తెలుగులో అలరించిన మిస్టరీ... ‘ఆమె ఎవరు?’
ధన వ్యామోహం మనిషి చేత ఎతంటి పనినైనా చేయిస్తుంది. అందులోనూ మానవత్వం లేని కఠినాత్ముల విషయంలో అయితే వాళ్లు డబ్బుకోసం ఎటువంటి ఖూనీలు చేసేందుకు కూడా వెనుకాడరు. ఒక డాక్టరు తనకు నచ్చిన అమ్మాయిని ప్రేమిస్తే ఆమెను ఎవరో హత్య చేస్తారు. అంతేకాదు లక్షల ఆస్తికి వారసుడైన ఆ డాక్టర్‌ను హతమార్చి అతని ఆస్తిని హస్తగతం చేసుకోవాలని దాయాదులే కుట్ర పన్నుతారు. వారి పథకం నెరవేరేందుకు వారువేసే ఎత్తులు విఫలమై, చివరకు పట్టుబడి శిక్షకు లోనౌతారు. ఈ ఇతివృత్తంలో హరిహరన్‌ ఫిలిమ్స్‌ పేరిట పి.ఎస్‌.వీరప్పన్‌. దర్శకుడు బి.ఎస్‌.నారాయణ నిర్దేశకత్వంలో ‘ఆమె ఎవరు?’ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబరు 20, 1966న విడుదలై విజయం సాధించిన ఈ సినిమాకు మాతృక పి.ఎస్‌.వి.పిక్చర్స్‌ పతాకం మీద అదే నిర్మాత పి.ఎస్‌.వీరప్పన్‌ తమిళంలో నిర్మించిన ‘యార్‌ నీ?’ చిత్రం. ఆమె ఎవరు సినిమా విడుదలై యాబై సంవత్సరాలు పూర్తియిన సందర్భంగా ఆ చిత్ర విశేషాలు కొన్ని సితార పాఠకుల కోసం...


ఆమె ఎవరు నిర్మాణానికి నాంది
అరవయ్యో దశకం చలనచిత్ర రంగానికే తలమానికమని చెప్పవచ్చు ముఖ్యంగా హిందీ చిత్రరంగంలో ఎన్నో వైవిధ్యమైన కథలతో సినిమాలు వచ్చాయి. సస్సెన్సుతో కూడిన మిస్టరీ సినిమాలు ఆరోజుల్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. బి.ఆర్‌.చోప్రా నిర్మించిన కానూన్‌ (1960- రాజేంద్రకుమార్‌, నందా) ఈ మిస్టరీ సినిమాలకు నాంది పలుకగా, రాజ్‌ ఖోస్లా 1964లో ఒక సైకలాజికల్‌ మిస్టరీ సినిమా నిర్మించారు. అదే ‘వో కౌన్‌ థీ’ సినిమా. ఈ సినిమా విజయంతో ఎన్నో మిస్టరీ సినిమాలు వరుసగా వచ్చి అన్నిటినీ విజవంతం చేశాయి. వాటిలో గుమ్మామ్‌, మేరా సాయా, అనిత, హమ్‌ రాజ్‌, షికార్‌, ఇత్తేఫాక్‌, మెహల్‌ సినిమాలను ముఖ్యంగా చెప్పుకోవాలి. వో కౌన్‌ థీ సినిమాలో మనోజ్‌ కుమార్‌, సాధనా, ప్రేమ్‌ చోప్రా, హెలన్‌ ముఖ్య భూమికలు పోషించగా, ఆ సినిమా కథను ధృవచటర్జీ రూపొందించారు. ఈ సినిమాకు ముఖ్యంగా మదన్‌ మోహన్‌ అందించిన అద్భుత సంగీతం ప్రాణం. సినిమా బాక్సాఫీసు హిట్‌ కావడంతో రాజ్‌ ఖోస్లా 1966లో మేరాసాయా, 1967లో అనిత పేరుతో రెండు మిస్టరీ సినిమాలు నిర్మించి విజయవంతం చేశారు. ఈ రెంటిలోనూ సాధన హీరోయిన్‌గా నటించడం విశేషం. వో కౌన్‌ థి సినిమాకు అత్యద్భుతమైన ఛాయాగ్రహణం అందించిన కె.హెచ్‌.కపాడియా, కృష్ణారావు వాశిర్దాలకు ఫిలింఫేర్‌ బహుమతి లభించింది. వో కౌన్‌ థీ సినిమా విజయం ఇటు తమిళ చిత్రరంగాన్ని కూడా ఆకర్షించింది. పి.ఎస్‌.వి.పిక్చర్స్‌ నిర్మాత పి.ఎస్‌.వీరప్పన్‌ హిందీ సినిమా హక్కులు కొని ‘యార్‌ నీ?’ పేరుతో తమిళంలో సినిమా నిర్మించారు. సత్యం దర్శకత్వంలో జయశంకర్‌, జయలలిత, ఎస్‌.వి.రామదాస్‌, మనోరమ, లక్ష్మీరాజ్యం నటించిన ‘యార్‌ నీ’ సినిమా 1966 ఏప్రిల్‌ 10న విడుదలై అఖండ విజయం సాధించింది. హిందీలో సూపర్‌ హట్‌గా నిలిచిన ‘నైనా బరసే రింఝిం’, ‘జో హమ్మే దాస్తాన్‌ అప్నే సునాయి ఆప్‌ క్యో రోయే’, ‘లగ్‌ జా గలే కి ఫిర్‌ యే హసీన రాత్‌ హో నహో’ వంటి అజరామరమైన హిందీ పాటల్ని సంగీత దర్శకుడు వేదాచలం (వేదా) యధాతధంగా అనుకరించి బాణీలు కట్టడంతో సినిమా సంగీతభరిత విజయాన్ని సాధించింది. దానితో వీరప్పన్‌ హరి హరన్‌ ఫిలిమ్స్‌ పేరుతో ‘యార్‌ నీ’ చిత్రాన్ని తెలుగులో ‘ఆమె ఎవరు’? పేరుతో పునర్నిర్మించారు. గతంలో తిరుపతమ్మ కథ, విశాల హృదయాలు వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన బి.ఎస్‌.నారాయణ ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. బొల్లిముంత శివరామకృష్ణ మాటలు రాయగా, పాటలన్నిటినీ దాశరథి రాశారు. హిందీ సినిమాకు ఏమాత్రం తీసిపోకుండా డబ్ల్యు ఆర్‌.సుబ్బారావు, కార్తికేయన్‌లు అద్భతంగా ఛాయాగ్రహణం నిర్వహించారు. తమిళ చిత్రానికి సంగీతం అందించిన వేదాచలమే ఆమె ఎవరు సినిమాకు పసందైన సంగీతాన్ని అందించారు. జగ్గయ్య, జయలలిత, తమళ నటుడు ఆనంద్‌, నాగభూషణం, ప్రభాకర్‌రెడ్డి, రాజబాబు, మాలతి, వాణిశ్రీ, రాధ నటించిన ఆమె ఎవరు సినిమా తెలుగులో కూడా విజయవంతంగా ఆడింది.


ఆమె ఎవరు కథలోకి వెళితే
డాక్టర్‌ ఆనంద్‌ (జగ్గయ్య) ఒక అర్ధరాత్రి వర్షపు హోరులో వెళుతుండగా ఒక అమ్మాయి కారును ఆపి తనను సంధ్య (జయలలిత)గా పరిచయం చేసుకొని లిఫ్ట్‌ అడుగుతుంది. ఆమె కారు ఎక్కగానే వర్షపు నీరు తుడిచే వైపర్లు పనిచేయడం అగిపోతుంది. ఆ చీకటిలో ఆమె ఆనంద్‌కు దారిచూపుతూ స్మశానవాటిక వద్ద దిగిపోతుంది. ఆమె కారు దిగగానే ఆ గోరీలదొడ్డి తలుపులు వాటంతట అవే తెరచుకుంటాయి. ఆమె ఒక పాడుబడిన ఇంటిలోకి వెళ్లి మాయమైపోతుంది. ఆనంద్‌ ఆశ్చర్యపోతాడు. ఆనంద్‌కు అనుకోకుండా ఒక స్థిరాస్ధి కలిసివస్తుంది. ఆ ఆస్థిని దక్కించుకునేందుకు ఇంటిదొంగలే విఫల ప్రయత్నం చేస్తుంటారు. అది కూడా సస్పెన్సే. డాక్టర్‌ సింహ (నాగభూషణం) నర్సింగ్‌ హోమ్‌లో ఆనంద్‌ పనిచేస్తుంటాడు. సింహ కూతురు లత కూడా డాక్టరే. ఆమె ఆనంద్‌ను ప్రేమిస్తుంది. కానీ, ఆనంద్‌ రాధ (రాధ) అనే అమ్మాయికి మనసిస్తాడు. రాధ విచిత్రమైన పరిస్థితుల్లో సైనైడ్‌ ఇంజక్షన్‌ ఇవ్వటం వలన చనిపోతుంది. అందరూ డాక్టర్‌ సింహ, అతని కూతురు డాక్టర్‌ లతను అనుమానిస్తారు. ఒకరోజు అర్ధరాత్రి ఆనంద్‌కు ఒక పాడుబడిన భవంతిలో ఉంటున్న రోగి నుంచి ఎమర్జెన్సీ పిలుపు రాగా అక్కడకు వెళ్లిన ఆనంద్‌కు అంతకుముందు వర్షంలో పరిచయమైన సంధ్య శవమై కనిపిస్తుంది. పోలీసులు అటువంటి సంఘటనలు అదే భవనంలో చాలాసార్లు జరిగినట్లు, తాము దర్యాప్తు చేస్తునట్లు తెలుపుతారు. తర్వాత పేపర్లో సంధ్య అనే అమ్మాయి రైలు ప్రమాదంలో మరణించినట్టు వార్త వస్తుంది. ఆనంద్‌ తల్లి (మాలతి) తన చెల్లెలు సిఫార్సు చేసిన అమ్మాయితో ఆనంద్‌ పెళ్లి జరిపిస్తుంది. పెళ్లికి ముందు ఆ అమ్మాయి (జయలలితే)ని ఆనంద్‌ గాని, అతని తల్లి గాని చూసివుండరు. పెళ్లిలో సంధ్యను చూసి ఆనంద్‌ ఆశ్చర్యపోతాడు. తనకు తారసపడిన అమ్మాయిలాగే సంధ్య ఉండడం అతన్ని విస్మయానికి గురిచేస్తుంది. ఒకరోజు సంధ్య ఆనంద్‌ నర్సింగ్‌ హోంకు వచ్చి అతన్ని తీసుకొని మరలా పాడుబడిన బంగాళాకు తీసుకువెళ్తుంది. అక్కడకు వెళ్లాక అదృశ్యమౌతుంది. ఆనంద్‌ ఇంటికొచ్చి చూస్తే సంధ్య ఇంట్లోనే ఉంటుంది. దానితో ఆనంద్‌కు ఒక సన్యాసి (ప్రభాకర్‌ రెడ్డి) పరిచయమౌతాడు. వందేళ్ల క్రితం ఒక ప్రేమజంట ఆ కొండమీద విహరిస్తూ ఉండగా ఆ జంటలోని అమ్మాయి ప్రమాదవశాత్తు కొండ మీద నుంచి పడి చనిపోయిందని, ఆ అమ్మాయి ప్రేతాత్మ తన ప్రియుడికోసం తిరుగుతూ ఉంటుందని, ఆనంద్‌లో ఆమె ప్రియుని పోలికలు కనిపించడంలో అతని వెంటపడిందని చెబుతాడు, ఆనంద్‌ సన్నిహిత మిత్రుడు, బంధువు అయిన రమేష్‌ (ఆనంద్‌) ఈ నాటక మాడి, ఆనంద్‌ని మతిలేనివాడిగా సృష్టించి అతనికి సంక్రమించే ఆస్తిని హస్తగతం చేసుకోవాలని పన్నిన పన్నాగమని ఆనంద్‌కు తెలిసివస్తుంది. చనిపోయన మోహిని అనబడే సంధ్య ఆనంద్‌ను అనుసరించిన అమ్మాయి చనిపోయిన సంధ్యగా గుర్తిస్తారు. మిస్టరీ వీడటంతో సంధ్య, ఆనంద్‌ ఒక్కటౌతారు

వేదాచలం అనుకరణ సంగీతం
వేదాగా అందరకీ తెలిసిన సంగీత దర్శకుడు వేదాచలం. తెలుగులో ‘అవేకళ్ళు’ సినిమా గుర్తుంటే వేదా ఎవరో ఇట్టే తెలుస్తుంది. తమిళ సినిమాకు కన్నదాసన్‌, తెలుగు సినిమాకు దాశరథి పాటలు రాశారు. ఈ సినిమాలో ముఖ్యమైన పాట సుశీల ఆలపించిన ‘ఓ నా రాజా రావా రావా చెలినే మరిచేవా’ గీతం. ఈ పాట సినిమాలో నాలుగు సార్లు వినిపిస్తుంది. హిందీలో లతామంగేష్కర్‌ అద్భుతంగా ఆలపించిన ‘నైనా బరసే రింఝం రింఝం’ ట్యూన్‌కు ఇది యధాతధ అనుకరణ. తమిళంలో కూడా ఇదే పాట ‘నానే వరువేన్‌ ఇన్‌ గమ్‌ అన్‌గుం’గా వస్తుంది. ఇందులో సుశీల ఏమాత్రం లతాజీకి తీసిపోకుండా ఈ పాటల్ని పాడటం విశేషం. అలాగే, హిందీలో ‘బిజియం’ను యధాతధంగా అనుకరించి పాటకు వేదా సొబగులద్దారు. లతా ఆలపించిన మరొక హిందీ పాట ‘జో హమ్నే దాస్తాన్‌ అప్నే సునాయా ఆప్‌ క్యోరోయే’ను తమిళంలో ‘ఎస్‌ వేదనయిల్‌ ఉన్‌ కన్నీ రండం’గా తెలుగులో ‘నీ కన్నులలో నా కన్నీరే వింతగా పొంగి రానేలా’గా వేదా అద్భుతంగా మలిచారు. ఈ పాటలో దాశరథి ‘ఇంతలో మారిపోయే లోకమంటే అంత మమతేలా, గడియలో మాసిపోయే బ్రతకు కోసం కంట నీరేలా’ అంటూ వేదాంత సారాన్ని జయలలిత ఆత్మ చేత ఆలపించి తన సాహిత్య గౌరవాన్ని ఇనుమండింపజేసుకున్నారు. మరొక లతాజీ పాట ‘లగ్‌ జా గలే కి ఫర్‌ యే హసీన్‌ రాత్‌ హోనహో’ను తమిళంలో ‘పోన్‌ మేని తళువామల్‌ పెన్భంఇన్‌ అరియామల్‌’గా. తెలుగులో యుగళ గీతంగా మార్చి పి.బి.శ్రీనివాస్‌, ఎల్‌.ఆర్‌ ఈశ్వరిల చేత ‘నీవు చూసే చూపులో ఎన్నెన్ని అర్ధాలు ఉన్నవో’ పాటగా పాడించారు. ఇది కూడా హిట్‌ పాటే. ఈశ్వరి బృందం పాడే ‘కన్నెమనసు దోచుకొన్న మామయ్యా’, సుశీల పాడిన ‘అందచందాల చిన్నదీ రోజా, పొందుగోరేను అందుకో రాజా’, శ్రీనివాస్‌, ఈశ్వరి బృందం పాడే ‘డిక్కిరిక్కి టాటటా కిలకిల నవ్వులు నవ్వుదాం’ పాటలు కూడా వినదగినవే.


మరిన్ని విశేషాలు:
* బాలీవుడ్‌ నటుడు ‘భరత్‌’గా కీర్తినందుకున్న మనోజ్‌ కుమార్‌ చిత్రరంగ ప్రవేశం చేసిన తర్వాత సూపర్‌ హిట్టయిన రెండవ సినిమా ‘వో కౌన్‌ థీ’, మొదటిది విజయట్‌ నిర్మించిన ‘హరియాలి అవుర్‌ రాస్తా’. కానీ సాధన మాత్రం అప్పటికే ‘హమ్‌ దోనో’, ‘అసలీ నకిలీ’, ‘మేరే మెహబూబ్‌’, ‘పారఖ్‌’ వంటి హిట్‌ చిత్రాల రికార్డులో బాగా స్థిరపడిన నటి కావటం గమనార్హం. అలాగే తమిళ హీరో జయశంకర్‌కు కుళందయుం దైవముం (లేతమనసులు) తర్వాత బాగా హిట్టయిన సినిమా కూడా ‘యార్‌ నీ’. అయితే జగ్గయ్య మాత్రం వీరందరికన్నా సీనియర్‌ నటుడు. తమిళం, తెలుగు రెండు భాషల్లోనూ జయలలిత హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘ఆమె ఎవరు’ కావటం గొప్ప విషయం.

* ఆమె ఎవరు’ అవుట్‌డోర్‌ సన్నివేశాలు, కొన్ని పాటలు ఊటీలో చిత్రీకరించారు.

* హిందీ, తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమాకు పేరుపెట్టడమే ఒక సస్పెన్స్‌ సినిమా అనే అర్ధం వచ్చేలా ఉండటం ప్రత్యేకత. అందుకు హిందీ దర్శకుడు రాజ్‌ ఖోస్లా అభినందనీయుడు.
* మదన్‌ మోహన్‌ అంటే లతాజీకి చాలా గౌరవం. భయ్యా అని పిలిచేది. ‘వో కౌన్‌ థీ’ సినిమా పాటల గురించి లతాజీ ఎన్నోసార్లు వేదికిలమీద ‘మధన్‌ భయ్యా నా కోసమే ప్రత్యేకంగా వో కౌన్‌ థీ పాటలు కంపోజ్‌ చేశారు’ అంటూ గొప్పగా చెప్పేది. అలాగే సుశీల కూడా అటు తమిళం. ఇటు తెలుగు భాషల్లో లతాజీకి ఏమాత్రం తీసిపోని రీతిలో పాడి మంచి పేరు తెచ్చుకున్నారు. వేదా సంగీతం అద్భుతంగా పండింది.
- ఆచారం షణ్ముఖాచారి


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.