డెభ్బై ఎనిమిది వసంతాల వాహినీ చిత్రం.. దేవత

వాహిని పిక్చర్స్‌ సంస్థకు బి.ఎన్‌.రెడ్డి, మూలా నారాయణస్వామి మూల స్థంభాలు, దర్శకుడు కె.వి.రెడ్డి, నారాయణ స్వామికి మంచి స్నేహితుడు, నెప్ట్యూన్‌ స్టూడియోతో ఇబ్బందులు ఎదుర్కొవడంతో వీరంతా కలిసి వాహినీ స్టూడియో నిర్మించారు. నిరుద్యోగం, వరకట్న సమస్యలను ఎత్తిచూపుతూ బి.ఎన్‌.రెడ్డి నిర్మించిన ‘వందేమాతరం’. సినిమా విజయవంతమయ్యాక. బాల్య వివాహాలను నిరసిస్తూ, వితంతు వివాహాలను ప్రోత్యాహిస్తూ ‘సుమంగళి’ సినిమా తీశారు. ఆ సినిమా జనాదరణ పొందలేదు. మూడవ చిత్రాన్ని వివాహతూర్పర్వ లైంగిక సంబంధాలు, పెళ్లి కాని తల్లులు ఎదుర్కొనే సమస్యల ఇతివృత్తంలో ‘దేవత’ సినిమా నిర్మించారు. శతదినోత్సవం జరుపుకున్న ఈ సినిమా జులై 4, 1941న విడుదలైంది. 79 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ చిత్ర విశేషాలు కొన్ని..

ఇదీ నేపథ్యం

వాహినీ పిక్చర్స్‌ పతాకం మీద వచ్చిన తొలి చిత్రం ‘వందేమాతరం’. అది ఏప్రిల్‌ 1, 1939న విడుదలైంది. తరువాతి చిత్రం ‘సుమంగళి’ మే 31, 1940న విడుదలైంది. ఈ రెండు చిత్రాలకు నిర్మాత, దర్శకుడు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (బి.ఎన్‌.రెడ్డి) ‘వందేమాతరం’ సినిమా వాహినీ సంస్థ పతాకాన్ని రెపరెప లాడించడమే కాకుండా కాసులు, కీర్తిని కూడా సంపాదించి పెట్టింది. అయితే రెండో చిత్రం ‘సుమంగళి’ మాత్రం వాహిని వారి చేతులు కాల్చి, నిరాశను మిగిల్చింది.‘సుమంగళి’ ఇతివృత్తం విధవా పునర్వివాహం కావడంతో ప్రేక్షకులకు నచ్చలేదు. ఈ భవిష్యందశాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. దానితో ‘వందేమాతరం’ తరహాలోనే చిత్రం నిర్మించాలని రామ్‌నాథ్, బి.ఎన్‌.రెడ్డి కలిసి ‘దేవత’ సినిమాను కథ అల్లారు. ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే రామనాథ్‌ రూపొందించారు. రామ్‌నాథ్‌ మద్రాసు యూనివర్సిటీలో పట్టాపుచ్చుకొని, ఆంగ్ల సాహిత్యంలో మంచి పట్టు సాధించిన సాహిత్య పిపాసి. రామ్‌నాథ్‌కు నాటక రంగం మీద మంచి అవగాహన ఉండేది. అందుకే ఈ సినిమాలో ఎక్కడా నాటక పంథా కనిపించకుండా పకడ్బందీగా సినేరియా అల్లారు. అప్పట్లో నటీనటులకు క్లోజప్‌ షాట్లు ఉండేవి కావు. తెలుగు సినిమా చరిత్రలో క్లోజప్‌ షాట్లు తీయడం ఈ చిత్రంతోనే ప్రారంభమైదని చెప్పవచ్చు. ముఖ్యంగా కుమారి, సూర్యకుమారిల మీద లెక్కలేనన్ని క్లోజప్‌ షాట్లు ఇందులో చూపించారు రామనాథ్‌. ఈ చిత్ర విజయంతో వాహినీ సంస్థ నిలదోక్కుకొని లాభాల బాటలో పయనించింది. చిత్తూరు నాగయ్య, ముదిగొండ లింగమూర్తి, బెజవాడ రాజారత్నం గతంలో వాహినీ సంస్థకు పనిచేసినవారే. ఈ సినిమాలో కొత్తగా టంగూటూరి సూర్యకుమారి, సి.హెచ్‌.నారాయణరావు చేరారు. సంగీత దర్శకుడు భీమవరపు సరసింహరావు వద్ద సహాయకుడిగా పనిచేసిన అశ్వద్ధామ, బాలనటుడుగా ఇందులో లక్ష్మీ అనుచరుడు రంగడు పాత్ర పోషించడం కూడా విశేషమే! అశ్వద్థామ తదనంతర కాలంలో గొప్ప సంగీత దర్శకునిగా ఎదగడం తెలిసిందే. ఈ సినిమాకు సముద్రాల రంగాచార్య మాటలు, చిత్తూరు నాగయ్య సంగీత దర్శకత్వ బాధ్యతలను నిర్వహించారు. అప్పట్లో ప్రముఖ సంగీత దర్శకులు గాలి పెంచల నరసింహరావు నాగయ్యకు ఆర్కెస్ట్రా సహాయకుడిగా పనిచేయడం మరో విశేషం. ఎ.కె.శేఖర్‌ వాహినీ సంస్థ మూలపురుషుల్లో ఒకరు. ఈ చిత్రానికి కళా దర్శకత్వ శాఖనే కాకుండా శబ్దగ్రహణ బాధ్యతలు కూడా మోశారు.


కథ ఇదీ...

వేణుగోపాల్‌ (నాగయ్య) బారిస్టరు చదువుకోసం ఇంగ్లండు వెళ్తాడు. చదువు పూర్తయ్యావ స్వగ్రామానికి వస్తాడు. తల్లి మంగమ్మ (పార్వతీబాయి) చెల్లెలు సీత (టంగుటూరి సూర్యకుమారి) ఎంతో ఆనందిస్తారు. వారి ఇంటిలో లక్ష్మీ (కుమారి) అనే పేదింటి అమ్మాయి పనిమనిషిగా ఉంటూ, అందరి మనసూ చూరగొంటుంది. ఆమె వెంట తమ్ముడు రంగడు (అశ్వద్థామ) కూడా అదే ఇంట్లో పనిచేస్తూ ఉంటాడు. వేణు మేనమామ బలరామయ్య (సుబ్బారావు) మద్రాసు నగరంలో పెద్ద జమీందారు. అతనికి విమల (బెజవాడ రాజరత్నం) అనే ఏకైక సంతానం వేణుని బలరామయ్య తన ఇంటి అల్లుడిగా చేసుకోవాలనుకుంటాడు. విమలకు కవిత్వమన్నా, సంగీతమన్నా విపరీతమైన అభిమానం. సుకుమార్‌ (సి.హెచ్‌. నారాయణరావు) అనే స్వార్థపరుడు వారింట్లో చేరి విమల తండ్రి మెప్పు పొందేందుకు నానా యాతన పడుతూ ఉంటాడు. ఒకరోజు తల్లి, చెల్లెలు ఇంట్లోలేని సమయంలో వేణు, లక్ష్మి అందానికి వివశుడై బలవంతం చేస్తాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలుకుతాడు. తరువాత వేణు మద్రాసు వెళ్లి వకీలుగా ప్రాక్టీసు ఆరంభిస్తాడు. వేణు పెళ్లి విషయం మాట్లాడాలని బలరామయ్య అతని తల్లిని, చెల్లెల్ని మద్రాసు పిలిపిస్తాడు. వారి వెంట లక్ష్మీ కూడా వస్తుంది. వేణు సంఘర్షణకు గురై లక్ష్మీని వదిలించుకోవాలని డబ్బు ఇవ్వజూపుతాడు. అభిమానవతి అయిన లక్ష్మీ రంగణ్ణి తోడుకొని పల్లెటూరికి వెళ్ళిపోతుంది. అప్పటికే ఆమె గర్భవతి. విషయం తెలుసుకున్న ఆమె తండ్రి వెంకయ్య (ముదిగొండ లింగమూర్తి) ఆగ్రహోదగ్రుడౌతాడు. లక్ష్మీ భయపడి తమ్ముడితో బాటు ఇల్లు వదిలి వెళ్తుంది. అక్కడ మేనమామ ఇంట్లో విమల సుకుమార్‌తో లేచిపోతుంది. పశ్చాత్తాపంతో వేణు తల్లికి జరిగిన విషయం చెబుతాడు. లక్ష్మీ కోసం గాలిస్తాడు. ఒక హరిదాసు (రెండు చింతల సత్యనారాయణ) లక్ష్మీకి ఆశ్రయమిస్తాడు ఆమెకి ఒక బిడ్డ కలుగుతాడు. కులటను ఇంట్లో పెట్టుకున్న నెపంతో హరిదాసును ఆ ఊరివాళ్లు నిలేయడంతో లక్ష్మీ అక్కడ నుంచి వెళ్లిపోయి మద్రాసు త్రిపురాంబ (శేషమాంబ) నడుపుతున్న వ్యభిచార గృహంలో ఇరుక్కుటుంది. బిడ్డకు అనారోగ్యం విషమించడంతో త్రిపురాంబను లక్ష్మీ డబ్బు సహాయం కోరుకుంటుంది. కానీ, అంతరాత్మ ప్రబోధంతో త్రిపురాంబ నుంచి తప్పించుకనే ప్రయత్నంతో ఆమె తల పగలగొడుతుంది. పోలీసులు లక్ష్మీనీ బంధిస్తారు. త్రిపురాంబ లక్ష్మీ తప్పేమీలేదని ఆమె దేవతలాంటిదని వాంగ్మూలమిస్తుంది. లక్ష్మీ విడుదలౌతుంది. వేణు - లక్ష్మీని భార్యగా స్వీకరిస్తాడు. ఇదీ సినిమా కథ. ఈ సినిమాలోని ఇతర పాత్రల్లో గౌరీపతి శాస్త్రి, సుబ్బారావు, రమామణి, హేమలత, సత్యవతి నటించారు.

సంగీత సౌరభాలు

ఈ సినిమాలో ఎవరి పాటలు వారే పాడుకున్నారు. ఇందులో పాటలు, కొన్ని పద్యాలు సముద్రాల రాశారు. అయితే ఒక్క డ్యూయట్టు కూడా సినిమాలో లేకుండడం విచిత్రమే. టంగుటూరి సూర్యకుమారి పది పాటలు, బెజవాడ రాజారత్నం ఐదు పాటలు పాడారు. అందులో సూర్యకుమారి ఆలపించిన ‘వెండి కంచాలలో వేడి బువ్వుందోయ్‌’, ‘ఊగెదా ఉయ్యాల తూగుటూయెలా’, ‘రైతే జనములా పండుగ దినమిదిరా’, ‘చాలాప్రాచుర్యం పొందిన పాటలు. బెజవాడ రాజారత్నం ఆలపించిన ‘రాదే చెలి రమ్మరాదే చెలీ మగవారినిలా నమ్మరాదే చెలీ’, ‘అదిగో అందియలారవళీ జగమే రాపాడిపోయే’, ‘జాగేలా, వెరపేలా త్రాగుము రాగసుధా రసము’, ‘నిజమో కాదో యమునా తటిలో’, ‘ఎవరు మాకింకా సాటి వేనే’ పాటలు కూడా ఆ రోజుల్లో అందరి నోళ్లలో నానినవే. అశ్వథామ పాడిన ‘లోకమంతా లోభులా కానరు నిరుపేదలా’ పాట ఎంత పాపులర్‌ అయిందంటే, ఆరోజుల్లో బిచ్చగాళ్లు కూడా ఈ పాటను పాడుతుండేవాళ్లు. నాగయ్య ఆలపించిన ‘రావే రావే బంగారు పాపా ఆడుచునూ దోగాడుచునూ’ ఒక అందమైన పాట.

మరిన్నివిశేషాలు...

* మద్రాసు ప్యారగాన్‌ టాకీసులో వెస్ట్రన్‌ ఎలక్ట్రికల్స్‌ వారి మిరోఫోన్‌ మాస్టర్‌ ప్రొజెక్టర్‌ అమర్చిన తరువాత ప్రదర్శించబడిన తొలిచిత్రం దేవత. ఎం.ఎస్‌.రామారావు గాయకుడుగా పరిచయమైన చిత్రం కూడా ఇదే. ఇందులో ‘ఈ వసంతమూ నిత్యమూ కాదోయి’ అనే నేపధ్య గీతాన్ని రామారావు ఆలపించారు.

* ప్రసిద్ధ దర్శకుడు కె.వి.రెడ్డి ఈ సినిమాకు చీఫ్‌ ప్రొడక్షన్‌ ఎక్జిక్యూటివ్‌గా పనిచేయడం విశేషం. అలాగే కమలాకర కామేశ్వరరావు సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఇందులో హీరోగా నటించిన నాగయ్యకు నెలసరి జీతం కింద 3000 వేల రూపాయలు చెల్లించారు. ఆ రోజుల్లో అది చాలాపెద్ద మొత్తం కింద లెక్క.


*
ఈ చిత్రంలో లక్ష్మి పాత్ర ధరించిన కుమారి నటన అధ్బుతం. ఆమె పలికిన ప్రతి డైలాగు హృదయాంతరాల నుంచి వచ్చినట్లే ఉండి సానుభూతిని చూరొగొంది. అలాగే టంగుటూరి సూర్యకుమారిని ఎంత అందంగా చూపాలో రామనాథ్‌కు తెలుసు. సంగీత దర్శకుడు నౌషద్‌ నర్మించిన ఉరన్‌ ఖటోలా (1955) సినిమాలో సూర్యకుమారిని ఛాయాగ్రాహకుడు జాల్‌ మిస్త్రీ ఎంత అందంగా చూపాడో, అంతకన్నా రామనాథ్‌ ఆమెను గొప్పగా ఈ సినిమాలో చూపించాడు.

* సినిమాలో నాగయ్య, కుమారిని బలవంతం చేసే సన్నివేశాన్ని బి.ఎన్‌.ఎంతో జాగ్రత్తగా హృద్యంగా తీశారు. ఎక్కడా అసభ్యానికి తావు లేకుండా ప్రేయసీప్రియుల విగ్రహాలను, విదేశి పత్రికల్లోని శృంగార దృశ్యాలను సింబాలిక్‌గా చూపిస్తూ సన్నివేశాన్ని రక్తికట్టించాడు.

* నాగయ్య స్వతహాగ బిడియస్తుడు. ఈ సన్నివేశ చిత్రీకరణకు కొన్ని రోజుల ముందు నాగయ్యకు ఒక వింత అనుభవం ఎదురైంది. జయలక్ష్మీ అనే మహిళ నాగయ్య ఇంటికి చుట్టపు చూపుగా వచ్చింది. ఒకానొక సందర్భంలో నాగయ్య ఆమెకు చేరువై, తరువాత తన తప్పును తెలుసుకొని ఆ మరునాడే వడపళని దేవాలయానికి తీసుకెళ్లి దేవుని ఎదుట వివాహం చేసుకున్నారు. సినిమాలో ఇలాంటి సన్నివేశంలో నాగయ్య రావడం యాదృచ్ఛికమే.

* సముద్రాల రాఘవాచార్య మాటలు, పాటల వలన ‘దేవత’ చిత్రానికి పట్టు దొరికింది.


*
ఈ చిత్రంలో కొన్ని లోపాలు దొర్లినట్లు ప్రఖ్యాత హిందీ నిర్మాత దర్శకుడు వి.శాంతారాం గమనించారు. అంతే కాదు విఖ్యాత సినీ విమర్శకుడు. ఫిలిం ఇండియా ప్రతినిధి బాబూరావు పటేల్‌ కూడా చిత్ర లోపాలను వేలెత్తి చూపడలం విశేషం.


*
ఇంగ్లాండెకు వెళ్లి న్యాయశాస్త్రం అభ్యసించి ఇంటికి వచ్చిన వేణు, ఒక పనిపిల్ల శీలాన్ని హరించడం న్యాయబద్ధంగా లేదని బాబూరావు పటేల్‌ వాదన. వేణు చర్య వలన హీరో పాత్ర ఔచిత్యం దెబ్బతిందని శాంతారాం విమర్శించారు. పైగా తను చేసిన తప్పును డబ్బుతో వదిలించుకోవాలని చూడడం బాగోలేదన్నారు. వ్యాపారపరంగా సినిమా విజయవంతమవడానికి ఈ లోపాలేవీ ప్రతిబంధకం కాలేదు.

- ఆచారం షణ్ముఖాచారిCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.