ముచ్చటయిన ముక్కోణపు ప్రేమ

రెండక్షరాల ప్రేమ రెండు జీవితాల్ని రెండు హృదయాల్ని కలిపితే...అనురాగ రంజితం. అందుకు భిన్నంగా అల్లకల్లోలం చేస్తే బతుకు దుర్భర నరకప్రాయం. ఇద్దరి ప్రేమికుల మధ్య మూడో వ్యక్తి ప్రవేశిస్తే...అటూ ఇటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఆవిష్కృతమైన ముక్కోణపు ప్రేమ సినిమాని కమర్షియల్ గా గట్టెక్కించే సక్సెస్ ఫార్ములా. ఈ ఫార్ములా అనుసరించి అన్ని భాషాల్లోనూ లెక్కకు మిక్కిలి సినిమాలు రూపొంది థియేటర్ల పై దాడి చేశాయి. కొన్ని ప్రేక్షక హృదయాల్ని సూటిగా తాకి కాసుల వర్షం కురిపిస్తే మరికొన్ని తిరస్కారానికి గురయ్యాయి. ముక్కోణపు ప్రేమను తెర కి ఎక్కించేటప్పుడు తారాగణం నుంచి అన్ని విభాగాల్లోనో నవ్యత ఉండేలా చూసుకోవాలి. అప్పుడే...గతంలో ఇదే ఫార్ములాతో ఎన్నిసినిమాలు చూశామా? అన్న విషయాన్ని పక్కన పెట్టే ప్రేక్షకులు తాజా సినిమాలో లీనమై విజయాన్ని బహుకరిస్తారు...అచ్చం ‘హమ్ దిల్ దే చుకె సనమ్’ చిత్రంలా.


ఈ సినిమాలో ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్ అందం, భావోద్వేగాలతో అలరిస్తే... ఆమెని కోరుకునే ఇద్దరు కథానాయకులుగా సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్ పాత్రోచితంగా నటించి మెప్పించారు. హృద్యమైన ప్రేమ సన్నివేశాలు, సుస్వరాల మధురీభరిత గీతాలు, కమనీయం, రమణీయం అనిపించి...పెయింటింగ్ ని తలపించే ప్రకృతీ దృశ్యాలు...ఆపై ఆ ప్రేమికుల్లో ప్రేక్షకులు తమని ఐడింటిఫై చేసుకోవడానికి వీలు కల్పించే కథాకథనాలు...ఇవీ సక్సెస్ కి కారణాలు గా విమర్శకులు ప్రశంసలు కురిపిస్తూ మరీ చెప్తారు.చిత్ర విశేషాలు

హమ్ దిల్ దే చుకె సనమ్ చిత్రం ప్రఖ్యాత రచయిత్రి మైత్రేయి దేవి బెంగాలీ నవల న హానాయతే కి స్వేచ్చానుసారణం. ఈ చిత్రానికి దర్శక నిర్మాత సంజయ్ లాల్ బన్సాలి. చిత్రానువాదం: కనన్ మణి, కెన్నెత్ ఫిలిప్స్, సంజయ్ లీలా బన్సాలి. కధ: ప్రతాప్ కార్వత్, సంజయ్ లీల బన్సాలి. సంగీతం: ఇస్మాయిల్ దర్బార్. సినిమాటోగ్రఫీ: అనిల్ మెహతా. పంపిణీదారులు: ఎస్ఎల్ బి ఫిలిమ్స్. చిత్రం నిడివి: 188 నిముషాలు, విడుదల తేదీ: 1999 జూన్ 18, బడ్జెట్: 16 కోట్లు , వసూళ్లు: 51. కోట్లుతారాగణం

ఐశ్వర్యారాయ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్, జోహ్రా సెహగల్, విక్రమ్ గోఖలే, స్మితా జయకర్, రేఖారావ్, కెన్నీ దేశాయ్, షీబా చద్దా, రాజీవ్ వర్మ, వినయ్ పాఠక్, హెలెన్, డింపుల్ ఇనాందార్, ఆకాష్ కర్ణాటకి.

హృద్యమైన ప్రేమ కధ

హమ్ దిల్ దే చుకె సనమ్... నా హృదయాన్ని ఇచ్చేసాను ప్రేయసీ! హృదయం ఇచ్చి పుచ్చుకోవడంలోని అనిర్వచనీయ ఆనందాన్ని ఈ సినిమా అందంగా ఆవిష్కరించింది. మొదట్లో కధానాయకుడు సమీర్ (సల్మాన్ ఖాన్) కదానాయిక నందిని (ఐశ్వర్యారాయ్ బచ్చన్) మధ్య చిన్ని చిన్ని తగవులు, ఎదురుపడినప్పుడల్లా చిరాకులు, పరాకులు... అల్లరల్లరిగా సాగుతుంది కధ. అంతలోనే అనూహ్యంగా ప్రేమలో పడిపోయిన తర్వాత వారిద్దరి కోపాలు వెన్నెల్లో దీపాలుగా పల్చటి వెలుతురు పంచడాన్ని దర్శకుడు ఎంతో ఆహ్లాదభరితంగా మలచారు. ఆ సమయంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలితే ఎంత బాగుంటుందోననిపించేలా తీర్చిదిద్దారు. కదా విషయానికి వస్తే సంగీతమంటే పిచ్చి ప్రేమ ఉన్న పండిట్ దర్బార్ (విక్రమ్ గోఖలే) కి ఒకే ఓకే కూతురు నందిని. భారతీయ సంగీతంలో మెళకువలను నేర్చుకునేందుకు ఇటలీ నుంచి ఆ ఇంటికి సమీర్ వస్తాడు. అతిధి గా ఆ ఇంటి గడప తొక్కిన సమీర్ బస కోసం నందిని గదిని పండిట్ దర్బార్ కేటాయిస్తారు. ఇక... అక్కడనుంచి వారిద్దరి మధ్య చినికి చినికి గాలివానలా మారి చిన్ని చిన్ని తగవులు అనేకం చోటు చేసుకుంటాయి. ఎదురుపడినప్పుడల్లా ఒకర్నొకరు తీక్షణంగా చూసుకోవడం...చిరాకు పడిపోవడం జరుగుతుంటుంది. పండిట్ దర్బార్ కి తన కూతురు నందినిని వనరాజ్ (అజయ్ దేవగన్)కి ఇచ్చి వివాహం చేయాలని భావిస్తారు.వనరా జ్ కూడా నందిని ని ఇష్టపడతాడు. ఓసారి తన కజిన్ సిస్టర్ అను (షీబా చద్దా ) పెళ్ళిలో నందినిని చూస్తాడు. అప్పటినుంచి ఆమె అంటే అతడికి ఇష్టం కలుగుతుంది. ఇంతలో సమీర్, నందిని మధ్య ప్రేమ ఉండనే విషయం ఆయన దృస్థికి వస్తుంది. ఆ తర్వాత ఏర్పడిన పరిణామాల వల్ల సమీర్ తిరిగి ఇటలీ వెళ్లాల్సి వస్తుంది. అక్కడ నుంచి తన ప్రేమను వ్యక్తం చేస్తూ తనదగ్గరికి వచ్చేయమని సమీర్ నందిని కి పలుమార్లు ఉత్తరాలు రాస్తాడు. కానీ... ఏ ఒక్క ఉత్తరం కూడా నందినికి చేరలేదు. ఆయిష్టంగా, అనివార్యంగా నందిని వనరాజ్ ని పెళ్లాడింది. మొదటి రాత్రి వనరాజ్ ని అవమానిస్తుంది. అతడి పట్ల నిరసనను వ్యక్తం చేస్తుంటుంది. కారణం అడిగిన వనరాజ్ కి ఆమె మౌనమే సమాధానమవుతుంది. ఒకానొక సందర్భంలో తన భార్య మరొకరి ప్రేమలో ఉందనే విషయాన్ని వనరాజ్ తెలుసుకుంటాడు. ఆమెని అతడి దగ్గరికి చేర్చే ప్రయత్నం చేస్తాడు. సమీర్, నందిని కలిసేలా ఓ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. కానీ... ఆ సమావేశంలో నందిని మనసు మార్చుకుంటుంది. తనని వనరాజ్ ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్ధం చేసుకుంటుంది. సమీర్ కి క్షమాపణ చెప్పి తిరిగి వనరాజ్ దగ్గరికి చేరుకుంటుంది. వనరాజ్ ఆమెని మనస్ఫూర్తిగా స్వీకరించడంతో చిత్రం ముగుస్తుంది. నటీనటుల నటన, పాటలు, సంగీతం, సన్నివేశాలు...ఇలా అన్నీ సమపాళ్లలో కుదిరి ప్రేక్షకులకు ఈ చిత్రం ఎంతో ఇష్టపాత్రమైనది.

సంజయ్ లీలా బన్సాలీ మాయాజాలం

హమ్ దిల్ దే చుకె సనమ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ మాయాజాలం అని చెప్పొచ్చు. దర్శకత్వంలో తన ముద్ర వేసుకుని జనాదరణ పొందిన దిగ్దర్శకుడు ఆయన. సున్నితమైన భావోద్వేగాలను తెర కి లెక్కించడంలోనే ఆయా ప్రతిభ కనిపిస్తుంది. ఆయన చిత్రాలన్నీ పండుగలా కళ్ళకి ఇంపుగా ఉంటాయి. 1989లో ఫరీదా, 1994లో 1942 ఏ లవ్ స్టోరీ చిత్రాలకు రచయితగా పనిచేసిన సంజయ్ లీలా బన్సాలీ 1996 నుంచి మెగాఫోన్ పట్టి బాలీవుడ్ లో అభిరుచిగల చిత్రాలకు దర్శకత్వం వహించారు. సల్మాన్ ఖాన్, మనిషా కోయిరాల నటించిన ఖామోషి, ది మ్యూజికల్, 1999లో హమ్ దిల్ దే చుకె సనమ్, 2002లో దేవ్ దాస్, 2005లో బ్లాక్, 2007లో సావరియా, 2010లో గుజారిష్, 2011లో మై ఫ్రెండ్ పింటో, 2012లో రౌడీ రాథోడ్, 2015లో గబ్బర్ ఈజ్ బాక్, బాజీరావ్ మస్తానీ, 2018లో పద్మావతి...ఇలా ఎన్నో చిత్రాలు రూపొందించారు. ఆయన చిత్రాలు భారీగా, తెర నిండుగా పాత్రలతో కళకళలాడుతుంటాయి. హమ్ దిల్ దే చుకె సనమ్ చిత్రం కూడా సంజయ్ లీలా బన్సాలీ మాయాజాలానికి మచ్చుతునక.అవార్డులు-పురస్కారాలు

47వ జాతీయ పురస్కారాల్లో బెస్ట్ ప్రొడక్షన్ అవార్డును నితిన్ చంద్రకాంత్ దేశాయ్ అందుకున్నారు. ఉత్తమ సంగీత దర్శకుడిగా ఇస్మాయిల్ దర్బార్ అవార్డు అందుకున్నారు. కొరియోగ్రాఫర్ అవార్డు ని సరోజ ఖాన్ స్వీకరించారు. బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డును అనిల్ మెహతా అందుకున్నారు. 45వ ఫిలిం ఫేర్ అవార్డులు కూడా హమ్ దిల్ దే చుకె సనమ్ కి దక్కాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడిగా సంజయ్ లీలా బన్సాలి రెండు అవార్డులు స్వీకరించారు. ఉత్తమ నటిగా ఐశ్వర్యారాయ్ బచ్చన్ అవార్డు అందుకున్నారు. ఉత్తమ నేపధ్య గాయకుడిగా చాంద్ చుపా బాదల్ మీ పాటకు గాను ఉదిత్ నారాయణ్ అవార్డు స్వీకరించారు. బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ గా నితిన్ చంద్రకాంత్ దేశాయ్, బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా అనిల్ మెహతా, బెస్ట్ కొరియోగ్రాఫర్ గా సరోజాఖాన్ నింబోడా నింబోడా నృత్యానికిగాను అవార్డు అందుకున్నారు. బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించినందుకు అంజాన్ బిశ్వాస్, ఫిలిం ఫేర్ ఆర్దీ బర్మన్ అవార్డును చిత్ర సంగీత దర్శకుడు ఇస్మాయిల్ దర్బార్ అందుకున్నారు.
స్టార్ స్క్రీన్ అవార్డులు

స్టార్ స్క్రీన్ అవార్డులు కూడా ఈ చిత్రానికి దక్కాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడిగా సంజయ్ లీల బన్సాలి రెండు అవార్డులు అందుకున్నారు. ఉత్తమ నటిగా ఐశ్వర్యారాయ్ బచ్చన్, బెస్ట్ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ గా కవిత కృష్ణమూర్తి, బెస్ట్ స్క్రీన్ ప్లే గా సంజయ్ లీలా బన్సాలి, కెన్నెత్ ఫిలిప్స్ అవార్డును అందుకున్నారు. మొదటి ఐఐ ఎఫ్ ఆ అవార్డుల్లో కూడా ఈ చిత్రం హవా చూపించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు అవార్డులను సంజయ్ లీల బన్సాలీ అందుకోగా, ఉత్తమ నటి అవార్డును ఐశ్వర్యారాయ్ బచ్చన్, ఉత్తమ నేపధ్య గాయకుడి అవార్డును ఉదిత్ నారాయణ్, బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డును అనాలి మెహతా, ఉత్తమ కధ అవార్డును సంజయ్ లీలా బన్సాలీ తో పాటు పతాప్ కార్వత్ సంయుక్తంగా అందుకున్నారు. బెస్ట్ డైలాగ్స్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ కొరియోగ్రఫీ, బెస్ట్ సౌండ్ రికార్డింగ్ ... ఇలా అవార్డులు చిత్ర యూనిట్ కి లభించాయి. జీ సినిమా, జీ గోల్డ్ అవార్డులు కూడా ఈ చిత్రానికి బాగానే దక్కాయి.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.