‘మాయాబజార్‌’ అంటే జంధ్యాలకు అంత మక్కువ!

‘మాయాబజార్‌’ చిత్రాన్ని ఇష్టపడని తెలుగు ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. ప్రముఖ దర్శకుడు జంధ్యాలకూ ఆ చిత్రమంటే ఎంతో మక్కువ. మరీ ముఖ్యంగా ఆ చిత్రంలోని పాటలంటే మరింత ఇష్టం. ఎంతిష్టమంటే ఆ సినిమాలోని పాపులర్‌ పాటల పల్లవులనే మూడు సినిమాలకు టైటిల్‌గా పెట్టేశారు. అయినా తనివి తీరలేదేమో. ఆ చిత్రంలోని ఓ డైలాగ్‌నూ టైటిల్‌ కింద మార్చేశారు. అవేంటో చూసేయండి మరి.
1. అహ నా పెళ్లంట.. ఒహో నా పెళ్లంట

‘అహ నా పెళ్లంట ఒహో నా పెళ్లంట...’ అని సావిత్రి మురిసిపోతుంటే ఎంత చూడముచ్చటగా ఉంటుంది కదూ. జనం నోళ్లలో ఈ పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఆ పల్లవిని టైటిల్‌గా పెట్టి జంధ్యాల తీసిన ‘అహనా పెళ్లంట’ కూడా ఇప్పటికీ మరపురాని చిత్రంగా నిలిచింది. ఆ పాట పల్లవిలోని ఇంకో వాక్యంతో ‘ఒహో నా పెళ్లంట’ అనే సినిమా కూడా తీశారు జంధ్యాల.

2. వివాహ భోజనంబు

‘వివాహ భోజనంబు వింతైన వంటకంబు...’ అంటూ ఘటోత్కచుడు తెలుగిళ్లల్లో కనిపించే అన్ని రకాల తిండి పదార్థాలూ లాగిస్తుంటే ప్రేక్షకులూ లొట్టలేసుకుంటూ చూసేశారు. ఆ పాట పల్లవితో ‘వివాహ భోజనంబు’ అనే సినిమా తీసి కడుపుబ్బా నవ్వించారు జంధ్యాల.
3. చూపులు కలసిన శుభవేళ


‘చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకీ కలవరము...’ అనే ప్రణయ గీతంలో ఏఎన్నార్, సావిత్రిల రొమాన్స్‌ ఎంత మధురంగా ఉంటుందో, ఆ పల్లవితో జంధ్యాల తెరకెక్కించిన ‘చూపులు కలసిన శుభవేళ’ చిత్రమూ అంతే మధురంగా ఉంటుంది.
4. హై హై నాయకా

‘మాయాబజార్‌’లోని పాపులర్‌ డైలాగ్‌ ఇది. ఘటోత్కచుడి శిష్యగణం ఆయనకు జేజేలు పలుకుతూ చెప్పే ఈ డైలాగ్‌నూ టైటిల్‌గా చేసి ‘హై హై నాయకా’ సినిమా తీయడం జంధ్యాలకే చెల్లింది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.