స్క్రీన్‌ప్లే 90 శాతం... షూటింగ్‌ 10 శాతం

ఎంత గొప్ప నటుడయినా, దర్శకుడు చెప్పినట్టు చెయ్యాలి. తనకి తోచిన విధానంలో నటుడు నటించినా దర్శకుడు ‘సరే’ అనాలి. దర్శకుడి ఆమోదముద్ర లేకపోతే, నటుడి నటనకి ఆస్కారం ఉండదు. అందుకే, అక్కినేని నాగేశ్వరరావు గారు ఎప్పుడూ చెప్పేవారు... ‘‘ఆల్వేజ్‌ ద డైరెక్టర్‌ ఈజ్‌ ద కమాండర్‌, ఐయామ్‌ సోల్జర్‌’’ అని. ఏమాత్రం అనుభవంలేని కొత్త దర్శకుడి దగ్గర నటించినా, అదే భావం! దర్శకుడు అంటే, షూటింగ్‌ టైమ్‌లో షాట్సు పెట్టడమే కాదు- ముందు నుంచి, కథ, సన్నివేశాలు, పాత్రల మీద పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. అంటే, దర్శకుడికి కల్పనాచాతుర్యం, ఊహాబలం వుండాలి. నాటకీయత (డ్రామా) తెలిసివుండాలి. నిర్మాణ బాధ్యత నిర్మాతదే ఐనా, దర్శకుడి ప్రమేయం వుండాలి; ఉంటుంది. ఇప్పుడైతే, పెట్టుబడి పెట్టే ప్రతివాళ్లూ ‘నిర్మాత’లుగా చలామణి అవుతున్నారు గాని, ఆ రోజుల్లో అలా వుండేది కాదు.

* స్క్రీన్‌ప్లే రాసిచ్చినా దర్శకుడి పేరే ఉంటుంది..
హాలీవుడ్‌లోని పెద్ద చిత్రనిర్మాణ సంస్థలు ఒక చిత్రం నిర్మించాలనుకున్నపుడు, దానికి సరైన ప్రొడ్యూసర్‌ ఎవరని ఆలోచించి, నియమించేవి. ప్రొడ్యూసర్‌ జీతగాడు. అతను వచ్చాకనే, చిత్రదర్శకుడినీ నటుల్నీ ఎన్నుకుంటాడు. ఇది మొదట్నుంచీ వుంది. కొన్ని సంస్థల్లో దర్శకుడిదే అధిక్యత. కొన్నింటిలో నిర్మాతది ఆధిక్యత. సారథి సంస్థకి చిత్రాలు డైరెక్టు చేసిన, గూడవల్లి రామబ్రహ్మం గారిదే పెత్తనం. అన్నపూర్ణ సంస్థ తీసిన ప్రతి చిత్ర జయాపజయాల్లోనూ నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావుదే బాధ్యత. ‘విజయ’లో చక్రపాణి పెత్తనం. ఇవి ఉదాహరణలు. నిజానికి దర్శకుడు, నిర్మాతా ఇద్దరూ అనుకుని నిర్ణయాలు చేస్తారు. కాని, దర్శకుడి సంప్రదింపులు లేకుండా, నిర్మాతలే నిర్ణయాలు చేసే సందర్భాలూ ఉన్నాయి. హాలీవుడ్‌లో కథ ఒకరిదీ, స్క్రీన్‌ప్లే ఇంకొకరిదీ. దర్శకత్వం వేరొకదీ. నిర్ణయించుకున్న కథకి, ఎవరు స్క్రీన్‌ప్లే రాయగల సమర్థులో వారి చేత రాయిస్తారు. మనకి దర్శకుడే సాధారణంగా స్క్రీన్‌ప్లే రచయిత. స్క్రీన్‌ప్లే అనేది ఉన్నా లేకపోయినా మన చిత్రాలన్నింటి మీదా ‘స్క్రీన్‌ప్లే - డైరెక్షన్‌’ అని వుంటుంది. స్క్రీన్‌ప్లేని రచయితే రాసి ఇచ్చినా, దర్శకుడి పేరే వుంటుంది. బాపురమణల చిత్రాలు పరిశీలిస్తే; ‘స్క్రీన్‌ప్లే, మాటలు’: ముళ్లపూడి వెంకటరమణ, ‘‘దర్శకత్వం - బాపు’’ అనే వుంటుంది. ‘స్క్రీన్‌ప్లే దర్శకత్వం - బాపు’ అని ఉండదు. ఐతే, ఇద్దరి ప్రమేయం - కథా గమనంలో వుంటుంది.

* షూటింగ్‌ది ఏముంది 10 శాతం..
స్క్రీన్‌ప్లే రాయడంలో ప్రజ్ఞావంతుడని కె. రామ్‌నాథ్‌ గురించి, వాహిని సంస్థ చెప్పేది. రామ్‌నాథ్‌ ఛాయాగ్రహణ దర్శకుడైనా, స్క్రీన్‌ప్లే రాయడంలో దిట్ట. వాహిని వారి వందేమాతరం, సుమంగళి, భక్తపోతన చిత్రాలకు రామ్‌నాథే స్క్రీన్‌ప్లే రచయిత. ‘‘చిత్రకథ కంటే ముఖ్యమైనది స్క్రీన్‌ప్లే’’ అని రామ్‌నాథ్‌ చెప్పేవారు. కథని తెరమీద, ప్రేక్షకులకి చెప్పడం ముఖ్యం. అరటిపండు ఒలిచి, ముక్కాముక్కా తినిపించినట్టు వుండాలని సి. పుల్లయ్యగారు చెప్పేవారు. ‘‘కథ మొదలైన దగ్గర్నుంచి, పిల్లలకి కథ చెప్పినట్టు సూటిగా చెప్పాలి. తికమక పెట్టకూడదు. కథని ఎక్కడో మొదలుపెట్టి, ‘ఫ్లాష్‌బాక్‌’లో చెప్పడం ఎందుకండీ?’’ అనేవాడు ఆయన. ‘‘సినిమా చూసి వచ్చిన తర్వాత, ప్రేక్షకుడు తక్కిన వాళ్లకి ఆ కథ చెప్పినప్పుడు, అతడు ఆగకుండా, ఆలోచించకుండా చెప్పగలగాలి. దృశ్యానికీ దృశ్యానికీ సంబంధం వుంటే, కథ సూటిగా వుంటుంది. నా ఉద్దేశంలో మంచి స్క్రీన్‌ప్లే లక్షణం అంటే అదీ!’’ అని కమలాకర కామేశ్వరరావు చెప్పేవాడు.

స్క్రిప్టు పూర్తి ఐతేగాని, సినిమాలు మొదలుపెట్టేవారు కాదు. ‘స్క్రీన్‌’ అంటే ఒక్క డైలాగులు మాత్రం కాదు. యాక్షను, షాట్సు అన్నీ వుండి - కరతలామలకంగా ఉండాలి. ‘‘సినిమా అంటే ఏమాత్రం తెలియని కొత్తవాడిని, స్క్రిప్టు ఇస్తే తాను అలా షూట్‌ చేసుకుంటూ వెళ్లే స్థితిలో వుండాలి స్క్రిప్టు’’ అని చెప్పేవారు కె.వి.రెడ్డి. ‘‘ఎనీ స్టోరీ కెన్‌బీ మేడ్‌ ఇన్‌టూ ఎ పిక్చర్‌. ఇంపార్టెంట్‌ ఈజ్‌ ద స్క్రీన్‌ప్లే, నాట్‌ ద స్టోరీ’’ అంటాడు హిచ్‌కాక్‌. అందుకే, ఒక సినిమా విడుదలయిన తర్వాత, ఒక జర్నలిస్టు ‘‘మీ తర్వాతి చిత్రం ఎప్పుడు?’’ అని అడిగితే- ‘‘90 శాతం అయిపోయింది’’ అన్నాడు హిచ్‌కాక్‌. ‘‘అదేమిటి- ఎప్పుడు మొదలుపెట్టారు?’’ అని జర్నలిస్టు అడిగితే- ‘‘స్క్రిప్టు పూర్తయింది. షూటింగ్‌దేముంది- 10 శాతం!’’ అన్నాడు హిచ్‌కాక్‌. ‘‘ముందుగా మనం అనుకున్న కథ, దృశ్యాలు మనకి నచ్చాలి. మనకి పూర్తిగా నచ్చితేనే సినిమా నిర్మాణం’’ అనేవాడు దుక్కిపాటి మధుసూదనరావు గారు. ‘‘స్క్రీన్‌ప్లే దశ పూర్తయిన తర్వాతే, షూటింగ్‌ ఆలోచన, నటుల నిర్ణయం’’ అన్న సిద్ధాంతం కె.వి.రెడ్డిగారిది. స్క్రీన్‌ప్లే రచనకి ఎన్ని నెలలు పట్టినా, ఇబ్బంది లేదు. ‘మాయాబజార్‌’ గాని, ‘గుణసుందరి కథ’ గాని, ‘పాతాళభైరవి’ గాని - ఘనవిజయం సాధించడానికి మూలకారణం- స్క్రీన్‌ప్లే. ‘నర్తనశాల’ విజయం వెనుక, కమలాకర కామేశ్వరరావు గారి స్క్రీన్‌ప్లే కనిపిస్తుంది. దృశ్యానికీ సంభాషణలకీ విలువ ఇస్తూ నటులు ప్రాణం పోస్తారు. సినిమా సాధించిన విజయానికి అందరూ బాధ్యులే అయినా, మూలం అంతా స్క్రీన్‌ప్లే రచనలో వుంటుందనేది- అందరికీ తెలిసిన సత్యం.

* షూటింగ్‌లో దర్శకులు..
కొందరు దర్శకులు షూటింగ్‌లో సరదాగా, ఆడుతూపాడుతూ ఉంటారు. ఏ మాత్రం ఆందోళన వుండదు. నాకు తెలిసి, కె.యస్‌.ప్రకాశరావు, ఆదుర్తి సుబ్బారావు ముఖ్యులు. కె.వి.రెడ్డి, బి.ఎన్‌.రెడ్డి వంటివారు- ఎన్‌.టి.రామారావు గారూ చాలా స్ట్రిక్ట్‌గా వుండేవారు. ఎక్కడా ఇతర శబ్దాలు వినిపించకూడదు. సెట్లో కబుర్లు చెప్పుకోవడం కుదరదు. షూటింగ్‌ మీదనే దృష్టిపెట్టాలి. పనిలేని వాళ్లు బయటికి వెళ్లి కూచోవాలి. ఎల్‌.వి.ప్రసాద్‌గారు- అటూ ఇటూగా ఉండేవారు. ఆయన డైలాగ్‌కీ నటనకీ ప్రాముఖ్యత ఇచ్చి చేయించేవారు. నటులందరూ తమ ధోరణిలో నటిస్తున్నా- లోపం వుంటే తానుగా చెప్పి, చేసి- సరిదిద్దేవారు. సహజంగా ఆయన నటుడు కావడం వల్ల- ఆయన తీరు అలా వుండేది. బి.ఎన్‌.గారు సినిమాలకి రాకముందు నాటకాల్లో నటించేవారు గాని, సెట్లో ‘‘డైలాగ్‌ ఇలా చెప్పు-’’ అని చెప్పిన సందర్భాలు నేను చూడలేదు. ఎలా కావాలో, ఎంత కావాలో సూచించేవారు. ఒక డైలాగుని నాలుగైదు రకాలుగా చెప్పించి, తనకి కావలసిన దాన్ని నిర్ణయించడం- కె.వి.గారి పద్ధతి. విఠలాచార్య గారి విధానం- కాస్త ‘ఓవర్‌’గా వుండేది. ఆంగిక, హావభావాలు ఎక్కువగా వుండాలనేవారు. ‘అండర్‌ యాక్టింగ్‌’ అనే విధానం- నచ్చదు. ఒక నటుడు ఒక చిత్రంలో ‘‘అద్భుతంగా నటించాడు’’ అనిపించుకుంటే, అందులో 50, 60 శాతం- దర్శకుడిదీ ఉంటుంది. ‘‘బంగారుపాపలో నేను ఎంతో బాగా నటించానని, అందరూ పొడిగినప్పుడు- అందులో ఎక్కువ భాగం బి.ఎన్‌.రెడ్డి గారికే చెందాలి’’ అనేవారు ఎస్‌.వి.రంగారావు. ‘‘నటులలోని ప్రజ్ఞని రాబట్టుకోడం దర్శకుల ప్రజ్ఞ’’ అన్నది అక్కినేని వారి విశ్వాసం. ‘‘అమ్మా- ఇదీ డైలాగు. మీరు ఎలా చెప్పినా ఓకే అనేవారు కొందరు దర్శకులు’’- అని ఒకసారి సావిత్రి చెప్పారు. ‘‘చక్రపాణి గారు శోక దృశ్యాల్లో కూడా ఏడవనివ్వరు. కళ్లల్లో కాస్త మీరు చెప్పరిల్లితే చాలు’’ అని చెప్పేవారు. అందుకే చూడండి, ‘మిస్సమ్మ’ ‘గుండమ్మకథ’ల్లో నా పాత్ర ఒకటి రెండుచోట్ల గుండె కలుక్కుమనిస్తుంది’’ అన్నారు సావిత్రి. నటులకి, కథ- పాత్ర స్వభావం పూర్తిగా తెలిస్తే- షూటింగ్‌లో దృశ్యం, సందర్భం తెలిస్తే- అర్థమైపోతుంది. స్క్రిప్టు పూర్తయిన తర్వాత, నటుల్నీ టెక్నీషియన్లనీ కూచోబెట్టుకుని- చదివి వినిపించడం అనే ప్రక్రియ ఆ రోజుల్లో వుండేది. అన్నపూర్ణా వారి తొలి చిత్రాలన్నీ అలాగే సాగాయి. బి.ఎన్‌.గారిదీ అదే పద్ధతి. ఆయన తీసిన ‘రంగులరాట్నం’ తర్వాత, ఆ విధానం మూలబడిపోయింది. ‘‘స్క్రిప్టు వినడానికి ముందుగానే కాల్‌షీటు చెప్పినా, ఆ వేళకి కొందరు రావడంలేదు. ఇంకెందుకని మానేశాం. ఇది చాలా దారుణం’’ అని బి.ఎన్‌.రెడ్డి బాధపడేవారు.
- రావి కొండలరావు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.