పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమా నిర్మాణానికి సీతారాం పడిన కష్టానికి ఆశించినంత ఫలితం రాకపోవడం విషాదకరమే. నష్టాలు రాకపోయినా, లాభాలు ఆర్జించలేకపోయినా ఓ మంచి సినిమాగా ‘బొబ్బిలియుద్ధం’ చరిత్రపుటల్లో నిలిచిపోయింది. విజయవాడ మారుతీ టాకీసులో ‘బొబ్బిలియుద్ధం’ సినిమా 85 రోజులు ఆడింది. అయితే రిపీట్‌ రన్‌లో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఈ సినిమా బాగా ఆడింది. ‘బి’ క్లాస్‌ సెంటర్లలో మంచి కలెక్షన్లు కూడా వసూలు చేసింది. నాటి ఆంధ్రప్రదేశ్‌ గవర్నరు పట్టం థాను పిళ్ళై ఈ సినిమాను ప్రత్యేకంగా కుటుంబ సమేతంగా చూసి వాస్తవికతను, దేశభక్తిని చాటినందుకు సీతారాంను అభినందిస్తూ ప్రశంసాపత్రాన్ని అందజేసారు. హైదరాబాద్‌ దిల్షాద్‌ టాకీసులో ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు, శాసనసభ్యుల కుటుంబాల వారి కోసం 1965 మార్చి 7న సీతారాం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసినప్పుడు నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి, సభాపతి బి.వి.సుబ్డారెడ్డి సమేతంగా ఈ సినిమాకు వచ్చేసి సీతారాంని అభినందించారు. కారణాంతరాల వలన సీతారాం మూడేళ్లదాకా మరో సినిమా తీయలేకపోయారు. 1967లో శోభన్‌బాబు, రామకృష్ణ, రాజశ్రీ, గీతాంజలితో ‘రక్తసింధూరం’ చిత్రాన్ని నిర్మించినా ఆ సినిమా విజయవంతం కాలేదు. దాంతో సినీనిర్మాణానికి ఈ ప్రతిభావంతుడు దూరమయ్యారు. ‘బొబ్బిలి యుద్ధం’ సినిమా ప్రేరణతోనే 1986లో కృష్ణంరాజు ‘తాండ్ర పాపారాయుడు’ చిత్రాన్ని నిర్మించారు.
 
ర‘సాలూరి’న హృదయరాగాలు
సంగీతం జీవన సుధాసారమని విజ్ఞులు చెపుతుంటారు. ‘బొబ్బిలి యుద్ధం’ సినిమాకు సంగీతం అయువుపట్టు. ఎన్నో అజరామరమైన సంగీత మధురిమలను వెండితెరకు అందించిన ప్రతిభాశాలి సాలూరు రాజేశ్వరరావు ఈ సినిమాకు సంగీత దర్శకుడు. మల్లె పూరేకుల వంటి సాహిత్య సంగీతాల మేళవింపుతో సోయగాల గుబాళింపు పంచిన ‘బొబ్బిలి యుద్ధం’ సినిమా పాటలు ఇప్పటికి ఆకట్టుకుంటాయి. సినిమాలో వచ్చే తొలి పాటను గొల్ల వృద్ధుడుగా నటించిన చిత్తూరు నాగయ్య ఆవుపాలు పితుకుతూ పాడే పాటగా చిత్రీకరించారు. ‘సిరినేలు రాయడా సిరిమన్నారాయుడా... పాడిపంటలు పెంచి పాలించు మా స్వామి’’ అనే ఈ పాటను ఆరుద్ర రచించగా రాజేశ్వరరావే పాడటం విశేషం. రెండోపాట సముద్రాల రాసిన ‘‘శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా... సిరులు యశము శోభిల దీవించు మమ్ములా..’’ అనే భక్తగీతం. ఐదు స్వరాలున్న హిందోళరాగంలో మనోధర్మ సంగీతం పాడేలా ఈ పాటను పూజా మందిరంలో భానుమతి శ్రావ్యంగా పాడగా చిత్రీకరించారు. ఈ పాట ఆమెకు ఎంతో పేరు తెచ్చి పెట్టింది. మరోపాట ఆరుద్ర రాయగా సుశీల బృందం ఆలపించిన ‘‘ముత్యాల చెమ్మచెక్క... రత్నాల చెమ్మచెక్క’’ పాటను జమున తన చెలికత్తేలతో కలిసి సాంప్రదాయపు ఆటలతో, పొడుపు కథల సొబగులతో రమ్యంగా సాగే పాటగా చిత్రీకరిస్తే, రాజేశ్వరరావు ఆ పాటను మధ్యమావతి, శుద్ధసావేరి మిశ్రమ రాగాలతో స్వరపరిచారు. సీతారాం మారువేషంతో వచ్చి జమునను ఉద్యానవనంలో కలుసుకున్నప్పుడు ఇద్దరూ కలిసి పాడుకునే యుగళగీతం శ్రీశ్రీ రచించింది. ‘‘అందాల రాణీవే నీవెంత జాణవే.. కవ్వించి సిగ్గుచెంద నీకు న్యాయమా’’ పాట ఘంటసాల, సుశీల పాడిన ఈ పాటలో ‘‘పరీక్ష చాలునే, ఉపేక్ష యేలనే- ఉపేక్ష కాదిది ఆపేక్ష వున్నది... నిరీక్ష చాలా మంచిదీ’’ అంటూ అలతి పదాలతో శ్రీశ్రీ అందంగా రాస్తే, రాజేశ్వరరావు శంకరాభరణం, కాంభోజి మిశ్రమ రాగాల సమ్మేళనంగా ముట్లు కట్టారు. సీతారాం, జమునల తొలిరేయిగీతం ‘‘మురిపించే అందాలే, అవి నన్నే చెందాలే’’ కూడా శ్రీశ్రీ రచనే. ఈ పాటకు ముందువచ్చే సాకీలో ‘‘సొగసు కీల్జడదాన, సోగ కన్నులదాన, వజ్రాలవంటి పల్వరుసదాన- బంగారు జిగిదాన, సింగారములదాన, నయమైన ఒయ్యారి నడలదాన - తోరంపు కటిదాన, తొణకు సిగ్గులదాన, పిడికిట నడగు నెన్నడముదాన’’ అనే శ్రీనాధుని చాటువుని వాడుకున్నారు. ఈ పాటను రాజేశ్వరరావు పహాడీ రాగంతో స్వరపరిచారు. శ్రీశ్రీని ఈ సినిమా కోసం ఒక ‘జావళీ’ని రాయమంటే సునాయాసంగా ‘‘నినుచేర మనసాయెరా! నా స్వామీ చనువా దయసేయరా’’ అంటూ రాసి అందరిని అబ్బురపరిచారు. ఈ పాటను సింధుభైరవి రాగంలో స్వరపరచగా, ఎల్‌. విజయలక్ష్మీ పనుమర్తి వేణుగోపాల్‌ నృత్యదర్శకత్వంలో నర్తించింది. సినారే రాసిన ‘‘ఊయల లూగినదోయి మనసే... తీయని వూహాల తీవెలపైన’’ పాటను తొలిరేయి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఎన్టీఆర్‌ సరసన భానుమతి పాడుతుంది. రాజేశ్వరరావుకు ఇష్టమైన కల్యాణి రాగంలో ఈ పాటను స్వరపిచారు. పి.బి.శ్రీనివాస్, జానకి పాడిన ఆరుద్రగీతం ‘‘సేవలు సెయ్యాలే ఓ పిల్ల సేవలు చేయ్యాలే’’; స్వర్ణలత, వసంత, సత్యారావులు పాడిన కొసరాజు గీతం ‘‘ఏమయా రామయా ఇలారావయా’’కూడా వినదగినవే. ఈ సినిమాలో పద్యాలను గబ్బిట వెంకట్రావు, ఆరుద్ర రాయగా మాధవపెద్ది ఆలపించారు. పౌరుషానికి ప్రతీకగా కొలిచే వీరబొబ్బిలి గాధ తరతరాలుగా బుర్రకథల రూపంలో తెలుగు బిడ్డల్ని ఉత్తేజపరుస్తూనే వుంది... వుంటుంది. అలాగే ‘బొబ్బిలి యుద్ధం’ సినిమా కూడా తరతాలకూ గుర్తుండే చలన చిత్రంగా తెలుగు చిత్రసీమలో సుస్థిరంగా మిగిలిపోతుందంటే అతిశయోక్తి ఉండదు.!

- ఆచారం షణ్ముఖాచారి


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.