‘కీలుగుఱ్ఱం’ గగన విహారానికి డెబ్భై ఏళ్ళు
కదిలే బొమ్మలు తెలుగు మాటలు నేర్చింది 1932లో ‘భక్త ప్రహ్లాద’ చిత్రంతో. ఆ సినిమా ద్వారా మాటలు పలికించింది మీసాలపులి హెచ్‌.ఎం.రెడ్డి. ఆ దశకంలో నిర్మించిన చిత్రాలు ముఖ్యంగా ‘ సీతాకల్యాణం’, ‘లవకుశ’, ‘అహల్య’, ‘శ్రీకృష్ణ తులాభారం’, ‘భక్త కుచేల’, ‘ద్రౌపది వస్త్రాపహరణం’, ‘సంపూర్ణ రామాయణం’, ‘లంకాదహనం’, ‘దశావతారాలు’, ‘మోహినీ రుక్మాంగద’, ‘రుక్మిణీకల్యాణం’, ‘కృష్ణ జరాసంధ’ వంటి పౌరాణిక చిత్రాలే. పైగా ఆ సినిమాలకు మూలాలు రంగస్థల నాటకాలు. నలభయ్యవ దశకంలో కాశీమజిలీ కథల్లాంటి జానపదాలు, చింతామణి వంటి సాంఘిక నాటకాల ప్రభావంతో తెలుగులో సినిమాలు తీశారు. వాహినీ సంస్థ ఉద్భవించి ‘సుమంగళి’, ‘దేవత’, ‘స్వర్గసీమ’ వంటి సందేశాత్మక చిత్రాలను నిర్మిస్తే, శోభనాచల పిక్చర్స్‌ వారు ‘దక్షయజ్ఞం’, ‘భీష్మ’, ప్రతిభా వారు ‘పార్వతీ కల్యాణం’, ‘సీతారామ జననం’, సారథి స్టూడియోస్‌ వారు ‘పత్ని’, ‘మాయలోకం’, ‘పంతులమ్మ’, జెమిని ఫిలిం సర్క్యూట్‌ వారు ‘బాలనాగమ్మ’ వంటి చిత్రాలను నిర్మిస్తూ సినిమా నిర్మాణంలో అనేక మార్పులు తీసుకొచ్చారు. ముఖ్యంగా జానపద సినిమాలకు మంచి ప్రేక్షకాదరణ లభించడంతో, ఆ వైపు నిర్మాతలు మొగ్గు చూపారు. ప్రతిభా వారు నిర్మించిన ‘బాలరాజు’ సినిమా 1949లో 11 కేంద్రాల్లో వందరోజులు ఆడి విజయవాడలో 365 రోజుల ప్రదర్శనతో చరిత్ర సృష్టించింది. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా స్టార్డం అందుకున్నది ఈ చిత్రంతోనే. తరువాత విడుదలైన శోభనాచల వారి ‘కీలుగుఱ్ఱం’ చిత్రం కూడా ‘బాలరాజు’ తరహాలోనే 11 కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుంది. ‘కీలుగుఱ్ఱం’ చిత్రం 19 ఫిబ్రవరి 1949న విడుదలై 70 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రను అందుకుంది. డెబ్భై సంవత్సరాలకు ముందే ఓ ‘కీలుగుఱ్ఱం’ చేత గగన యానం చేయించిన ఈ సినిమా విశేషాలను మననం చేసుకుందాం...


* కీలుగుఱ్ఱం తెర వెనుక...
చిత్ర నిర్మాణం: శోభనాచల పిక్చర్స్, నిర్మాత, దర్శకుడు: మీర్జాపురం రాజా, స్కీన్ర్‌ ప్లే: చిత్రపు నారాయణమూర్తి, మాటలు, పాటలు: తాపీ ధర్మారావు నాయుడు, సంగీత దర్శకుడు: ఘంటసాల, ఛాయాగ్రహణం: డి.ఎల్‌.నారాయణ, కళాదర్శకుడు: టి.వి.ఎస్‌.శర్మ, నృత్య దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య, వెంపటి పెద సత్యం, నటీనటవర్గం: నాగేశ్వరరావు, అంజలీదేవి, ఎ.వి.సుబ్బారావు, రేలంగి, మహంకాళి వెంకయ్య, కంచి నరసింహారావు, టి.కనకం, బాలామణి, సూర్యశ్రీ, జూనియర్‌ లక్ష్మిరాజ్యం, సురభి కమలాబాయి, గంగారత్నం మొదలగువారు.

* శోభనాచల పిక్చర్స్‌ ఆవిర్భావం...
సినీ ప్రేమికులకు మీర్జాపురం రాజాగా పరిచితులైన మేకా వెంకట్రామయ్య అప్పారావు బహదూర్‌ కృష్ణాజిల్లా నూజివీడుకు చెందిన జమీందారు. ఆ రోజుల్లోనే మద్రాసు ఆల్వార్‌పేటలో జయా ఫిలిమ్స్‌ లిమిటెడ్‌ అనే చలనచిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి అదే పేరుతో విశాలమైన స్టూడియో కూడా కట్టారు. 1938లో వేమూరు గగ్గయ్య, ఎం.వి. రాజమ్మలతో చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వంలో ‘కృష్ణ జరాసంధ’ అనే చిత్రాన్ని నిర్మించారు. తరువాత 1939-42 మధ్యకాలంలో వరుసగా ‘మహానంద’, ‘భోజకాళిదాస’, ‘జీవనజ్యోతి’ చిత్రాలు నిర్మించారు. ‘మహానంద’ చిత్రానికి టి.మార్కొని దర్శకత్వం వహించగా, కృష్ణవేణి టైటిల్‌ పాత్ర పోషించింది. అలాగే ‘భోజకాళిదాస’లో కూడా హీరోయిన్‌ చతురికగా కృష్ణవేణి నటించింది. ఈ చిత్ర నిర్మాణ సమయంలోనే మీర్జాపురం రాజా నటి, గాయని కృష్ణవేణిని వివాహమాడారు. ఈ చిత్రానికి దర్శకుడు హెచ్‌.వి. బాబు. మీర్జాపురం జమీందారులు నూజివీడుకు సమీపంలోని అగిరిపల్లి గ్రామంలో వెలసిన శ్రీశోభనాచల నరసింహ స్వామి దివ్య క్షేత్రానికి వంశపారంపర్య ధర్మకర్తలు కావడంతో, ఆ స్వామివారి మీద భక్తితో మీర్జాపురం రాజా ‘జయా ఫిలిమ్స్‌’ సంస్థను ‘శోభనాచల పిక్చర్స్‌ లిమిటెడ్‌‘గాను, స్టూడియోని ‘శోభనాచల స్టూడియో’గాను మార్చి ఆ బ్యానరు మీద చిత్రనిర్మాణం కొనసాగించారు. శోభనాచల బ్యానర్‌ మీద నిర్మించిన తొలిచిత్రం ‘దక్షయజ్ఞము’ (1941). ఇందులో కృష్ణవేణి సతి పాత్రలో నటించగా వేమూరి గగ్గయ్య దక్షుడు పాత్రలో జీవించారు. తరువాత చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వంలో ‘భక్తప్రహ్లాద’(1942) చిత్రాన్ని నిర్మించారు. అందులో వేమూరు గగ్గయ్య హిరణ్యకశిపుడుగా నటించారు. తరువాత ఇదే బ్యానరు మీద ‘సంసార నారది’ (1944), ‘భీష్మ’ (1945), ’గొల్లభామ’ (1947), ‘మదాలస’ (1948) చిత్రాలు నిర్మించారు. ‘గొల్లభామ’ చిత్రంలో అంజలీదేవి, కృష్ణవేణి నటించారు. అప్పుడే వీరిద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. అంతవరకు శోభనాచాలవారు తీసిన చిత్రాలకు చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. నారాయణమూర్తి మంచి దర్శకుడు. కానీ రాజావారు ఆయనకు కొన్ని పరిమితులు విధించడంతో వాటిని మించి తన సృజనాత్మకతను, కళాప్రతిభను చూపించే స్వేచ్ఛ లోపించింది. ‘కీలుగుఱ్ఱం’ సినిమా చర్చలు జరుగుతున్న సమయంలోనే నారాయణమూర్తికి శ్రీ వెంకట్రామా పిక్చర్స్‌ వారి తొలిచిత్రం ‘బ్రహ్మరథం’ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం రావడంతో శోభనాచల స్టూడియోలోనే ఆ చిత్రాన్ని తీస్తూ, ‘కీలుగుఱ్ఱం’ చిత్రానికి అజ్ఞాతంగా రాజా వారికి దర్శకత్వ నిర్వహణలో సహకారం అందించడం జరిగింది. దాంతో మీర్జాపురం రాజా పేరు దర్శకుడిగా తెరమీదకొచ్చింది.


* కీలుగుఱ్ఱం సినిమాలో...
మీర్జాపురం రాజాకు జానపద సినిమాలంటే మక్కువ. అంతకు ముందే ‘బాలరాజు’ చిత్రం ప్రేక్షకుల్ని ఉర్రూతలూపింది. అందుకే కాశీమజిలీ కథల నేపథ్యంలో రచయిత తాపీ ధర్మారావు నాయుడు చేత కీలుగుఱ్ఱం కథ రాయించారు. నిజానికి ఈ కథ రూపకర్త సదాశివబ్రహ్మం. కానీ అతని పేరు సినిమా క్రెడిట్స్‌లో చేర్చలేదు. ఈ కథకు చిత్రపు నారాయణమూర్తి చేత స్కీన్ర్‌ ప్లే రాయించి ‘కీలుగుఱ్ఱం’ చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కథ సరదాగా వుంటుంది. ప్రసేన మహారాజు(ఎ.వి.సుబ్బారావు) అడవిలో వేటాడుతూ భువనసుందరి(అంజలీదేవి) అనే యువతిని మోహిస్తాడు. నిజానికి ఆమె ఒక రాక్షస కన్య అని మహారాజుకు తెలియదు. ఆమె మొదట బెట్టుచేసినా, తరువాత రాజు వెంట తన తల్లి కేకిని (టి.కనకం)తో రాజు అంతఃపురానికి చేరుకుంటుంది. పట్టపురాణి ప్రభావతిదేవి (బాలామణి)కి పుత్రోదయం కానున్నదని తెలిసి అసూయపడుతుంది. తన రాక్షస ప్రవృత్తి మానుకోలేక తల్లీకూతుళ్లు గుర్రపుశాలల్లో, ఏనుగుశాలల్లో వుండే అశ్వగజ సంపదను రాత్రివేళ భక్షిస్తూ ఆ నేరాన్ని పట్టపురాణి మీదకు నెట్టేస్తారు. రాజు ఆగ్రహించి మహారాణిని చంపేయమని ఆజ్ఞలు జారీచేస్తాడు. విశ్వాస పాత్రులైన సేవకులు ఆమెను అడవిలోకి తీసుకెళ్లి మహారాణి కనుగుడ్లు మాత్రమే పెరికి ఆమెను వదలిపెడతారు. అడవిలో మహారాణికి అటవిక జాతివాళ్లు ఆశ్రయమిస్తారు. మహారాణికి విక్రమసింహుడు (అక్కినేని నాగేశ్వరరావు) పుడతాడు. తల్లి ద్వారా తను యువరాజునని గ్రహించి రాజాస్థానం చేరుకొని అక్కడ కీలుగుర్రాన్ని అధిరోహించగల సాహసిగా మహారాజు మన్ననలంది, సేనాధిపతిగా నియమితుడౌతాడు. కీలుగుఱ్ఱం సాయంతో రాక్షసి పన్నాగాలను ఛేదించి, వారిని చంపి తల్లిదండ్రులను కలుపుతాడు. ఇందులో అక్కినేని సరసన రాజకుమారిలుగా సూర్యశ్రీ (విద్యావతి), లక్ష్మిరాజ్యం జూనియర్‌ (సుగుణ) నటించారు.

* కీలుగుఱ్ఱం సినిమా విశేషాలు...


*
1949 ఫిబ్రవరి 18న పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో అక్కినేని నాగేశ్వరరావు-అన్నపూర్ణల వివాహం జరిగింది. ఆ మరుసటిరోజే ‘కీలుగుఱ్ఱం’ సినిమా పది ప్రింట్లతో అన్ని ముఖ్య కేంద్రాల్లో విడుదలై 150 రోజులు ఆడి విజయ దుందుభి మోగించింది. పేరుకి మీర్జాపురం రాజా దర్శకుడైనా, సినిమాను తెరచాటు నుంచి నడిపించింది చిత్రపు నారాయణ మూర్తే.

*
ఈ చిత్రంలో నెగిటివ్‌ పాత్ర పోషించేందుకు ముందు అంజలీదేవి ఒప్పుకోలేదు. అయితే కృష్ణవేణి పట్టుపట్టడంతో స్నేహధర్మాన్ని కాదనలేక రాక్షసి పాత్ర పోషించేందుకు ఒప్పుకుంది. అయితే తన పాటలు కృష్ణవేణే పాడాలని కోరడంతో ‘తెలియవశమా పలుకగలమా ప్రేమమహిమా’ (ఘంటసాలతో), ‘ఆహా, కీరగానములు, భ్రమర గీతములు కోకిల పాటలు విన్నామా’, ‘హాయీ భాగ్యము నాదేనోయీ’, ‘చూచి తీరవలదా నా చదరంగము వేచి చూడవలదా’ పాటలను అంజలీదేవి కోసం కృష్ణవేణి ఆలపించింది.


* ఘంటసాల ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. దీనికి ముందు ఘంటసాల భరణీ వారి ‘రత్నమాల’, ప్రతిభా వారి ‘బాలరాజు’ సినిమాలకు సహాయ సంగీత దర్శకునిగా పనిచేసి, పెందుర్తి సుబ్బారావు మొదలుపెట్టిన ‘లక్ష్మమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. ఆర్ధిక ఇబ్బందుల వలన పెందుర్తి ఆ చిత్రాన్ని పూర్తి చేయలేకపోవడంతో, కృష్ణవేణి ఆ చిత్రాన్ని కొనుగోలు చేషింది. అందులో ఘంటసాల స్వరపరచిన పాటలు ఆమెకు నచ్చడంతో, ‘కీలుగుఱ్ఱం’ సినిమాకు ఘంటసాలను తీసుకుందామని రాజాకు సిఫారసు చేసింది. అలా శోభనాచల వారి ‘కీలుగుఱ్ఱం’ చిత్రానికి ఘంటసాల సంగీత దర్శకునిగా నియమితులయ్యారు. అయితే ‘లక్ష్మమ్మ’ సినిమా 26 ఫిబ్రవరి 1950 న విడుదల కాగా, అంతకన్నా ముందే (19-02-1949) ‘కీలుగుఱ్ఱం’ సినిమా విడుదలైంది.

* జకార్తా ఫిలిం ఫెస్టివల్‌లో ‘నర్తనశాల’ చిత్రానికి ఉత్తమ కళాదర్శకుని బహుమతి పొందిన టి.వి.ఎస్‌. శర్మ ‘కీలుగుఱ్ఱాని’కి రూపకల్పన చేశారు. ఆ గుఱ్ఱానికి గేర్లు వంటివి అమర్చి అటూ ఇటూ మలుపులు తిరిగేలా రూపొందించారు. సినిమాటోగ్రాఫర్‌ ఎం.ఎ.రెహమాన్‌ ఆ కొయ్యగుర్రం చేత ఆకాశంలో విన్యాసాలు చేయించి సినిమాను రక్తి కట్టించారు. డెబ్బై ఏళ్ళ క్రితమే ఒక కొయ్యగుర్రం చేత గగనయానం చేయించే ఆలోచనకు కార్యరూపమివ్వడం విశేషమే. ‘కీలుగుఱ్ఱం’ సినిమా మొత్తం శోభనాచల స్టూడియోలోనే చిత్రీకరించారు. అంతా ఇన్‌డోర్‌లోనే సినిమా నిర్మాణం జరిగింది.
* ఈ సినిమా నిర్మాణ దశలో వుండగా ఓ విచిత్రం జరిగింది. నటుడు, దర్శకుడు లంక సత్యం జూపిటర్‌ పిక్చర్స్‌ సోమసుందరం కోసం మీర్జాపురం రాజాను ‘కీలుగుఱ్ఱం’ కథను ఇమ్మని అడిగారు. రాజా ‘కీలుగుఱ్ఱం’ కథను ఇచ్చారు. ‘మోహిని’ పేరుతో లంక సత్యం దర్శకత్వంలో ‘కీలుగుఱ్ఱం’ కథ తమిళ సినిమాగా పూర్తి 31 అక్టోబరు 1948న ... అంటే ... మూడున్నర నెలల ముందే తమిళనాట విడుదలైంది. ఈ చిత్రంలో ఎం.జి.రామచంద్రన్, టి.ఎస్‌.బాలయ్య, నంబియార్,ఆర్‌.బాలసుబ్రమణియం, మాధురి దేవి, వి.ఎన్‌.జానకి, మాలతి నటించారు. ఎస్‌.ఎం.సుబ్బయ్యనాయుడు, సి.ఆర్‌.సుబ్బురామన్‌ సంగీత దర్శకత్వం వహించారు. అందులో కీలుగుఱ్ఱం మ్యాజిక్‌ సన్నివేశాలను కె.రామనాథ్‌ చిత్రీకరించారు. ఈ చిత్రంతోనే ఎమ్జీఆర్‌ వి.ఎన్‌.జానకితో ప్రేమలో పడి ఆమెను పెళ్ళిచేసుకున్నారు. ఇందులో ఎమ్జీఆర్‌ది చిన్న పాత్ర కాగా అక్కినేని పాత్రను టి.ఎస్‌.బాలయ్య పోషించాడు. కానీ తమిళ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించలేదు. దాంతో చిత్రం పరాజయం చవిచూసింది. తెలుగు చిత్రం ‘కీలుగుఱ్ఱం’ సూపర్‌ హిట్టయ్యాక, ‘మాయక్కుదిరై’ పేరుతో తమిళంలోకి అనువదించి 1949 ఆగస్టు 4న విడుదల చేస్తే పెద్ద హిట్టై నిలిచింది.

* ఆ రోజుల్లో శ్రీలంకలోని జాఫ్నా పట్టణంలో తమిళులు అధికంగా ఉండడంతో అక్కడ తమిళ చిత్రాలు ఆడుతుండేవి. ‘మాయక్కుదిరై’ చిత్రం జాఫ్నాలో కూడా పెద్ద హిట్‌గా నిలవడం విశేషం. తమిళ భాషలోకి అనువదింపబడిన తొలి తెలుగు చిత్రం కూడా ‘కీలుగుఱ్ఱం’ చిత్రం కావడం మరో విశేషం. తరువాతి కాలంలో ‘కీలుగుఱ్ఱం’ సినిమాను కొన్ని మార్పులతో ఎన్‌.టి.రామారావును హీరోగా పెట్టి సినిమాగా తీయాలని నిర్మాత కృష్ణవేణి అభిప్రాయపడినా అది ఆచరణలోకి రాలేదు. ఇందులో కేకిని పాత్రను రంగస్థల నటి టి.కనకం పోషించింది. తాపీ ధర్మారావు నాయుడు సిఫారసుతో ఆమెను కేకిని పాత్రకు తీసుకున్నారు.

*
మరో పెద్ద విశేషమేవిటంటే... ఈ సినిమా నిర్మాణంలో వుండగా ‘కీలుగుఱ్ఱం’ నడుపుతూ అక్కినేని నాగేశ్వరరావు పడిపోయి చనిపోయారనే పుకారు ఆంధ్రదేశంలో చెలరేగింది. ప్రతిభా వారి కార్యాలయానికి సంతాప సందేశాలు కోకొల్లలుగా వచ్చాయి. దాంతో ఘంటసాల బలరామయ్య ‘అక్కినేని నాగేశ్వరరావు బ్రతికే వున్నారు’ అని ప్రముఖంగా పత్రికా ప్రకటన ఇవ్వాల్సివచ్చింది. ఈ సినిమా విజయంతో అక్కినేని స్టార్డం అందుకున్నారు. తరువాత మూడేళ్ళ పాటు అక్కినేని ఎక్కువ జానపద చిత్రాల్లో హీరోగా నటించారు.

*
మీర్జాపురం రాజా-కృష్ణవేణిల కుమార్తె ఎన్‌.ఆర్‌. అనూరాధాదేవి తదనంతర కాలంలో నిర్మాతగా మారి తెలుగు, తమిళంలో అత్యధికంగా 17 సినిమాలు నిర్మింఛి రికార్డు సాధించారు. వాటిలో ఆలీబాబా 40 దొంగలు, అనుబంధం, చక్రధారి కొన్ని మాత్రమే.

* పాటలు...
ఈ చిత్రం టైటిల్స్‌ వస్తున్నప్పుడు ‘శోభనగిరి నిలయా దయామయా వైభవోపేత వరగుణ సమేత వీరరస కలిత విష్ణువంశ సంజాతా వైరి హరరంహా వ్యాఘ్ర నరసింహా’ అంటూ కృష్ణవేణి ఆలపించిన పాట వినవస్తుంది. అగిరిపల్లి శోభనాద్రి కొండమీద కొలువైన శోభనాచల నరసింహస్వామి పేరుతో శోభనాచల స్టూడియో నెలకొల్పబడింది. ఘంటసాల, శ్రీదేవి ఆలపించిన ‘ఎంత కృపామతివే భవాని యెంత దయా నిధివే’ పాట ఆరోజుల్లో పెద్ద హిట్‌. ఇప్పుడు కూడా పాతతరం వారు ఆ పాటను గుర్తుచేసుకోవడం కద్దు. ఘంటసాల, వక్కలంక సరళ ఆలపించిన మరొక మధుర గీతం ‘కాదుసుమా కల కాదు సుమా అమృత పానమును అమరగానమును గగన యానమును కల్గినట్లుగా గాలిని తేలుచు సోలిపోవుటిది’. ఈ పాట నేటికీ అజరామరమే. వక్కలంక సరళ ఆలపించిన అతితక్కువ పాటల్లో ఇదొకటి. ఇక మిగతా పాటలు కృష్ణవేణి ఆలపించినవే.

- ఆచారం షణ్ముఖాచారి


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.