తొలి తెలుగు బాండ్‌ సినిమా ‘గూఢచారి 116’
భారతదేశంలో గూఢచర్యం ద్వారా కల్లోలం సృష్టించి దేశప్రతిష్టతను దిగజార్చాలనే ప్రణాళికతో ఒక నరహంతకుడు ప్రవేశిస్తాడు. జేమ్స్‌ బాండ్‌ వంటి మన దేశపు గూఢాచారి ఆ ప్రయత్నాన్ని ఎలా అంతమొందించాడో తెలియజెప్పేదే ‘గూఢాచారి 116’ సినిమా కథ. ఈ చిత్రాన్ని విజయలక్ష్మి పతాకంపై నిర్మాతలు సుందర్లాల్‌ నహతా, డూండీ నిర్మించారు. ఈ సినిమా నటుడు కృష్ణను ప్లే బాయ్‌గా మార్చి విజయపరంపరకు సోపానంగా నిలిచింది. ఆగస్టు 11, 1966న విడుదలై శతదినోత్సవం జరుపుకున్న ఈ సినిమా యాభైరెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని విశేషాలు మీకోసం.* డిటెక్టెవ్‌ సినిమా తీయాలని...
బెజవాడలో 1921లోనే మొదటి సినిమా హాలు మారుతీ టాకీస్‌ నిర్మించిన పోతిన శ్రీనివాసనావుకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు సురేంద్రనాథ్‌ బెనర్జీ ఎన్‌.టి.ఆర్‌. సహాధ్యాయి కాగా, రెండవ కుమారుడు డూండేశ్వరరావు చలచనచిత్ర నిర్మాత. చిత్రపరిశ్రమలో అందరూ అతణ్ణి డూండీ అని పిలుస్తారు. చిన్నబ్బాయి బాబ్జి కూడా నిర్మాతే. ఫిలిం పంపిణీ దారుడు సుందర్లాల్‌ నహతా, డూండీకి సహనిర్మాత. 1962లో తొలి జేమ్స్‌బాండ్‌ చిత్రం ‘డాక్టర్‌ నో’ విడుదలై సంచలనం సృష్టించింది. ఆ సినిమా ప్రభావం డూండీ మీద పడింది. వెంటనే డూండీ జేమ్స్‌ బాండ్‌ సృష్టికర్త ఇయాన్‌ ఫ్లెమింగ్‌ రాసిన నవలలు చదివి స్ఫూర్తి పొందారు. ఈ లోగా వరసగా జేమ్స్‌ బాండ్‌ సినిమాలు ‘ఫ్రమ్‌ రష్యా విత్‌ లî’ËÂ (1963,), ‘గోల్డ్‌ ఫింగర్‌’ (1964), ‘థండర్‌ బాల్‌’ (1965) విడుదలై కాసుల రాసులు పోశాయి. తెలుగు ప్రేక్షకులకు జేమ్స్‌బాండ్‌ తరహా కథతో సినిమా అందిస్తే బాగుంటుందనిపించి, డూండీ రచయిత ఆరుద్రను సంప్రదించారు. ఆరుద్ర, డూండీ వ్యక్తిగతంగా మంచి మిత్రులు. పైగా ఆరుద్ర కూడా ఇయాన్‌ ఫ్లెమింగ్‌ నవలలు చదవడమే కాదు. ఆ సినిమాలు కూడా చూసివున్నారు. రెండు నెలల్లో జేమ్స్‌ బాండ్‌ తరహా కథను అల్లమని డూండీ ఆరుద్రకు చెప్పారు. రెండ్రోజుల్లో డూండీ భాగస్వామి సుందర్లాల్‌ నహతాకు కథ వినిపించాల్సి ఉండగా, డూండీ కంపెనీలో సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న వి.రామచంద్రరావును ఆరుద్ర పిలిపించి కథను డిక్టేట్‌ చేసి, నహతాకు వినిపించారు. కథ అటు నహతాకు, ఇటు డూండీకి కూడా నచ్చింది. ఆరుద్ర కూర్చిన మాటలతో స్క్రిప్టు తయారైంది. బడ్జెట్‌ కాస్త ఎక్కువైనా రిచ్‌గా తీద్దామని నిర్మాతలు నిర్ణయించారు.


* తొలి ఆంధ్రా జేమ్స్‌బాండ్‌..
బాబూ మూవీస్‌ పతాకంపై నిర్మించిన తొలి సాంఘిక కలర్‌ చిత్రం ‘తేనెమనసులు’ విజయవంతంగా వందరోజులు పూర్తిచేసుకుంది. అందులో హీరోగా నటింంచిన ఘట్టమనేని కృష్ణ ప్రేక్షకుల్ని మొప్పించారు. సినిమా విజయవంతమైనా కృష్ణకు వెంటనే అవకాశాలు రాలేదు. సొంత ఊరు తెనాలి వెళ్లి ఆరు నెలలు అక్కడే గడిపారు. ఆదుర్తి సుబ్బారావు ‘తేనెమనసులు’ సినిమాలో కృష్ణను బుక్‌ చేస్తూ అగ్రిమెంట్‌లో తదుపరి చిత్రంలో ‘కన్నె మనసులు’ మొదలు పెడుతున్నామని, వెంటనే రమ్మని కృష్ణకు కబురొచ్చింది. ‘తేనెమనసులు’లో నటించిన వారితోనే ‘కన్నెమనసులు’ షూటింగ్‌ మొదలైంది నాలుగు రోజులు షూటింగ్‌ జరిగాక ఆదుర్తి కృష్ణను పిలిచి ‘‘డూండీ నిన్ను కలవమన్నారు వెళ్లిరా’’ అని పంపించారు. కృష్ణ వెళ్లగానే డూండీ అతని చేతుల్లో వెయ్యి రూపాయలు పెట్టి తన సినిమాలో నటించేందుకు అగ్రిమెంట్‌ మీద సంతకం తీసుకున్నారు. అదే ‘గూఢాచారి 116’ సినిమా. నిర్మాత, దర్శకుడు సి.వి. శ్రీధర్‌ చిత్రం ‘వెన్నీర ఆడై’. తమిళంలో బిజీగా మారిన జయలలితను హీరోయిన్‌గా తీసుకున్నారు. అదే చిత్రంలో నటించి తర్వాత ‘వెన్నిరాడై నిర్మల’గా పేరు తెచ్చుకున్న నటితో ‘గూఢచారి 116’లో ఒక ఐటెం సాంగ్‌ చేయించారు. అలనాటి హీరోయిన్‌ శ్రీరంజని కుమారుడు మల్లికార్జునరావు దర్శకుడిగా, రవికాంత్‌ నగాయిచ్‌ ఛాయాగ్రాహకుడుగా, తాతినేని చలపతిరావు సంగీత దర్శకుడిగా నియమితులయ్యారు.* అసలెవరీ జేమ్స్‌ బాండ్‌?
బ్రిటిష్‌ రచయిత ఇయాన్‌ ఫ్లెమింగ్‌ సృష్టించిన పాత్ర జేమ్స్‌బాండ్‌. బాండ్‌ కాల్పనిక బ్రిటిష్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ సంస్థకు గూఢచారి-007గా అతని గుర్తింపు నంబరు. ఒక అమెరికన్‌ ఆర్నిధాలజిస్ట్‌ (పక్షుల పరిశోధకుడు) పేరును తీసుకుని తన గూఢచారి పాత్రకు జేమ్స్‌ బాండ్‌ అని నామకరణం చేశాడు. ఫ్లెమింగ్‌కు జమైకాలో ఒక పెద్ద ఎస్టేట్‌ వుండేది. అక్కడ కూర్చునే తొలి బాండ్‌ నవల ‘గోల్డన్‌ ఐ’ 1953లో రాశాడు. ఆ నవలకు విపరీతమైన క్రేజ్‌ రావడంతో వరసగా 12 నవలలు రాసి 1964లో చనిపోయాడు. అవన్నీ సినిమాలుగా వచ్చాయి. ఫ్లెమింగ్‌ చనిపోయాక మరో ఎనమండుగురు రచయితలు బాండ్‌ సిరీస్‌ కొనసాగించారు. తన దేశం కోసం ఇతర దేశస్థుల గూఢాచారుల పని పట్టడం జేమ్స్‌ బాండ్‌ 007 విధి. అదేవిధంగా గూఢచారి 116 పాత్రను మలిచారు.

* గూఢచారి కథా సంగ్రహం
దేశంలో దౌర్జన్యకాండలు, విధ్వంశాలు, సృష్టిస్తూ శత్రుదేశాలకు సాయపడే విద్రోహుల ముఠాను అంతం చేసేందుకు రహస్య ఏజంట్‌ 303 (శోభన్‌బాబు)ని గూఢచార సంస్థ నియమిస్తుంది. విదేశీయ విద్రోహులకు సహాయపడే మనదేశపు ముఠాకు దామోదర్‌ (ముక్కామల) నాయకుడు, అతని డెన్లో ఎంతోమంది రౌడీలు పనిచేస్తూ వుంటారు. విద్రోహశక్తులు దామోదర్‌ ముఠా సాయంతో బండ్లకు నిప్పంటించడం, రిజార్వాయిర్లకు డైనమైట్లు పెట్టి గండికొట్టించడం, డ్యాములను కూల్చడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉంటే వారి మూలాలను పసిగట్టి వాళ్లు వాడిన కారు నెంబరు వంటి కొన్ని ఆధారాలను సంపాదిస్తాడు. వాటిని గూఢచార సంస్థకు చేరవేసేలోపు శత్రువ్యూహంలో చిక్కుకొని మరణిస్తాడు. సి.ఐ.డి. ఉన్నతాధికారి (జూ।। ఎ.వి. సుబ్బారావు) ఈ చిక్కును విడదీసే బాధ్యతను గోపి (కృష్ణ) అనే ఏజెంట్‌ 116కు అప్పగిస్తాడు. ఆ విద్రోహ ముఠాకు ఒక విదేశీయుడు (రాజనాల) బాస్‌. అతడు తన ఏజెంట్‌ దామోదరం (ముక్కామల)ను ‘ఆర్‌డి’ అనే కోడ్‌ భాషలో సంప్రదిస్తూ, ఆదేశాలు జారీచేస్తూ ఉంటాడు. దామోదరం కూతురు రాధ (జయలలిత) ఏజెంట్‌ 303 సేకరించిన ఆధారాలను సంపాదించే ప్రయత్నంలో దామోదరం, ఆ ఏజెంట్‌ చెల్లెలు సుగుణ (గీతాంజలి) ను కలిసి, తను సి.ఐ.డి. అధికారి అని పరిచయం చేసుకొని, ఆమెను పావుగా వాడుకొనే ప్రయత్నం చేస్తాడు. ఈలోగా గోపి ఆమె వద్దకు వచ్చి తనను గూఢాచారి 116 పరిచయం చేసుకుంటాడు. కానీ సుగుణ గోపినీ నమ్మదు. ఆ ఇంట్లో ఉన్న ఏజెంట్‌ 303 ఫోటో మీద ఉన్న అడ్రస్‌ ఆధారంగా గోపి నెగిటివ్‌లు సంపాదించి, వాటి ఆధారంగా విద్రోహక ముఠా ఆనుపానులు తెలుసుకుని వారిని మట్టుబెట్టే ప్రయత్నంలో, రాధ ప్రేమలో పడతాడు. రాధకు ఆమె తండ్రే విధ్వంసాలు సృష్టిస్తున్న విషయాన్ని తెలియజెప్పి ఆమె ద్వారా దామోదరంలో పరివర్తన తెచ్చేందుకు ప్రయత్నిస్తాడు. దామోదరం విదేశీ ముఠా నాయకుడిని కలిసి ఇకపై నేరప్రవృత్తికి తిలోదకాలు ఇస్తున్నట్లు చెబుతాడు. అందుకు ఆగ్రహించిన ముఠా నాయుకుడు రాధను బంధిస్తాడు. ఇక గోపి చాకచక్యంతో విద్రోహ ముఠాను మట్టికరిపించి, ముఠా నాయకుడు విమానంలో పారిపోతుంటే తన జీపుతో డీకొట్టి ఆ విమానాన్ని పేల్చివేస్తాడు. ఏజెంట్‌ 116కు అప్పగించిన పని పూర్తవడంతో సినిమా కూడా పూర్తవుంతుంది. గోపి, రాధ, ఒకటౌతారు. ఇందులో రేలంగి, శోభన్‌బాబు, రాజనాల, రమణారెడ్డి అతిథి నటులుగా కనిపిస్తారు. ఇతర పాత్రల్లో పహిల్వాన్‌ నెల్లూరు కాంతారావు, రావి కొండలరావు, మిస్టర్‌ మద్రాస్‌ రామకృష్ణ, సిహెచ్‌ కృష్ణమూర్తి, పి.జె.శర్మ. నేరెళ్ల వేణుమాధవ్‌, జగ్గారావు, వెన్నీ రాడై నిర్మల, సుదాముల నటించారు.* వెస్టర్న్‌ సంగీత జోరు
ఇందులో సంగీత దర్శకుడు తాతినేని చలపతిరావు సమకూర్చిన సంగీత బాణీలు పాశ్చాత్య ధోరణిలో, కొత్త రకంగా ఉంటాయి. వెన్నీరాడై నిర్మలతో కృష్ణ అభినయించే తొలిపాట ‘‘ఓ...వాలు చూపుల వన్నెలాడి’’ (డీరి డిరిడిరి డిరిడీ) పాటను ఘంటసాల హృద్యంగా ఆలపించారు. ఈ పాటను ఊటీలో చిత్రీకరించారు. రెండవది ‘‘ఎర్రా బుగ్గలమీద మనసైతే నువ్వేంచేస్తావోయ్‌ చిన్నవాడా’’ ఒక జానపద ధోరణిలో డప్పులు, డ్రమ్ములతో వినిపించే క్లబ్‌ పాట. పాటకు ముందు సంగీత దర్శకుడు చలపతిరావు ఈ పాట వైశిష్ట్యాన్ని గుర్తుచేస్తూ ‘‘నేడు-రేపు అనే పేరిట నేను సమర్పించబోయే ఈ పాట దేశదేశాల మేళవింపు. ఇంతవరకు మీరు వింటున్న ఈ ఆధునిక రాక్‌-ఎన్‌-రోల్‌ మన అమ్మవారి జాతరలోని తాళానికి చాలా దగ్గరలో ఉంటుంది’’ అని విశ్లేషిస్తూ సమర్పిస్తారు. సంప్రదాయక కనక తప్పెట్లు, డ్రమ్‌ వాద్యాలు పోటీపడి వినిపిస్తాయి. ఇందులో జయలలిత, కృష్ణ బృందం నటించింది. ‘‘మనసు తీరా నవ్వులె, నవ్వులె నవ్వులె నవ్వాలి’’ కూడా వెస్ట్రన్‌ బీట్‌తో వచ్చే పుట్టినరోజు పాట. ‘‘పడిలేచే కెరటం చూడు’’ అనే యుగళ గీతాన్ని మహాబలిపురం సముద్ర తీరంలో చిత్రీకరించారు. ‘‘నువ్వు నా ముందుంటే, నిన్నిలా చూస్తుంటే’’ యుగళ గీతాన్ని రంగుల్లో ఊటీలో చిత్రీకరించడం విశేషం. ఇక గీతాంజలి కోసం సుశీల పాడిన టీజింగ్‌ పాట ‘‘నీతో ఏదో పనివుంది’’ మధ్యలో మాటలు కలిసిపోతాయి తమాషాగా వుంటుంది.ఆసక్తికరమైన సంగతులు...
* గఢచారి 116 సినిమాకి ‘పానిక్‌ ఇన్‌ బ్యాంకాక్‌’ సినిమా ఆధారం. ‘డాక్టర్‌ నో’ వంటి కొన్ని బాండ్‌ సినిమాలలోని సన్నివేశాలను ప్రేరణగా తీసుకున్నారు. ఆరుద్రకు పాకెట్‌ డిటెక్టెవ్‌ పుస్తకాలు రాసే అలవాటు ఉండడం కూడా ఈ చిత్రానికి లాభించింది.

* హిందీలో రవికాంత్‌ నగాయిచ్‌ దర్శకత్వంలో ‘ఫర్జ్‌’ చిత్రం 175 రోజులపాటు ఆడింది. కృష్ణకు ‘గూఢచారి 116’ మూడవ చిత్రమైతే, జితేంద్రకు కూడా ‘ఫô’Â్జ మూడవ చిత్రం కావడం యాదృచ్చికం.

* ధ్వన్యునుకరణ చక్రవర్తి, నేరెళ్ల వేణుమాధవ్‌ రేలంగి కొడుకుగా ఈ సినిమాలో అందరినీ అనుకరిస్తూ ఉంటారు. వాటిలో చిత్తూరు నాగయ్య అనుకరణ కూడా ఉంది. సినిమాలో లేనివాళ్లని అనుకరించి చూపటం సభ్యత కాదని డూండీ ఆ బిట్‌ను తొలగించారు. ఇన్ఫార్మర్‌ ‘క్యూ’గా పనిచేసే రేలంగికి 18 మంది సంతానంగా సినిమాలో చూపుతారు. వారికి సుబ్బరాజు (నేరెళ్ల), నూకరాజు (రాజబాబు), అప్పల రాజు (రమణారెడ్డి)గా పేర్లుపెట్టి వారి ద్వారా వినోదాన్ని పంచారు.

* కృష్ణ ప్రతి యువతిని ‘‘మోహినీ’’ అని సంభోధిస్తుంటాడు. అతని డైలాగులు ఆరుద్ర చమత్కారంగా రాశారు. ‘‘నీతో ప్రపంచపు అంచుల దాకా వెళ్లాలనే ఉంది. కానీ మా తాత ఆ అంచులు దాటి వెళ్లిపోతున్నాడు వెళ్లొస్తా’’ అంటూ వెన్నీరాడై నిర్మలతో చెప్పడం బాగుంటుంది. ట్రైన్‌కు బాంబుపెట్టి పేల్చడంతో సినిమా మొదలవుతుంది. వెంటనే ముక్కామల ఫోనులో ‘‘రైలుబండి ఇంటికి వెళ్లిందన్న మాట. గుడ్‌. ఇక రిజర్వాయిరు రిపేరు, డ్యామ్‌కు మరమ్మత్తు చెయ్యాలి. భోధపడిందా’’ అంటూ తమ వ్యూహాన్ని నర్మగర్భంగా చెపుతారు. అలాగే మరో డైలాగులో ‘‘నిజం పచ్చగడ్డి లాంటిది. ఎంత కోసేసినా పెరుగుతూనే ఉంటుంది’’ అని చెబుతారు.

* హాస్యనటులు కొండలరావు ఈ సినిమాలో ఫోటో స్టూడియో యజమానిగా నవ్వులు పూయించారు. అతని నటనకు ఫిదా అయిన డూండీ ‘ఇద్దరు మొనగాళ్ళు’ చిత్రంలో పెద్ద పాత్రను ఇచ్చారు. డూండీ నిర్మించిన సినిమాల్లో కొండలరావుకు తప్పకుండా పాత్ర ఉండేది.

* కృష్ణకు ఈ సినిమా ఒక మైల్‌స్టోన్‌. అసలు ఈ సినిమా కోసం ‘తేనెమనసులు’ హీరోని పంపమని డూండీ ఆదుర్తిని కోరితే ముందు రామ్మోహన్‌ను పంపారు. డూండీ ఫోన్‌చేసి ‘‘ఇతను కాదు. వేరొక హీరో ఉన్నాడు కదా. అతణ్ణి పంపండి’’ అంటే కృష్ణ వెళ్ళడం, అడ్వాన్స్‌ తీసుకోవడం జరిగింది. ఆ తరువాత డూండీ నిర్మించిన పాతిక సినిమాలలో కృష్ణే హీరో! అంతేకాదు ఈ చిత్ర విజయంతో కృష్ణ ఏకంగా 20 సినిమాలలో బుక్‌ అయ్యారు. ఈ సినిమాలో నటించిన పహిల్వాన్‌ కాంతారావు తను నిర్మించిన ‘అసాధ్యుడు’, ‘అఖండుడు’ సినిమాలలో కృష్ణనే హీరోగా తీసుకున్నారు. ఈ చిత్రంలో సహకార దర్శకుడిగా పనిచేసిన వి.రామచంద్రరావు కృష్ణతో డజను సినిమాలకు పైగా దర్శకత్వం వహించారు. రవికాంత్‌ నగాయిచ్‌కి సహాయకులుగా వి.ఎస్‌.ఆర్‌. స్వామి, వి.ఎస్‌.ఆర్‌. కృష్ణారావు ఇందులో పనిచేయడం విశేషం.

- ఆచారం షణ్ముఖాచారి


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.