ఎన్టీఆర్‌ పంతం... జమున శపథం!
భారతీయ సినిమా సౌధానికి రాళ్ళెత్తిన కూలీలలో ఆయనది ప్రముఖ స్థానం. చలన చిత్ర పరిశ్రమ నగరం నుంచి భాగ్యనగరానికి రావడానికి నడుం బిగించిన ప్రముఖుల్లో ఆయనది ప్రత్యేక స్థానం. జాతీయ చలన చిత్రాభివృద్ధి సంస్థకు చైర్మన్‌గా, ఫిలిం ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు అధ్యక్షునిగా ఆయన చేసిన సేవలకు వెలకట్టలేం. బ్రిటిష్‌ దర్శకుడు రిచర్డ్‌ అటెన్‌బరో ‘గాంధీ’ చిత్ర నిర్మాణానికి నడుం బిగించినప్పుడు చలన చిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్‌ హోదాలో ఆర్థిక సహకారాన్ని అందించిన ఘనత ఆయనదే! భారత ప్రభుత్వ ‘పద్మశ్రీ’ని, రాష్ట్ర ప్రభుత్వ ‘రఘపతి వెంకయ్య’ పురస్కారాన్ని పొందిన చలన చిత్ర భీష్మాచార్యుడు అతనే! ‘మంగమ్మ శపథం’తో మొదలుపెట్టి ‘పిడుగురాముడు’, ‘గండికోట రహస్యం’, ‘తిక్కశంకరయ్య’, ‘చిన్నానాటి స్నేహితులు’, ‘ధనమా-దైవమా’, ‘జీవనజ్యోతి’, ‘ముఝే ఇన్సాఫ్‌ చాహియే’ వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించి వాసికెక్కిన ఆ భీష్ముడే ‘డివియస్‌’ అని గౌరవంగా పిలిపించకున్న దాట్ల వెంకట సూర్యనారాయణ రాజు. డివియస్‌ ప్రొడక్షన్స్‌ పతాకంలో ఆయన నిర్మించిన తొలి చిత్రం ‘మంగమ్మ శపథం’ 1965 మార్చి 6న విడుదలై ఐదు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. ఈ సందర్భంగా ‘మంగమ్మ శపథం’ విశేషాలు కొన్ని...


* రాజు వెడలె చెన్నపట్నం..
కాకినాడలో డిగ్రీ పూర్తి చేసాక డివిఎస్‌ రాజు ‘సినీ లిథో వర్క్స్‌’ అనే సినిమా పోస్టర్లు ముద్రించే సంస్థలో భాగస్థునిగా చేరారు. ఆ సంస్థకు విజయవాడ, మద్రాసు నగరాల్లో ఆధునాతన ప్రింటింగు ప్రెస్సులు ఉండేవి. మద్రాసు విభాగ బాధ్యతను చేపట్టిన డివియస్, ఆఫ్‌సెట్‌ ముద్రణ యంత్రాలను ప్రవేశపెట్టి సినిమా పోస్టర్ల నాణ్యతను పెంచారు. అలా సినిమా రంగంతో పరిచయాలు పెరిగి, రాజమండ్రి వాస్తవ్యుడు, ఎన్టీఆర్‌ రూమ్మేట్‌ టివి రాజు సహకారంతో రామారావు దగ్గరయ్యారు. ఎన్టీఆర్‌ తొలి సొంత చిత్రం ‘పిచ్చి పుల్లయ్య’ పోస్టర్లు అత్యంత సుందరంగా ముద్రించి ఇవ్వడంతో ఎన్టీఆర్‌కు డివియస్‌ ప్రతిభ నచ్చింది. డివియస్‌కు తన ఎన్‌.ఎ.టి. సంస్థలో భాగస్వామ్యం కల్పించారు. ఆ సంస్థలో భాగస్వామిగా చేరిన తరవాత ‘తోడు దొంగలు’, ‘జయసింహ’, ‘పాండురంగ మహాత్మ్యం’, ‘గులేబకావళి’ సినిమాలకు పెట్టుబడిదారునిగా వ్యవహరించారు. ‘పాండురంగ మహాత్మ్యం’ సినిమా నిర్మాణంలో వుండగా సాహిణీ వారి ‘పెంకి పెళ్ళాం’ (1956) సినిమాను ‘కణ్ణియనే కడిమై’ సినిమా నిర్మాణంలో తమిళంలోకి డబ్బింగు చేసారు. తరువాత కొందరు భాగస్వాములతో కలిపి ‘మా బాబు’ (1960) సినిమాను ప్రగతి ఆర్ట్‌ ప్రొడక్షన్‌స బ్యానర్‌ మీద తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో ఆయన నిర్మించారు. 1959లో రాజేంద్రకుమార్, మీనాకుమారి నటించిన దేవేంద్ర గోయల్‌ హిందీ సినిమా ‘చిరాగ్‌ కహో రోష్నీ కహా’ దీనికి ఆధారం. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి నటించగా ఈ సినిమాకు తాతినేని చలపతరావు సంగీతం సమకూర్చారు.

* సొంత సంస్థ ‘మంగమ్మ...’తో మొదలు
నిర్మాత రామానాయుడు తన తొలి సినిమా ‘రాముడు-భీముడు’ (1964)లో ఎన్టీఆర్‌ చేత ద్విపాత్రాభినయం చేయించారు. అది సాంఘిక సినిమా. రామారావుది అందులో అన్నదమ్ముల పాత్ర. అయితే అదే సంవత్సరంలో నిర్మాత డివియస్‌ రాజు సొంతంగా డివిఎస్‌ ప్రొడక్షన్స్‌ సంస్థను స్థాపించి ఎన్టీఆర్‌ హీరోగా ‘మంగమ్మ శపథం’ జానపద సినిమాకు శ్రీకారం చుట్టారు. ఇందులో ఎన్టీఆర్‌ది తండ్రీకొడుకుల పాత్ర. ‘రాముడు - భీముడు’ సినిమా తరువాత ‘శ్రీ సత్యనారాయణ మహాత్మ్యం’, ‘అగ్గిపిడుగు’ (1964) సినిమాల్లో ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేసి వుండడం ‘మంగమ్మ శపథం’ సినిమాకు కలిసొచ్చిన అంశం. అసలు జానపద సినిమా తీయాలని డివియస్‌ నిర్ణయం తీసుకోవడానికి వెనుక ‘జయసింహ’ సినిమా విజయం మొదటి కారణం కాగా, రామారావుకు జానపద సినిమాల్లో తిరుగులేని రికార్డు వుండడం రెండో కారణం. జానపద బ్రహ్మ విఠలాచార్య అప్పటికే ‘బందిపోటు’, ‘పిడుడురాముడు’ హిట్స్‌ అందించి ఉండడంతో ఆయనే ‘మంగమ్మ శపథం’ సినిమాకు దర్శకుడయ్యారు. ఈ సినిమాకు 1943లో వచ్చిన జెమిని వాసన్‌ తమిళ సినిమా ‘మంగమ్మ అబదం’ అధారం. టిజి రాఘవాచారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రంజన్‌ ద్విపాత్రాభినయం చేయగా, ప్రసిద్ధ నటి వైజయంతిమాల తల్లి వసుంధరాదేవి మంగమ్మగా నటించింది. సినిమా విజయవంతమవడంతో దీనినే 1951లో జెమినీవారు మరలా ‘మంగళ’ పేరుతో తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తీశారు. రంజన్‌ ద్విపాత్రాభినయం చేయగా, భానుమతి మంగళ పాత్ర వేసింది. పై మూడు భాషల్లోనూ వీరిద్దరూ నటించారు. హిందీ వెర్షన్‌కు వాసన్‌ దర్శకత్వం వహించగా, తమిళ, తెలుగు వెర్షన్లకు చంద్రు దర్శకత్వం వహించారు. సింగీతం శ్రీనివాసరావు అసోసియేట్‌గా, ఈమని శంకరశాస్త్రి, ఎండి పార్థసారథి సంగీత దర్శకులుగా తెలుగు చిత్రానికి పనిచేశారు. ఈ సినిమాకు తాఫీ ధర్మారావు నాయుడు మాటలు, పాటలు రాయడం విశేషం.


* సంక్షిప్త చిత్ర కథ
రాజుల కథలు విన్నాం, కానీ ఈ సినిమాలో రాజు (ఎన్టీఆర్‌) స్త్రీలోలుడు, కాముకుడు. అతడు రాజవీధిన వెళ్తున్నాడంటే సంసార స్త్రీలకు భయం. ఒకసారి ఆ రాజు షికారు వెళ్లి పొలంలో పని చేసుకునే మంగమ్మ (జమున)ను చూసి మోహిస్తాడు. తెగువ, స్వాభిమానంగల ఆమె రాజుపై తిరగబడుతుంది. రాజమహలుకు తిరిగి వచ్చిన రాజు తన అంతరంగికుడు రత్తాలు (అల్లు రామలింగయ్య)ను పంపి మంగమ్మ అనుపానులు తెలుసుకుని రమ్మంటాడు. మంగమ్మ భజగోవిందం (రేలంగి) చెల్లెలని తెలుసుకొని, రాజుగారి కోరిక తీర్చేందుకు మంగమ్మను ఒప్పిస్తే అతణ్ణి మండలేశ్వరుని చేయిస్తానని ఆశ పెడతాడు. ఆ మాటలు ఆలకించిన మంగమ్మ రత్తాలుకు బడిత పూజ చేస్తుంది. రాజుకు పంతం పెరిగి మంగమ్మను బలాత్కారించబోయి పరాభవించబడతాడు. అందుకు ఆగ్రహించిన రాజు ఆమెను బలవంతంగా పెళ్లాడి, చెరసాలలో పెట్టించి ఆమె బ్రతకును అడవి కాచిన వెన్నెల చేస్తానని హెచ్చరిస్తాడు. రాజు బలవంతంగా పెళ్లిడితే ఆ రాజుతోనే ఒక కొడుకును కని, అతని చేతే కొరడాతో కొట్టించి, ఆడదాని శీలం విలువేమటో చెప్పిస్తానని మంగమ్మ శపథం చేస్తుంది. తండ్రి (మిక్కిలినేని) మనుగడ కోసం మంగమ్మ రాజుతో పెళ్లికి అంగీకరిస్తుంది. శోభనం రాత్రి వేడుకలో రాజు ‘నా శపథం చెల్లింది. ఇక నీ శపథం చెల్లించు’ అని మంగమ్మను రెచ్చగొడుతాడు. మంగమ్మ ‘ఆవేశంలో నేనేదో అన్నాను. మనమిప్పుడు దంపతులం. అవన్నీ మరచిపోదాం. నన్ను మన్నించి యేలుకోండి’’ అని ప్రాధేయపడుతుంది. అవమానం మరవని ఆ రాజు ఆమెను చెరసాలలో బంధిస్తాడు. మంగమ్మ తండ్రి సాయంతో చెరసాల నుంచి తన ఇంటికి సొరంగ మార్గాన్ని తవ్విస్తుంది. చెర నుంచి బయటకు వచ్చి అన్న సాయంతో మంజీర (గిరిజ) అనే దొమ్మరి పిల్ల వద్ద శిక్షణ పొంది, మారువేషంలో రాజును కలసి, భాషరాని దొమ్మరిసాని ‘సోఫియా’గా నటించి, అతని శయ్యాగారంలోనే అతనితో ఉంటూ ఒక కూమారుని కంటుంది. అతని పేరు విజయనాథుడు (ఎన్టీఆర్‌). విజయనాధునికి మంగమ్మ తన శపథం సంగతి తెలియజేస్తుంది. మంగమ్మ రహస్య మార్గం ద్వారా తిరిగి చెరసాలకు చేరుకుంటుంది. తల్లికి జరిగిన అవమానాన్ని తెలుసుకున్న విజయనాథ్‌ యుక్తిగా రాజును బంధించి కొరడా దెబ్బల రుచి చూపించి తల్లి శపథం నెరవేరుస్తాడు. విజయనాథ్‌ తన కుమారుడేనని తెలిసిరాజు తన అపజయాన్ని అంగీకరిస్తాడు. బహ్య సౌందర్యం కన్నా ఆత్మసౌందర్యం గొప్పదనే విషయాన్ని అర్థం చేసుకుని సేనాధిపతి కూతురు విజయ (ఎల్‌ విజయలక్ష్మి)తో విజయనాథ్‌ పెళ్లి జరిపిస్తాడు. టూకీగా ఇదీ కథ. సినిమాలో సేనాపతిగా రాజనాల, కొత్వాలుగా రమణారెడ్డి, అతని భార్యగా ఛాయాదేవి, గిరిజ తండ్రిగా నల్లరామ్మూర్తి, అతని శిష్యునిగా బాలకృష్ణ, నర్తకిగా రాజశ్రీ, చంచలగా వాణిశ్రీ ఇతర పాత్రల్లో నటించారు.


* ఆ సినిమా కామధేనువు
‘మంగమ్మ శపథం’ సినిమా డివియస్‌ చలన చిత్ర జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది. ప్రేక్షకుల నీరాజనాలందుకొని ఐదు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. ఆ రోజుల్లో ఈ భారీ బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమాకు ఆరు లక్షలు ఖర్చు చేసారు డివియస్‌. బి - సెంటర్లలో, రిపీట్‌ రన్లలో ‘మంగమ్మ శపథం’ వసూళ్ల వర్షం కురిపించింది. ఇందులో ఎన్టీఆర్‌ వేసిన మారువేషాలు ప్రేక్షకుల్ని బాగా అలరించాయి. ఈ సినిమా అటు ఎన్టీఆర్‌కు, ఇటు నాయిక జమునకు కూడా పెద్ద సవాలుగా నిలిచింది. తల్లి - కొడుకులుగా జమున - ఎన్టీఆర్‌ను ప్రేక్షకుల ఊహించుకోవడం కష్టమే. అందుకే స్క్రీన్‌ ప్లేను దర్శకుడు విఠలాచార్య పకడ్బందీగా అల్లారు. వారిద్దరి సన్నివేశాలను తగ్గించి తల్లి - కొడుకులుగా ఎక్కువగా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్టీఆర్‌ కొన్ని సాహసోపేతమైన సన్నివేశాల్లో డూప్‌ లేకుండా నటించారు. ముఖ్యంగా పరదాల ఆధారంగా రాజభవన ప్రవేశం చేసేటప్పుడు ఆయన కాలు బెణికి వాపు వచ్చింది. అయినా లెక్క చేయకుండా ఎన్టీఆర్‌ నటించారు. సినిమాలోని ఎక్కువ సన్నివేశాలు సహజ వాతావరణంలో చిత్రీకరించారు. అరణ్యం సీనులన్నీ ప్రస్తుతం ఐఐటి వుండే ప్రాంతంలో చిత్రీకరించారు. ‘రాముడు - భీముడు’ సినిమాలో నటించిన హీరోయిన్లే ఈ సినిమాలో హీరోయిన్లు కావడం కేవలం యాదృచ్చికం మాత్రమే. సముద్రాల (జూ) సంభాషణలు ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. ‘బాకా లంగరు టాకా’’ అంటూ రేలంగి పలికే ఊతపదం, దొమ్మరిసాని సోఫియా పలికే ‘‘బరస్‌ ఫరేనా, హరత్‌ బ్యూతీ, హాలియా మస్తా, తవేష్మా’’ పదాలు విచిత్రంగా వుంటాయి. 1965లో ఎన్టీఆర్‌ 12 సినిమాల్లో నటిస్తే అన్నీ అర్థ శతదినోత్సవం జరుపుకున్నాయి. ఇందులో 8 సినిమాలు శతదినోత్సవం జరుపుకోగా ‘మంగమ్మ శపథం’ కూడా వాటిలో ఒకటి. ‘నాదీ ఆడజన్మే’, ‘పాండవ వనవాసము’, ‘ఆడబ్రతుకు’ సినిమాలు 25 వారాలు ఆడితే ‘వీరాభిమన్యు’ సినిమా 156 రోజులు ఆడింది. ఒక రకంగా డివియస్‌కు 1965 కలిసొచ్చిన సంవత్సరం. స్టిల్‌ ఫోటోగ్రాఫర్‌ భూషన్‌ ఈ సినిమాతోనే చిత్ర రంగ ప్రవేశం చేసారు. ‘రాముడు - భీముడు’లో లాగే కైకాల సత్యనారాయణ ఎన్టీఆర్‌కు ఇందులో కూడా డూప్‌గా నటించారు. ‘మంగమ్మ శపథం’తో మొదలైన డివియస్, టి.వి.రాజుల కాంబినేషన్‌ ఆయన బ్రతికున్నంత వరకు కొనసాగింది.


* రాజఠీవి రసగుళికలు
‘మంగమ్మ శపథం’ సినిమాకు సంగీత దర్శకుడు టి.వి.రాజు. సినిమాలో మొత్తం తొమ్మిది పాటలుండగా సింహభాగం పాటల్ని సినారె రాయగా మూడు పాటల్ని కొసరాజు రాసారు. పొదుపు చర్యలతో నిర్మాతకు పెట్టుబడి ఆదా చేసే తత్త్వంగల దర్శకుడు విఠలాచార్య అన్ని పాటల్నీ ఇండోర్‌లోనే చిత్రీకరించారు. హిందోళరాగంలో వచ్చే జమున ప్రవేశ గీతం ‘రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నది’’ పాటను మాత్రం కొడైకునాల్‌లో చిత్రీకరించారు. శీతకాలం కావడంతో ఆ పాట చిత్రీకరణకు సిబ్బంది చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఎన్టీఆర్, రాజశ్రీల మీద చిత్రీకరించిన ‘కనులీవేళ చిలిపిగ నవ్వెను’ పాటను సింధుభైరవి రాగంలో స్వరపచారు. ఎన్టీఆర్, జమునల మీద చిత్రీకరించిన ‘‘నీ రాజు పిలిచెను రేరాజు నిలిచెను’’ పాట మోహన రాగంలో రూపుదిద్దుకోగా, ఆ పాట బిజియంలో ‘ఈ నాటి ఈ హాయి కలకాదోయి నిజమోయి’’ (జయసింహ) నాటి స్వరాలు గుర్తుకొస్తాయి. ఎన్టీఆర్, ఎల్‌ విజయలక్ష్మి మీద చిత్రీకరంచిన ‘ఒయ్యార మెలికే చిన్నది ఉడికించు చున్నది’’ పాటను కూడా టి.వి.రాజు మోహన రాగంలోనే స్వరపరిచారు. ఆ రోజుల్లో ప్రతి జానపద చిత్రంలో ఒక జావళి తప్పనిసరిగా వుండేది. జావళి అనేది నాయకుని ఉద్దేశించి శృంగార భరితంగా పాడుతూ నాట్యం చేసే విరహగీతం. బేగడ రాగంలో టి.వి.రాజు ‘‘అందాల నారాజ అలుకేలరా ఔనని కాదని’’ ఆ పాటకు వన్నె తెచ్చింది. వెన్నెల రాత్రి, మండపం సెట్టింగు, లతలు, రెల్లు పూల మధ్య చిత్రీకరించిన ఈ పాటకు అలతి పదాలతో సొబగులద్దిన సినారె అభినందనీయుడు. ఇవికాక ‘ఢీ డిక్కు, డీ డిక్కు, డీ డిక్కు డిగ్గా’’ (ఎన్టీఆర్‌ బృందం), ‘అయ్యయ్యో ఐసా పైసా చల్తారే’ (ఎన్టీఆర్, జమున బృందం), ‘ఆ వూరు నాదిగాదు’ (రేలంగి, గిరిజ), ‘చిరునవ్వులూరించు చిన్ని అబ్బాయీ’ (జమున, రేలంగి, గిరిజ) పాటలు కూడా సన్నివేశపరంగా ముద్దులొలికించేవే!

- ఆచారం షణ్ముఖాచారి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.