‘కొండవీటి దొంగ’కు 30 ఏళ్లు

కొండవీడులో తెల్లని గుర్రం మీద

నల్లని బట్టలు వేసుకుని

మెడలో ఎర్రని రుమాలు కట్టుకుని

చేతిలో కొరడా పట్టుకుని...


ఓ దొంగ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ దేవుడిలా ప్రత్యక్షమై పేదవాడిని కాపాడేవాడు. ఇది కథ బాబు.. కొండవీటి దొంగ నిజంగా లేడు అని కైకాల సత్యనారాయణ చెప్పగా.. ‘ఉన్నాడు! నిద్రపోతున్న జాతిని జాగృతి చేసేందుకు నేను కొండవీటి దొంగనవుతాన’ని చిరంజీవి చెప్పి నేటికి 30 ఏళ్లు పూర్తయింది. ‘కొండవీటి దొంగ’ చిత్రంలోని సంభాషణ ఇది. 1990 మార్చి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం. ఈ సందర్భంగా...

*కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది. కొండవీడు అనే గ్రామం నేపథ్యంలో సాగుతుంది. రాజా(చిరంజీవి) తండ్రిని హత్యచేసిన కొందరు వ్యక్తులు ఆ నేరాన్ని రాజా తల్లిపై మోపుతారు. దాంతో ఆమె జైలుకు వెళ్తుంది. ఒంటరైన రాజాను ఈ గూడెం ప్రజలు చేరదీస్తారు. చదువుకునేందుకు పట్నం వెళ్లిన రాజా చాలా కాలం తర్వాత వస్తాడు. అప్పటికీ ఈ గ్రామంలో పరిస్థితులు మారవు. అన్యాయాన్ని ఎదురించాలనే సంకల్పంతో ఉంటాడు. అలా ధనవంతుల సొమ్మును పేదలకు పంచే ఓ దొంగ కథే ‘కొండవీటి దొంగ’. చిరు సరసన రాధ, విజయశాంతి తమ అందం, అభినయంతో కనువిందు చేశారు. రావు గోపాల రావు, మోహన్‌ బాబు, అమ్రిష్‌ పురి ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఇళయరాజా సంగీతం ఓ ఊపు ఊపింది. ముఖ్యంగా ‘శుభలేఖ రాసుకున్న’, ‘చమకు చమకు’, ‘కోలో కోలమ్మ’, ‘జీవితమే ఓ ఆట సాహసమే పూబాట’ శ్రోతల్ని విపరీతంగా అలరించాయి. పరుచూరి సోదరులు కథ, యండమూరి వీరేంద్రనాథ్‌ స్క్రీన్‌ప్లే అందించారు.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.