ఆమె నటనా కౌశలం... ఈ చిత్రాల్లో ‘పది’లం!
శ్రీదేవి.. ఓ భాషకు, ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన వ్యక్తి కాదు. ఆమె ముగ్ధమనోహర సౌందర్యానికి, నటనా కౌశలానికి టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌ అంటూ సరిహద్దులు లేవు. భారత సినీ కళామ్మతల్లి ముద్దబిడ్డగా తన నటనతో యావత్‌ దేశాన్ని తన కొంగున ముడివేసుకున్న అతిలోక సుందరి శ్రీదేవి. లేడీ సూపర్‌స్టార్‌గా ఖ్యాతి పొందిన ఏకైక కథానాయిక. ఆ తరం ఈ తరం అంటూ తేడాలేకుండా దశాబ్దాల పాటు సినీ సామ్రాజ్యానికి మకుటం లేని మహారాణిగా వెలుగులు విరజిమ్మింది. శ్రీదేవి తన సినీ ప్రయాణంలో ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి దాదాపు 300 చిత్రాల్లో నటించగా అనేక బ్లాక్‌బస్టర్‌ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. వీటిలో ఆమె నటించిన పది అత్యుత్తమ సినిమాలు ఇవి...

పదహారేళ్ల వయసు...
ఇది శ్రీదేవి సినీ ప్రస్థానంలో తొలి ఘనమైన అడుగు. పద్నాలుగేళ్ల వయసులో ఈ సినిమా ద్వారా ఈ అతిలోక సుందరి తెలుగు ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైంది. తమిళ మాతృక ‘పదునారు వయనదిలే’ ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించారు. ఇందులో ‘మల్లి’ అనే పాత్రలో ప్రేమలో మోసపోయిన పల్లెటూరి పిల్లలా అద్భుతమైన అభినయాన్ని కనబరిచింది. చూపు తిప్పుకోనివ్వని అందం.. అమాయకమైన చూపులతో శ్రీదేవి పలికించిన హావభావాలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. చిత్రం ఆద్యంతం ఎంతో పరిణతితో కూడిన నటనను కనబరిచింది శ్రీదేవి. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్‌ సన్నివేశాల్లో ఆమె కనబరచిన అభినయం తన నటనా కౌశలానికి మచ్చుతునకలుగా చెప్పవచ్చు. ఇక ‘‘సిరిమల్లె పువ్వా.. సిరిమల్లె పువ్వా’’ పాటలో శ్రీదేవి ముగ్ధమనోహర సౌందర్యాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఆ అందాన్ని ఎన్నిసార్లు చూసినా తనివితీరదు.


ఇంగ్లిష్‌ వింగ్లిష్‌..
బోనీకపూర్‌ని పెళ్లి చేసుకోని సినిమాలకు దూరమైన శ్రీదేవి 15 ఏళ్ల తర్వాత ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’తో తన రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. ఈ చిత్రంలో ‘గౌరీ షిండే’ అనే గృహిణిగా, లడ్డులు తయారు చేసి అమ్ముతూ భర్తకు సహాయపడే పాత్రలో కనిపిస్తుంది. ఇంగ్లిష్‌ రాదని భర్త, పిల్లలు ఎగతాళి చేస్తుంటారు. దీంతో ఎలాగైనా నేర్చుకోవాలనే పట్టుదలతో వారికి తెలియకుండా ఇంగ్లిష్‌ మాట్లాడటంలో శిక్షణ తీసుకోవడం చిత్ర నేపథ్యం. ఇందులో ‘గౌరీ షిండే’ పాత్రలో శ్రీదేవి నటించడం కాదు, జీవించిందనే చెప్పాలి. ముఖ్యంగా ఆంగ్లంలో మాట్లాడటం రాని మహిళగా శ్రీదేవి పలికించిన అమాయకపు హావభావాలు ప్రేక్షకులని నవ్వించడంతో పాటు చాలా చోట్ల కంటతడి పెట్టిస్తాయి. ఈ చిత్రంతో చాలా విరామం తర్వాత చేసిన శ్రీదేవి నటిగా తనలోని ప్రతిభను మరోసారి సినీ పరిశ్రమకు తెలియపరిచింది. 2012లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు విమర్శకుల్నీ మెప్పించింది. దీంతోపాటు ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో భారత్‌ నుంచి ఆస్కార్‌కు నామినేట్‌ అయింది.

జగదేక వీరుడు అతిలోక సుందరి..
శ్రీదేవిని సినీ పరిశ్రమలో అతిలోక సుందరిగా మార్చిన చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ (1990). చిరంజీవి, శ్రీదేవి జోడీగా నటించిన ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావు దర్శకుడు. శ్రీదేవి ఇందులో ఇంద్రుని కుమార్తె ఇంద్రజగా కనిపిస్తుంది. స్వర్గలోకం నుంచి భూలోకానికి విహారానికి వచ్చి తన ఉంగరం పోగొట్టుకొని తిరిగి వెళ్లలేకపోతుంది. తర్వాత ఆ ఉంగరం కోసం భూలోకంలో పడే ఇబ్బందులు నేపథ్యంగా సినిమా నడుస్తుంది. ఇందులో దేవకన్యగా శ్రీదేవి ఇంద్రజ పాత్రకు ప్రాణం పోసింది. ‘మానవా.. మానవా’ అంటూ నిజమైన దేవకన్యలా అందంగా, అమాయకంగా అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించింది. ‘ఏమి ఈ దవళ వర్ణ పదార్థము..’, ‘ఈ మానవుని చెంత చేరి, అచ్చిక బుచ్చికలాడి, మచ్చికచేసుకొని, నా అంగుళీయకము సంపాదించెద..’ అంటూ శ్రీదేవి పలికిన సంభాషణలు ఎంతో ఆకట్టు కున్నాయి. ముఖ్యంగా ‘అందాలలో అహో మహోదయం..’, ‘యమహో నీ యమా యమా అందం’, ‘అబ్బనీ తీయనీ దెబ్బ..’ పాటల్లో శ్రీదేవి కనిపించిన తీరు ఆమె డాన్సులు సినీ ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి.లమ్హే..
శ్రీదేవి సినీ ప్రస్థానంలో మంచి క్లాసికల్‌ హిట్‌గా నిలిచిన సినిమాల్లో ‘లమ్హే’ (1991) ఒకటి. ఇందులో శ్రీదేవి ద్విపాత్రాభినయం చేసింది. ఈ సినిమాలో పల్లవిగా తల్లిపాత్రలో ఎంత చక్కగా ఒదిగిపోయిందో.. పూజ అనే అనాథ బాలికగా అంతే చక్కటి అభినయాన్ని ప్రదర్శించింది శ్రీదేవి. ఇలా రెండు పాత్రలను తనదైన నటనా వైవిధ్యంతో రక్తి కట్టించింది శ్రీదేవి. ముఖ్యంగా పూజ పాత్ర శ్రీదేవి కెరీర్‌లో మెచ్చుకోదగ్గ పాత్రల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇందులోని ‘మోర్నీ బాగా మెయిన్‌’’ పాట అప్పట్లో ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ చిత్రంతో శ్రీదేవి ఉత్తమ నటిగా ఫిలింఫేర్‌ అవార్డును అందుకుంది.


క్షణక్షణం..
1991లో వచ్చిన ఈ చిత్రాన్ని రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించారు. ఇందులో శ్రీదేవి, వెంకటేష్‌కు జోడీగా చేసింది. ఇందులో ఆమె చాలా వరకు ఒకే కాస్ట్యూమ్‌లో, మేకప్‌ లేకుండా నటించడం విశేషం. అయినా ఆ పాత్రలో శ్రీదేవి ఎంత అందంగా కనిపిస్తుందో.. అభినయంతోనూ అదే స్థాయిలో ప్రేక్షకులను అలరించింది. ఆ చిత్రంలోని ‘జాము రాతిరి జాబిలమ్మ..’’ పాటలో శ్రీదేవి సౌందర్యాన్ని రామ్‌గోపాల్‌ వర్మ ఎంతో అమోఘంగా తెరపై ఆవిష్కరించాడు. ఆ పాట మొత్తానికి శ్రీదేవి హావభావాలే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రంలో శ్రీదేవి నటనకు ఉత్తమ నటిగా సౌత్‌ ఫిలింఫేర్‌ పురస్కారం లభించింది.


చాందిని
నటిగా శ్రీదేవిలోని విభిన్న కోణాలను ప్రేక్షకులకు చూపించిన సినిమాల్లో ‘చాందిని’ తొలిస్థానంలో ఉంటుంది. ఈ చిత్రంలోని ‘మేరే హాతోన్‌ మెయిన్‌’’ పాటతో శ్రీదేవి సినీ ప్రియులకు అందాల విందు భోజనాన్ని వడ్డించిందనే చెప్పాలి. ఈ చిత్రం శ్రీదేవిలోని నటిని ప్రేక్షకులకు సరికొత్తగా పరిచయం చేసింది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో కళ్లతో ఆమె పలికించిన హావభావాలు సినీ ప్రియులను ఎంతగానో కట్టిపడేశాయి. 1989లో విడుదలైన ‘చాందిని’ శ్రీదేవి కెరీర్‌లో భారీ హిట్‌గా నిలిచింది.

చాల్‌బాజ్‌..
శ్రీదేవిలోని నటిని సంపూర్ణంగా ఆవిష్కరించిన సినిమా ‘చాల్‌బాజ్‌’. 1989లో విడుదలైన ఈ చిత్రంలో శ్రీదేవి ద్విపాత్రాభినయం చేసింది. ఇందులో అంజు అనే పొగరబోతు యువతిగా ఓ పాత్రలో, మంజు అనే అమాయకపు యువతిగా మరోపాత్రలో శ్రీదేవి చక్కటి వైవిధ్యాన్ని ప్రదర్శించింది ప్రేక్షకులను తన నటనతో వశపరచుకుంది. ఈ సినిమా తర్వాత శ్రీదేవి ద్విపాత్రాభినయం చేసిన ‘లమ్హే’లో ఇదే స్థాయిలో భారీ విజయాన్ని అందుకుంది.


వసంత కోకిల..
1982లో కమలహాసన్‌ హీరోగా బాలు మహేంద్ర తెరకెక్కించిన ‘మాండ్రమ్‌ పిరై’ చిత్రమే తెలుగులో ‘వసంత కోకిల’గా విడుదలైంది. ఈ సినిమాలో శ్రీదేవి ఓ ప్రమాదంలో గతం మర్చిపోయిన యువతిగా ఆరేళ్ల చిన్నపిల్లలా ప్రవర్తిస్తూ.. అమాయకమైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. కొన్ని సన్నివేశాల్లో శ్రీదేవి నటన ప్రేక్షకులకు కంటతడి పెట్టిస్తుంది. ఈ చిత్రం తెలుగు, తమిళంలో భారీ విజయాన్ని అందుకోవడంతో బాలు మహేంద్ర ‘సద్మా’ పేరుతో దీన్ని శ్రీదేవి హీరోయిన్‌గా బాలీవుడ్‌లోనూ తెరకెక్కించి విజయాన్నందుకున్నారు.

హిమ్మత్‌వాలా..
కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో హిందీలో తెరకెక్కిన సినిమా ‘హిమ్మత్‌వాలా’ (1983). దీన్ని తెలుగులో వచ్చిన ‘ఊరికి మొనగాడు’ (1981) ఆధారంగా హిందీలో తిరిగి తీశారు దర్శకేంద్రుడు. శ్రీదేవి, జితేంద్రకు మేనకోడలిగా చక్కటి కెమిస్ట్రీ పండించింది. ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే ‘నైనోన్‌ మె సప్‌నా..’ పాటలో శ్రీదేవి, జితేంద్రల స్టెప్పులు అప్పట్లో బాలీవుడ్‌ ప్రేక్షకులను ఒక ఊపు ఊపేశాయి. దీన్ని ‘ఎల్లువచ్చె గోదారమ్మ..’’ పాట స్ఫూర్తిగా అచ్చు అదే విధంగా బిందెలతో తెరకెక్కించారు రాఘవేంద్రరావు. ఈ చిత్రంలో శ్రీదేవి సొగసులను చూసి మనసుపారేసుకోని బాలీవుడ్‌ ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. ఒక రకంగా బోనీకపూర్‌కు శ్రీదేవిని దగ్గర చేసింది ఈ సినిమానే.


గోవిందా.. గోవింద..
రామ్‌గోపాల్‌ వర్మ, శ్రీదేవి కథానాయికగా తెరకెక్కించిన రెండవ సినిమా ‘గోవిందా.. గోవింద’. నాగార్జున కథానాయకుడు. 1994లో విడుదలైన ఈ సినిమా కమర్షియల్‌ విజయాన్ని అందుకోనప్పటికీ నటిగా శ్రీదేవికి మంచి పేరు తెచ్చిపెట్టింది. దీనిలోని ‘‘అమ్మ బ్రహ్మదేవుడో..’’, ‘‘అందమా అందమా’’ గీతాల్లో శ్రీదేవి వేసిన స్టెప్పులు, ఆమె సౌందర్యం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘అమ్మ బ్రహ్మదేవుడో’ పాటను శ్రీదేవి అందాన్ని ఆరాధించే ఓ అభిమాని అన్న మాటల ఆధారంగా రామ్‌గోపాల్‌వర్మ తెరకెక్కించడం విశేషం.                                                                                                                                
                                                                                                                         
                                                                                                                                     - మందలపర్తి రాజేష్‌శర్మ, ఈనాడు డిజిటల్‌


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.