‘అంతస్తులు’ అధిరోహించిన జగపతి చిత్రం

జగపతి ఆర్ట్‌పిక్చర్‌ అంటేనే మంచి పాటలకు, వినోదాలకు చిరునామా. తెలుగు అక్షరమాలలో మొదటి అక్షరంలో ‘దసరా బుల్లోడు’ వరకూ వరుస సినిమాలు నిర్మించిన వి.బి.రాజేంద్రప్రసాద్‌ ఆ సంస్థకు సారథి. ఆయన తెలుగులో ఏకంగా పాతిక సినిమాలకు పైగానే నిర్మించారు. దాదాపు అన్ని సినిమాలూ హిట్టే! జగపతి సంస్థ సినిమాల్లో పాటలు ఎంత ప్రాచుర్యం పొందాయంటే, ‘చిటపట చినుకులు’ పేరుతో కేవలం పాటలను ఒక మాలగాగుచ్చి సినిమాగా విడుదలచేస్తే, అది కూడా హిట్టై కూర్చుంది. తన తండ్రి పేరుతో చిత్రనిర్మాణ సంస్థను స్థాపించిన రాజేంద్రప్రసాద్‌ మన మధ్య లేకున్నా, అజరామరమైన సినిమాలను మాత్రం వారసత్వ సంపదగా మిగిల్చి వెళ్ళారు. తొలిచిత్రం ‘అన్నపూర్ణ’తో మొదలైన ప్రస్థానం, వరుసగా ‘ఆరాధన’, ‘ఆత్మబలం’ విజయాల తరువాత తీసిన ‘అంతస్తులు’ సినిమా జాతీయ స్థాయిలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ ప్రాంతీయ చలనచిత్ర బహుమతి గెలుచుకోవడమే కాకుండా రాష్ట్రప్రభుత్వ నంది బహుమతి, ఫిలింఫేర్‌ బహుమతి కూడా తన ఖాతాలో జమచేసుకుంది. బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి నటనకు కూడా బహుమతి లభించడం ‘అంతస్తులు’ పాత్ర మహిమే. మే 27, 1965న విడుదలై ఆరు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న ‘అంతస్తులు’ చిత్రం 55 సంవత్సరాలు పూర్తిచేసున్న సందర్భంగా ఆ సినిమా విశేషాంశాలు కొన్ని..


* కథలో అంతస్తులు

రెండంతస్తుల మధ్య తారతమ్యాన్ని తెలుపుతూ, సమన్వయం కుదిర్చి ప్రయత్నమే ‘అంతస్తులు’. జమీందారు జగన్నాథరావు (గుమ్మడి) తన వివాహానికి పూర్వం వేరొక వనితతో వున్న సంబంధానికి ఫలితంగా కలిగిన బిడ్డ రాణి (భానుమతి). దివాణానికి ఆమె కూడా వారసులే. కానీ, అతని అదృశ్య భార్యకు సంతానం కావడమే ఆమె చేసుకున్న పాపం. ఆ దివాణంలో స్థానం కోసం, తన వారి అభిమానం కోసం తాపత్రయపడే రాణి అనుభవించిన ఆవేదన అంతా ఇంతా కాదు. రాణి అనాధగా ఉంటూ ఆటగత్తెగా పెరుగుతుంది. ఆ జమీందారుకు రఘు (అక్కినేని) ఒక ఆదర్శ కొడుకు. జమీందారు రెండవ కొడుకు నాగరాజు. తండ్రి విధించే క్రమ శిక్షణకు తట్టుకోలేక నాగరాజు గుండె ఆగి చనిపోతాడు. ఆ సంఘటనతో జమీందారు చలించిపోతాడు. పరాయి వూరిలో వున్న రఘును పిలిపించి అతనికో సోదరి వుందనే సంగతి చెప్పి, ఆ రహస్యం ఎవరికీ తెలియనీయద్దని మాట తీసుకొని మరణిస్తాడు. రఘు రాణిని కలుసుకొని ఆమెను దివాణానికి తీసుకొస్తాడు. కానీ రాణి జన్మ వృత్తాంతం తెలియని రఘు తల్లి రూపాదేవి (జి.వరలక్ష్మి) అందుకు ఒప్పుకోదు. మనసిచ్చిన ప్రేయసి (కృష్ణకుమారి) కూడా రఘు మీద సానుభూతి చూపదు. రహస్యం బయట పెట్టనని తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడిన రఘుకు అవమానమే మిగుల్తుంది. ఆ ఇంటి ఆడపడుచుగా గుర్తింపు పొందాలని, చివరికి అక్కున చేర్చుకుంటుంది. ఇదీ క్లుప్తంగా ‘అంతస్తులు’ కథ.

* సినీ సింహాసనాధిరోహణం

రాజేంద్రప్రసాద్‌ అంటే అక్కినేనికి అవ్యాజమైన ప్రేమ. అక్కినేని ప్రతి వేసవి రోజుల్లో కృష్ణా జిల్లాలో తన స్నేహితుల్ని కలిసేందుకు డోకిపర్రు వస్తుండేవారు. వారంతా అక్కినేనికి బంధువులే. వారిలో రాజేంద్రప్రసాద్‌ కూడా ఒకరు. అలా అక్కినేనితో ప్రసాద్‌కు ముందు నుంచే పరిచయం. ఆయన కాకినాడ కాలేజీలో చదివే రోజుల్లో ‘దేవదాసు’ (1953) సినిమా శతదినోత్సవానికి అక్కినేని వస్తే, ప్రసాద్‌ తన రూమ్‌కు తీసుకెళ్లి కొంత సమయం గడిపిన సందర్భం వుంది. తరువాత మద్రాసులో సినిమా తీసేందుకు వెళ్లినప్పుడు ప్రసాద్‌ తొలుత సంప్రదించింది అక్కినేనినే. బిజీ షెడ్యూలు ఉండటంతో ప్రసాద్‌ తొలి చిత్రం ‘అన్నపూర్ణ’కు జగ్గయ్యను సిఫారసు చేసింది కూడా అక్కినేనే. అక్కినేని-జగ్గయ్యలు జగపతి సినిమాల్లో సమాంతర పాత్రలుగానీ, హీరో-విలన్‌ పాత్రలు ధరిస్తూనే వచ్చారు. తరువాత ‘ఆరాధన’, ‘ఆత్మబలం’ సినిమాల్లో నటించి జగపతి బ్యానర్‌కు గుర్తింపు తెచ్చింది కూడా అక్కినేనే. అక్కినేని జగపతి వారు నిర్మించిన 14 సినిమాల్లో హీరోగా నటించారు. ఆయన ప్రోద్బలంతోనే ‘దసరా బుల్లోడు’ సినిమాకు రాజేంద్రప్రసాద్‌ స్వంతంగా దర్శకత్వం నిర్వహించి, ఆ పరంపరను 22 సినిమాల దాకా కొనసాగించారు. తను తీసిన ప్రతి సినిమాను ఇరవై రోజుల పాటు ప్రేక్షకుల మధ్య కూర్చుని గమనించడం ప్రసాద్‌కు అలవాటు. ‘అంతస్తులు’ సినిమాలో భానుమతి పాత్రకు తొలుత పరిశీలించింది జమున పేరును! జమున మొదట సరేనన్నా, కొందరు ‘‘అక్కినేనికి అక్కగా నటిస్తే ఎవరు చూస్తారు?’’ అనడంతో వెనక్కి తగ్గింది. అప్పుడు భానుమతిని సంప్రదించారు ప్రసాద్‌. ఆమెకు కథ బాగా నచ్చి‘‘ఓకే’’ అంది. అప్పటికే ఆమె రెండు సినిమాల్లో నటించాల్సి వుంది. ‘అంతస్తులు’ కథ విన్నాక ఆ రెండు సినిమాలు వదులుకొని మరీ నటించింది. సినిమా నిర్మాణం సారథీ స్టూడియోలో జరిగింది. భానుమతి జగపతి సంస్థకు ఎంతగా సహకరించిందంటే కనీసం హోటల్లో కూడా బసచేయలేదు. స్టూడియో గెస్టుహౌస్‌లోనే మకాం! ‘‘దులపర బుల్లోడో దుమ్ము దులపర బుల్లోడా’’ పాత చిత్రీకరణకు ముందురోజు రాత్రి గెస్ట్‌హౌస్‌లో చుంచులు ఆమె కాలి వేళ్లను కొరికాయి. రాజేంద్రప్రసాద్‌ సహా యూనిట్‌ సభ్యులంతా భయపడిపోయారు. షూటింగు క్యాన్సిల్‌ చేద్దామంటే భానుమతి ఒప్పుకోలేదు. డాక్టరు కూడా వద్దంది. పాట షూటింగు కానిచ్చేసి దుమ్ము దులిపింది. ఈ పాట ఇప్పటికీ దుమ్ము దులుపుతూనే వుంది. పెళసుగా వుండే భానుమతి మాటతీరు, ఆహార్యం, అహంభావ ధోరణి ‘అంతస్తులు’ సినిమాలో పాత్రకు సరిగ్గా సరిపోయాయి. అందుకే ఈ సినిమాలో ఆమె నటనకు అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమాతోనే రాజేంద్రప్రసాద్‌కు భానుమతితో మంచి స్నేహం కుదిరింది. భానుమతి ఈ సినిమాలో తమిళ నటి మనోరమను అనుకరించిందని కొందరు అంటారు. కృష్ణకుమారి అందాలు ఈ సినిమాలో అద్భుతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా గొడుగు పట్టుకొని నిలుచున్న నిశ్చల చిత్రాన్ని ఆ రోజుల్లో ప్రేక్షకులు వేలంవెర్రిగా అభిమానించారు. ఈ సినిమాను ఆస్ట్రేలియాలో ప్రదర్శిస్తే అక్కడ కూడా బహుమతి గెల్చుకోవడం విశేషం. ఈ సినిమా అద్భుత విజయంతో రాజేంద్రప్రసాద్‌ ‘ఆస్తిపరులు’ అదృష్టవంతులు’ సినిమాను తీసి వరుస విజయాలు సాధించి ‘అక్కా చెల్లెలు’ చిత్రంతో దూసుకెళ్లారు. అక్షరమాలలో ‘అ’ అంతటితో ఆగిపోగా ‘దసరా బుల్లోడు’ సినిమాతో ప్రసాద్‌ దర్శకుని అవతారం ఎత్తారు.


* మహదేవన్‌ మణిపూసలు
జగపతి సంస్థకు ఆస్థాన సంగీత దర్శకులు కె.వి.మహదేవన్‌. ఏ భాషలో సంగీతం చేసినా ఆ భాషతో మమేకమై, సాహిత్యాన్ని అర్థం చేసుకొని స్వరకల్పన చేయడం, పాట రాశాకే బాణీ కట్టడం మహదేవన్‌ పద్ధతి. తెలుగు సరిగా రాకపోయినా కవి రాసిన ప్రతి వాక్యానికీ భావం చెప్పించుకొని స్వరపరిచేవారు. ఇక సాహిత్యం విషయానికొస్తే ఆచార్య ఆత్రేయ గురించే చెప్పాలి. రాజేంద్రప్రసాద్‌కు ఆయనంటే గురి. ఆత్రేయ రాసిన ఒక్క ‘చిటపట చినుకులు’ పాటతోనే ‘ఆత్మబలం’ అంబరానికెగసింది. సినిమా పాట ఒడుపు తెలిసిన కవి ఆత్రేయ. అందుకే రాజేంద్ర ప్రసాద్‌ ఆయన ఇంటివద్ద కాపుకాసి మరీ పాటలు రాయించారు. ఈ సినిమాలో ఒకటి రెండు పాటలను మినహయిస్తే మిగతావన్నీ ఇండోర్‌లో చిత్రీకరించినవే. ‘‘నిను వీడని నీడను నేనే...కలగా మిదిలే కథ నేనే’’ పాటను సుశీల పాడారు. 1962లో బిశ్వజిత్‌ నటించిన ‘బీస్‌ సాల్‌ బాద్‌’ సస్పెన్స్‌ సినిమాలో షకీల్‌ బదాయూని రాయగా హేమంతకుమార్‌ స్వరపరచిన లతా పాట ‘కహి దీప్‌ జలే కహి దిల్‌...జరా దేఖ్లే ఆకర్‌ పర్వానే’’ ఈ పాటకు స్ఫూర్తి. ట్యూను ఇంచుమించు ఒకేలా వున్నా బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ పూర్తిగా హిందీ పాటకు భిన్నంగా వుంటుంది. ఈ పాట చిత్రీకరణ దర్శకుడు మధుసూదనరావు అద్భుతంగా చేశారు. ముఖ్యంగా గుమ్మడి పాట పాడే వనిత నీడను పసిగట్టి వడివడిగా అడుగులేసినప్పుడు, ఆ స్త్రీ నీడ క్రమంగా కనుమరుగవడం గొప్ప చిత్రీకరణ. ‘‘నునులేతపూవునై విరిసీ నిను నమ్మి చేరినా వలచీ... వలపంత ధూళిలో కలిసే...బ్రతుకే బలియై ముగిసే’’ వాక్యం భానుమతి తల్లికి జమీందారు చేసిన అన్యాయం గుర్తుకు తెస్తుంది. ఈ పాట మంచి హిట్‌గా నిలిచింది. బేహాగ్‌ రాగంలో స్వరపరచిన ఆత్రేయ యుగళ గీతం ‘‘నువ్వంటే నాకెందుకో ఇంత ఇది.. నువ్వన్నా నా కెందుకో అదే ఇదీ’’ పాటను ఘంటసాల, సుశీల ఆలపించగా గండిపేట చెరువు వద్ద, దానికి దగ్గరలో వున్న పార్కులో చిత్రీకరించారు. మరో యుగళగీతం ‘‘తెల్లచీర కట్టుకున్నదెవరి కోసము... మల్లెపూలు పెట్టుకున్న దెవరికోసము’’ను స్టూడియోలోనే వెన్నెలరేయి పాటగా చిత్రీకరించారు. ఈ పాటలో వచ్చే రెండవ చరణంలో ‘‘అద్దాల చెక్కిళ్ళు ఎవరి కోసము...ముద్దైన నీ మోవి ముద్ర కోసము’’ అనే వాక్యాలను సెన్సారు బోర్డువారు తొలగించారు. జాగ్రత్తగా గమనిస్తే ఈ పాట వస్తున్నప్పుడు తెరమీద కత్తెర పడిన ఆనవాళ్లు చూడవచ్చు. భానుమతి పాడిన ‘‘వినరా విస్సన్నా నే వేదం చెబుతా వినరన్నా... పేదోళ్ల నీతిలో బేధాలు లేవన్నా’’ పాటలో రేలంగి, రమణారెడ్డి చెరొక వాయిద్యం వాయిస్తూ వంతపాడుతూ వుంటారు. పాట చివరలో గుమ్మడి కారులో రావడం, భానుమతిని కూతురుగా గుర్తుపట్టినా, అక్కడే వున్న చిన్న కొడుకు నాగరాజును తీసుకెళ్లడం మొత్తం సారథీ స్టూడియోలో చిత్రీకరించారు. ఈ పాటలో వచ్చే తొలిచరణం సినిమాలో కనిపించదు. ‘‘వున్నపుడు హాయిగా వరిగింజ నీళ్లు, లేకుంటే చాలులే ఆ పంపు నీళ్లు... సాటోళ్లతో సుకపడుట మేలు, చల్లని చెట్టు నీడను దొరికే సౌఖ్యం కొంటే రాదురా’’ అనే ఆరుద్ర రాసిన చరణాన్ని చిత్రీకరించినా యెందుకో తొలగించారు. అదే కాకుండా చివరి చరణంలో ‘‘అంతస్థుకి అంతెక్కడుంది... ఏడంతస్తుల మేడకు కూడా పునాది భూమిలో వుండాలి’’ అనే వాక్యాలు కూడా తొలగించారు. ఎల్‌. విజయలక్ష్మి నృత్యగీతం ‘పైకంతో కొనలేనిది ఏదీ లేదు....నా మైకంలో పడనివారు ఎవరూ లేరు’’ పాట చూస్తుంటే ఆత్మబలం సినిమాలో ‘‘ఎక్కడికీ పోతావు చిన్నవాడా’’ పాట గుర్తురాక మానదు. ఇందులో తలపై టోపీతో జగ్గయ్య, మందు గ్లాసుతో అక్కినేని, నాట్యం చేస్తూ కనిపిస్తారు. ఈ సినిమాలో అసలు సిసలైన పాట భానమతి బృందం పాడిన కొసరాజు గీతం ‘‘దులపర బుల్లోడా దుమ్ము దులపర బుల్లోడా’’. ఈ పాటకు ప్రేక్షకులు తెరవద్దకు వెళ్లి మరీ నాట్యం చేసేవారు. కాలేజీకి వెళ్లే ముద్దు గుమ్మలను వెకిలిగా వెంటబడే రౌడీలను, సంప్రదాయమైన చిన్నది సినిమాకొస్తే పక్క సీటులో బైఠాయించుకొని చీకటి మరుగున చేతులు వేసే శిఖండిగాళ్లను, మాయా మర్మం తెలియని చిన్నది మంగళగిరి తిరునాళ్లకు వెళితే సందు చూసుకొని సరసాలకు దిగే గ్రంథసాంగులను దుమ్ము దులపమని ఉద్బోధించే పాట ఇది. ఇక చివరి పాట మాధవపెద్ది - పీఠాపురం ఆలపించిన కొసరాజు గీతం ‘‘దేవుడు మనిషిగా పుట్టాలిరా...ఈ మనుషుల భరతం పట్టాలిరా’’ అనే వినోద గీతం. రేలంగి- రమణారెడ్డిల మీద మద్రాసులో ఈ పాటను చిత్రీకరించారు. ఆసాంతం చక్కని కాలక్షేపాన్ని పంచి అటు ప్రభుత్వ ఆదరాన్ని ఇటు ఆర్థిక విజయాన్ని సాధించిన జగపతి చిత్రం ‘అంతస్తులు’.

- ఆచారం షణ్ముఖాచారిCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.