19 వసంతాల ‘ఖుషి’

‘‘ఈ సమస్త భూమండలం, అందులో జీవించే సకల జీవకోటి, వాటి జీవన విధానం.. ఇవన్నీ అర్థవంతంగా ఉన్నాయంటే దానికి ఒకే ఒక కారణం వాటి మధ్య ఉద్భవించే ప్రేమే. ఈ ప్రేమ అనేది ఓ తల్లికి, బిడ్డకి మధ్య కావొచ్చు. సహోదరుల మధ్య కావొచ్చు. స్నేహితుల మధ్య కావొచ్చు. ప్రేమికుల మధ్య కావొచ్చు. ఏది ఏమైనప్పటికీ యవ్వన ప్రాయంలో, ఇరవై ఏళ్ల వయసులో ఓ ఆడ మగ మధ్య ఏర్పడే ప్రేమే తలచుకోవడానికి తియ్యగా ఉంటుంది. ఆలోచిస్తే ఆనందంగా ఉంటుంది. కలకతా నగరంలో పుట్టిన సిద్ధార్థ్‌ రాయ్‌కి, కోనసీమ ప్రాంతంలోని కైకలూరు గ్రామంలో జన్మించిన మధుమతికి భగవంతుడు నిశ్చయించేశాడు. వాళ్ల స్థితి గతులు వేరైనా, ఆచారాలు వేరైనా, కులాలు వేరైనా, భాషలు వేరైనా ఓ మార్గం చూపించాడు. అదేంటంటే ప్రేమ. వాళ్లిద్దరు ఎలా కలుస్తారా? అనేదే కథ’’ అంటూ వచ్చిన ప్రేమ కథ ‘ఖుషి’. ఈ సినిమా 19 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా...


- ప్రేమ ఒకటే కానీ దాని భావాలు వేరు. ప్రేమకథలన్నీ ఇంచుమించు ఒకేలా ఉంటాయి కానీ చూపించే తీరు వేరు. ఇద్దరు విద్యార్థుల మధ్య ఉండే ప్రేమ గురించి టాలీవుడ్‌లో ఎన్నో చిత్రాలొచ్చాయి. ఇదే నేపథ్యంతో వచ్చిన ‘ఖుషి’ మాత్రం ప్రత్యేక స్థానం సంపాదించింది. దానికి కారణం నాయకానాయికల మధ్య ఉన్న ఇగో అనే చిన్న సమస్య. దాన్ని సున్నితంగా చూపించి ప్రేమ విలువని తెలియజేశారు దర్శకుడు ఎస్‌.జె.సూర్య. ఈ చిత్రంలో పెద్ద డైలాగులు ఉండవు, భారీ యాక్షన్‌ సన్నివేశాలు లేవు, హద్దులు దాటే ముద్దులు లేవు, సీనియర్‌ నటీనటులు పెద్దగా లేరు అయినా ఘన విజయం అందుకుందంటే స్క్రీన్‌ప్లే ఎలాంటి పాత్ర పోషించిందో అర్థం చేసుకోవచ్చు. పవన్‌ కల్యాణ్, భూమిక నాయకానాయికలుగా ఎంపిక చేయడంలోనే ఆయన సగం విజయం సాధించారు. కోలీవుడ్‌లో విజయవంతమైన చిత్రానికి రీమేక్‌ ఇది. తెలుగుదనాన్ని దృష్టిలో పెట్టుకుని హీరో పాత్రని కొత్తగా చూపించారు ఇక్కడ. పవన్‌ మ్యానరిజం కొత్తగా, స్టైలిష్‌గా ఉండటంతో సినీ ప్రియుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. అందం, అభినయంతో భూమిక కుర్రకారు హృదయాలు కొల్లగొట్టింది. మణిశర్మ సంగీతం, నేపథ్య సంగీతం మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ చిత్రంలోని ప్రతి పాట ఎప్పటికీ ప్రత్యేకమే. ఎ.ఎమ్‌.రత్నం నిర్మించిన ఈ సినిమా టాలీవుడ్‌లో చెరగని ముద్ర వేసుకుంది.


సంబంధిత వ్యాసాలు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.