‘కోడి’ ప్రయోగించని కథలు
వందకు పైగా చిత్రాలు తెరకెక్కించి.. వెండితెరపై సెంచరీ కొట్టిన అతి కొద్దిమంది ప్రముఖ దర్శకుల్లో కోడి రామకృష్ణ ఒకరు. నిత్య సవాళ్ల సాగరంలా కనిపించే చిత్ర సీమలో.. సాహసోపేతమైన ప్రయాణాన్ని సాగిస్తూ, సరికొత్త ప్రయోగాత్మక కథలతో సినీప్రియులను అలరించిన దర్శక మాంత్రికుడాయన. ఇమేజ్‌ చట్రానికి ఇరుసులా మారకుండా వైవిధ్యభరిత చిత్రాలతో తెలుగు తెరకు సరికొత్త సొబగులు సమకూర్చారు. తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే ‘అంకుశం’, ‘శత్రువు’, ‘తలంబ్రాలు’, ‘అమ్మోరు’, ‘దేవుళ్లు’, ‘అరుంధతి’ వంటి అపురూప దృశ్య కావ్యాలెన్నింటినో అందించారు. భావి దర్శకతరానికి ఓ డిక్షనరీగా నిలిచారు. దాసరికి తగ్గ శిష్యుడిగా, మేటి దర్శకుడిగా ఆయన కీర్తి శిఖర స్థాయికి చేరుకున్నా.. సినిమాలపై ఆయనకున్న తపన ఏనాడూ తగ్గలేదు. అంతేకాదు ఆయనకంటూ కొన్ని కలల ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. వాటిని ఎప్పటికైనా పూర్తిచేస్తానని, మరోసారి సినీప్రియులను తన సినిమాలతో అలరిస్తానని ఓ ఇంటర్వ్యూలో ధీమా వ్యక్తం చేశారు కోడి రామకృష్ణ. మరి ఆయన తీయాలనుకున్న ఆ కలల ప్రాజెక్టులు ఏంటంటే..


* కోడి - కోడి పిల్లలు - కోడి పుంజు
‘అమ్మోరు’, ‘దేవీ’, ‘అరుంధతి’ చిత్రాలతో తెలుగు తెరకు సరికొత్త గ్రాఫిక్స్‌ హంగులను పరిచయం చేశారు కోడి రామకృష్ణ. ఈ కోవలోనే పూర్తిస్థాయి సాంకేతిక మాయాజాలాన్ని ఉపయోగించి ‘కోడి.. కోడి పిల్లలు.. కోడి పుంజు’ అనే సినిమా తీయాలనుకున్నారట రామకృష్ణ. ఇది ఆయన కలల ప్రాజెక్ట్‌ అట. దీని కోసం పూర్తిస్థాయిలో కథను కూడా సిద్ధం చేసుకున్నారట ఆయన. కోడి పందాలకు ఓ పుంజును తీసుకెళ్లి పోరుకు దింపగా.. అది వీరమరణం పొందుతుంది. దాని భార్యాపిల్లలు ఆ మరణవార్త విని గుండెలు పగిలేలా రోదిస్తారు. ఆ పుంజు పిల్లల్లోని ఒకటి జనం మీద పగతో వారిపై దాడి చేయడం మొదలుపెడుతుంది. ఇలా ఓ ఎమోషనల్‌ స్టోరీలైన్‌తో ఆ కథను సిద్ధం చేసుకున్నారట. నిజంగా ఈ కథను వెండితెరపై ఆవిష్కరించి ఉంటే మరో ‘ఈగ’లా సంచలన విజయాన్ని అందుకునేది ఏమో.

* మళ్లీ పట్టాలెక్కని ‘విక్రమ సింహా’..
నందమూరి బాలకృష్ణను టాలీవుడ్‌లో స్టార్‌గా నిలబెట్టడంలో కోడి రామకృష్ణ దర్శకత్వ ప్రతిభ ఎంతో ఉంది. ముఖ్యంగా బాలయ్య - రామకృష్ణ - ఎస్‌. గోపాలకృష్ణ కలయికను ‘బాల గోపాల కృష్ణ’ త్రయంగా కీర్తించేవారు. వీరి కలయికలో వచ్చిన ‘మంగమ్మగారి మనవడు’, ‘ముద్దుల మావయ్య’ బాక్సాఫీస్‌ ముందు బ్లాక్‌బస్టర్‌లుగా నిలవగా.. ఈ జోరులోనే హ్యాట్రిక్‌ కొట్టేందుకు ‘విక్రమ సింహా’ పేరుతో మరో సినిమాను మొదలుపెట్టారు. అయితే 50శాతం చిత్రీకరణ పూర్తయిన తర్వాత అనుకోని కారణాల వల్ల సినిమా మధ్యలో ఆగిపోయింది. అయితే దీనికి గల కారణాన్ని కోడి రామకృష్ణ ఎప్పుడూ బయటపెç్టలేదు. ఈ విషయాన్ని ఎప్పుడైనా ప్రస్తావనకు తెచ్చినా ‘‘ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని ఉంది. త్వరలోనే చిత్రీకరణ మొదలుపెడతాం’’ అని చెప్పేవారు.


* ‘కేరాఫ్‌ కంచరపాలెం’ తరహాలో..
దర్శకుడిగా ఎన్నో భారీ బడ్జెట్‌ చిత్రాలను తెరకెక్కించి సత్తా చాటిన కోడి రామకృష్ణ.. అప్పట్లో చిత్రసీమలో ఓ సరికొత్త ప్రయోగానికి నాంది పలకాలని భావించారు. ఓ మారుమూల గ్రామానికి వెళ్లి.. అక్కడివారినే నటీనటులుగా పెట్టుకోని అతి తక్కువ బడ్జెట్‌తో పూర్తి పల్లె వాతావరణంలో ఓ అసామాన్యమైన చిత్రాలని అనుకున్నారు. ఇప్పుడు కుదరకున్నా ఎప్పటికైనా దాన్ని తీసి చూపిస్తానని, అదే తన ఆశయమని తోటివారితో అంటుండేవారట. గతేడాది వెంకటేష్‌ మహా తెరకెక్కించిన సంచలన చిత్రం ‘కేరాఫ్‌ కంచరపాలెం’ ఆయన ఆశయానికి నకలు లాంటిందే.


కేవలం ఇవి మాత్రమే కాదు. ‘భారత్‌ బంద్‌’ తరహాలో ‘ప్రపంచ బంద్‌’, ‘ సత్యసాయిబాబా జీవితాధారంగా ఓ బయోపిక్, ‘అంకుల్‌ ఆంజనేయ స్వామి’, ‘స్వర్గంలో పాలిటిక్స్‌’.. ఇలా పలు సినిమాలను తెరకెక్కించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కోడి రామకృష్ణ. కానీ, ఈ కోరికలు తీరుకుండానే సినీ ప్రియులను శోక సంద్రంలో ముంచి దివికేగారు కోడి రామకృష్ణ.

- మందలపర్తి రాజేశ్‌ శర్మ


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.