కథ ఒకటే... సినిమాలు రెండు!
వ్యాపారం అన్న తర్వాత పోటీ ఉంటుంది. ఇవాళ ఎన్నో టూత్‌ పేస్టులు, షాంఫూలు తమ వ్యాపారం మీద శ్రద్ధ చూపుతూ పోటీ పడుతున్నాయి. అలాగే ఎన్నో వస్తువులు. సినిమాను కూడా వ్యాపారంగానే పరిగణించారు గనుక, తొలిరోజుల్లోనే పోటీ ఏర్పడింది. అప్పట్లో నాటక బృందాలన్నీ కాంట్రాక్టర్‌ చేతిలో ఉండేది. ఆ కాంట్రాక్టరే ఆయా నాటక బృందాల్ని వూళ్లలో ఏర్పాటు చేసి కమీషన్‌ తీసుకునే వాడు. ఒక్కో కాంట్రాక్టరు చేతిలో 3-4 నాట్యమండలులు వుండేవి.

ఇద్దరు రామదాసులు...
తొలి సినిమా ‘భక్త ప్రహ్లాద’ 1932లో విడుదలై, విపరీతమైన ధనార్జన చెయ్యడంతో, ఒక కాంట్రాక్టరు తన బృందాన్ని ఇంపీరియల్‌ ఫిలిమ్‌ కంపెనీకి తీసుకు వెళ్లి (బొంబాయి) హెచ్‌.ఎమ్‌.రెడ్డికి చూపించి ‘రామదాసు’ సినిమా తియ్యడానికి దోహదం చేశాడు. ఆ సమయంలోనే ఇంకో కాంట్రాక్టర్‌ తన బృందాన్ని కలకత్తా తీసుకువెళ్లి ఈస్టిండియా చేత ‘రామదాసు’ తీయించాడు. ఇంపీరియల్‌ సినిమాలో ఆరణి సత్య నారాయణ రామదాసు పాత్రధారి. (ఆరణి సత్యనారాయణ అంటే ‘దేవదాస్‌’ ధర్మన్నగా నటించాడు) ఈస్టిండియా చిత్రంలో సి.ఎస్‌.ఆర్‌.ఆంజనేయులు రామదాసు పాత్రధారి. వీటికి దర్శకత్వం అంటూ లేదు. నాటకాన్ని యథాతధంగా ప్రదర్శిస్తే కెమెరామెన్‌తో, రిఫ్లెక్టర్‌తోనూ, చిత్రించడమే. రెండూ 1933లోనే విడుదలై - పోటీపడ్డాయి. ఐతే, ఏదీ విజయం సాధించలేదు.


సావిత్రుల పోటీ...
అలాగే అదే సంవత్సరంలో రెండు ‘సావిత్రి’ సినిమాలు పోటీపడ్డాయి. ఒకటి కలకత్తాలోనూ, రెండోది బొంబాయిలోనూ తీశారు. బొంబాయి కృష్ణా ఫిలిం కంపెనీ (ఇంపీరియల్‌ వారిదే) ‘సావిత్రి’లో సురభి కమలాబాయ్, వి.వి.సుబ్బారావు (మునిపల్లి సుబ్బయ్య - ‘ప్రహ్లాద’లో హిరణ్య కశిపుడు) నటించారు. ఈస్టిండియా వారి (కలకత్తా) ‘సావిత్రి’లో వేమూరు గగ్గయ్య, రామతికలం నటించగా, సి.పుల్లయ్య డైరెక్టు చేశారు. ఈ సినిమా అసాధారణమైన విజయం సాధించింది. ‘భక్తప్రహ్లాద’ తర్వాత, ఘనవిజయం సాధించిన సినిమా- ఈ సావిత్రే!


ద్రౌపది కోసం...
మూడేళ్ల తరువాత 1936లో ద్రౌపది కథమీద పోటీ పడ్డారు. ఒకరు ‘ద్రౌపది వస్త్రాపహరణం’ అనీ, రెండోవారు ‘ద్రౌపదీ మాన సంరక్షణం’ అనీ పోటీపడి తీశారు. పారేపల్లి శేషయ్య అనే ఆయన బెజవాడకి చెందిన పారిశ్రామిక వేత్త. ఆయన గూడవల్లి రామబ్రహ్మం సహకారంతో వస్త్రాపహరణం నిర్మించాలని సంకల్పించారు. దుర్యోధనుడి పాత్రను బళ్లారి రాఘవాచార్య చేత నటింపచెయ్యాలని ఆయన్ని అడిగితే, ఆయన అంతకుముందే లక్ష్మీఫిలింస్‌ అనే కంపెనీవారు తనను దుర్యోధనుడి పాత్రధారణకి అడిగారని, అదీ ద్రౌపది కథేనని చెప్పారు. దాంతో పోటీ స్థితి ఏర్పడింది. ఈ చిత్రానికి ‘ద్రౌపది’ అని పేరు పెట్టుకున్నారు. సరస్వతి టాకీస్‌ వారు యడ్లవల్లి సూర్యనారాయణను దుర్యోధన పాత్రకి ఎన్నిక చేసి, ‘ద్రౌపది వస్త్రాపహరణం’ అని చిత్రానికి పేరు పెట్టారు. దాంతో, లక్ష్మీ ఫిలింస్‌ వారు ‘ద్రౌపది మానసంరక్షణం’ అని నామకరణం చేశారు. పోటీలో సరస్వతి టాకీస్‌ వారు సి.ఎన్‌.ఆర్‌ ఆంజనేయులుని కృష్ణ పాత్రకు తీసుకోగా, బందా కనగలింగేశ్వరరావుని, లక్ష్మీఫిలింస్‌వారు తీసుకున్నారు. వస్త్రాపహరణంలో కన్నాంబ, రామతిలకం, మాధవపెద్ది వెంకట్రామయ్య, వేమూరు గగ్గయ్య వంటి రంగస్థల మహానటుల్ని తీసుకున్నారు. ‘మానసంరక్షణ’లో సురభి కమలాబాయి, డాక్టర్‌ శివరామకృష్ణ మున్నగువారు ఉన్నారు. ఈ చిత్రాన్ని ఎన్‌. జగన్నాధ్‌ డైరెక్ట్‌ చేయగా, వస్త్రాపహరణాన్ని హెచ్‌.వి. బాబు డైరెక్టు చేశారు. పెత్తనం హెచ్‌.ఎమ్‌.రెడ్డి, గూడవల్లి రామబ్రహ్మం. ఐతే, భారీ తారాగణం వున్న ‘ద్రౌపది’ వస్త్రాపహరణం’ ఘనవిజయం సాధించింది. రెండోది అపజయం పాలైంది.


వితంతు పెళ్లికి కూడా...
పోటీపడి చిత్రాలు తీస్తే రెండూ విజయ సాధన చెయ్యలేవు. ఏదో ఒకటి మాత్రం నిలబడుతుంది. వితంతు వివాహవేదిక మీద కథ ఆలోచించి వై.వి.రావు, బి.ఎన్‌.రెడ్డి ఒకేసారి చిత్ర నిర్మాణం మొదలుపెట్టారు. కాంచనమాలతో వై.వి.రావు ‘మళ్ళీపెళ్ళి’ అని ప్రాంరంభించి, వాహిని చిత్రానికి ముందే 1939లో విడుదలచేస్తే, అనూహ్యమైన విజయం సాధించింది. వాహిని చిత్రం ‘సుమంగళి’ 1940లో వచ్చింది. ‘మళ్లీపెళ్ళి’ సుఖాంతం గనుక కాబోలు, హిట్టయ్యింది. ‘సుమంగళి’ విషాదాంతం కావడంతో, మంచిపేరు వచ్చినా, ప్రజాబలం సిద్ధంచలేదు.బాల నాగమ్మల సవాల్‌...
1942లో రెండు ‘బాలనాగమ్మ’లు పోటీపడ్డాయి. ఒకటి జెమిని వారిది. సి.పుల్లయ్య దర్శకుడు. రెండోది శాంత వసుంధరా వారిది. విశేషం ఏమిటంటే, జెమిని బాలనాగమ్మకి కళా దర్శకుడిగా పనిచేసిన యస్‌.వి.యన్‌.రామారావు ఏదో మాటపడి, బయటకొచ్చి తానూ బాలనాగమ్మ మొదలుపెట్టారు. అలాగే, జెమిని చిత్రానికి సంగీత దర్శకుడైన సాలూరి రాజేశ్వరరావు, రెండో చిత్రంలో పాత్రధారణ చేశాడు. జెమిని బాలనాగమ్మ, తారాగణం, కళానైపుణ్యంతో రావడంవల్ల- ఘనమైన విజయం సాధించింది. రెండో బాలనాగమ్మ - చతికిలబడింది.
లక్ష్మమ్మల పోరు...
ఇక ‘లక్ష్మమ్మకథ’. 1950లో ఈ కథ సంచలనం రేపింది. లక్ష్మమ్మ ఒక ఇంటి కోడలు. జరిగిన కథగా చెప్పుకుంటారు. ఆ కోడలు దీనావస్థని చిత్రీకరిస్తే, మహిళా ప్రేక్షకులు ఆచరిస్తారన్న నమ్మకంతో దర్శకుడు, రచయిత గోపిచంద్‌ కథ తయారుచేసి, కృష్ణవేణికి చెప్పగా ఆమెకి నచ్చి చిత్రం తీయాలని ఆలోచనలో వున్నారు. ఇదే కథ ఘంటసాల బలరామయ్యగారి మస్తిస్కంలో కూడా వుంది. కృష్ణవేణి తియ్యాలనుకుంటున్న తరుణంలో తానుకూడా ఉద్దేశించి సముద్రాల చేత స్క్రిప్టు రాయించారు. నాగేశ్వరరావు, అంజలిదేవి, ముఖ్యపాత్రధారులు. అందులో కృష్ణవేణి, సి.హెచ్‌. నారాయణరావు. రెండూ నిర్మాణంలో పోటీ పడ్డాయి. రేయింబవళ్ళు షూటింగ్‌ చేశారు. ఒకటి ‘లక్ష్మమ్మ’ రెండోది ‘శ్రీలక్ష్మమ్మకథ’ రెండూ ఒకేరోజు విడుదలచెయ్యాలనుకున్నారుగాని, ఒక్క రోజు తేడాలో విడుదలైయాయి. ‘లక్షమ్మ’కి పేరు, కాసులఖించాయి.


కురుక్షేత్రంలో యుద్ధం...
పాండవులు, కౌరవుల కథకి కూడా పోటీ తప్పలేదు. పద్మాలయ పేరుమీద కృష్ణ ‘కురుక్షేత్రం’గా, తన స్టూడియో పేరు మీద ఎన్‌.టి.రామారావు ‘దానవీరశూరకర్ణ’గా ఒకే కథను ప్రారంభించారు. రెండూ కలర్‌ చిత్రాలు. ‘దా.వీ.శూ. కర్ణ’లో ఎన్‌.టి.ఆర్‌ పలు పాత్రలు ధరించారు. ‘కురుక్షేత్రం’ భారీగా నిర్మించినా, ‘దా.వీ.శూ.క’ మీద నిలబడలేకపోయింది. ఎప్పుడైనా రెండు చిత్రాలు పోటీపడితే, ఏదో ఒకటే, నిలుస్తుంది. లేదా, రెండూ రాలిపోతాయి. తర్వాత తర్వాత పోటీతత్వం తగ్గింది. ‘‘వాళ్లు తీస్తున్నారు మనకెందుకులే’’ అన్న ధోరణి రావడంతో పోటీ తగ్గుముఖం పట్టింది. పురాణం, జానపద, కథల మీద ఎవరికీ హక్కులు వుండవు గనుక వాటికే పోటీ. ఇవాళ, ఆ రెండూ సంకల్పంలో లేవు. అంచేత పోటీ తగ్గింది.

- రావి కొండలరావుCopyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.