సంక్రాంతి వచ్చిందంటే ఆ రోజుల్లో పెద్దనటుల సినిమాలు విడుదలై ప్రేక్షకులకు వినోదాన్ని పంచేవి. జనసామాన్యాన్ని బాగా ఆకర్షించే కత్తిపోరాటాలు, ముష్టి యుద్ధాలు, గుర్రపు విన్యాసాలు, చూడచక్కని నాట్యాలు, హస్యం పంచే సన్నివేశాలు, రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలనే కుతంత్రాలతో వెరసి జనరంజకమైన సినిమాలు వెండితెరను తాకేవి. ఇలాంటి హంగులన్నీ పుష్కలంగావున్న ఒక జానపద చిత్రం, 1967 భోగి పండుగరోజు విడుదలై ఘనవిజయం సాధించింది. ఎన్.టి. రామారావు ద్విపాత్రాభినయం చేసిన ఆ సినిమా పేరు ‘గోపాలుడు-భూపాలుడు’. గౌరి ప్రొడక్షన్స్ పతాకంపై వై.వి.రావు నిర్మించిన ఆ సినిమాకు జి.విశ్వనాథం దర్శకత్వం వహించగా, నిర్మాణ బాధ్యతల్ని ఎస్.భావనారాయణ నిర్వహించారు. భోగి పండుగ రోజున విడుదలై ఈ సంక్రాంతి చిత్ర విశేషాలు సితార పాఠకుల కోసం...

నిర్మాత సంగతులు...
గౌరి ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ‘గోపాలుడు-భూపాలుడు’ నిర్మాత వై.వి.రావు స్వస్ధలం రాజమహేంద్రవరం. 1948లో ‘సువర్ణమాల’ అనే చిత్రానికి నిర్మాణ బాధ్యతలు చేపట్టేందుకు వై.వి.రావు చెన్నపట్నం వచ్చారు. ఆ సినిమా 1952లో విడుదలైంది. ఈలోగా వై.వి.రావు ఆసక్తి జర్నలిజం వైపుకు మళ్లింది. ప్రముఖ ‘డిటెక్టివ్’ నవలా రచయిత టెంపోరావుతో పరిచయమేర్పడి అతనితో కలిసి ‘ఫీల్’, ‘రతి’, అనే తెలుగు పత్రికలు, ‘టెంపో’ అనే ఆంగ్ల పత్రిక కొంతకాలం నడిపారు. 1954లో ‘డిటెక్టివ్’ అనే మాసపత్రిక సంపాదకవర్గంలో పనిచేస్తూ, ఆ పత్రికకు సర్కులేషన్ మేనేజరుగా కూడా వ్యవహరించారు. ఎస్.భావనారాయణ అనబడే సరిదే భావనారాయణ వై.వి.రావుకు స్వయాన బావ. వై.వి.రావు కంటే రెండేళ్లకు ముందే చెన్నపట్నం వచ్చిన భావనారాయణ, దర్శక నిర్మాత కె.ఎస్.ప్రకాశరావు వద్ద నిర్మాణశాఖలో మూడేళ్లు పనిచేసి 1950లో ‘వాలిసుగ్రీవ’ అనే సినిమా నిర్మించి, ఆ తరువాత డి.బి.నారాయణతో కలిసి ఆదుర్తి సుబ్బారావుకు దర్శకుడిగా తొలి అవకాశమిస్తూ 1954లో ‘అమరసందేశం’ సినిమా తీశారు. ఇద్దరూ కలిసి ‘పెంకిపెళ్ళాం’ తీశాక, భావనారాయణ కౌసల్య ప్రొడక్షన్స్ సంస్ధను నెలకొల్పి 1964లో ‘బంగారు తిమ్మరాజు’, ‘తోటలో పిల్ల-కోటలో రాణి’, ‘ఆకాశరామన్న’ వంటి సినిమాలు నిర్మించారు. 1966లో వై.వి.రావు, భావనారాయణతో భాగస్వామ్యం కలిసి ‘లోగుట్టు పెరుమాళ్ళుకెరుక’ సినిమా నిర్మించారు. తరువాత సినిమాగా భారీ తారాగణంతో ‘గోపాలుడు-భూపాలుడు’ సినిమా తీసి విజయం సాధించారు. అలా 12 సినిమాలు వీరిద్దరి నిర్మాణ సారధ్యంలో వచ్చాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవలసినవిగా ‘దేవుని గెలిచిన మానవుడు’, ‘సర్కార్ ఎక్స్ ప్రెస్’, ‘టక్కరిదొంగ-చక్కనిచుక్క’, ‘పగసాధిస్తా’, ‘రివాల్వర్ రాణి’, ‘ఒకనారి వంద తుపాకులు’ వంటి చిత్రాలున్నాయి.
కవల పిల్లల కథ
కుంతల రాజ వంశానికి ఒక శాపం వుంది. ఆరు తరాలుగా అన్నదమ్ములు సింహాసనం కోసం ఒకరినొకరు హత్య చేసుకుంటూ ఉంటారు. ఆ కుంతల వంశపు రాజు (ప్రభాకరరెడ్డి)కి ఎన్నో నోములు పంటగా లేకలేక కవల పిల్లలు కలుగుతారు. వంశ పారంపర్యంగా రాజ సింహసనం పిల్లలకు సంక్రమిస్తుందని, ఆ రాజు తమ్ముడు వీరేంద్ర (సిహెచ్. కృష్ణమూర్తి) వ్యూహం పన్ని పురిటి గదిలోనే రాజుని దారుణంగా కత్తితో పొడుస్తాడు. ఆ రాజు తమ్ముణ్ణి చంపి తను కూడా ప్రాణం విడుస్తాడు. ఆ దారుణ దృశ్యం చూసిన మహారాణి (ఎస్.వరలక్ష్మి) మనసు అల్లకల్లోలమవుతుంది. రాణి అన్న (మిక్కిలినేని) రాజ్యభారాన్ని మోసేందుకు సిద్ధమౌతాడు. పెరిగి పెద్దయ్యాక ఈ కవల పిల్లలు కూడా ఇటువంటి దారుణానికి తలపడతారని భయపడి ఒక బిడ్డను తన వద్ద వుంచుకుని రెండవ బిడ్డని దాసికి ఇచ్చి కానన దేశానికి తీసుకెళ్లి పెంచమని పురమాయిస్తుంది. దాసి బిడ్డను తీసుకుని అడవి దారిన వెళుతుండగా ఆమె పులివాత పడుతుంది. ఏడుస్తున్న ఆ బిడ్డను గొల్ల మంగమ్మ (హేమలత) చూసి, తీసుకునిపోయి పెంచుతుంది. రాజభవనంలో పెద్ద బిడ్డ పెరిగి పెద్దవాడై రాజేంద్ర భూపతి (ఎన్.టి.రామారావు) అవుతాడు. కోనలో మంగమ్మ ఇంట పెరిగిన చిన్నవాడు గోపాలుడు/గోపన్న (ఎన్.టి.రామారావు)గా పెరిగి పెద్దవాడౌతాడు. రాజేంద్ర భూపతికి తన అన్న కుమార్తె పద్మావతి(రాజశ్రీ)ని ఇచ్చి వివాహం చేయాలని మహారాణి సంకల్పం. కానీ రాజేంద్ర భూపతి కోనలో పరిచయమైన రజని (జయలలిత)కి మనసిస్తాడు. వేట నెపంతో వీలయినప్పుడల్లా అడవికి వెళ్లి రజనీని కలుస్తుంటాడు. రాజా పినతండ్రి వీరేంద్ర కుమారుడు వీరబాహు (రాజనాల) అరణ్య దుర్గానికి అధిపతి. రాజాను కడతేర్చి, పద్మావతితోబాటు కుంతలరాజ్య సింహాసనాన్ని కైవసం చేసుకోవాలని పన్నాగం పన్నుతాడు. వేట కోసం వచ్చిన రాజాను అడవిలో వీరబాహు అనుచరులు చుట్టుముట్టి బంధించబోతే, అక్కడకు దగ్గరలోనే గొర్రెలు మేపుతున్న గోపన్న వారిని తరిమికొట్టి రాజాను బంధవిముక్తుణ్ణి చేస్తాడు. ఇద్దరూ ఒకే పోలికతో ఉండటం చూసిన రాజా ఆశ్చర్యం వ్యక్తపరిచి గోపన్నను రాజాస్థానానికి ఆహ్వనిస్తాడు. మహారాణి గోపన్నను చూసి ఆశ్చర్యపోతుంది. అన్నదమ్ములిద్దరూ కత్తిసాము చేస్తుండగా చూసిన మహారాణి గోపన్నను పంపివేయమని రాజామీద ఒత్తిడి తెస్తుంది. రాజాకు ఒక ఉపాయం తట్టి గోపన్నను రాజభవనంలో పెట్టి తను రజనీని కలిసేందుకు అడవికి వెళ్తాడు. అక్కడ వీరబాహు అనుచరులకు చిక్కి ఒక దుర్గంలో బంధించబడతాడు. విషయం పసిగట్టిన గోపన్న వీరబాహు పరివారాన్ని పరిమార్చి రాజేంద్రభూపతిని రక్షిస్తాడు. మహారాణి మంగమ్మను పిలిపించి, ఆమె చెప్పిన కథ విని, గోపాలుడు తన రెండవ బిడ్డేనని తెలుసుకుంటుంది. బోలెడన్ని సాహసకృత్యాలు, కత్తి యుద్ధాలు, శృంగార పాటలు, చిద్విలాసాలు సంపూర్ణమయ్యాక రాజమాత సంకల్పాన్ని సిద్ధింపజేసి రాజకుమారులిద్దరూ తాము ప్రేమించిన ప్రియురాళ్లను వివాహమాడుతారు. ఈ సినిమాలోని సహాయక పాత్రల్లో సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, జగ్గారావు, వాణిశ్రీ, రాజేశ్వరి, ప్రభావతి నటించారు. ఈ సినిమాకు భావనారాయణ కథ, స్క్రీన్ ప్లే సమకూర్చగా పాలగుమ్మి పద్మరాజు మాటలు అందించారు.

కోదండపాణి సంగీతం...
గౌరి ప్రొడక్షన్స్ సినిమాలకు కోదండపాణి ఆస్ధాన సంగీత దర్శకుడు. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో అద్భుతమైన పాటలున్నాయి. టైటిల్స్ పడుతున్నప్పుడు వచ్చే పాటలోనే సినిమా కథ టూకీగా తెలిసిపోతుంది. టి.ఎం.సొందర్ రాజన్ పాడిన సినారె గీతం ‘ఇదేనా... తరతరాల చరిత్రలో జరిగింది ఇదేనా’ ఒక అద్భుతమైన పాట. ‘ఇక రక్తం పంచుకున్న అన్నదమ్ములే, ఒకరినొకరు హతమార్చగ కత్తి దూసిరే... ఒకే తల్లి కడుపులో ఉదయించిన పాపలు విధి చేసిన వంచెనతో విడిపోయిరి పాపం... కోనలోన పెరిగెనొకడు గోపాలుడై... కోటలోన పెరిగెనొకడు భూపాలుడై’ అంటూ వినవచ్చే చరణాలు ప్రేక్షకుడికి సినిమా సారాంశాన్ని ముందే తెలియజేస్తాయి. ఎన్టీఆర్, జయలలిత కోసం ఘంటసాల, సుశీల పాడిన ‘కోటలోని మొనగాడా వేటకు వచ్చావా... జింకపిల్ల కోసమో, ఇంక దేని కోసమో’ పాట ప్రశ్న జవాబులతో సాగేది. అందుకు ఎన్టీఆర్ దీటుగా ‘వేటకు వచ్చానే... జింకపిల్ల కన్నులున్న చిన్నదాని కోసమే’ అంటూ చెప్పటంతో సినారె రచనా పటిమ ద్యోతకమవుతుంది. ఈ పాటలో సినారె ‘చామంతి వన్నెలది’ అనే పద ప్రయోగాన్ని వాడటం విశేషం. వన్నె వాసిని వర్ణించేటప్పుడు కవులు మేని రంగును బంగరు ఛాయతో గాని, పచ్చని పసుపు వర్ణంతోగాని పోలుస్తారు. మేని రంగును చామంతి వన్నెతో పోల్చటం, ఆమె ‘గోల్డన్ ఎల్లో’ రంగుతో ఉన్నదని చెప్పటం అంతరార్ధం. ఈ పాటకు కోదండపాణి సహాయకుడు నాగరాజన్ వేణువు ఆలపించిన విధానం అత్యద్భుతం. ఘంటసాల, జానకి పాడిన ఆరుద్ర గీతం ‘ఒకసారి కలలోకి రావయ్యా... నా ఉవ్విళ్ళు కవ్వించి పోవయ్యా... ఓ గొల్ల గోపయ్యా’ చాలా పసందైన పాట. రాజశ్రీ, ఎన్టీఆర్‌ల మీద ఈ పాటను చిత్రీకరించారు. వీరిద్దరి పైనే చిత్రీకరించిన మరొక యుగళ గీతం ‘ఎంత బాగున్నది... అందరాని చందమామ అందుతున్నది’ పాటతోబాటు చిత్రీకరణ కూడా అద్భుతంగా ఉంటుంది! జయలలిత, ఎన్టీఆర్‌ల మీద చిత్రీకరించిన ‘చూడకూ...చూడకూ...మరీ అంతగా చూడకూ’ పాట మంద్ర స్ధాయిలో, శృంగార వీధిలో పయనించేలా అమరింది. ‘విరుల పానుపున పరచిన మల్లెలు ఒరిగి ఒరిగి చూస్తున్నాయి... ఆకాశాన విసిరిన తారలు అదేపనిగా చూస్తున్నాయి... ఇన్ని చూడగా లేనిది, నేను చూడ ఏమైనది’ అంటూ ఎన్టీఆర్ కొంటెగా అడగటం; ‘చూచిన అందమే తిరిగితిరిగి నను చూడనీ’ అని గోముగా అనటం నిజంగా హ్యాట్సాఫ్! పిఠాపురం, ఈశ్వరి పాడే ‘మరదలా చిట్టి మరదలా మేటి మగధీరుడ నేనంటే మాటలా’; జయలలిత బృందం కోసం జానకి, లత పాడిన ‘ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాలో’; జయలలిత కోసం సుశీల పాడిన ‘ఓ....జింతడీ’ కూడా మంచి పాటలే.

మరిన్ని విశేషాలు..* గోపాలుడు-భూపాలుడు సినిమాలో ఎన్టీ రామారావు ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ముఖ్యంగా రాజేంద్ర భూపతి పాత్రకు వాడిన కాస్ట్యూములు చాలా రిచ్‌గా ఉంటాయి.
* ఈ చిత్రానికి ప్రఖ్యాత దర్శకుడు కె.ఎస్.ఆర్.దాస్ ఎడిటింగ్ శాఖను నిర్వహించడం గొప్ప విషయం. అంతకు ముందు నిర్మించిన ‘లోగుట్టు పెరుమాళ్ళకెరుక’ సినిమాకి కె.ఎస్.ఆర్.దాస్ దర్శకుడు. మరలా 1969లో నిర్మించిన ‘టక్కరిదొంగ-చక్కనిచుక్క’ చిత్రానికి కె.ఎస్.ఆర్.దాస్ ఎడిటింగ్తోబాటు దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహించారు.
* సంగీత దర్శకుడు కోదండపాణికి ప్రయోగాలు చేయడమంటే సరదా. 1964లో గౌరి ప్రొడక్షన్స్ వారే నిర్మించిన ‘బంగారు తిమ్మరాజు’ చిత్రం ద్వారా జేసుదాసును తెలుగు తెరకు పరిచయం చేశారు. ‘ఓ.... నిండు చందమామా నిగనిగలా భామా... ఒంటరిగా సాగలేవు కలిసిమెలిసి పోదామా’ అంటూ ఆరుద్ర రాసిన పాట అది. అలాగే 1967లో ‘గోపాలుడు-భూపాలుడు’ చిత్రంలో తమిళ గాయకుడు టి.ఎం.సౌందరరాజన్ చేత టైటిల్ సాంగ్ పాడించారు. యాభై సంవత్సరాలుగా గంధర్వ గానం ఆలపిస్తూ, సంగీత ప్రియులను తన స్వరఝరిలో పునీతం చేస్తున్న ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యంను ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’ చిత్రం ద్వారా పరిచయం చేసిన సుస్వరాలబాణి ఈ కోదండపాణి.
* తదనంతర కాలంలో నిర్మాతగామారి ‘కూతురు-కోడలు’, ‘స్త్రీ’ వంటి చిత్రాలు నిర్మించిన అట్లూరి పూర్ణచంద్రరావు ఈ సినిమాకు ప్రొడక్షన్ ఎక్సిక్యూటివ్‌గా బాధ్యతలు నిర్వహించారు. హెచ్.ఎస్.వేణు ఛాయాగ్రహణం, రామనాథన్ శబ్దగ్రహణం శాఖలను నిర్వహించారు. ఇద్దరు ఎన్టీఆర్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూపించిన వేణు తాంత్రిక ఛాయాగ్రహణం ఆ రోజుల్లో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. అంతకు ముందు గౌరి ప్రొడక్షన్స్ నిర్మించిన సినిమాలకు కూడా వీరు పనిచేశారు.
* గతంలో వై.వి.రావు పేరుతోనే మరొక దర్శక నిర్మాత ఉండేవారు. ఆయన నటుడు కూడా. అసలు పేరు యరగుడిపాటి వరదారావు. 1939 ప్రాంతం నుండే ‘ఇతడు’, ‘మళ్లీపెళ్లి’, ‘విశ్వమోహిని’, ‘సత్యభామ’, ‘తాసీల్దార్’, ‘మానవతి’, ‘మంజరి’ వంటి సినిమాలు నిర్మించడమే కాకుండా దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహించారు. వీటిలో కొన్ని సినిమాలలో హీరోగా కూడా నటించారు. అయితే ఈ వై.వి.రావులు ఇద్దరూ ఒకరే అనుకొని పొరబడినవారు చిత్ర పరిశ్రమలో కూడా వున్నారు.
* ఎన్.టి.రామారావు ఈ సినిమా తరువాత వై.వి.రావు సంస్ధకు ‘నిప్పులాంటి మనిషి’, ‘నేరం నాది కాదు ఆకలిది’ చిత్రాలలో నటించారు.
- ఆచారం షణ్ముఖాచారి