నాలుగు మూకీలు... ఇరవై టాకీలుగా ‘హరిశ్చంద్ర’
ప్రాచీన భారతీయ చరిత్ర ప్రతిష్టకు ‘హరిశ్చంద్ర’ మహారాజు కథ ఒక ప్రామాణికం. ఇనకుల వంశోద్భవుడు హరిశ్చంద్రుడు షట్చక్రవర్తులలో అగ్రగణ్యుడైన సత్యసంధుడు. సత్య ప్రతిష్ఠలకై సకల ఐశ్వర్యాలను త్యజించి, భార్యాబిడ్డలను బానిసలుగా అమ్మి తనకు తానుగా చండాల దాస్యానికి సిద్ధపడిన సార్వభౌముడు, శాంతమూర్తి. పూర్వకాలంలో ‘హరిశ్చంద్ర’ కథ, నాటకంగా బహుళ ప్రచారంలో ఉండేది. ఈ కథను మూకీ యుగంలో నాలుగుసార్లు, టాకీ యుగంలో ఇరవై సార్లు వేరేవేరు భాషల్లో వెండితెరకెక్కించారు. తొలుత చలనచిత్ర పితామహుడు దాదా సాహెబ్‌ ఫాల్కే 1913లో ‘రాజా హరిశ్చంద్ర’ సినిమాను పూర్తిస్థాయి మూకీ చిత్రంగా మరాఠీ భాషలో నిర్మించారు. అదే కథను ‘సత్యవాది రాజా హరిశ్చంద్ర’ పేరుతో మరాఠీలోనే 1917లో లఘు చిత్రంగా నిర్మించింది కూడా ఆయనే. తరువాత రుస్తుంజీ ధోతివాలా ‘సత్యవాది రాజా హరిశ్చంద్ర’ పేరుతో బెంగాలీ భాషలో మరొక సినిమా నిర్మించారు. తెలుగులో 1935లో ఒకసారి, 1956లో మరొకసారి, 1965లో చివరిసారి హరిశ్చంద్ర సినిమా రూపంలో వచ్చింది. ఇన్ని సార్లు ఇదే కథను సినిమాగా మలచడానికి కథాబలం ఒక కారణమైతే, ఒక మహత్తరమైన నాటకంగా కూడా ‘హరిశ్చంద్ర’ పేరు ప్రఖ్యాతలు పొంది ఉండడం మరొక కారణం. ప్రముఖ నిర్మాత, నటి లక్ష్మీరాజ్యం చిత్రాన్ని నిర్మించి 1956 మే 30న విడుదల చేశారు. అరవై  మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంలో ఆ సినిమా గురించి విశేషాలు కొన్ని...


‘హరిశ్చంద్ర’ (1956) సినిమాకు సంభాషణలే కాకుండా పాటలు కూడా రాసింది జంపన చంద్రశేఖర రావే. వెంపటి సత్యం నృత్యాలను, సుసర్ల దక్షిణామూర్తి సంగీతాన్ని, టి.వి.యస్‌.శర్మ కళాదర్శకత్వాన్ని నిర్వహించారు. తరువాతి రోజుల్లో దర్శకుడిగా ఎదిగిన ఎస్‌.డి.లాల్‌ ఈ చిత్రానికి సహకార దర్శకునిగా వ్యవహరించారు. ఎస్‌.పి.కోదండపాణి సుసర్లకు సహాయకుడిగా పనిచేశారు. జెమిని, వీనస్, రేవతి స్టూడియోల్లో చిత్ర నిర్మాణం జరిగింది. ఎస్‌.వి.రంగారావు హరిశ్చంద్రుడిగా, రేలంగి నక్షత్రకుడిగా, గుమ్మడి విశ్వామిత్రుడిగా, పి.సూరిబాబు వశిష్టుడిగా, లక్ష్మిరాజ్యం చంద్రమతిగా, సూర్యకాంతం కలహకంఠిగా నటించారు. రాజసులోచన, కుచలకుమారి మాతంగ కన్యలుగా నటించగా, ఇతర నృత్యాలను ఇ.వి.సరోజ, రీటా, కమల, సూర్యకళ నిర్వహించారు. సినిమా విజయవంతంగా ఆడింది.

జంపన కథా శైలి
అధ్యాపక వృత్తిలో నిపుణడైన జంపన ఈ చిత్ర కథను మలిచిన తీరు అద్భుతం. చిత్ర కథా ఇలా సాగుతుంది. ఇంద్రలోకంలో దేవేంద్రుడు ‘భూలోకంలో సత్యవాక్పపరిపాలకుడు ఎవరైనా ఉన్నారా?’ అని వశిష్ట మహామునిని అడుగుతాడు. ముని హరిశ్చంద్ర చక్రవర్తి పేరును సూచిస్తాడు. మహర్షి విశ్వామిత్రుడు కల్పించుకొని హరిశ్చంద్రుని సత్యభ్రష్ణుణ్ణి చేస్తానని ప్రతిన పూనుతాడు. తన తపశ్శక్తితో అయోధ్య రాజ్యంలో మృగసంచారాన్ని పెంచుతాడు. ప్రజల శ్రేయస్సు కోరి హరిశ్చంద్రుడు తన భార్య చంద్రమతి, కుమారుడు లోహితాస్యునితో కలిసి వేటకు వెళ్తాడు. విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని ధర్మమార్గం నుంచి మళ్లీంచేందుకు ఇద్దరు మాతంగ కన్యలను సృష్టించి తన శిష్యుడు నక్షత్రకునితో పంపుతాడు. హరిశ్చంద్రుని చేతిలో వారు పరాభవం పాలవుతారు. విశ్వామిత్రుడు ఆ మాతంగ కన్యలను వివాహ మాడవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. ధర్మమార్గానికి వ్యతిరేకంగా నడుచుకోనని చెప్పి హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడిని వేరే ఏదైనా కోరుకోమంటాడు. విశ్వామిత్రుడు రాజ్యం దానం ఇవ్వమంటాడు. అందుకు హరిశ్చంద్రుడు సంతోషంగా ఒప్పుకుంటాడు. అంతకు ముందు విశ్వామిత్రుడు యాగం నిర్వహించినప్పుడు హరిశ్చంద్రుని వద్ద నుంచి యాగధనాన్ని అవసరమొచ్చినప్పుడు తీసుకుంటానని చెప్పి ఉంటాడు. రాజ్యదానానంతరం ఆ యాగధనాన్ని ఇమ్మని విశ్వామిత్రుడు కోరుతాడు. రిక్తహస్తాలతో మిగిలిన హరిశ్చంద్రుడు విశ్వామిత్రుని రుణం చెల్లించడానికి తన భార్యను, కుమారుని అమ్ముకుంటాడు. చివరకు తనను తానే వీరబాహుడు అనే చండాలునికి అమ్ముడుపోతాడు. లోహతాస్యుడు పాముకాటుతో మరణించడతో, చంద్రమతి ఆ బాలుణ్ణి స్మశానానికి తీసుకొస్తుంది. అక్కడ కాటికాపరిగా హరిశ్చంద్రుడు శవదహనం కోసం రుసుము చెల్లించమని కోరుతాడు. విశ్వామిత్రుని మాయవలన చంద్రమతిపై హత్యానేరం మోపబడి ఆమె మరణశిక్షకు గురవుతుంది. కాశీరాజు ఆ శిక్ష అమలుకోసం వీరబాహుని నియమిస్తాడు. వీరబాహుని ఆదేశం మీద హరిశ్చంద్రుడు ఆ పనికి ఉపక్రమిస్తాడు. ఈ వృత్తాతం తెలుసుకొని దేవతలు ప్రత్యక్షమై హరిశ్చంద్రుని ప్రశంసించి, చంద్రమతిని, లోహితాస్యునికి బ్రతికించి అయోధ్య రాజ్యాన్ని హరిశ్చంద్రునికి అప్పగిస్తారు. హరిశ్చంద్రుడు జనరంజకంగా రాజ్యాన్ని పాలిస్తాడు ఇదీ సినిమా కథ.


విశేషాలు..విశిష్టతలు..
*
గుమ్మడి వెంకటేశ్వరరావు నటించిన తొలి పౌరాణిక చిత్రంగా ‘హరిశ్చంద్ర’ (1956) చరిత్రపుటలకెక్కింది.
* సినిమా మొత్తం 11 పాటలు, 24 పద్యాలు వున్నాయి. పాటలను కొసరాజు, జంపన రాశారు. బలిజేపల్లి లక్ష్మికాంతం రాసిన 14 పద్యాలను, గుర్రం జాషువా రచించిన 9 పద్యాలను వాడుకున్నారు.
* ఉప్పు సత్యగ్రహ కాలంలో బలిజేపల్లి లక్ష్మికాంతం ‘సత్యహరిశ్చంద్రీయం’ పేరిట ఆరు అంకాలతో నాటకాన్ని రాశారు. ఈ నాటకంలోని పద్యాలు, సంభాషణలు చాలామందికి కంఠతా వచ్చేవి. 1935, 1956లలో వచ్చిన ‘హరిశ్చంద్ర’ సినిమాలు విజయవంతం కావడానికి ఇవి దోహదం చేశాయి.
* తొలుత హరిశ్చంద్రుని పాత్రను ఎన్‌.టి.రామారావు చేత వేయించాలని లక్ష్మీరాజ్యం ప్రయత్నించారు. కానీ ఆయన కాల్షీట్లు లభ్యం కాలేదు. తరువాత సి.హెచ్‌.ఆదినారాయణరావు చేత వేయిద్దామనుకున్నారు. అయితే అతనికి అప్పటికే డిమాండ్‌ తగ్గడంతో పాటు, తక్కువ పారితోషికానికి ఒప్పుకోకపోవగడంతో ఆ పాత్ర ఎస్‌.వి.రంగారావుకు దక్కింది.
* ఈ చిత్ర విజయంతో విజయా సంస్థ 1965 ఏప్రిల్‌ 22న ‘సత్య హరిశ్చంద్ర’ సినిమా నిర్మించింది. ఇందులో తొలుత విశ్వామిత్రుని పాత్రను ఎస్‌.వి.రంగారావుకు ఇవ్వజూపితే ఆయన తిరస్కరించారు. కారణం 1956లో వచ్చిన ‘హరిశ్చంద్ర’ సినిమాలో అతడు హీరో వేసం ఉండడమే! ఆ పాత్రను ముక్కామలకు ఇచ్చారు.
* విజయావారి సినిమాలలో అటు బలిజేపల్లి పద్యాలు కానీ, ఇటు జాషువా పద్యాలు కానీ లేకపోవడంతో ఎంత భారీతారాగణంతో సినిమా నిర్మించినా అది విజయం కాలేదు.
* తొలి హరిశ్చంద్ర సంగతులు..

*
తెలుగులో భారత్‌ మూవీటోన్‌ పిక్చర్స్‌ వారు తొలి టాకీ చిత్రం ‘భక్తప్రహ్లాద’ నిర్మించి 1932 ఫిబ్రవరి 6న విడుదల చేశారు. అదే సంవత్సరం నవంబర్‌లో ‘రామ పాదుకా పట్టాభిషేకము’ సినిమా విడుదలయ్యాక మూడేళ్ల కాలంలో వరుసగా పదమూడు సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో ‘చింతామణి’, ‘రామదాసు’ సినిమాలను మినహాయిస్తే అన్నీ పౌరాణిక సినిమాలే కావడం విశేషం. ‘సత్యహరిశ్చంద్ర’ 1935 నవంబర్‌ 16న విడుదలైంది. దీన్ని స్టార్‌ కంబైన్స్‌ ప్రొడక్షన్స్‌ వారు నిర్మించారు. ఇందులో అద్దంకి శ్రీరామమూర్తి, పులిపాటి వెంకటేశ్వర్లు, బందరు నాయుడు, మాస్టర్‌ భీమారావు, ఆకుల నరసింహారావు, నెల్లూరు నాగరాజరావు, కన్నాంబ, పెండ్యాల సుందరమ్మ, కోలాచలం శ్రీనివాసరావు, పురుషోత్తమ కవి, బలిజేపల్లి లక్ష్మీకాంతం వంటి సాహితీ మూర్తులు ఈ సత్యసంధుని కథను పద్యనాటకంగా మలిస్తే రంగస్థలం మీద అత్యంత జనాదరణ పొందిన కథగా అది మన్ననలందుకుంది. వీటిలో బలిజేపల్లి నాటకం సుస్థిర కీర్తిని ఆర్జించింది. బలిజేపల్లి నాటక స్ఫూర్తితో నిర్మించిన ఈ చిత్రానికి ఆ రోజుల్లోనే లక్ష రూపాయలు ఖర్చయింది. ఆరు నెలల సుదీర్ఘ కాలాన్ని వెచ్చించి సినిమా నిర్మించారు. చంద్రమతిగా కన్నాంబ నటించగా, ఆమె సలహా మేరకే తన నాటక ట్రూపులో ఉన్న నటీనటులందరూ ఈ సినిమాలో కనిపించారు. నాటకాల్లో హరిశ్చంద్రుని పాత్రకు పేరొందిన డీవీ సుబ్బారావు, హరిప్రసాద్‌లను కాదని అందమైన పాటగాడు అద్దంకి శ్రీరామమూర్తిని ఎంపిక చేశారు. అద్దంకి శ్రీరామమూర్తితో బాటు, విశ్వామిత్రుడుగా నటించిన బండారు నాయుడు, నక్షత్రకుడిగా నటించిన పులిపాక వెంకటేశ్వర్లు నాటకాల్లో నటించిన అనుభవంతో తమ పద్యాలు, పాటలు వారే పాడుకోవడం చేత ప్రేక్షకాదరణ లభించింది. ఈసినిమా అఖండ విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి పేరుకు రామన్‌ దర్శకుడేగాని సినిమా నిర్మాణ, దర్శకత బాధ్యతలను మోసింది మాత్రం పి.పుల్యయ్యే.

- ఆచారం షణ్ముఖాచారి


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.