ఆలయాన వెలసిన... పద్మనాభం ‘దేవత’
ఆలయంలో వెలసిన దేవతలాగే, భారతీయ మహిళ మన చరిత్రలో ఒక పవిత్ర స్థానం దక్కించుకుంది. జీవనజ్యోతి వంటి ఆ స్త్రీమూర్తిని దేవతామూర్తిగా ఆరాధించిన ఘనత భారతదేశానికే దక్కుతుంది. కష్టసుఖాలను భర్తతో పంచుకుంటూ, ఆదరణలో ఓ తల్లిని మురిపిసూ, గృహసీమను కాచే దేవతగా ఆ భగవంతుడు సృష్టించాడేమో అనిపించేలా సేవలు చేసే ఒక స్త్రీ మూర్తి జీవిత కథను హాస్యనటుడు పద్మనాభం వెండితెరపై ఆవిష్కరించారు. నిర్మాతగా మారి, రేఖా అండ్‌ మురళీ ఆర్ట్స్‌ పేరిట చిత్ర సంస్థను నెలకొల్పి తన తొలి ప్రయత్నంలోనే అద్భుత చిత్రం ‘దేవత’ సినిమాను నిర్మించి అఖండ విజయాన్ని అందుకున్నారు. నటరత్న ఎన్టీఆర్‌, సావిత్రి, నాగయ్య వంటి భారీ తారాగణంతో నిర్మించిన ‘దేవత’ సినిమా 1965, జులై 24న విడుదలై స్వర్ణోత్సవం జరుపుకుంది. ఆ రోజుల్లో ఆరు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకోవడమంటే గొప్ప విషయం. ఆ సంవత్సరం ఎన్టీఆర్‌ నటించిన 12 సినిమాలు విడుదలైతే, వాటిలో ఘన విజయం సాధించిన ఎనిమిదింటిలో ‘దేవత’ కూడా ఒకటి. అశేష ప్రజానీకం, ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్న ఈ సినిమా విశేషాలు మీ కోసం...


* తెర వెనుక ‘దేవత’
పద్మనాభం స్వయంగా స్టేజి నటుడు. సినిమాల్లోకి వచ్చాక కూడా నాటక రంగాన్ని వదల లేదు. 1960లో వాహిని వారి ‘రాజమకుటం’ సినిమాలో నటించాక సహనటుడు వల్లం నరసింహారావుతో కలిసి ‘రేఖా అండ్‌ మురళీ ఆర్ట్స్‌’ పేరుతో ఒక నాటక సంస్థను నెలకొల్పారు. రేఖ నరసింహారావు కుమార్తె అయితే మురళి పద్మనాభం కొడుకు. వీళ్లిద్దరి పేరుతోనే ఆ సంస్థ వెలసింది. సంగీత దర్శకుడు కోదండపాణి వీరికి ఆస్థాన విద్వాంసుడుగా వ్యవహరించేవారు. తొలిసారి పద్మరాజు రచించిన ‘శాంతినివాసం’ నాటకాన్ని రాష్ట్రమంతటా ప్రదర్శించారు. అదే నాటకాన్ని తర్వాతి కాలంలో సుందర్లాల్‌ నహత సినిమాగా తీశారు. ‘శ్రీకాళహస్త్రీశ్వరమహత్మ్యం’ నాటకాన్ని వందలకొద్దీ ప్రదర్శనలిస్తూ, అటు సినిమాల్లో బిజీగా ఉంటున్న రోజుల్లో, పద్మరాజు శిష్యుడు వీటూరి (వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి) ‘దేవత’ కథను పద్మనాభం, కోదండపాణిలకు వినిపించారు. అది నాటకానికి సరిపోదు కాబట్టి ఎవరైనా నిర్మాతకు వినిపిస్తే సినిమాగా తీస్తారని పద్మనాభం సలహా ఇచ్చారు. అయితే కోదండపాణి మాత్రం ఎన్టీఆర్‌ని కలిస్తే బాగుంటుందని చెప్పిన మీదట వీటూరితో కలిసి పద్మనాభం ఎన్టీఆర్‌కు ‘దేవత’ కథ వినిపించారు. ఆయనకు కథ నచ్చింది. ‘గో అహెడ్‌ బ్రదర్‌’ అని ప్రోత్సహించడంతో పద్మనాభంకు ధైర్యం వచ్చింది. ఆ కథలో హీరోయిన్‌ది డబుల్‌ రోల్‌. ఆ పాత్రకు సావిత్రి అయితే బాగుంటుందని వెళ్లి ఆమెను కలిశారు. ఆమెకూ కథ నచ్చింది. కానీ అప్పటికే సావిత్రి మూడునెలల గర్భవతి. ఆమె ఒప్పుకుంటే మూడునెలల్లోనే సినిమా పూర్తి చేస్తానని భరోసాయిచ్చి, ఆమెను సమాధానపరిచారు పద్మనాభం. సావిత్రికి అడ్వాన్సు ఇస్తుండగా ఒక వంద రూపాయల నోటు పొరబాటున చేజారి కిందపడింది. సావిత్రి ఆ నోటును కళ్లకద్దుకుంటూ ‘‘పద్మనాభం గారూ, ఇది మంచి శకునం. మీ ‘దేవత’ సినిమా తప్పకుండా వందరోజులు ఆడుతుంది చూడండి’’ అని అభయమిచ్చింది. ఏది ఏమైనా ఆమె జోస్యం ఫలించడం విశేషం! వాణీ ఫిలిమ్స్‌ స్టూడియో రెండవ ఫ్లోరులో 22 జనవరి 1965 ‘దేవత’ చిత్రనిర్మాణం మొదలెట్టారు. విజయా నిర్మాత చక్రపాణి సమక్షంలో వాణీ ఫిలిమ్స్‌ పంపిణీదారుడు కాకర్ల వెంకటేశ్వరరావు కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. ఇదీ నటుడు పద్మనాభం నిర్మించిన ‘దేవత’ సినిమా తెర వెనుక కథ.


తెరముందు ‘దేవత’
లెక్చరర్‌ ప్రసాద్‌ (ఎన్టీఆర్‌) తండ్రి లోకాభిరామయ్య (నాగయ్య) శ్రీమంతుడు. ప్రసాద్‌ తల్లి పార్వతమ్మ (నిర్మలమ్మ) గుండెజబ్బు మనిషి. ప్రసాద్‌ భార్య సీత (సావిత్రి) ఆదర్శప్రాయురాలైన సద్గుణవతి. ఆమెకు ఒక ముద్దుల కొడుకు మధు (మాస్టర్‌ మురళి). హైస్కూల్‌లో చదివే హేమ (గీతాంజలి) ప్రసాద్‌ చెల్లెలు. లోకాభిరామయ్య చెల్లెలు కొడుకు వరహాలు (పద్మనాభం) తల్లిదండ్రులు పోయిన దగ్గర్నుంచి మేనమామ లోకాభిరామయ్య ఇంట్లోనే పెరిగాడు. అతనికి సినిమా పిచ్చి. తనపేరు ‘ప్రేమ్‌ కుమార్‌’గా మార్చుకొని సినిమా హీరో కావాలని కలలుకంటూ వుంటాడు. విభిన్న మనస్తత్వాలు కలిగిన ఈ ఇంట్లో సీత ఒక్క క్షణం లేకున్నా గడవదు. ప్రసాద్‌ డాక్టరేట్‌ డిగ్రీ అందుకునేందుకు విశాఖపట్నం వెళ్లిన సమయంలో తండ్రి శేషయ్య (పెరుమాళ్లు)కు సుస్తీగా వుందని కబురందడంతో సీత పుట్టింటికి బయలుదేరుతుంది. అయితే సీత ప్రయాణించే రైలు ప్రమాదానికి గురవుతుంది. ప్రమాద స్థలిలో అతనికి గాయపడిన సీత పోలికలున్న లలిత (సావిత్రి ద్విపాత్రాభినయం) కనిపిస్తే, ఆమెను తన భార్యగా భావించి ఇంటికి తీసుకొస్తాడు. కానీ ఆమె మతి స్థిమితం లేకుండా మాట్లాడుతూ ఇంట్లోవారినెవరినీ గుర్తుపట్టదు. రుక్మిణమ్మ అనే లేడీ డాక్టరు ఆమె సీత కాదని, పెళ్లికాని కన్య అని నిర్ధరిస్తుంది. ఈలోగా ప్రసాద్‌కు సీత మరణించిందని తెలుస్తుంది. నిజం తెలుసుకున్న ప్రసాద్‌ ఇంట్లో పరిస్థితులు చక్కబËడేదాకా లలితను సీత స్థానంలో సహకరించమని కోరితే ఆమె కాదనలేక పోతుంది. సీత రూపంలో తన ఇంటవున్న లలితను ఆమె ప్రేమించిన రమేష్‌ (వల్లం నరసింహారావు)కు ఇచ్చి వివాహం చేసేందుకు ప్రసాద్‌ ఏర్పాట్లు చేస్తాడు. కానీ లలిత ప్రసాద్‌ ఇంట్లో వుంటున్నందున అతడు లలిత శీలాన్ని శంకిస్తాడు. దాంతో రమేష్‌ను లలిత తిరస్కరిస్తుంది. సీత తండ్రి శేషయ్య చనిపోతూ తన యావదాస్తిని ఆమె పేరిట రాస్తే దాన్ని దక్కించుకునేందుకు సీత బంధువు జగన్నాధం (రాజనాల) లలితను సీతగా భ్రమించి బంధిస్తాడు. ప్రసాద్‌ ఆమెను కాపాడుతాడు. ప్రసాద్‌ మంచితనాన్ని, ఇంటిల్లిపాదీ తనపై చూపిస్తున్న ప్రేమభిమానాలకు ముగ్థురాలై, ప్రసాద్‌తో జీవితాన్ని పంచుకునేందుకు లలిత సిద్ధపడుతుంది. సీత లేని లోటు తీర్చి ఆ ఇంటి ‘దేవత’గా నిలుస్తుంది. ఇదీ కథ!

మరిన్ని విశేషాలు...
* దేవత సినిమా నిర్మాణం జరుగుతుండగా చిత్తూరు నాగయ్యకు ‘పద్మశ్రీ’ పురస్కార ప్రకటన వెలువడింది. షూటింగ్‌ స్పాట్లోనే నాగయ్యను పద్మనాభం పూలమాలలతో ముంచెత్తి సత్కార కార్యక్రమం నిర్వహించారు. ‘త్యాగయ్య’ సినిమాలో నటించినప్పటి నుండి పద్మనాభం నాగయ్యను ‘‘నాన్నగారూ’’ అని పిలిచేవారు. రేణుకా ఆఫీసులో తనకు పాతిక రూపాయలిచ్చి అన్నంపెట్టిన ఆ మహా మనిషిని సత్కరించడం అదృష్టమని భావించారు పద్మనాభం.

* సినిమాలో ఎన్టీఆర్‌-సావిత్రి కొడుకుగా నటంచింది పద్మనాభం కుమారుడు మురళి. ‘‘కన్నుల్లో మిసమిసలు కనిపించనీ’’ అనే పాట చిత్రీకరణను సాతనూర్‌ డ్యాం వద్ద చిత్రీకరణ జరిపినప్పుడు ఒక చిన్న సంఘటన చోటుచేసుకుంది. ఎన్టీఆర్‌ని కారులో ఎక్కించుకొని రాత్రిపూట సాతనూర్‌ బయలుదేరారు పద్మనాభం. ఎన్టీఆర్‌ వెనక సీటులో పడుకున్నారు. చెంగల్పట్టుకు దగ్గరలో రోడ్డు మీదకు ఒక పులి వచ్చింది. ముందు సీట్లో వున్న పద్మనాభం, డ్రైవరుకు ధైర్యం చెప్పి స్పీడు తగ్గించమన్నారు. పులి వంద అడుగుల రోడ్డును ఒక్క గెంతులో దాటేసింది. డ్రైవరు పద్మనాభంతో ‘‘సార్‌ పులిని చూసి మీరు భయపడలేదే’’ అని అడిగాడు. పద్మనాభం సమాధానమిస్తూ ‘‘నిజమేరా. పులికి నేను భయపడలేదు. వెనక సింహాన్ని తీసుకెళుతున్నాం. నాకు అదంటేనే భయం’’ అన్నారు. తిరువణ్ణమలై దాటాక డ్రైవరుకి టీ తాగిద్దామని నాలుగు గంటలకు కారు ఆపగా ఎన్టీఆర్‌ లేచారు. పద్మనాభం జరిగింది అన్నగారికి చెప్పారు. ‘‘నన్ను కూడా లేపాల్సింది. నేనూ చూసేవాణ్ణిగా?’’ అన్నారు ఎన్టీఆర్‌. పద్మనాభం తాపీగా ‘‘పులి వెళ్లి పోయిందిగా, అంతగా అవసరం వస్తే సింహాన్ని లేపేవాణ్ణి సార్‌’’ అనడంతో నవ్వులు విరిశాయి.
                                       

*
‘దేవత’ సినిమాకు ‘‘బొమ్మను చేసి ప్రాణము పోసి’’ అనే క్లైమాక్స్‌ పాట కోసం వీటూరి రెండు పల్లవులు రాశారు. మొదటిది ‘‘నవ్వలేవు ఏడ్వలేవు ఓడిపోయావోయ్‌ మేధావి... నవ్వించువాడు, ఏడ్పించువాడు వున్నాడు వేరే మాయావి’’. రెండవది ‘‘బొమ్మనుచేసి ప్రాణముపోని ఆడేవు నీకిది వేడుకా’’ అనేది. మొదటి పల్లవిలో డబ్బింగ్‌ ఛాయలు ఉండడంతో రెండవ పల్లవిని అందరూ ‘‘ఓకే’’ చేశారు. కానీ ఇరవై రోజులు గడిచినా ఈ పాటకు చరణాలు కుదరలేదు. ఒకవైపు సావిత్రి గర్భవతి కావడంతో త్వరగా సినిమా పూర్తి చేయాలని, అప్పుడు పద్మనాభం మహాకవి శ్రీశ్రీని కలిశారు. పల్లవిని మార్చకుండా శ్రీశ్రీ రెండు చరణాలను రెండ్రోజుల్లోనే రాసి యిచ్చేశారు. మహాకవి శ్రీశ్రీ వీటూరి రాసిన పల్లవిని మార్చకుండా చరణాలు రాసి తన గొప్ప మనసును చాటుకున్న మహాత్తర గీతమిది. ఇప్పటికీ ఈ పాట ప్రతి పాట కచేరీలో తప్పనిసరిగా వినిపిస్తూనే ఉంటుంది.

* 1965లో గాంధీ జయంతి సందర్భంగా తెలుగు పరిశ్రమ కళాకారులు, సంస్థలు శ్రీసారథి స్టూడియోలో సమావేశమై దేశరక్షణ నిమిత్తం నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మనందరెడ్డికి విరాళాలు అందజేశారు. ఈ సందర్భంగా పద్మనాభం ఐదువేల రూపాయలు ముఖ్యమంత్రికి అందజేశారు. ఆ రోజుల్లో ఈ మొత్తం చాలా పెద్దది అని చెప్పవచ్చు. ఈ సినిమాకు ‘గృహదేవత’ అనే టైటిల్‌ పెడితే ఉపయుక్తంగా ఉండేదని శ్రీశ్రీ భావించడం కొసమెరుపు. ‘దేవత’ సినిమా తొలి సగం వినోదాత్మకంగాను, మలి సగం ఉదాత్తమంగానూ, గంభీరంగానూ వుండడంతో ప్రేక్షకులకు ఈ చిత్రంమీద ఆసక్తి పెరిగి బాగా ఆదరించారు.
                          

*
దేవత చిత్రానికి కోదండపాణి చేసిన స్వర రచన మహాద్భుతం. ఈ సినిమా పాటలు చిత్ర విజయానికి బాగా తోడ్పడ్డాయి. ఘంటసాల ఆలపించిన ‘ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి.. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి’ అత్యంత ప్రజాదరణ పొందిన పాట. సింధుభైరవి రాగఛాయల్లో అమరిన ఈ గీతం వింటే కార్యేషు దాసీ.. కరణేషు మంత్రి అనే నానుడి గుర్తుకొస్తుంది. శంకరాభరణ రాగంలో స్వరపరచిన ‘కన్నుల్లో మిసమిసలు కనిపించనీ గుండెల్లో గుసగుససలు వినిపించినీ’ పాటను ఎన్టీఆర్‌ - సావిత్రిల మీద చిత్రీకరించారు. ఈ పాటలో ‘నీ చూపుతో నన్ను ముడివేయకూ... ఈ పూలు వింటాయి సడిసేయకూ’’ అనేది అద్భుత ప్రయోగం. కల్యాణి రాగంలో ఘంటసాల - సుశీల ఆలపించిన మరొక పాట ‘‘తొలివలపే పదేపదే పిలిచే... ఎదలో సందడి చేసే’’ కూడా చాలా గొప్ప పాట. ఈ పాటకు సరిగమలు జొప్పించడం కోదండపాణి చేసిన అద్భుత ప్రయోగం. ‘‘బొమ్మను చేసి ప్రాణము చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా’’ పాట ఘంటసాల పాడిన ఆణిముత్యాల్లో ఒకటిగా నిలుస్తుంది. ‘దేవత’ సినిమా పాలగుమ్మి పద్మరాజు రాసిన ‘భళారే ధీరుడ వీవేరా వాహవ్వా వీరుడ నీవేరా’ పాటతోనే మొదలవుతుంది. పొరబాటున జానపద సినిమాకు వచ్చామా అనే సందేహం తొలిసారి సినిమాకు వెళ్లిన ప్రేక్షకుడికి కలగడం ఖాయం. పద్మనాభం - గీతాంజలి ఈ పాటలో నటించగా పి.బి.శ్రీనివాస్‌, జానకి ఆ పాటను పాడారు. కొసరాజు గీతం ‘మావూరు మదరాసు, నాపేరు రామదాసు’ను ఎల్లారీశ్వరితో కలిసి పద్మనాభమే పాడడం విశేషం. ఇక దాశరధి గీతం ‘అరె ఖుషీఖుషీ చేస్తేనే కలుగు హుషారు’, వాణిశ్రీ నర్తించిన నారాయణరెడ్డి గీతం ‘నాకు నీవే కావాలిరా’ అతి సాధారణ పాటలే! ఈ సినిమాలో నృత్యాలకు పసుమర్తి కృష్ణమూర్తి జనరంజకమైన నృత్యరీతుల్ని సమకూర్చడం విశేషం. ఈ సినిమా తరవాత పద్మనాభం ‘పొట్టి ప్లీడరు’ నిర్మించడం, ఆ తరవాత ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని చిత్రసీమకు పరిచయం చేయడం చకచకా జరిగిపోయాయి.

- ఆచారం షణ్ముఖాచారి


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.