నాటి చిత్రపరిశ్రమని నిలబెట్టిన జానపద చిత్రాలు
జనపదం అంటే- గ్రామం పల్లెల్లోనూ గ్రామాల్లోనూ ఏవేవో కథలు చెప్పుకునేవారు. కాలక్షేపానికి. ఈ కథలకి ఆధారాలుండవు. అన్నీ కాల్పనిక కథలే. పురాణేతిహాసాలకీ, చరిత్రకీ ఏమాత్రం సంబంధం లేని కథలు. ఈ కథలతో గ్రామాల్లో పాటలు అల్లి పాడేవారు. బుర్ర కథలుగా, జముకల కథలుగా చెప్పేవారు. ఈ కథల్లో ఏదో నీతి అంతర్గతంగా కనిపిస్తుంది గాని, అద్భుతమే ఆసక్తి, రాజులు, రాణులు, మాంత్రికులు, పిశాచాలు, దెయ్యాలూ ఈ కథల్లో పాత్రలు. జనశ్రుతిగా వస్తున్న ఎన్నో కథల్ని ఏర్పికూర్చి మరింత పాకాన పడేట్టు చేశారు. నాటి రచయితలు. వీటినే జానపద కథలన్నారు. ఇవి అన్ని దేశాల్లోనూ, అన్ని భాషల్లోనూ ఉన్నాయి. ముఖ్యంగా పిల్లల్ని ఆకట్టుకుంటాయి. పెద్దలూ ఆనందిస్తారు. కల్పన చేసిన కథలు కనక, మాయలు, మంత్రాలు, దేవతలూ ఎవరు కావాలంటే వాళ్లు, ఏది కావాలంటే అది రాయవచ్చు- అభ్యంతరం ఉండదు.


తెలుగులో- అలాంటి జానపద కథని తీసుకుని సినిమా తీస్తే భిన్నంగా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. అప్పటికే అలాంటి కథలతో మూకీలు వచ్చాయి. హిందీలో టాకీలు వచ్చాయి. ‘కనక్‌తార’ కల్పిత కథతో ఉన్న నాటకం. ఆ నాటకాన్ని ‘కనకతార’ పేరుతో తొలి జానపద చిత్రం (ఆంగ్లంలో ఫోక్‌లోర్‌ ఫిలిమ్‌ అన్నారు) 1937లో వచ్చింది. పురాణ కథల మధ్య వచ్చిన ఈ సినిమా అంతంత మాత్రం. హిందీలో సినిమాగా వచ్చిన ‘గులేబకావళి’ అరేబియన్‌ జానపద కథ. దాన్ని అనుకరిస్తూ 1938లో తెలుగులో తీస్తే- రాణించలేదు.

పురాణాల్నీ జానపదాల్నీ సినిమాలుగా తీసినప్పుడు- టెక్నిక్‌కి ప్రాధాన్యం ఇవ్వాలి. ట్రిక్‌ ఫాట్స్‌ని నిజం అనిపించేలా తియ్యాలి. మంచి ఫొటోగ్రఫీ, పాటలు, హాస్యం నిండుగా ఉండాలి. సాంఘిక సినిమాలోలా ప్యాంటు, షర్టు, పంచె, జుబ్బాలతో కాలక్షేపం చేస్తే కుదరదు. ఈ ఆలోచనతో జెమిని సంస్థ ‘బాలనాగమ్మ’ (1942) నిర్మించింది. పుక్కిటి కథ. జరగడానికి అవకాశం ఉందా, లేదా అన్న ఆలోచన పక్కన పెట్టి ప్రేక్షకుల్ని అద్భుతలోకంలోకి తీసుకువెళ్లడం లక్ష్యంగా పెట్టుకుని కథ అల్లారు. మాంత్రికుడున్నాడు. మాయలున్నాయి. అవసరమైనప్పుడు దేవుళ్లు ప్రత్యక్షమైపోతారు. లేకపోతే, ఎవడి ప్రాణమైనా వాడి దగ్గరే ఉంటుంది గాని, ఎక్కడో సప్తసముద్రాల అవతల ఉన్న ఒక చెట్టు తొర్రలోని చిలకలో ఉంటుందా? నమ్మశక్యమా? అంతే! ఈ అద్భుతం ఫలించింది. ప్రేక్షకులు విరగబడ్డారు. జానపద చిత్రాలు ప్రజా మేఘాల చేత కనకవర్షాలు కురిపిస్తాయని రూడి ఉంటుంది. పురాణ కథాచిత్రాలు, సాంఘికాలూ బాక్స్‌ ఆఫీసు దగ్గర అలా అలా ఉన్న సమయంలో అలాంటి జానపదం వచ్చి దారి చూపించింది. ఏ సినిమా సంస్థకయినా మూలధనం కావాలి. లేకపోతే సంస్థ నిలవదు.


‘మాలపిల్ల’, ‘రైతుబిడ్డ’ లాంటి సంచలనాత్మక చిత్రాలు తీసిన గూడవల్లి రామబ్రహ్మం సారథి వారికి పత్ని, పంతులమ సినిమాలు తీసి- నిరుత్సాహపడి, ‘సంస్థ నిలబడ్డానికి ఓ జానపదం కావాలి’ అనుకున్నారు. గ్రామాల్లో వినోదం కోసం పాడుకునే కాంభోజరాజు కథని తీసుకుని- ‘మాయాలోకం’ పేరుతో సినిమా తీసి, సారథి సంస్థని నిలబెట్టారు. ప్రేక్షకులకి కావలసినది ముఖ్యంగా వినోదం. అలాంటి వినోదం ఇవ్వాలంటే కాశీమజిలీ లాంటి కథలే కావాలి. ‘ఆదర్శాలు పక్కనపెట్టి ధనార్జనకి ప్రయత్నిద్దాం’ అనుకున్నారు. విశాలమైన చిత్రాలు నిర్మించింది వాహిని సంస్థ. ప్రజలు మెచ్చే చిత్రాలు తీసింది. కె.వి.రెడ్డి తొలి చిత్రం ‘భక్త పోతన’ విశేషాదరణ పొందినా, తరువాత వచ్చిన ‘యోగి వేమన’ ప్రజాభిమానం పొందిందేగాని, ప్రజాధనం పొందలేదు. ధన సంపాదనకి జానపదమే శరణ్యం అనుకున్నారు. వాహినికుటుంబ పెద్దలు. ‘గుణసుందరికథ’ పేరులో కె.వి.దర్శకత్వంలో చిత్రం నిర్మించి విడుదల చేస్తే- కోశాగారం -ఓవర్‌ఫ్లో’ అయింది! వాహినికి సిరులు చేకూరాయి. ఆ దశలో వచ్చిన ‘కీలుగుర్రం’, ‘బాలరాజు’, ‘అపూర్వ సహోదరులు’, ‘స్వప్నసుందరి’, ‘మాయలమారి’ వంటి జానపదచిత్రాలు కాసులు గుమ్మరించాయి. ఒక గొప్ప ఆశయంతో ఉత్తమ చిత్రాలు నిర్మించాలని ఆరంభబైన విజయసంస్థ తొలి సినిమాగా ‘షావుకారు’ తీస్తే పేరు వచ్చిందేగాని, పెన్నిధి దక్కలేదు. సంస్థకి మూలధనం చేకూరితే, ఎలాంటి చిత్రం తియ్యడానికైనా సాహసించవచ్చు- అనుకుని అదే కె.వి.రెడ్డి దర్శకత్వంలో ‘పాతాళభైరవి’ని విడుదల చేసింది. పరిపూర్ణమైన చిత్రంగా ‘పాతాళభైరవి’ని విడుదల చేసింది. పరిపూర్ణమైన చిత్రంగా ‘పాతాళభైరవి’ ప్రజాహృదయాలను కొల్లగొట్టింది.


పెద్ద, చిన్న, ఆడ, మగా, పండితుడు, పామరుడూ అందరూ ఆనందించి కాసుల పంట పండించారు. ఫొటోగ్రఫీ, సెట్లు, సంగీత సాహిత్యాలూ అన్ని సమపాళ్లలో వుండి ఆకర్షించాయి. ఆ రోజుల్లోనే విజయ సంస్థకి ‘పాతాళభైరవి’ ‘‘కోట్లు’’ ఆర్జించి పెట్టింది. ‘దేవదాసు’, ‘కన్యాశుల్కం’లాంటి క్లాసిక్స్‌ తీసిన వినోదాసంస్థ ముందుగా, జానపద చిత్రాన్నే తీసింది అది ‘‘స్త్రీ సాహసం’’ ఆ విజయసాధనతో కంపెనీ నిలదొక్కుంది. ఎన్‌.టి.రామారావు సొంతంగా సంస్థ స్థాపించారు. సదాశయంతో చిత్రనిర్మాణం చెయ్యాలని ‘తోడు దొంగలు’, ‘పిచ్చిపుల్లయ్య’ తీస్తే కాసులు ఖర్చయిపోయి, నష్టాలు మిగిలాయి. రామారావు జానపద సూత్రాన్నే నమ్ముకున్నారు. ‘జయసింహ’ పేరుతో జానపదం తీస్తే సూపర్‌హిట్‌ అయింది. ఆ సినిమాలోని జానపదాలే. ఐతే వాటిని నిర్దిష్టంగా, ఉత్సాహభరితంగా తియ్యాలి. మంచి స్క్రీన్‌ప్లే అవసరం, వ్యవధి కావలి. ఇవి లేకుండా వచ్చిన జానపద చిత్రాలు ప్రజామోదం పొందలేక చతకిలబడ్డవీ వున్నాయి. 1951-60 మధ్యలో పురాణ చిత్రాల సంఖ్య తగ్గి, సాంఘికాలు, జానపదాల సంఖ్య హెచ్చింది. అన్ని జానపదా చిత్రాలూ హిట్‌ కాలేదు- కారణాలు నిర్దిష్టత లేకపోవడం. జానపద చిత్రానికి ఇంకో సలక్షణం కనిపిస్తుంది. చక్కని భాష పాటల్లో, మాటల్లో ఉత్తమ సాహిత్యం వెల్లివిరుస్తుంది. మంచి పాటలు, సాహితీవిలువలు వున్న పాటలు అనిపించుకున్న వాటిలో ఎక్కువ జానపద చిత్రాల నుంచి వచ్చినవే. మల్లాది రామకృష్ణశాస్త్రి, తాపీ ధర్మారావు, బలిజేపల్లి లక్ష్మీకాంతం, పింగళి నాగేంద్రరావు, సమ్రుదాల (సీ, జూ) వంటి రచయితల పాటలు పరిశీలిస్తే జానపదాల విలువ తెలుస్తుంది.


అంజలిదేవి, ఆదినారాయణరావులు అంజలి పిక్చర్స్‌ పేరుతో సంస్థ నెలకొల్పి ‘పరదేశి’, సాంఘీకం తీశారు. ఆకర్షించలేదు. తరువాత తీసిన ‘అనార్కలి’ ఆదరణ పొందినా, ఆ తరువాత తీసిన జానపదం ‘‘సువర్ణ సుందరి’’- స్వర్ణపేటికలు సంపాదించింది. నిర్మాణ వ్యయంగా చూసుకుంటే సాంఘికం కంటే, జానపద పౌరాణికాలకు- వ్యయం ఎక్కువ. దానికి తెగించినవారే- జానపదాలకు ఆలోచన చేశారు. సి.పుల్లయ్య, పి.పుల్లయ్య, బి.ఎన్‌.రెడ్డి, కె.వి.రెడ్డి, కె.కామేశ్వరరావు, డి.యోగానంద్, కె.ఎస్‌.ప్రకాశరావు, టి.ప్రకాశరావు వంటి దర్శకులందరూ జానపదాలూ డైరక్టు చేశారు. వాహిని, విజయలాంటి పెద్ద సంస్థలు జానపద చిత్రాలు తీసాయి కానీ, పి.ఎ.పి, జగపతి, అన్నపూర్ణ వంటి సంస్థలు తియ్యలేదు. సాంఘికాల్నే నమ్ముకుని, ఉత్తమ ధోరణిలో తీసి, సంస్థల్ని నిలబెట్టుకున్నాయి. దాదాపు నటీనటులందరూ సాంఘికాలతో పాటు జానపదాల్లోనూ నటించారు.

జానపదాల ‘చిట్కా’ తెలుసుకున్న దర్శక, నిర్మాత విఠలాచార్య- రెండు సాంఘిక చిత్రాల నిర్మాణానంతరం- జానపదం మొదలుపెట్టారు. ఐతే, ఆయన ఆలోచన వేరు. ‘జానపదమే అయినా, పొదుపుగా తియ్యలేమా?’ అన్న ఆలోచనతో నిర్మాణవ్యయం తగ్గించుకుని, జానపదాలు తీశారు. ఒకటి రెండు సెట్లు మాత్రమే వేసి, వాటినే మార్చి మార్చి తియ్యడం వల్ల కాలం, వ్యయం కలిసివచ్చాయి. ‘ఎంత లాభం వచ్చినా అంతా లాభమే’ అనుకొన్నాడు. దుస్తులు, ఆభరణాలు, కత్తులు, కటార్లు- అన్నీ అవే. వాటిలో మార్పులు ఏం వుంటాయి? గుర్రాలు, కత్తి యుద్దాలు, కుస్తీ, పట్లు- పండితులు విమర్శించినా, పామరులు విచిత్రంగా చూశారు. బి.సి స్టేషన్స్‌లో విఠలాచార్య వేసిన మంత్రానికి, విపరీతంగా చింత కాయలు రాలాయి! అన్ని చిత్రాలూ తమిళంలోకి అనువాదమై, తక్షణ విజయం సాధించాయి. విఠలాచార్య జానపద చిత్రాలకి విశేషం, విశిష్టతా లభించాయి. వీలైనంత తక్కువ బడ్జెట్‌లో జానపదాలు ఎలా తీయవచ్చో ఆయన చూపించారు. ఎలాంటి చిత్రాలు తీసినా, జానపద చిత్రాల దర్శకుడిగానే విఠలాచార్యకి ముద్రపడింది.

1948వ గొప్పసంస్థగా పేరుపొందిన జెమిని- జానపద ధోరణితోనే. అతి భారీయైన చిత్రం తియ్యాలని ఆశించి- ‘చంద్రలేఖ’ (తమిళం) తీసింది. ఆ చిత్ర దర్శక నిర్మాత యస్‌.యస్‌.వాసన్‌ ఆర్జించిన ధనమంతటినీ ఆ సినిమా కోసం గుమ్మరించారు. అప్పులు చేశారు. ‘‘ఈ సినిమాతో అయితే, లక్షాధికారిని అవ్వాలి లేదా భిక్షాధికారినవుతాను’’ అని తీర్మానించుకున్నాడు. ఆయన తపం ఫలించింది. ‘చంద్రలేఖ’ టెక్నికల్‌ పరంగానూ, ఆసక్తికరంగానూ వుండి విపరీతమైన ఆకర్షణ పొంది. అపారమైన ధనం తెచ్చింది. ఆ పందెంతో జెమిని జెండా-ఆకాశంలో ఎగిరింది. కొన్నేళ్ల తరువాత జాపపదాలు వెనకబడ్డాయి. ఎక్కువగా సాంఘికాలే ఏలాయి. ఆ తరుణంలో, ఒక జానపదం వస్తే ఎలి వుంటుందన్న ఆలోచనతో చందమామ విజయ కంబైన్స్‌ ‘భైరవద్వీపం’ నిర్మిస్తే- జానపదానికి వున్న ఆకర్షణ శక్తిని నిరూపించింది. తెలుగులో జానపద చిత్రండిత పామరుల్ని అలరించింది.

- రావి కొండల రావు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.