తల్లడిల్లిన పిల్లల విజయం... లేతమనసులు

పెద్దవాళ్లు పిల్లలకు కథలు చెప్పడం సహజం. కానీ పిల్లలే పెద్దలకు గుణపాఠం చెప్పడం ఎ.వి.ఎం.సంస్థ సమర్పించిన వీరప్పస్‌ కంపెనీ వారి లేత మనసులు సినిమాలోని విశేషం. పిల్లలు తమలో తాము పోట్లాడుకున్నా, వెంటనే మాటా మాటా కలుపుకొని కలిసిపోతారు. అయితే పెద్దవాళ్ల తగాదాలు మాత్రం విరుద్ధం. తేడా వస్తే తిరిగి కలవలేరు. అలా విడిపోయిన అమ్మానాన్నల్ని ఇద్దరు చిన్నారి కవలలు ఒకటిగా కూడబలుక్కొని, ఒక పథకం ప్రకారం ఎలా కలిపారనేదే ‘లేత మనసులు’ సినిమా నేపథ్యం. సరిగ్గా 54 ఏళ్ల క్రితం 1966, సెప్టెంబరు 16న విడుదలై విజయం సాధించిన ‘లేతమనసులు’ విశేషాలు కొన్ని తెలుసుకుందాం... 


* తెర వెనుక కథ

1961లో వాల్ట్‌ డిస్నీ వారు ‘ది పేరెంట్‌ ట్రాప్‌’ అనే టెక్నికలర్‌ సినిమా నిర్మించారు. డేవిడ్‌ స్విఫ్ట్‌ దర్శకత్వం నిర్వహించిన ఈ సినిమాకు ఎరిచ్‌ క్యాస్టనర్‌ రచించిన ‘లొట్టీ అండ్‌ లిసా’ అనే జర్మన్‌ నవల ఆధారం. ఈ సినిమాలో ఇద్దరు బాలికలు, తల్లిదండ్రులు విడాకుల కారణంగా పుట్టినప్పుడే విడిపోయి ఒక సమ్మర్‌ క్యాంప్‌లో కలుసుకొని వారిద్దరినీ కలుపుతారు. ప్రఖ్యాత బ్రిటిష్‌ నటి హేలీమిల్స్‌ తనకు 15 ఏళ్ల వయసుండగా ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేసింది. ప్రముఖ హాలీవుడ్‌ నటుడు మౌరీన్‌ ఓహరా, బ్రియాన్‌ కీత్‌ ఆ బాలిక తల్లిదండ్రులుగా నటించారు. ఎ.వి.ఎం. స్టూడియో అధినేత, నిర్మాత మెయ్యప్ప చెట్టియార్‌ ఈ సినిమా చూసి ప్రభావితుడై తమిళంలో అలాంటి సినిమా తీయాలని సంకల్పించారు. ప్రముఖ నటుడు, రచయిత జావేర్‌ సీతారం ‘ది పేరెంట్‌ ట్రాప్‌’తో బాటు 1953లో వచ్చిన ‘ట్వైస్‌ అపాన్‌ ఎ టైమ్‌’ అనే కామెడీ సినిమా లోని కొన్ని సన్నివేశాలను జోడించి కథను అల్లితే, దానిని ‘కుళందైయుం దైవముం’ పేరుతో సినిమాగా నిర్మించారు. ఎ.వి.ఎం సంస్థకు ఆస్థాన దర్శకులైన కృష్ణన్‌-పంజు ఆధ్వర్యంలో నిర్మించిన ఈ చిత్రం 1965, నవంబర్‌ 19న విడుదలైంది. ఇందులో జయశంకర్, జమున, ఎస్‌.వరలక్ష్మి, మేజర్‌ సుందరరాజన్, కుట్టి పద్మిని, వి.ఆర్‌.తిలకం, నాగేష్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ‘కళందైయుం దైవముం’ సినిమా తమిళంలో అఖండ విజయం సాధించడమే కాకుండా, ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం అందుకుంది. ఇదే సినిమాను ‘లేతమనసులు’ పేరుతో ఎ.వి.ఎం. సంస్థ కృష్ణన్‌- పంజు దర్శకత్వంలోనే తెలుగులో పునర్నిర్మించింది.

* లేత మనసుల కథ

సినిమా పేరులోనే కథ ఇమిడి ఉంది. ఇది రెండు లేత మనసుల కథ. మద్రాసులోని కనకదుర్గా ట్రాన్స్‌పోర్టు కంపెనీ యజమాని శంభులింగం (రేలంగి), ఇంటి పెత్తనమంతా అతని భార్య కనకదుర్గ (జి.వరలక్ష్మి)దే. శంభులింగం కనకదుర్గ మాటకు ఎదురు చెప్పలేని బలహీనుడు. ఈ దంపతుల కుమార్తె సత్యభామ (జమున) కాలేజీలో చదువుకుంటూ తోటి విద్యార్థి చంద్రశేఖర్‌ (హరనాథ్‌)ను ప్రేమిస్తుంది. చంద్రశేఖర్‌ తాత రావుబహద్దూర్‌ రంగనాయకుల సాయంతో వ్యాపారంలో రాణించి ధనవంతుడైన శంభులింగం అతని మీద ఉన్న గౌరవంతో చంద్రశేఖర్‌ చదువుకు సాయపడతాడు. ఆ విషయం చంద్రశేఖర్‌కు తరువాత తెలుస్తుంది. వీరిద్దరి ప్రేమ, పెళ్లికి దారితీస్తుంది. చంద్రశేఖర్‌ పేదవాడనే చిన్న చూపుతో కనకదుర్గ అతణ్ణి ఆఫీసు మేనేజరుగా నియమిస్తుంది. సత్యభామ కవల పిల్లలకు జన్మనిస్తుంది. ఒకరు లలిత (కుట్టి పద్మిని), మరొకరు పద్మిని (కుట్టిపద్మిని). లల్లీ, పప్పీగా పిలువబడే ఈ కవలలు రూపంలో ఒకేలా ఉంటారు. శంభులింగం కంపెనీ రజతోత్సవాలలో చంద్రశేఖర్‌కు అవమానం జరుగుతుంది. అవమాన భారం భరించలేని చంద్రశేఖర్‌ భార్య, పిల్లలతో కలిసి ఇల్లు వదిలి వెళ్లేందుకు ప్రతిపాదిస్తే, తల్లి అడ్డుపడుతుంది. కినుక వహించిన చంద్రశేఖర్‌ చిన్న కూతురు పప్పీని వెంటబెట్టుకుని రంగూన్‌ వెళ్లిపోతాడు. అక్కడ వ్యాపారంలో లక్షలు గడించి, ఏడేళ్ల తరవాత మద్రాసులో అడుగుపెడతాడు. భర్త జాడ తెలియని సత్యభామ దిగులుతో ఉంటుంది. పప్పీ, లల్లీ చదివే స్కూలులో చేరుతుంది. ఒక పిక్నిక్‌ సందర్భంగా ఇద్దరూ కవలపిల్లలని తెలుసుకొని, ఒకరి స్థానంలో మరొకరు వెళ్తారు. నిర్మల (గీతాంజలి) చంద్రశేఖర్‌ ఇంట్లో పప్పీకి టీచరుగా చేరుతుంది. పిల్లల ద్వారా భర్త ఆచూకీ తెలుసుకొని చంద్రశేఖర్‌ వద్దకు వస్తుంది. ఆగ్రహంతో చంద్రశేఖర్‌ ఆమెను తిరస్కరిస్తాడు. సత్యభామ పిల్లల్ని తీసుకొని తిరుపతి వెళుతుంది. ఇది పసికట్టిన జలజమ్మ పిల్లల్ని వదిలించుకునేందుకు వారిని చంపించాలని కుట్రపన్ని జగ్గు (జగ్గారావు) అనే రౌడీని నియమిస్తుంది. ఈ కుట్ర తెలుసుకున్న చంద్రశేఖర్‌ తిరుపతి పయనమౌతాడు. లల్లీ, పప్పీ కొండ ఎక్కుతుండగా వారిని చంపబోయిన జగ్గును పాము కాటువేస్తుంది. తల్లిదండ్రులిద్దరూ కలిసి ఉంటామని పిల్లలకు ప్రమాణం చేసి మాట ఇవ్వడంతో పిల్లలిద్దరూ కొండదిగివచ్చి తల్లిదండ్రులను కలుపుతారు. ‘ఏడు కొండలపైనుండి ఎల్ల జనుల సంకటములను బాపు శ్రీ వెంకటేశ... మరల మా తల్లిదండ్రుల మాకొసంగి ఇల్లు నిలబెట్టినావు మా చల్లనయ్యా’ అంటూ సినిమాకు శుభం కార్డు పడుతుంది. ఇందులో పద్మనాభం హరనాథ్‌ స్నేహితుడిగా నటించగా, ఇతర పాత్రల్లో డా।। రమేష్, వహాబ్‌ కాశ్మీరి, మణిమాల, సునీత, మంజుల నటించారు.


* ఎమ్మెస్వీ మధుర సంగీతం

టి.కె.రామ్మూర్తి నుంచి విడిపోయాక ఎం.ఎస్‌.విశ్వనాథం స్వతంత్రంగా సంగీత దర్శకత్వం నిర్వహించిన తొలితరం సినిమాల్లో ‘కుళందైయుం దైవముం’ ప్రధమ స్థానం ఆక్రమిస్తుంది. తమిళ మాతృక అఖండ విజయానికి అందులో సంగీతమే ప్రధాన పాత్ర స్థానం ఆక్రమిస్తుంది. తమిళ మాతృక అఖండ విజయానికి అందులో సంగీతమే ప్రధాన పాత్ర వహించిందని ‘ఆనంద వికటన్‌’ పత్రిక సహా అనేక ప్రముఖ పత్రికలు ప్రశంసించాయి. తమిళంలో కణ్ణదాసన్, వాలి పాటలు రాయగా తెలుగులో దాశరథి, ఆరుద్ర పాటలు రాశారు. ‘లేత మనసులు’ చిత్రంలో ఎం.ఎస్‌. విశ్వనాథంకు ఆర్‌.గోవర్ధనం, హెన్రీ డేనియల్‌ సహకరించారు. దాశరథి రచించిన ‘హల్లో మేడం సత్యభామా.. పైన కోపం లోన ప్రేమ’ అనే టీజింగ్‌ సాంగ్‌ను పి.బి.శ్రీనివాస్, పిఠాపురం ఆలపించగా ఈ పాటకు తమిళంలో సౌందర్‌రాజన్, రాఘవన్‌ పాడిన ‘ఎన్నవేగం నిల్లు బామా, ఎన్నకోబం సొల్లలమా’ అనుకరణే. శ్రీనివాస్, సుశీల ఆలిపించిన హిట్‌ సాంగ్‌ ‘అందాల ఓ చిలకా అందుకో నా లేఖా’ పాట, తమిళంలో ‘అన్బూళ్ళమాన్‌ విళియే ఆశైయిల్‌ పూర్‌ కడిత్తం’కు అనుకరణ. ఈ పాట హీరో ఒక కాగితం మీద తన పక్కనే ఉన్న హీరోయిన్‌కు ఉత్తరం రాయడంతో మొదలవుతుంది. తమిళంలో ఈ పాటను సౌందర్‌రాజన్, సుశీల ఆలపించారు. ఇదే పాట రెండవ సారి విషాద గీతంగా వస్తుంది. ‘నాన్‌ నండ్రి సోల్వెయిన్, ఎన్‌ కన్గళుక్కు’ హనీమూన్‌ పాటను తెలుగులో ‘ఈ పువ్వులలో ఒక చల్లదనం, నీ నవ్వులలో ఒక వెచ్చదనం’గా శ్రీనివాస్, సుశీల పాడగా జమున, హరనాథ్‌ మీద బృందావన గార్డెన్స్, మైసూరులో చిత్రీకరించారు. తమిళ పాటలో సుశీలతో గళం కలిపింది ఎం.ఎస్‌.విశ్వనాథం కావడం విశేషం. తమిళ మాతృకలోని ‘పళముదిర్‌ సోలైయిలే తోళి పార్థత్తవణ్‌ వందానడి’ అనే సంప్రదాయ కీర్తన స్థానంలో క్షేత్రయ్య పదం ‘మక్కువ దీర్చరా మువ్వగోపాలా’ పెట్టారు. సుశీల ఆలపించిన ఈ గీతాన్ని గీతాంజలి మీద చిత్రీకరించారు. ఖవ్వాలి పాటలు రాయడంలో దాశరథి దిట్ట. అలాంటి ఒక పాట ‘అందాల ఈ రేయి నీదోయి నీదోయి, పోనిస్తే మళ్లీమళ్లీ రాదోయి రాదోయి’ను గీతాంజలి, హరనాథ్‌పై చిత్రీకరించారు. ఈ సినిమా మొత్తానికి హైలైట్‌ అయిన పాట కుట్టి పద్మినిపై చిత్రీకరించిన ‘కోడి ఒక కోనలో, పుంజు ఒక కోనలో పిల్లలేమో తల్లడిల్లు ప్రేమలేని కానలో’ను ఆరుద్ర రాయగా సుశీల ఆలపించారు. తమిళంలో ‘కోళి ఒరు కూట్టిలే సాయెవల్‌ ఒరు కూట్టిలే’గా వచ్చే ఈ పాటను ఎం.ఎస్‌.రాజేశ్వరి పాడారు. ఈసినిమాలో ఈ పాట విషాద గీతంగా కూడా వినిపిస్తుంది.


]

మరిన్ని ఆసక్తికర సంగతులు

* తమిళంలో విజయవంతమైన ‘కుళందైయుం దైవముం’ సినిమాను మరుసటి సంవత్సరం ఏవీయం వారే తెలుగులో ‘లేతమనసులు’గా పునర్నిర్మించి విజయం సాధించారు. 1967లో ఇదే సినిమాను హిందీలో ‘దో కలియా’గా నిర్మిస్తే అది సిల్వర్‌ జూబిలీ చేసుకుంది. ఇందులో బిశ్వజిత్, మాలసిన్హా జంటగా నటించారు. తర్వాత మలయాళంలో ‘సేతుబంధనం’గా, కన్నడంలో ‘మక్కల్‌ భాగ్య’గా పునర్నిర్మించారు. అని దక్షిణాది భాషల్లో నిర్మితమైన సినిమాగా ‘లేతమనసులు’ రికార్డులకెక్కింది. అంతేకాదు, కుటుంబ నేపథ్యంలో సాగిన అన్ని భాషల్లోనూ విజయం సాధించడం కూడా విశేషమే.

* తొలుత ‘దో కలియా’ సినిమాలో కూడా కుట్టి పద్మినినే నటింపచేద్దామని మెయ్యప్పన్‌ చెట్టియార్‌ భావించినా, మాటల రచయిత పండిట్‌ ముఖ్రమ్‌ శర్మ, పద్మిని వయసులో కాస్త పెద్దదిగా ఉందని, ఆ పాత్ర కోసం బేబీ సోనియాను ప్రతిపాదించారు. బేబీ సోనియా అసలు పేరు నీతూసింగ్‌. పెద్దయ్యాక నీతూసింగ్‌ హిందీలో విజయవంతమైన హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. రాజ్‌కపూర్‌ చిన్న కుమారుడు రిషికపూర్‌ను పెళ్లాడి సినిమా నటకు స్వస్తి చెప్పింది. నీతూసింగ్‌ కుమారుడే ఈ నాటి యువకథానాయకుడు రణ్‌బీర్‌కపూర్‌.

* ఎన్‌.ఎస్‌.కృష్ణన్‌ భార్య టి.ఎ.మధురం తమిళ మాతృకలో వ్యాంప్‌ పాత్రను పోషించటం విశేషం. కృష్ణన్‌ మరణాంతరం ఆమె నటించిన అతి కొద్ది సినిమాలలో ‘కుళందైయుం దైవముం’ ఒకటి. ఇదే పాత్రను తెలుగులో గీతాంజలి పోషించింది.

- ఆచారం షణ్ముఖాచారిCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.