విలువ‌లే ప్రాణంగా...
సృజ‌న‌లో ఆకాశ‌మే హ‌ద్దు. విలువ‌లంటే ప్రాణం. చెబితే మంచే చెప్పాల‌ని... తీసే ప్ర‌తి సినిమా స‌మాజానికి ఏదో ర‌కంగా మేలు చేసేలా ఉండాల‌ని త‌పించే ద‌ర్శ‌కుడు కృష్ణవంశీ. తొలి చిత్రం `గులాబి`తోనే ప్రేక్ష‌కుల్ని అల‌రించాడు. ప‌రిశ్ర‌మ‌ని విశేషంగా ఆక‌ట్టుకున్నాడు. తెలుగు సినిమా పరిశ్రమలో మ‌రొక గొప్ప సృజ‌నాత్మ‌క ద‌ర్శ‌కుడిగా ఆయ‌న కీర్తి సంపాదించారు. రామ్ గోపాల్ వర్మ వద్ద శిష్యరికం చేయక మునుపు, కొన్నాళ్ళపాటు త్రిపురనేని వరప్రసాద్ అనే దర్శకుడి దగ్గర సహాయకుడిగా ఉన్నాడు. వర్మ వద్ద చేరిన తరువాత కొన్నాళ్ళకు అనగనగా ఒక రోజు చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం లభించినా బడ్జెట్ పరిధి దాటిపోతుండడంతో అతడిని ఆ బాధ్యత నుండి తప్పించారు. కానీ ఆయన ప్రతిభను గమనించిన వర్మ `గులాబి` అనే చిత్రంతో మరో అవకాశం ఇచ్చాడు. ఆ చిత్రం ఘ‌న విజ‌యం సాధించ‌డంతో అంద‌రూ కృష్ణ‌వంశీ గురించి మాట్లాడుకొన్నారు. అందులో పాట‌ల చిత్రీక‌ర‌ణ‌ని మెచ్చి అక్కినేని నాగార్జున `నిన్నే పెళ్లాడ‌తా` తీసే అవ‌కాశం ఇచ్చారు. అది కూడా ఘ‌న విజ‌యం సాధించ‌డంతో కృష్ణవంశీ స్టార్ ద‌ర్శ‌కుడిగా ఎదిగాడు. ఆ త‌ర్వాత నక్సల్ సమస్యను అద్భుతమైన భావోద్వేగాలతో రంగరించి చిత్రీకరంచిన సింధూరం విమర్శకుల ప్రశంసలు పొందినా, ఆ చిత్రానికి నిర్మాత కూడా ఆయ‌నే కావ‌డంతో ఆర్థికంగా న‌ష్టాల్ని చ‌విచూడాల్సి వ‌చ్చింది. నిన్నే పెళ్లాడ‌తా త‌ర్వాత నాగార్జున‌తో తీసిన `చంద్రలేఖ‌` ప‌రాజ‌యాన్ని చ‌విచూసినా అంతఃపురం, స‌ముద్రం, మురారి, ఖ‌డ్గం, చిత్రాల‌తో విజ‌యాల్ని అందుకొన్నాడు. హిందీలో త‌న `అంతఃపురం` చిత్రానికి రీమేక్‌గా `శ‌క్తి ` అనే చిత్రం తీశారు. శ్రీఆంజ‌నేయం, చ‌క్రం, డేంజ‌ర్‌, రాఖి చిత్రాలు ఆర్థికంగా ఆశించిన ఫ‌లితాల్ని సాధించ‌క‌పోయినా వాటిలో కృష్ణ‌వంశీ సృజ‌నాత్మ‌క‌త‌, విలువ‌లు, సాంకేతిక‌త ప్రేక్ష‌కుల్ని హ‌త్తుకొన్నాయి. చంద‌మామ‌తో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చినా ఆ త‌ర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో ఆయ‌న్నుంచి సినిమాలు రాలేక‌పోయాయి. రామ్‌చ‌ర‌ణ్‌తో తెర‌కెక్కించిన గోవిందుడు అంద‌రివాడేలే ఫ‌ర్వాలేద‌నిపించిందంతే. మ‌రో హిట్టు కోసం త‌పిస్తున్న కృష్ణ‌వంశీ 1962 జులై 27లో తాడేప‌ల్లిగూడెంలో జ‌న్మించారు. 2003లో క‌థానాయిక ర‌మ్య‌కృష్ణ‌ని వివాహం చేసుకొన్నారు. ఈ దంప‌తుల‌కి రిత్విక్ వంశీ అనే ఓ అబ్బాయి ఉన్నారు. కృష్ణ‌వంశీ అస‌లు పేరు ప‌సుపులేటి వెంక‌ట‌బంగార్రాజు. ఆయ‌న చ‌దివిన పుస్త‌కాల ప్ర‌భావంతో త‌న పేరును వంశీకృష్ణ‌గా మార్చుకున్నారు. అయితే రామ్‌గోపాల్ వ‌ర్మ ద‌గ్గ‌ర శిష్య‌రికం చేస్తున్న‌ప్పుడు ఆయ‌న స‌ల‌హాతో వంశీ కృష్ణ అనే పేరును కృష్ణ‌వంశీగా మార్చుకున్నారు. ఈ రోజు కృష్ణ‌వంశీ పుట్టిన‌రోజు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.