సెంటిమెంట్‌ ప్రాణంతో సమానం

కోడి రామకృష్ణకు సెంటిమెంట్లు ఎక్కువ. చేతికి రంగుల తాళ్లు, నుదురున కట్టుకున్న తెల్లని వస్త్రం, బొట్టు, ఉంగరాలూ.. ఈ అలంకరణ కోడి రామకృష్ణను ప్రత్యేకంగా మార్చేశాయి. సెంటిమెంట్లకు నిలువుటద్దంలా ఉంటారాయన. వాటి వెనుక నమ్మకం కంటే, ఆత్మీయతే ఎక్కువగా కనిపిస్తుంది. నుదుటన కట్టుకునే బ్యాండ్‌ వెనుక ఓ కథ ఉంది. ‘మా పల్లెలో గోపాలుడు’ షూటింగ్‌ మద్రాస్‌ బీచ్‌లో జరుగుతోంది. ఎండలు మండిపోతున్న కాలం అది. అంతటి ఎర్రటి ఎండలో గొడుగు లేకుండా చెమటలు కక్కేస్తున్న కోడిరామకృష్ణ దగ్గరకు పరుగు పరుగున వచ్చాడు కాస్ట్యూమర్‌ మోకా రామారావు. ‘సార్‌.. మీ నుదురు చాలా పెద్దది. ఎండ ప్రభావం ఎక్కువగా పడుతోంది’ అంటూ అప్పటికప్పుడు జేబు రుమాలు తీసి నుదుటన కట్టారు. ఆ రోజు షూటింగ్‌ ముగిసింది. మరుసటి రోజు మోకా రామారావు మళ్లీ వచ్చారు. ‘సార్‌.. ఇది వరకు చాలా మంది ఇలా జేబు రుమాళ్లు నుదుటున కట్టుకున్నారు. కానీ ఎవ్వరికీ ఇంత బాగా సూట్‌ అవ్వలేదు. చూస్తుంటే.. ఇది పూర్వ జన్మ బంధంలా ఉంది’ అంటూ కోడి రామకృష్ణకు టర్కీటవల్‌తో మరోసారి బ్యాండ్‌ తయారు చేసి ఇచ్చారు. అప్పటి నుంచీ కోడి రామకృష్ణకు అది ఆభరణంగా మారిపోయింది. ఓసారి బాలచందర్‌ కోడి రామకృష్ణ సెట్‌కి వచ్చారు. అప్పుడు ఓ సీతాకోక చిలుక కోడిరామకృష్ణ కట్టుకున్న బ్యాండ్‌మీద వాలిందట. ‘‘చూడవయ్యా.. ఎంత అందంగా ఉందో.. ఇది పూర్వజన్మ బంధం’’ అనేసరికి ఆ సెంటిమెంట్‌ మరింత బలపడిపోయింది. ఇక ఆయన చేతులకు కట్టుకునే తాళ్లు స్నేహితులు ఆత్మీయతతో తెచ్చినవి. ‘ఇది కట్టుకోవాల్సిందే’ అని వారు పట్టుపడితే కాదనలేకపోయేవారు.నారింజ పండుతో చిరంజీవి సవాల్‌!
దర్శకుడిగా కోడి రామకృష్ణ తొలి సినిమా ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రీకరణ సమయంలో ఓ చిత్రం చోటు చేసుకుంది. అంతర్వేదిలో ఒక పాటను తీశాక చిత్రబృందం అంతా లాంచీలో మొగల్తూరు వెళుతున్నారు. లాంచీ టాప్‌ మీద కోడి రామకృష్ణ ఉంటే, కింద పడవలో చిరంజీవి ఉన్నారు. ప్రయాణం మధ్యలో చిరంజీవి సరదాగా ఓ నారింజపండు తీసుకుని పైనున్న కోడి రామకృష్ణని పిలిచి, ‘రామకృష్ణా! ఈ నారింజను పైకి విసురుతాను. దీన్ని నువ్వు నోటితో పట్టుకోవాలి. పట్టుకుంటే... ఈ సినిమా సూపర్‌ హిట్‌. సరేనా?’ అని సవాలు విసిరారు. కోడి రామకృష్ణలో టెన్షన్‌. అసలే తొలి సినిమా అని గాభరా పడుతుంటే, మధ్యలో ఈ సవాలేంటని భయం. ఇంతలో చిరంజీవి నారింజను విసిరేశారు. కోడి రామకృష్ణ చటుక్కున ముందుకు వంగి ప్రయత్నించారు. సరిగ్గా... ఆ నారింజ కోడి రామకృష్ణ నోట్లోకే వచ్చింది! అందరూ చప్పట్లు కొట్టారు. ఆ సినిమా నిజంగానే సూపర్‌హిట్టయింది. సంవత్సరం పాటు ఆడింది!సంబంధిత వ్యాసాలు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.