తెలంగాణ ప్రజలకి ఓ సంబరం ‘మాభూమి’

ఇక తెలుగు చిత్ర పరిశ్రమ మారదా? ఎప్పుడూ అవే కథలు, అవే సినిమాలేనా? ఇలాంటి మాటలు ఇప్పుడే కాదు, 1979-80 కాలంలోనూ వినిపించేవి. మూస సినిమాల్ని చూడలేకపోతున్నాం బాబోయ్‌..అంటూ అప్పుడు కూడా ప్రేక్షకులు పెదవి విరిచేవారు. తెరపైకొచ్చే దాదాపు సినిమాలు వ్యాపార కోణంలోనే సాగిపోయేవి మరి! సమస్యలు, సామాజిక ప్రయోజనాలతో సినిమాలంటే డాక్యుమెంటరీల కింద లెక్కగట్టే పరిస్థితులు. సరిగ్గా అదే సమయంలో ఇద్దరు యువకులు ఒక విభిన్నమైన సినిమా తీయాలని సంకల్పించారు. ఆ చిత్రం నిజ జీవితాలకి అద్దం పట్టేలా ఉండాలని కంకణం కట్టుకున్నారు. వ్యాపారం, లాభాలు ఇవేవి ఆలోచించలేదు. సినిమా కోసం చరిత్ర తిరిగేశారు. పరిశోధనలు జరిపారు. నిజాం కాలంలో తెలంగాణ ప్రజలు పడిన కష్టాల్ని... రజాకార్లు, జమీందార్ల ఆగడాలకు వ్యతిరేకంగా జరిపిన సాయుధ పోరాటాన్ని తమ భూమి కోసం భుక్తి కోసం చేసిన త్యాగాల్ని.. అత్యంత సహజంగా తెరపైకి తీసుకొచ్చేందుకు నడుం బిగించారు. సుదీర్ఘమైన ఆ పోరాటాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు.. ఒక రకంగా ఆ యువకులు కూడా పోరాటమే చేశారు. రెండేళ్లపాటు ఎన్నో కష్టాల్ని అధిగమించి సినిమాని పూర్తి చేశారు. విజయవంతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అంతే - మన పోరాటాన్ని, ఆరాటాన్ని చూపించారట అంటూ సామాన్య జనం బండ్లు కట్టుకొని మరీ వెళ్లి ఆ సినిమా చూశారు. అలా ఆ సినిమా ఓ సంచలనం సృష్టించింది! అదే చైతన్య చిత్ర ఇంటర్నేషనల్‌ పతాకంపై బి.నరసింగరావు, జి.రవీంద్రనాథ్‌ కలిసి నిర్మించిన ‘మాభూమి’. గౌతమ్‌ ఘోష్‌ దర్శకత్వం వహించారు. సాయిచంద్, కాకరాల తదితరులు నటించారు. ‘చిల్లరదేవుళ్లు’ తరువాత తెలంగాణ యాసతో రూపుదిద్దుకొన్న మరో చిత్రమిది. ఎదురు తిరిగితే ఏముంది? తరతరాల దౌర్జన్యం మట్టికరుస్తుంది! అంటూ సాగిన తెలంగాణ సాయుధ పొరాటాన్ని కళ్లకు కట్టింది. ఎన్నో ప్రత్యేకతలున్న ‘మాభూమి’ 1980 మార్చి 23న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అంటే సరిగ్గా నలభై సంవత్సరాల కిత్రమన్నమాట. ఈ సందర్భరంగా ‘మాభూమి’ చిత్ర ప్రయాణం గురించి నిర్మాతల్లో ఒకరైన నరసింగరావు ‘సితార.నెట్‌’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విషయాలు మీ కోసం...
సుదీర్ఘ పోరాటం...

‘‘1934 నుంచి 1951 వరకు తెలంగాణలో భూమి కోసం సాగిన సుదీర్ఘ పోరాటాన్ని కళ్లకు కట్టే ప్రయత్నం చేశాం. నిజాం కాలంలో జమీందార్లు, రజకార్ల ఆగడాలు ఎలా ఉండేవో, వారి కింద సామాన్య జనం ఎలా నగిలిపోయేవారో ఇందులో చూపించాం. ఇంత పెద్ద కాన్వాస్‌తో సినిమా తీయడం మామూలు విషయం కాదు. అదీ పెద్దగా అనుభవం లేని మేం చేస్తున్నామంటే అందరూ రకరకాలుగా సందేహాలు వ్యక్తం చేశారు. అప్పట్లో మాపైన, మా సినిమాపైన ఎవరికీ అంచనాలు లేవు. ఏదో ప్రయోగం చేస్తున్నారని అంతా మాట్లాడుకొనేవాళ్లే. నిజానికి సినిమా 1980లో విడుదలైనా.. దాని కోసం మా ప్రయాణం 1977లోనే మొదలైంది. రెండేళ్లపాటు కష్టపడి ఈ సినిమాని తీశాం. రెండున్నర లక్షల రూపాయలతో పూర్తవుతుందనుకొన్న సినిమాకి 5 లక్షల 30 వేల వరకు వ్యయమైంది. ‘మాభూమి’ సినిమా కోసం మేం కూడా ఓ పోరాటమే చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం. తెలంగాణ ప్రజలతో అప్పట్లో సంబురాలు చేయించింది ఈ చిత్రం. హైదరాబాద్‌కి ప్రత్యేకంగా బస్సులు మాట్లాడుకుని వచ్చి సినిమా చూసి వెళ్లిపోయేవాళ్లు. ఇతర పట్టణాలకి బండ్లు కట్టుకొని మరీ వెళ్లి సినిమా చూశారు’’.


కిషన్‌ చందర్‌ నవల స్ఫూర్తితో..

‘‘1970లోనే నాకు జి.రవీంద్రనాథ్‌ అనే ఓ స్నేహితుడు పరిచయమయ్యాడు. వృత్తిరీత్యా అతనొక ఇంజనీర్‌. అభ్యుదయ భావాలు ఉన్న వ్యక్తి. ఆ తరువాత మళ్లీ మేమిద్దరం పెద్దగా కలుసుకొన్నది లేదు. 1977లో అనుకోకుండా తారసపడ్డాడు. ఆ సంగతులూ ఈ సంగతులూ మాట్లాడుకొన్నాక.. ఏం చేస్తున్నావు అని అడిగాడు. నిజానికి అప్పుడు ఏం చెయ్యాలో, ఎటువైపు వెళ్లాలో తెలియక సందిగ్ధంలో ఉన్నా. అదే విషయాన్ని చెప్పాను. తను అప్పటికే హిందీలో మృణాల్‌ సేన్‌ దర్శకత్వం వహించిన ‘మృగయా’ అనే చిత్ర నిర్మాణంలో ఓ భాగస్వామి. తెలుగులో కూడా మృణాల్‌సేన్‌తో ‘ఒక ఊరికథ’ నిర్మిస్తున్నాడు. మనం కలిసి సినిమా నిర్మాణం చేపడదాం అని చెప్పాడు. తరువాత మద్రాస్‌కి తీసుకెళ్లి అక్కడ ఉన్న మృణాల్‌ సేన్‌కి పరిచయం చేశాడు. ఆయనతో కలిసి రెండు రోజులు అక్కడే ఉన్నాం. మా ఇద్దరికీ మీరో సినిమా తీసి పెట్టాలి అని అడిగాం. బడ్జెట్‌ ఎంత పెడతారని ఆయన అడిగారు. నేను తక్కువ మొత్తం చెప్పాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను అంత బడ్జెట్‌తో సినిమా తీయలేనని చెబుతూనే, ‘గౌతమ్‌ ఘోష్‌ అనే యువకుడు ఉన్నాడు, వెళ్లి అతన్ని కలవ’మని సూచించారు. దీంతో కలకత్తాకి వెళ్లి గౌతమ్‌ ఘోష్‌ని కలిశాం. ఆయన మాతో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఆ వెంటనే కథని అన్వేషించడం మొదలుపెట్టాం. అప్పటికే ఉర్దూలో కిషన్‌ చందర్‌ రాసిన ‘జబ్‌ ఖేద్‌ జాగే’ అనే నవల విశేష ప్రాచుర్యం పొందింది. అది తెలుగులో ‘జైత్రయాత్ర’ పేరుతో అనువాదమైంది. ఆ నవలని చూసి స్నేహితుడు రవీంద్రనాథ్‌తో చెప్పా. ఆయన కూడా బాగుందనడంతో వెళ్లి గౌతమ్‌ ఘోష్‌ని కలిశాం. అప్పటికే ఆయన కూడా ఆ నవలని చదవడంతో పాటు, స్క్రిప్టుగా తీర్చిదిద్దే పనిలో ఉన్నారు. అయితే ఆయన తయారు చేసిన స్క్రిప్టు మాకు నచ్చలేదు. తెలంగాణలో చోటు చేసుకొన్న కొన్ని సంఘటల గురించి మగ్ధూం మొయినుద్ధీన్‌ చెప్పిన విషయాల ఆధారంగా ‘జబ్‌ ఖేద్‌ జాగే’ని నవలని రాశారు కిషన్‌ చందర్‌. ఉత్తరాదికి చెందిన ఆయన తెలంగాణకి ఎప్పుడూ వచ్చింది లేదు. దీంతో ఆ నవలలోని కొన్ని విషయాలు అశాస్త్రీయంగా అనిపిస్తాయి. గౌతమ్‌ ఘోష్‌ బెంగాల్‌కి చెందిన వారు కావడంతో ఆయన కూడా నవలకు తగ్గట్టుగానే స్క్రిప్టు తయారు చేశారు. అందుకే ఆ స్క్రిప్టుని పక్కన పెట్టి అందరూ కలిసి తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన కొన్ని ప్రాంతాలు తిరగాలని నిర్ణయించుకొన్నాం. ఆ మేరకు సూర్యాపేట్, బైరాన్‌పల్లి, పాలమాల తదితర ప్రాంతాలు తిరిగాం. పోరాటంలో పాల్గొన్న వాళ్లని ప్రత్యక్షంగా కలుసుకొన్నాం. వాళ్ల అనుభవాలు తెలుసుకొన్నాం. నోట్స్‌ తయారు చేసుకోవడంతో పాటు, ఫోటోలు తీసుకొన్నాం. అక్కడ లభించిన సమాచారానికి తోడు లైబ్రరీల్లో 1940 నాటి డెక్కన క్రానికల్, గోల్కొండ ప్రతికల్ని తిరగేశాం. సాయుధ పోరాటంపై నాయకులు, రచయితలు రాసిన పుస్తకాల్ని సేకరించాం. ఆ సమాచార సేకరణ పూర్తయ్యాక.. నేను, గౌతమ్‌ ఘోష్, పార్థబెనర్జీ, ప్రాణ్‌రావు కూర్చుని స్క్రిప్టు సిద్ధం చేశాం. కమ్యూనిస్టు పార్టీకి చెందిన నాయకుడు లక్ష్మారెడ్డిని పిలిపించి స్క్రిప్టులో ఏదైనా తప్పునిపిస్తే, అశాస్త్రీయంగా ఉందనిపిస్తే చెప్పమని అడుగి మెరుగులు దిద్దాం’’.


అత్తగారి ఊరే లొకేషన్‌...

స్క్రిప్టు అయితే సిద్ధమైంది కానీ.. 1940ల నాటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ సినిమా తీయడం ఎలా? అనే ప్రశ్న మొదలైంది. అందుకోసం శివారు గ్రామాల్ని ఎంచుకొన్నాం. మా అత్తగారి ఊరైన మెదక్‌ జిల్లా మంగల్‌పర్తిలో అప్పటికి ఇంకా కరెంట్‌ లేదు. దీంతో అక్కడికి వెళ్లాం. ఒక షెడ్యూల్‌ అక్కడ చిత్రీకరించాక.. గడీ అవరసరమైంది. ఆ ఊళ్లో చిన్న గడీ ఉండడంతో.. అది చాలదని నర్సాపూర్‌ తాలూక దొంతి అనే గ్రామానికి వెళ్లి అక్కడ కొన్ని సన్నివేశాల్ని తీశాం. హైదరాబాద్‌లోని యాప్రాల్, ఖజానా, జహనుమా, గాంధీనగర్‌ తదితర ప్రాంతాల్లో కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరించాం. కాకరాలతో పాటు ఒకరిద్దరు మినహా ఇందులో నటించినంత వాళ్లంతా కొత్తవాళ్లే. కనీసం రంగస్థలంపై కూడా లేని వాళ్లని తీసుకొచ్చి నటింపజేశాం. నాకు రంగస్థల అనుభవంతో పాటు, ఫైన్‌ ఆర్ట్స్‌ చేశాను కాబట్టి నేనే నటీనటులకు తర్ఫీదునిచ్చేవాణ్ణి. రచయిత త్రిపురనేని గోపీచంద్‌ తనయుడు సాయిచంద్‌ కథానాయకుడిగా నటించారు. నేను రెండో కథానాయకుడిగా నటించా. తెలంగాణ ప్రజలు పాడుకొంటున్న పాటల్నే సేకరించి ఇందులో వినియోగించాం. వింజమూరి సీతాదేవి సంగీతం సమకూర్చారు. గౌతమ్‌ ఘోష్‌ నేపథ్య సంగీతం సమకూర్చారు. ఎలాగోలా సినిమాని పూర్తి చేశాం కానీ.. సెన్సార్‌ చేయించడానికి ఒక మా దగ్గర డబ్బు లేదు. అప్పటికే నేను ఇంటిని తాకట్టు పెట్టా. సెన్సార్‌ కోసమని మా స్నేహితుడు రవీంద్రనాథ్‌ పెళ్లి సందర్భంగా ఇచ్చిన ఉంగారన్ని తాకట్టు పెట్టారు. ప్రజాపోరాటం నేపథ్యంలో తీసిన సినిమా కావడంతో సెన్సార్‌ అనుమతి లభిస్తుందో లేదో అనుకున్నాం. కానీ సెన్సార్‌ పరంగా ఎలాంటి అడ్డంకులూ రాలేదు కానీ.. సినిమా విడుదల చేయడానికి మాత్రం ఎవ్వరూ ముందుకు రాలేదు. వాళ్లలోనూ అవే భయాలు. చివరకి ఆంధ్రలో లక్ష్మీఫిలింస్‌ లింగమూర్తి, తారకరామ ఫిలింస్‌ కేశవరావు తెలంగాణలో చిత్రాన్ని విడుదల చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌ల్లో రోజుకి ఒక్క షో చొప్పున ఏడాది పాటు ఆడింది. రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల్లో సినిమాని బాగానే చూశారు కానీ..తెలంగాణలో మాత్రం ఘన విజయం చేశారు’’.


బలమైన పునాది

‘ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా సొంతం చేసుకొంది ‘మా భూమి’. ద్వితీయ ఉత్తమ చిత్రం, ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగాల్లో రెండు నంది పురస్కారాలు లభించాయి. ఫిల్మ్‌ఫేర్, సినీ హెరాల్డ్‌ పురుస్కారాలతో పాటు, తాష్కెంట్, కార్లొయివరీ తదితర అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లోనూ ఈ సినిమా ప్రదర్శితమైంది. నిర్మాతగా, దర్శకుడిగా నా సినీ ప్రయాణానికి బలమైన పునాది వేసిన చిత్రమిది. ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ ఘోష్‌ చేసిన తొలి చిత్రం కూడా ఇదే. ఆయన బెంగాలీ అయినా.. తెలుగు భాషపై అవగాహన పెంచుకొని ఈ సినిమా తీశారు. ఆయన్నుంచి నేను చాలా విషయాలు నేర్చుకొన్నా. తదుపరి నేను దర్శకుడిని అయ్యానంటే కారణం.. గౌతమ్‌ ఘోష్‌. ‘మాభూమి’ ఇచ్చిన స్ఫూర్తితోనే ‘రంగులకల’, ‘దాసి’, ‘మట్టిమనుషులు’ చిత్రాల్ని తీశా. ‘మాభూమి’ సినిమాతో ఎన్నో అనుభవాలున్నాయి. ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి నలభై సంవత్సరాలు అవుతోందంటే నమ్మశక్యంగా లేదు. మంచి సినిమాని ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోలేరనడానికి ఇదే నిదర్శనం’’.

మరికొన్ని విషయాలు...

*

నల్గొండ జిల్లా, సిరిపురం గ్రామంలో రామయ్య జీవితం నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది.

* సాయిచంద్‌తో పాటు, ప్రముఖ నటి తెలంగాణ శకుంతల ఈ చిత్రంతోనే పరిచయమయ్యారు.

* విప్లవ రచయిత బండి యాదగిరి రచించిన ‘బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి..’ అనే పాటని సినిమాలో గద్దర్‌ పాడారు. ఆ పాటలో ఆయన నటించారు కూడా.

* పల్లెటూరి పిల్లగాడ.. పాటని సుద్దాల హనుమంతు రచించారు. ప్రస్తుత సినీ గీతరచయిత సుద్దాల అశోక్‌తేజ తండ్రి సుద్దాల హనుమంతు. ఈ పాటని సంధ్య ఆలపించారు.

* పొదల పొదల.. అంటూ సాగే పాటని నిజామాబాద్‌ నుంచి సేకరించారు. సినిమాలో కేవీకే మోహన్‌రాజు పాడారు. అప్పట్లో నిజామాబాద్‌లోని జైలు గోడపై రాసి ఉన్న ఈ పాటని చూసి జనం పాడుకొన్నారని చెబుతుంటారు.

* దర్శకుడు గౌతమ్‌ ఘోష్‌ భార్య నీలాంజన ఘోష్‌ ఈ చిత్రానికి కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేశారు.

* నటుడు కొంగర జగ్గయ్య వాయిస్‌ ఓవర్‌తో సినిమా సాగుతుంది.

- నర్సిమ్‌ ఎర్రకోటCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.