శివాజీ మూడు పాత్రల ముచ్చట
(తమిళ నటుడు శివాజీ గణేశన్ అక్టోబర్ 1, 1928 విల్లుపురంలో జన్మించారు. తమిళంలో  ‘నడిగర్ తిలగం’గా  పేరొందిన ఆయన 5 భాషల్లో దాదాపు 300 చిత్రాల్లో నటించారు. ఈరోజు ఆయన  (జూలై 21, 2001) వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన నటించిన  చిత్రం గురించి ..)

తెలుగులో డబ్బింగ్‌ సినిమాల ప్రవేశం ‘ఆహుతి’ సినిమాతో ప్రారంభమైంది. 1946లో హిందీలో వచ్చిన ‘నీరా అవుర్‌ నందా’ సినిమాను నవీనా ఫిలిమ్స్‌ వారు ‘ఆహుతి’ పేరుతో తెలుగులోకి అనువదించి 1950లో విడుదల చేశారు. మహాకవి శ్రీశ్రీతో తెలుగులో డబ్బింగ్‌ సినిమాల అధ్యాయం మొదలైంది. మాతృకలో వున్న సంభాషణలు, పాటలు, పలికే పెదవుల కదలికలకు అనుగుణంగా పదాలను మార్చి తదనుగుణంగా భావాన్ని చెడకుండా తీసే సినిమాల్నే అనువాదచిత్రాలుగా పరిగణిస్తారనే విషయం తెలిసిందే. ‘ఆహుతి’ చిత్రం తరువాత ఎన్నో తమిళ చిత్రాలతోబాటు అనేక పరభాషా చిత్రాలు కూడా తెలుగులోకి అనువాదం అయ్యాయి. వాటిలో 1970 ఏప్రిల్‌ 24న విడుదలైన ‘కోటీశ్వరుడు’ సినిమా తెలుగులో కూడా విజయవంతంగా ఆడింది. ఆ సినిమా విశేషాలు...
.


సూపర్‌ హిట్‌ డబ్బింగ్‌ సినిమా ..
రాజ్‌కపూర్‌ నిర్మించిన ‘ప్రేమలేఖలు’ (హిందీలో ‘ఆహ్‌’) చిత్రానికి మాటలు, పాటలు కూర్చి సూపర్‌ హిట్‌ చేసిన ఆరుద్ర ‘కోటీశ్వరుడు’ చిత్రానికి రచయితగా పనిచేశారు. అంతకు ముందు ఆరుద్ర ‘వీరఖడ్గము’ (1958), ‘వీరపాండ్య కట్టబ్రహ్మన’ (1959), ’సంపూర్ణ రామాయణము’ (1960), ‘మురిపించే మువ్వలు’ (1962), సింగపూర్‌ సి.ఐ.డి’ (1965), ‘సరస్వతి శపథం’ (1967), ‘కొండవీటి సింహం’ (1969) చిత్రాలకు పనిచేశారు. ఆ తరువాత కలం పట్టిన డబ్బింగ్‌ సినిమా ‘కోటీశ్వరుడు’. ఈ చిత్రానికి మాతృక తమిళ చిత్రం ‘దైవమగన్‌’. నిర్మాతలు ఆర్‌.వి.వెంకటేశ్వర్లు, బి.సుశీలాదేవి కాగా దర్శకత్వ బాధ్యతలు ఎ.సి.త్రిలోక్‌ చందర్‌ నిర్వహించారు. శివాజీ గణేశన్, జయలలిత హీరో హీరోయిన్లు. ఇతర పాత్రలను సుందరరాజన్, నంబియార్, చిత్తూరు.వి.నాగయ్య, నాగేష్, పండరీబాయి, విజయశ్రీ పోషించారు. పాటలను ఆరుద్రతోబాటు ఆచార్య ఆత్రేయ, రాజశ్రీ లిఖించగా, యం.ఎస్‌. విశ్వనాథన్‌ సంగీతం అందించారు. తెలుగులో ఈ పాటలను రికార్డింగ్‌ చేసింది జె.వి.రాఘవులు. తెలుగు డబ్బింగ్‌ పాటలను ఘంటసాల, టి.యం.సౌందరరాజన్, ఎల్‌.ఆర్‌.ఈశ్వరి ఆలపించారు. ఎ.వి.ఏం. స్టూడియోలో నిర్మితమైన ఈ డబ్బింగ్‌ చిత్రం తెలుగులో కూడా విజయవంతమైంది.


తమిళ మాతృక విశేషాలు...
‘దైవమగన్‌’ (‘దైవకుమారుడు’) సినిమా శివాజీ గణేశన్‌ సొంత చిత్రం. శాంతి ఫిలిమ్స్‌ బ్యానర్‌ మీద సెప్టెంబరు 5, 1969న విడుదలైంది. దీనికి నహర్‌ రంజన్‌ గుప్తా అనే బెంగాలీ రచయిత నవల ‘ఉల్క’ ఆధారం. తొలిసారి 1963లో హిందీలో వచ్చిన ‘మేరీ సూరత్‌ తేరి ఆంఖే’ సినిమాకు మూలం కూడా ఇదే నవల. శివాజీ గణేశన్‌ ఈ సినిమా నిర్మించడానికి ముందు ఇదే కథను జి.వి.అయ్యర్‌ స్వీయ దర్శకత్వంలో 1965లో ‘తాయిన్‌ కరుణై’ పేరుతో సినిమాగా నిర్మించారు. ఎల్‌.వైద్యనాథన్‌ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో కళ్యాణ్‌ కుమార్, ముత్తురామన్, యం.వి.రాజమ్మ ప్రధాన తారాగణం. అయితే ఆశించినంత విజయవంతం కాలేదు. తరువాత నిర్మించిన ‘దైవమగన్‌’లో శివాజీ గణేశన్‌ ఏకంగా మూడు పాత్రలు పోషించడం ఆరోజుల్లో పెద్ద విశేషంగా చెప్పుకున్నారు. దీన్ని భారత ప్రభుత్వం అధికారిక ఎంట్రీగా ఆస్కార్‌ అవార్డ్‌ నిమిత్తం ఎంపిక చేయడం విశేషమైతే, తమిళ చిత్రరంగం నుంచి ఆస్కార్‌ బహుమతి కోసం ఎంపికైన తొలి సినిమా ఇదే కావడం మరో గొప్ప విశేషం. 1962లో పద్మిని పిక్చర్స్‌ బ్యానర్‌ మీద బి.ఆర్‌.పంతులు నిర్మించిన ‘బలే పాండియ’లో శివాజీ గణేశన్‌ మొదటిసారి త్రిపాత్రాభినయం చేశాడు. ఆ తరువాత 1964లో ‘నవరాత్రి’లో ఏకంగా తొమ్మిది భూమికలను పోషించి రికార్డు నెలకొల్పితే, మరుసటి సంవత్సరమే ‘దైవమగన్‌’లో రెండవసారి త్రిపాత్రాభినయం చేసి ప్రేక్షకులను మెప్పించారు. ‘ఆనంద్‌ వికటన్‌’ అనే తమిళ పత్రిక ఈ సినిమా గురించి రాస్తూ ‘శివాజీ గణేశన్‌ అనే ఒంటి స్తంభం మీద కట్టిన అద్దాల మేడ దైవమగన్‌’ అని ప్రశంసించింది. శివాజీ గణేశన్‌కు తమిళనాడు ప్రభుత్వం ఉత్తమ నటుడు బహుమతి ప్రదానం చేసింది. మేకప్‌ మాంత్రికుడు హరిపాదచంద్ర (హరిబాబు)కు ఆరోజుల్లో ఎంత డిమాండ్‌ వుండేదంటే ఎంత గొప్పనటుడైనా ఆయన ఇంటికి వెళ్ళి మేకప్‌ చేయించుకోవలసిందే... అంతే కానీ హరిబాబు స్టూడియోకి వచ్చేవాడు కాదు. అతని కుమారుడు ‘నన్ను’ హరిబాబు వద్దకు మేకప్‌ కోసం వచ్చే పెద్ద పెద్ద స్టార్స్‌కు బెంగాలీ కథలు చెబుతూ వుండేవాడు. అలా చెప్పిన కథే ‘ఉల్క’ నవల. ఈ కథ వినిన శివాజీ గణేశన్‌ సినిమాగా తీయాలని నిర్ణయించాడు. తన మిత్రుడు పెరియన్నను నిర్మాతగా పెట్టి తానే సినిమాగా మలిచాడు. దర్శకుడు త్రిలోక్‌ చందవర్‌తో తనే మూడు పాత్రలు పోషిస్తానని చెప్పి మూడు పాత్రల బాడీ లాంగ్వేజ్‌లో వైదుష్యాన్ని చూపుతూ పాత్రల పోషణ చేశారు. విక్టర్‌ హ్యూగో నవల ‘ది హంచ్‌ బ్యాక్‌ ఆఫ్‌ నోట్రీ డేమ్’లో ‘క్వాసీమోడో’ పాత్రను దృష్టిలో పెట్టుకొని శివాజీ గణేశన్‌ ‘కణ్ణన్‌’ పాత్రకు ప్రాణం పోశాడు. ఈ చిత్రాన్ని హిందీలో ‘బైరాగ్‌’ పేరుతో పునర్నిర్మించారు. దిలీప్‌ కుమార్‌ హీరోగా నటించిన ఆఖరి సినిమా ఇదే. హిందీలో గొప్పగా ఆడలేదు. తరువాత 1985లో... అంటే దాదాపు పదిహేనేళ్ల తరువాత ఈ సినిమాను కన్నడంలో ‘తాయి మమతే’గా పునర్నిర్మించారు. అప్పట్లో డి.యం.కె నాయకుడు అన్నాదురై అంటే శివాజీ గణేశన్‌కు ఎంతో భక్తి. ఇందులో ‘‘దైవమా.... దైవమా’’ అనే పాటను అన్నాదురైని దృష్టిలో వుంచుకొనే కణ్ణదాసన్‌ చేత రాయించారు. ఈ చిత్రానికి నెలరోజుల ముందు శివాజీ నటించిన ‘నిరైకుడమ్‌’ విడుదలైంది. ‘దైవ మగన్‌ విడుదలైన రెండు వారాలకే శివాజీ నటించిన ‘తిరుడన్‌’, మరో నెలరోజుల లోపే భారీ బడ్జట్‌తో నిర్మించిన శివాజీ చిత్రం ‘శివంద మణ్‌’ కూడా విడుదలైంది. అయినా ‘దైవమగన్‌’ విజయవంతంగా ఆడి అనేకచోట్ల శతదినోత్సవం జరుపుకొని సూపర్‌ హిట్‌ చిత్రంగా నిలిచింది.
చిత్ర కథ...
శంకర్‌ (శివాజీ గణేశన్‌) అనే ఒక ధనికుడు పుట్టుకతోనే వికృత రూపం సంతరించుకుంటాడు. పార్వతి (పండరిబాయి) అనే మహిళను పెళ్లిచేసుకుంటాడు. వారికి కణ్ణన్‌ (శివాజీ గణేశన్‌), విజయ్‌ (శివాజీ గణేశన్‌) అనే ఇద్దరు కుమారులు కవల సంతానంగా జన్మిస్తారు. అయితే పెద్ద కుమారుడు కణ్ణన్‌ తండ్రిలాగే ముఖం మీద పెద్ద మచ్చతో పుడతాడు. అతని ముఖ వైకల్యం చూసి తట్టుకోలేని శంకర్‌ తన స్నేహితుడు, వైద్యుడు అయిన రాజు (సుందరరాజన్‌)కు అప్పగించి, పుట్టుకలోనే అతన్ని చంపేయమని కోరుతాడు. అయితే మానవతావాది అయిన ఆ వైద్యుడు, ఆ బాలుణ్ణి ఒక బాబా (చిత్తూరు నాగయ్య) నిర్వహిస్తున్న అనాధాశ్రమంలో వుంచి పెంచుతాడు. ఆ పిల్లవాడు కణ్ణన్‌ పెరిగి పెద్దవాడై చదువులో ప్రధముడుగా వుండడమే కాకుండా సితార్‌ వాద్యం వాయించడంలో నిష్ణాతుడౌతాడు. చిన్నవాడు విజయ్‌ కాలేజీలో తన సహవిద్యార్ధిని నిర్మల/నిమ్మి (జయలలిత)ను ప్రేమిస్తాడు. ఈలోగా కణ్ణన్‌కు బాబా ద్వారా తన జన్మ వృత్తాంతం తెలుస్తుంది. తన తల్లిని, సోదరుణ్ణి కలుసుకొనే ప్రయత్నం చేస్తాడు. విషయం తెలిసిన తండ్రి అతణ్ణి వారిస్తాడు. అదే సమయంలో కరణ్‌ (నంబియార్‌) అనే శంకర్‌ మీద పగబట్టిన విరోధి, శంకర్‌ మీద ప్రతీకారం తీర్చుకోవాలని విజయ్‌ను అపహరించి బంధిస్తాడు. సినిమా అనేక మలుపులు తిరుగుతుంది. ఆఖరుకు వికలాంగుడైన కణ్ణన్‌ తెగించి కరణ్‌ తో పొరాడి అన్నను రక్షిస్తాడు. ఆ పోరులో కరణ్‌ చనిపోగా, కణ్ణన్‌కు తీవ్రగాయాలవుతాయి. చివరికి తల్లి ఒడిలో కణ్ణన్‌ మరణిస్తాడు.

విశ్వనాథన్‌ సంగీతం...
కోటీశ్వరుడు చిత్రానికి తమిళంలో కణ్ణదాసన్‌ మొత్తం ఎనిమిది పాటలు రాయగా వాటికి యం.ఎస్‌.విశ్వనాథన్‌ అందమైన బాణీలు కట్టారు. తమిళంలో పాటలను టి.యం.సౌందరరాజన్, శ్రీక్కాళి గోవిందరాజన్, సుశీల ఆలపించారు. తెలుగులో ‘దైవమా దైవమా ఎంత భాగ్యం దైవమా... కంటినే కంటినే కరువుతీరా కంటినే’ (తమిళంలో ‘దైవమే దైవమే నంద్రి సొలవన్‌’) అనే పాటను సౌందరరాజన్‌ తమిళంలో పాడిన టెంపోలోనే పాడారు. ఈ పాట నేటికీ ఎక్కడో ఒకదగ్గర వినపడుతూనే వుంటుంది. ‘కళ్ళు కళ్ళు కలిశాయమ్మా’ (తమిళంలో ‘కంగళ్‌ పేసుతమ్మా’) అనే సోలో గీతాన్ని ఘంటసాల ఆలపించారు. ‘కమ్మని హ్యాపీ డే ఓ కన్నుల పండగే‘ అనే పాటను, ‘నేలపై చుక్కలు చూడు పట్టపగలొచ్చెను నేడు ఎంతో వింతా ఏదో వింతా’ (తమిళంలో ‘కాదల్‌ మలర్‌ కూటం’) పాటను సౌందరరాజన్‌ పాడగా ‘చక్కనైన రామచిలకుంది’ అనే యుగళగీతాన్ని ఘంటసాల, ఎల్‌.ఆర్‌.ఈశ్వరి కలిసి పాడారు. ‘యాదవకుల పావన కృష్ణా కృష్ణా’ (తమిళంలో ‘కేట్టదమ్‌ కొడుప్పావనే కృష్ణా’) అనే పాటను కూడా ఘంటసాల పాడారు. ఈ ఏడు పాటలు అటు తమిళంలో, ఇటు తెలుగులో కూడా హిట్లయ్యాయి.
- ఆచారం షణ్ముఖాచారి


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.