‘జీవనతరంగాలు’... చెదరని జ్ఞాపకాలు

ఓ నవలాధారంగా తెరకెక్కిన చిత్రం..

ఇద్దరు కథానాయకులు కలిసి నటించిన చిత్రం..

మూడు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు అందుకున్న చిత్రం..

మూడు భాషల్లో రీమేక్‌ అయిన చిత్రం..

నలభైయేడేళ్లు పూర్తయినా ప్రేక్షకుల్లో సుస్థిర స్థానం కలిగిన చిత్రం...

-ఇన్ని ప్రఖ్యాతలు సాధించిన చిత్రమే ‘జీవనతరంగాలు’. శోభన్‌ బాబు, కృష్ణం రాజు నాయకులుగా తాతినేని రామారావు తెరకెక్కించారు. వాణిశ్రీ, చంద్రమోహన్, లక్ష్మీ, గుమ్మడి వెంకటేశ్వరరావు, అంజలీ దేవీ, శ్రీ రంజని కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ రచయిత్రి యుద్ధనపూడి సులోచనారాణి రచించిన ‘జీవనతరంగాలు’ నవల ఆధారంగా తెరకెక్కిందీ చిత్రం. ఆచార్య ఆత్రేయ స్క్రీన్‌ప్లే, డైలాగులు రాశారు. జె.వి.రాఘవులు సంగీతం సమకూర్చారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై దగ్గుబాటి రామానాయుడు నిర్మించి ఈ చిత్రం 1973 ఏప్రిల్‌ 20న విడుదలై అఖండ విజయం అందుకుంది. అటు అవార్డులు, ఇటు వసూళ్లు కురిపించి తెలుగు చిత్ర పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచే సినిమాల జాబితాలో ఒకటైంది.


*అవార్డులు.. రీమేక్‌లు

ఆ రోజుల్లో తెలుగు సినిమా మూడు భాషల్లో రీమేక్‌ అవడం, మూడు విభాగాల్లో ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు అందుకోవడం విశేషం. ‘దిల్‌ ఔర్‌ దీవార్‌’ పేరుతో హిందీ, ‘తిరుమాంగల్యం’గా తమిళ, ‘మాంగల్య’గా కన్నడ భాషల్లో రీమేకైన చిత్రంగా ఘనత సాధించింది ‘జీవనతరంగాలు’. విడుదలైన సంవత్సరంలోనే ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నాయిక విభాగాల్లో ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు(సౌత్‌) అందుకుని ఔరా అనిపించింది.
*ఇదీ కథ..

వేణు గోపాల రావు (గుమ్మడి), సావిత్రి (శ్రీరంజని) దంపతుల సంతానం రోజా(వాణిశ్రీ), చందు (కృష్ణరాజు).  మరో మహిళ వలలో పడి కుటుంబాన్ని వదిలేసిన వేణు గోపాలరావు ఆమెను వివాహం చేసుకుంటాడు. మరో ఇద్దరి పిల్లలకి తండ్రవుతాడు. వాళ్లే లావణ్య (లక్ష్మి), మరో అమ్మాయి పోలియో వ్యాధితో బాధపడుతుంది. సోదరుడి ఇంట్లో తలదాచుకునే సావిత్రి ఎన్నో అవమానాలు ఎదుర్కొంటుంది. రోజా సంగీత పాఠాలు నేర్పుతుంటుంది. చందు ఖాళీగా ఉంటూ వ్యసనాలకు పాల్పడతాడు. వేణు గోపాల రావు సోదరి (శాంతకుమారి) ధనవంతురాలు. ఆమె సొంత కుమారుడు అనంత్‌ (చంద్రమోహన్‌). విజయ్‌ (శోభన్‌ బాబు)శాంతకుమారికి వరసకు కొడుకు అవుతాడు. వృత్తిరీత్యా న్యాయవాది.  విజయ్‌కు అనంత్‌ను సక్రమంగా ఉండేలా చూడాలనే బాధ్యత శాంత కుమారి ఇస్తుంది. అనంత్‌ రోజాను ఒక పార్టీలో కలవగా అతనిని సోదరుడిలా భావిస్తుంది రోజా. కానీ అనంత్‌ ఆమెను మరో విధంగా అర్థం చేసుకుంటాడు.  లావణ్యను వివాహం చేసుకోవాలని విజయ్‌.. అనంత్‌ను కోరతాడు. లావణ్య పద్ధతి అనంత్‌కు నచ్చదు. రోజాను రహస్యంగా వివాహం చేసుకోవాలని యోచిస్తాడు అనంత్‌. ఊహించని పరిస్థితులలో రోజా -అనంత్‌ వివాహం జరుగుతుంది. రోజా జీవితం దయనీయంగా మారుతుంది. యాదృచ్ఛికంగా ఆమె వేణు గోపాల రావు ఇంట్లోకి ప్రవేశిస్తుంది. రోజా.. వేణు గోపాలరావు కూతురని తెలీదు. చివరకు తెలుస్తుందా? అనంత్‌ వెన్నంటే ఉండే విజయ్‌ ఏం చేశాడు? చందు మంచి వ్యక్తిగా మారాడా? విభిన్న వ్యక్తుల మనస్తత్వాలకు అద్దం పట్టే ఈ అద్భుత చిత్రం చూడాల్సిందే.

*మరిచిపోలేని సంగీతం


- ఈ జీవనతరంగాలలో.. ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతమూ ఎంతవరకీ బంధమూ


- పుట్టిన రోజు పండగే అందరికి.. మరి పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికి


- నందమయా గురుడా నందమయాCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.