అలరించిన ‘ముద్దుబిడ్డ’
అలరించిన ‘ముద్దుబిడ్డ’

సినిమా అనేది అత్యంత శక్తివంతమైన మాధ్యమం. అలాంటి సినిమా సమాజ ప్రగతికి దోహదపడాలనేది ప్రఖ్యాత నిర్మాత దర్శకుడు కె.బి.తిలక్‌ ఆశయం. అదే ధ్యేయంతో ఆయన 1956లో అనుపమ సంస్థను నెలకొల్పి తొలి ప్రయత్నంగా, ‘ముద్దుబిడ్డ’ సినిమా నిర్మించారు. ‘ఎం.ఎల్‌.ఎ’ చిత్రం ద్వారా ప్రఖ్యాత గాయని ఎస్‌.జానకిని, హీరో రమణమూర్తిని, ‘భూమికోసం’ సినిమా ద్వారా హీరోయిన్‌ జయప్రదను తెలుగు సినీరంగానికి పరిచయం చేసిన ఘనత కూడా తిలక్‌దే. ‘ముద్దుబిడ్డ’ సినిమా 1956 సెప్టెంబరు 6న విడుదలై అఖండ విజయం సాధించింది. అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆ సినిమా విశేషాలు కొన్ని...

తొలి అడుగు...


తిలక్‌ పూర్తి పేరు కొల్లిపర బాలగంగాధర్‌ తిలక్‌. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో జన్మించిన తిలక్‌ ఒక గొప్ప మానవతావాది. పిన్న వయసులోనే క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లిన సమరయోధుడు. మార్క్సిస్టు సిద్ధాంతాలను నమ్మి ప్రజానాట్యమండలిలో విప్లవ గీతాలాపనలతోబాటు, నాటకాలు వేయటం వంటి చురుకైన పాత్రలు పోషించినవాడు. అన్నిటికీ మించి ప్రఖ్యాత దర్శక నిర్మాత ఎల్‌.వి. ప్రసాద్‌కు మేనల్లుడు. జైలునుంచి విడుదలకాగానే బొంబాయివెళ్ళి ఎస్‌.ఎ.డాంగే సహకారంతో ఇండియన్‌ పీపుల్‌ థియేటర్‌ ఆర్ట్స్‌ ప్రముఖులు బల్రాజ్‌ సాహ్ని, రొమేష్‌ థాపర్‌ వంటివారితో సాన్నిహిత్యం పెంచుకున్నారు. మేనమామ ఎల్‌.వి. ప్రసాద్‌ సహకారంతో దర్శక నిర్మాత ఎస్‌.ఎం.యూసఫ్‌ వద్ద సహాయకుడిగా పనిచేస్తూ సినీ నిర్మాణ మెలకువలు నేర్చుకున్నారు. ఎల్‌.వి.ప్రసాద్‌ ‘గృహ ప్రవేశం’ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు నిర్వహించేందుకు మద్రాసు చేరుకున్న కొన్ని రోజులకు తిలక్‌ కూడా మద్రాసులో అడుగుపెట్టి, కోవెలమూడి భాస్కరరావు, చల్లపల్లి రాజాకు చెందిన ప్రీమియర్‌ ఫిలిమ్స్‌ పంపిణీ సంస్థలో పనిచేస్తూ ఎడిటర్‌ ఎం.వి.రాజన్‌కు దగ్గరై ఎడిటింగ్‌లో పట్టు సంపాదించారు. ‘మనదేశం’ సినిమా కోసం ఎన్‌.టి.రామారావుకు స్క్రీన్‌ టెస్ట్‌ ఎడిట్‌ చేసి, ఎంపిక చేసిన వారిలో రాజన్‌తో బాటు తిలక్‌ కూడా ఉన్నారు. ‘మనదేశం’ తరువాత 1951 నుంచి వరసగా ‘రాధిక’, ‘ధర్మాంగద’, ‘మంత్రదడం’, ‘సువర్ణమాల’, ‘రోజులుమారాయి’ సినిమాలకు రాజన్‌తో కలిసి పనిచేసిన తిలక్‌కు అనుకోకుండా దర్శకత్వం నిర్వహించే అవకాశం వచ్చింది. 1954లో నవయుగ సంస్థ వారు ప్రముఖ ఛాయాగ్రహకుడు పి.శ్రీధర్‌ దర్శకత్వంలో ‘జ్యోతి’ సినిమాకు నిర్మించాలనుకున్నా, ఆయన నిర్మాతతో మనస్పర్ధలు పెరిగి తప్పుకోవటంతో ఆ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం తిలక్‌కు దక్కింది. ఆ అనుభవంతో 1956లో అనుపమ సంస్థను నెలకొల్పి చిత్రనిర్మాణానికి నడుంబిగించారు. 1913లో శరశ్చంద్ర చటర్జీ రచించిన ‘బిందూర్‌ ఛలే’ నవల ఆధారంగా సినిమా కథను మలిచే బాధ్యతను తాపీ ధర్మారావు, ఆరుద్రలకు అప్పగించారు. ఈ చిత్రకథకు ‘ముద్దుబిడ్డ’ అని నామకరణం చేశారు. అనుపమా వారి తొలిచిత్రం ఇది. వీనస్‌ స్టూడియోలో నిర్మించారు. ఇది బాక్సాఫీసు హిట్‌గా నిలిచింది.

ముద్దుబిడ్డ కథలోకి వెళితే...

సంపన్న కుటుంబీకుడు గోపాలం (పెరుమాళ్లు) కూతురు రాధ (జమున) అల్లారుమద్దుగా పెరిగింది. ఆమెకు అహంకారం మెండు. మనసు నొచ్చే విధంగా ఎవరైనా అంటే ఆమెకు ఫిట్స్‌ వచ్చేవి. పెళ్ళి చేస్తే జబ్బు నయమవుతుందని డాక్టర్లు చెప్పడంతో గోపాలం పెళ్లి ప్రయత్నాలు చేస్తాడు. అంపాపురం జమీందారు చిన్నికృష్ణమ్మ బహద్దూర్‌ (సి.ఎస్‌.ఆర్‌) దివాణంలో పనిచేసే శేషయ్య (నాగయ్య)కు మధు (జగ్గయ్య) సవతి తమ్ముడు. శేషయ్య కష్టపడి మధును చదివించి డాక్టర్ని చేశాడు. గోపాలం కూతురు సంబంధం నచ్చిన శేషయ్య మధుకి పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తే, అన్నావదినలకు అమ్మాయి నచ్చితే తనకూ నచ్చినట్లేనని మధు రాధను చూడకుండానే పెళ్లి చేసుకుంటాడు. పెళ్లయ్యాక రాధకు ఫిట్స్‌ వస్తుంటాయని మధుకి తెలుస్తుంది. మధు పినతండ్రి కూతురు పేరమ్మ (సూర్యకాంతం) భర్త పరంధామయ్య (రమణారెడ్డి)తో బాటు శేషయ్య ఇంటిలో చేరి రాధ విషయంలో శేషయ్య మధుని మోసం చేసి పెళ్లికి ఒప్పించినట్లు అనుమాన బీజం నాటుతుంది. శేషయ్య భార్య సీతమ్మ (లక్ష్మీ రాజ్యం) వేణు (మాస్టర్‌ వెంకటేశ్వర్‌) అనే పిల్లవానికి జన్మనిస్తుంది. తన ఏడాది బిడ్డ వేణుని సీతమ్మ రాధకు మచ్చిక చేయడంతో ఆమెకు మూర్చరోగం తగ్గుముఖం పడుతుంది. వేణు తన తల్లి రాధే అనుకొని ఆమేనే ‘అమ్మ’, అని అసలు తల్లిని ‘అక్కయ్య’ అని పిలుస్తుంటాడు. వేణుకు ఆరేళ్లు వచ్చాక పేరమ్మ తన కొడుకు నారాయణ (హేమంతకుమార్‌) చదువు మిషతో మరలా మధు ఇంటిలో అడుగుపెడుతుంది. నారాయణ చెడు సాంగత్యంలో వేణు పాడైపోతాడని భావించిన రాధ మధు చేత పేరు కాపురం పెట్టిస్తుంది. కలతలతో రాధకు మరలా మూర్ఛరోగం తిరగబెడుతుంది. ఇది ఆసరాగా తీసుకున్న పేరమ్మ, రాధను చూస్తే ఆమె చచ్చిపోతుందని వేణుని నమ్మించి ఆ బాబుని రాధకు దూరం చేస్తుంది. రాధ మనోవేదనలతో మంచంపట్టి మృత్యుముఖానికి చేరువవుతుంది. అనేక నాటకీయ పరిణామాల మధ్య ఆ ఇంటి పరిస్థితులు చక్కబడి అంతా ఒకటవడంతో సినిమా సుఖాంతమవుతుంది. చదలవాడ కుటుంబరావు, పేకేటి, రామలింగయ్య, టైగర్‌ జోగారావు, సురభి కమలాబాయి, విజయలక్ష్మి, డ్యాన్సర్‌ మీనాక్షి, కృష్ణజ్యోతి, ఇ.వి.సరోజ ఇతర పాత్రల్లో నటించారు. ‘ముద్దుబిడ్డ’ సినిమాకు గోరె ఛాయాగ్రహణం, వేణుగోపాలస్వామి నృత్యదర్శకత్వం, ఎం.వి.రాజన్‌ కూర్పు, కె.బాపయ్య సహాయ దర్శకత్వం నిర్వహించారు.

పెండ్యాల స్వరాలు


తిలక్‌ - ఆరుద్ర - పెండ్యాల ముగ్గురూ ఏ శుభ ఘడియలో కలిశారోగాని, ‘ముద్దుబిడ్డ’ సినిమా తరువాత వచ్చిన ‘ఎం.ఎల్‌.ఎ,’ ‘అత్తా ఒకింటి కోడల’ే, ‘ఈడూ-జోడూ’, ‘ఉయ్యాల-జంపాల’, ‘భూమికోసం’, ‘కొల్లేటి కాపురం’ మొదలైన సినిమాలు అనుపమ సంస్థ కీర్తి ప్రతిష్టలను నిలబెట్టి సంగీతభరిత కుటుంబ చిత్రాలుగా నిలిచాయి. ‘ముద్దుబిడ్డ’ సినిమాకు పాటలన్నీ ఆరుద్ర రాసినవే. ‘చిట్టిపొట్టి వరాలమూటా గుమ్మడిపండు గోగుపువ్వు’ అనే పాటతో సినిమా మొదలవుతుంది. సుశీల పాడగా జమున అభినయించే ఈ పాటను పహాడి, యమన్‌ మిశ్రమ రాగచ్ఛాయల్లో పెండ్యాల స్వరపరచారు. రెండవ పాట ఒక నృత్యగీతం. ‘పదరా సరదాగా పదరా బావ చిందేసుకుంటూ’ అనే ఈ పాటను జిక్కి ఆలపించారు. ఈ పాటకో విశేషముంది. 1953లో రాజ్‌ కమల్‌ కళామందిర్‌ బ్యానర్‌లో ప్రముఖ హిందీ దర్శక నిర్మాత వి.శాంతారాం నిర్మించిన ‘తీన్‌ బత్తి చార్‌ రాస్తా’ చిత్రలో లక్ష్మి అనే తమిళ పాత్ర పోషించిన బొంబాయికి చెందిన మీనాక్షి ఈ పాటకు నృత్యం చేయటమే ఆ విశేషం. జమున - జగ్గయ్యల పెళ్లి సందర్భంగా వచ్చే నృత్య గీతమిది. మరొక విశేషమేమిటంటే ఈ పాట కోసం గుంటూరు జిల్లా కొలకలూరు గ్రామం నుంచి కనకతప్పెట్ల వాద్యకారులైన అమృతయ్య, గన్న ఏసుదాసులను కృష్ణా జిల్లా నుంచి పిలిచి జానపద బాణీలో రికార్డు చేశారు. ఆ పాటలో వీరిద్దరూ నటించారు. ఈ పాట తరువాత నాగయ్య ‘ఇటులేల చేశావయా ఓ దేవదేవా’ అంటూ చక్రవాక రాగంలో వేడుకోవడం కొసమెరుపు. నీలాంబరి రాగఛాయల్లో లీల చేత ఆలపింపచేసిన ‘ఎవరు కన్నారెవరు పెంచారు నవనీత చోరుని గోపాలబాలుని’ అనే మరొక పాట ఒక నేపథ్యగీతంగా సాగుతుంది. ఈ పాటను విని మల్లాది రామకృష్ణశాస్త్రి ఆరుద్రను ఎంతగానో మెచ్చుకున్నారు. ముఖ్యంగా చెప్పుకోవలసింది ‘అంతలోనె తెల్లావారె అయ్యో ఏమి సేతునే, కాంతుని మనసెంత నొచ్చెనో’ అంటూ సుశీల ఆలపించిన జావళి. తొలుత ‘తేలుకుట్టిందోయ్‌ బాబు తేలుకుట్టింది’ అంటూ వైదేహి కంఠంతో ఈ పాట మొదలవుతుంది. రమణారెడ్డి జోక్యంతో ‘తేలు కుట్టిందోయ్‌’కి మంగళంపాడి సభికుల కోరిక మీద ఒక జావళి రూపంలో భోగంమేళపు పాటగా ఇది రూపాంతరం చెందుతుంది. ఈ పాటకు కృష్ణజ్యోతి నృత్యం చేయగా మేళకర్తగా సురభి కమలాబాయి వ్యవహరించటం గొప్ప విషయం. ‘జయ మంగళ గౌరీ దేవీ దయజూడుము చల్లని తల్లీ’ అనే పాట అనునిత్యమూ ప్రతి ఇంటిలో జరిగే పూజాకార్యక్రమంలో మహిళలు పాడుకొనేదే. పీలూ రాగంలో స్వరపరిచిన ఈ పాటను లక్ష్మీరాజ్యం మీద చిత్రీకరించారు. ఈ సినిమాలో ప్రేక్షకుల మదిని దోచుకున్న మరొక పాట ‘చూడాలని ఉంది అమ్మా.. చూడాలని ఉంది’ అనే సుశీల పాడిన గీతం. ఈ పాటను మాస్టర్‌ వెంకటేశ్వర్‌ మీద చిత్రీకరించారు. చిన్నపిల్లలు మాట్లాడుకునే పదాలతోనే ఈ పాటను రచించటం ఆరుద్ర రచనా పటిమకు నిదర్శనం. జలుబు చేసిన కారణంగా సుశీల ఈ పాటను తరువాత పాడుతానంటే ఫరవాలేదంటూ పెండ్యాల అలాగే పాడించి రికార్డు చేశారు. ఆ పాట బాగా పాపులర్‌ అయింది. ఇక చివరిగా ఇ.వి.సరోజ, వేణుగోపాల్‌ నర్తిస్తూ వచ్చే పాట ‘ఓరోరి ఓరిమామ వయ్యారి మేనమామ’ను పిఠాపురం, వైదేహి ఆలపించారు.

మరిన్ని విశేషాలు...
* ‘ముద్దుబిడ’్డ సినిమాలో సీతమ్మ పాత్రకు జి.వరలక్ష్మిని ఎంపిక చేసి ఆమెతో ఎనిమది రీళ్ల సినిమాను తిలక్‌ చిత్రీకరించారు. అప్పట్లో మంచి డిమాండ్‌లో ఉన్న వరలక్ష్మి కొన్ని సంభాషణలను మార్చమని తిలక్‌కు సూచించారు. తిలక్‌కు దర్శక నిర్మాతగా ఇది తొలిచిత్రం కావడంతో వరలక్ష్మి తన సూచన ప్రకారం సంభాషణలు మారుస్తారని భావించింది. కానీ తిలక్‌ పద్ధతే వేరు. జి.వరలక్ష్మికి ఝలక్‌ ఇచ్చి, ఆమెతో తీసిన ఎనిమది రీళ్లను తొలగించి, లక్ష్మిరాజ్యం చేత సీతమ్మ పాత్రను నటింపజేసి సినిమా పూర్తిచేశారు. ఊహించని ఈ పరిణామానికి వరలక్ష్మి విస్తుపోయింది.



* ‘అంతలోనే తెల్లవారే’ అనే జావళికి నృత్యం చేసిన కృష్ణజ్యోతి క్యారక్టర్‌ నటుడు పి.జె.శర్మ భార్య, ప్రముఖ నటుడు సాయికుమార్‌ తల్లి. పూర్వకాలంలో దేవదాసీలు ప్రదర్శించే ఈ నృత్యరీతులను కృష్ణజ్యోతి చేసిన జావళిలో పోలుస్తూ కెనడాకు చెందిన దేవేష్‌ జోనేజి అనే చరిత్రకారుడు ఏకాంగా ఒక పుస్తకాన్నే ముద్రించారు. ఈ పాటను తొలుత రావు బాలసరస్వతి చేత పాడించి రికార్డు చేశారు. కారణాలు తెలియదుగానీ, తరువాత సుశీల చేత పాడించి సినిమాలో చిత్రీకరణ జరిపారు.

* 1952లో భారతలక్ష్మి ప్రొడక్షన్స్‌ వారి ‘ప్రియురాలు’ సినిమాలో జగ్గయ్యను తొలిసారి హీరోగా వెండితెరకు పరిచయం చేసిన ప్రముఖ రచయిత, దర్శకుడు త్రిపురనేని గోపీచంద్‌ జగ్గయ్యను తిలక్‌కు పరిచయం చేశారు. ఆ పరిచయంతోనే జగ్గయ్యను తిలక్‌ ‘ముద్దబిడ్డ’లో హీరోగా తీసుకున్నారు. ఈ సినిమాకి ముందు జగ్గయ్య బి.ఎన్‌.రెడ్డి దర్శకత్వం ‘బంగారుపాప’ పి.పుల్లయ్య దర్శకత్వంలో ‘అర్థాంగి’, కె.వి.రెడ్డి దర్శకత్వంలో ‘దొంగరాముడు’లో సహాయ పాత్రలు పోషించారు. జగ్గయ్య పూర్తిస్థాయి హీరోగా శతదినోత్సవం జరుపుకున్న మొదటి చిత్రం ‘ముద్దుబిడ్డ’.

* 1971లో సీరు దర్యాని హిందీలో ముద్దుబిడ్డ సినిమాని తిలక్‌ దర్శకత్వంలోనే ‘ఛోటీబహు’ పేరుతో పునర్నిర్మించారు. ఇందులో రాజేష్‌ ఖన్నా, షర్మీలా టాగోర్‌ జంటగా నటించగా, నిరూపరాయ్, ఐ.ఎస్‌.జోహార్, జైరాజ్, సత్యేంద్రకపూర్‌ ఇతరపాత్రలు పోషించారు. ఈ చిత్రం బాక్సాఫీస్‌ హిట్‌గా నిలిచింది. షర్మీలాకు ముందు సైరాబానుతో ఒక పాట కూడా చిత్రీకరించారు. అనారోగ్యంతో సైరాబాను తప్పుకోవటంతో ఆ స్థానం షర్మీలా టాగోర్‌కు దక్కింది. 1973లో ‘ముద్దుబిడ’్డ మాతృక బిందూర్‌ ఛలే నవలను బెంగాలీలలో గురు బాగ్చి, 2006లో బంగ్లా భాషలో ఎం.ఆర్‌.గుల్జార్‌ సినిమాలుగా నిర్మించారు.

* ఛోటీబహులో ముద్దుబిడ్డ పాత్రను ప్రముఖ నటి సారిక పోషించింది. హిందీ సినిమా షూటింగు మొత్తం హైదరాబాదు హయత్‌నగర్‌లోని ఎల్‌.వి.ప్రసాద్‌కు చెందిన చిత్రపురి స్టూడియోలో జరిగింది.

* ‘ఎవరు కన్నారెవరు పెంచారు’ అనేది నేపథ్య గీతం. అదే పాటను ఛోటి బహులో ‘కిస్‌ కో కహేగా’ అంటూ ఒక హరిదాసు పాడుతున్న విధంగా చిత్రీకరించారు. ఆ పాత్రను పోషించింది తెలుగు నటుడు వల్లం నరసింహరావు. అలాగే రాజేష్‌ ఖన్నాకు ‘ఏ రాత్‌ హై ప్యాసీ ప్యాసీ’ అనే పాటను పెట్టారు. తెలుగులో జగ్గయ్యకు ఒక్క పాట కూడా లేదు.


- ఆచారం షణ్ముఖాచారి


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.