‘చక్కన్న’ చెక్కిన చక్కని చిత్రం మిస్సమ్మ

‘‘జనం కోరేది మనం శాయడమా... మనం చేసేది జనం చూడడమా... యేరా డింగరీ’’ అంటూ పాతాళభైరవి సినిమాలో నేపాళ మాంత్రికుని చేత అనిపించి, జనం కోరే సినిమాలు తీస్తేనే విజవంతమౌతాయనే రహస్యాన్ని చెప్పకనే చెప్పించిన ‘విజయా’ వారి చక్కని హాస్యభరిత చిత్రం ‘మిస్సమ్మ’. విజయాసంస్థకు సారధులు నాగిరెడ్డి- చక్రపాణి, అతిరధులు పింగలి, మార్కస్‌ బార్ట్‌లే, గోఖలేల సమర్పణలో వచ్చిన ‘షావుకారు’, ‘పెళ్లిచేసిచూడు’ వంటి హిట్‌ సినిమాలకు కథను సమకూర్చిన చక్రపాణి ప్రేక్షకులకు వడ్డించిన మృష్టాన్నమే ‘మిస్సమ్మ’, తెలుగు సినిమా నిర్మాణ శైలినే మార్చివేసిన విజయా సంస్థ ఏ సినిమా తీసినా వినోదాన్ని మాత్రం వదులుకోలేదు. నాటక ఫక్కీలో నడిచే సినిమా మాధ్యమాన్ని వ్యవహారిక భాషశైలికి మళ్లించిన ఆ సంస్థ నిర్మించిన ‘మిస్సమ్మ’, సంక్రాంతి కానుకగా 12 జనవరి 1955న విడుదలై జయభేరి మోగించి 13 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. ఆ సినిమా విశేషాంశాలు కొన్ని....


తెనాలి సుబ్బారావు మద్రాసుకు...
విజయా సంస్థ సారధుల్లో ఒకడైన ఆలూరి వెంకట సుబ్బారావు, హిందీ భాషలో ప్రావీణ్యంతో చిత్రగుప్త, వినోదిని వంటి పత్రికలకు కథలు రాస్తూ, ఆ భాషా వ్యాప్తికి కృషిచేసిన వజ్రనందన శర్మ చేత ‘చక్రపాణి’ అనే కలం పేరును స్వీకరించి సార్ధకం చేసుకున్నారు. అప్పటి నుంచి ఆ కలంపేరే ఆయన పేరుగా స్థిరపడిపోయింది. 1934 ప్రాంతంలో అనారోగ్యానికి గురై మదనపల్లి శానిటోరియంలో చికిత్స పొందుతున్నపుడు ఒక బెంగాలి బాబుతో పరిచయమై ఆ భాషను చదవడం, రాయడం కూడా చక్రపాణికి పట్టువడడంతో ‘దేవదాసు’, ‘బడదీది’, ‘నిష్కృతి’ వంటి శరత్‌ సాహిత్యాన్ని, ఇతర బెంగాలీ రచనలను తనదైన నుడికారంతో అనువదించి ప్రచురించారు. 1941లో సి. పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన ‘ధర్మపత్ని’ సినిమాకు, బి.ఎన్‌.రెడ్డి తీసిన ‘స్వర్గసీమ’ సినిమాకు కథలు సమకూర్చాక వారి ప్రెస్సులోనే ‘యువ’ పుస్తక ప్రచురణలు వేస్తున్న సమయంలో బి.నాగిరెడ్డితో పరిచయమైంది. తర్వాత వారిద్దరూ కలిసి ‘ఆంధ్రజ్యోతి’, ‘చందమామ’ పత్రికలు ప్రారంభించారు. అలా పెరిగిన పరిచయం స్నేహానికి పర్యాయపదంగా నిలిచి విజయా సంస్థ ఆవిర్భావానికి నాంది పలికింది. వారి తొలి చిత్రం ‘షావుకారు’కు కథా సారధిగా వ్యవహరిస్తూ, తరవాత వచ్చిన ‘పెళ్లిచేసి చూడు’, ‘చంద్రహారం’ సినిమాకు తనే కథలను సమకూర్చారు. ఆ పరంపరలో 1955లో వచ్చిన ‘మిస్సమ్మ’ సినిమాకు కథారచన, స్క్రీన్‌ప్లే బాధ్యతలు మోస్తూ ఆ సినిమాను ఒక చక్కని హాస్య చిత్రంగా చక్రపాణి తీర్చిదిద్దారు.

మిస్సమ్మ మూలాలు...
‘మన్మయీ గర్ల్స్‌ స్కూల్‌’ పేరుతో రబీంద్రనాథ్‌ మైత్రా రచించిన బెంగాలి హాస్య నవలను ‘ఉదరనిమిత్తం’ పేరుతో చక్రపాణి తెలుగులో అనువాదించారు. ఆ నవలను 1935లో జ్యోతిష్‌ బెనర్జీ సినిమాగా తీశారు. ఆ సినిమా బాగా ఆడింది. అదే సినిమాను హేమచంద్ర సుందర్‌ అనేకసార్లు రీమేక్‌ చేసినప్పుడు కూడా విజయవంతమైంది. శరబిందు బెనర్జీ రాసిన మరో నవల ‘డిటెక్టివ్‌’ను కూడా అదే పేరుతో చక్రపాణి అనువాదించారు. ‘ఉదరనిమిత్తం’ కథను, ‘డిటెక్టివ్‌’ కథను మధించి ‘మిస్సమ్మ’ కథను చక్రపాణి రూపకల్పన చేశారు. అలా చక్రపాణి అనబడే ‘చక్కన్న’ వజ్రపేటిక నుంచి జాలువారిన ఆణిముత్యం ‘మిస్సమ్మ’. మిస్సమ్మ అంటే పెళ్లికాని ‘మిస్‌’ అనే అర్ధం ఒకటైతే, తప్పిపోయిన (మిస్‌ అయిన) అమ్మాయి అనేది రెండో అర్ధం. భానుమతిని దృష్టిలో ఉంచుకొనే చక్రపాణి మిస్సమ్మ పాత్రను రూపొందించారు. ఆ పాత్ర కోసం ఆత్మాభిమానం, పెంకితనం, తలబిరుసు తనంతో కూడిన సంభాషణలు రచించారు. దర్శకుడు ఎల్వీప్రసాద్‌ భానుమతితో నాలుగు రీళ్ల సినిమా కూడా షూట్‌ చేసారు. ఒక రోజు వరలక్ష్మి వ్రతం కోసమని ఉదయం షెడ్యూలుకు హాజరు కాలేనని, మధ్యాహ్నం వచ్చి షూటింగ్‌ పూర్తిచేస్తానని భానుమతి రాసిన లేఖను నౌకరు చక్రపాణి టేబులు మీద పెట్టాడు. దురదృష్టవశాత్తు ఆ ఉత్తరం చక్రపాణి దృష్టికి రాలేదు. వ్రతం ముగించుకొని యధాలాపంగా షూటింగ్‌కి వచ్చిన భానుమతిని, క్రమశిక్షణకు అగ్రతాంబూలమిచ్చే చక్రపాణి కేకలేశారు. తన తప్పేమిలేదని, అంచేత క్షమాపణ కూడా చెప్పనని భీష్మించుకుంది భానుమతి. చక్కన్న కోపం తారాస్థాయికి చేరి, అంతవరకు తీసిన నాలుగు రీళ్ల నెగటివ్‌ను తెప్పించి ఆమె ఎదుటే కాల్పిపారేశారు. ఆమెకు రావాల్సిన పారితోషికాన్ని సెటిల్‌ చేసి పంపేశారు. అలా ‘మిస్సమ్మ’ సినిమాను భానుమతి మిస్సయింది.


మిస్సమ్మ కథ
అప్పాపురం జమిందారు గోపాలరావు నాయుడు (యస్వీ రంగారావు) కుటుంబ సమేతంగా సముద్ర స్నానానికని పదహారేళ్ల క్రితం కాకినాడ వెళ్లినప్పుడు తన నాలుగేళ్ల పెద్దమ్మాయి మహాలక్ష్మి తప్పిపోతుంది. ఆ అమ్మాయి పేరిట ఒక ఎలిమెంటరీ పాఠశాల కట్టించి, మేనల్లుడు ఏకేరాజు (అక్కినేని) చేత నడిపిస్తుంటాడు. రాజు డిటెక్టివ్‌ పనులతో పాఠశాలను నిర్లక్ష్యం చేయడంతో, బియ్యే చదివిన దంపతులను నియమించి పాఠశాలను తీర్చిదిద్దాలని ప్రకటన ఇస్తాడు. బియ్యే చదివిన ఎంటీరావు (ఎన్టీఆర్‌), మేరి (సావిత్రి) అనే ఇద్దరు నిరుద్యోగ యువతీ యువకులు ఉదరపోషణ నిమిత్తం అగ్రిమెంట్‌కు వచ్చి, భార్యాభర్తలమని నమ్మబలికి ఆ స్కూల్లో చేరుతారు. దేవయ్య (రేలంగి) అనే బిచ్చగాడు వీరిద్దరి మధ్య వారధిగా ఉంటూ మేరి కస్సుబుస్సులను బ్యాలన్సు చేస్తుంటాడు. జమిందారు తప్పిపోయిన కూతురు మహాలక్ష్మిని వెదికే ప్రయత్నంలోవున్న రాజుకు మేరియే మహాలక్ష్మి ఎందుకు కాకూడదు అనే సందేహం వస్తుంది. మేరి చదువుకోసం ఆమె పెంపుడు తల్లితండ్రులు పాల్‌ (దొరస్వామి) దంపతులు, డేవిడ్‌ (రమణారెడ్డి) వద్ద చేసిన అప్పును చెల్లించలేకపోవడంతో మేరీనిచ్చి పెళ్లిచేయమని డేవిడ్‌ వారిని వేధిస్తూంటాడు. జమిందారు దంపతులు ఎంటీరావు, మేరీలను ‘అల్లుడు- కూతురు’గా భావించి చూపే మర్యాదలను మేరి తట్టుకోలేక పోతుంది. జమిందారు రెండో కూతురు సీత (జమున) చనువును కూడా భరించలేకపోతుంది. చివరికి మేరి జమిందారు కూతురేనని రుజువై, రావుతో నిజమైన భార్యగా రావడానికి ఒప్పుకోవడం, రాజుతో సీతకు పెళ్లి కుదురటంతో సినిమాకు శుభం కార్డు పడుతుంది.

విలక్షణీయం కథనం
ఈ సినిమాను నిరుద్యోగం అనేది కథా వస్తువు. కామెడీ సినిమాల్లో సస్పెన్సు ఉండకూడదనేది చక్కన్న సిద్ధాంతం. సినిమా ఆరంభంలోనే సావిత్రి కుడికాలి బొటనవేలుపై పెద్ద పుట్టుమచ్చను ఒకటికి రెండుసార్లు చూపుతూ సావిత్రే యస్వీ రంగారావు పెద్దకూతురనే సెస్పెన్స్‌కి తెరదించడం ఈ సినిమా ప్రత్యేకత. ఇక భానుమతి విషయానికొస్తే, అర్ధాంతరంగా తనను తప్పించినందుకు ప్రతిగా సొంత బ్యానరు మీద ‘చక్రపాణి’ అనే సినిమాను పేరడిగా తీసి, చక్కన్నను ఒక లోభిగా చూపిస్తూ (ఆ పాత్రలో సి.ఎస్‌.ఆర్‌ నటించారు) మిస్సమ్మ సినిమా కన్నా ముందే (19-03-1954) దాన్ని విడుదల చేసి కసి తీర్చుకుంది. అంతేకాదు ‘రంభా చక్రపాణీయం’ పేరుతో ఒక వ్యంగ్య రచనను కూడా పాఠకుల మీదకు వదిలింది. తొలుత మేరి పాత్రకు భానుమతిని, సీత పాత్రకు సావిత్రిని ఎంపిక చేశారు. భానుమతి ‘మిస్‌’ అవ్వడతో ఆ పాత్ర సావిత్రిని వరించింది. సీత పాత్ర జమునకు దక్కింది. అక్కినేని నిర్మాతలను అడిగి మరీ డిటెక్టివ్‌ పాత్రను ధరించారు. ‘దేవదాసు’ సినిమా అఖండ విజయం తరువాత అన్నీ విషాద విభిన్నమైన పాత్రలు వస్తుంటే, తనంటే ఏమిటో నిరూపించుకోవాలని ‘విప్రనారాయణ’లో శ్రీరంగడి భక్తుని పాత్రను, ‘మిస్సమ్మ’లో డిటెక్టివ్‌ రాజు పాత్రను ఎంచుకున్నారు. అక్కినేని ఇంత చిన్న పాత్రను పోషించడమేమిటి అని కూడా ఆ రోజుల్లో అభిమానులు అనుకున్నారు. సంస్కారవంతుడైన నిరుద్యోగి పాత్రలో ఎన్టీఆర్‌ నటనకు నూరు మార్కులు పడ్డాయి. మేరి ముక్కుసూటి మనస్తత్వానికి ప్రతీకగా ఒక సన్నివేశం గుర్తొస్తుంది. అప్పాపురం స్టేషనువద్ద కారులో మేరి ప్రక్కన కూర్చోవడానికి జమిందారు సందేహిస్తుంటే ‘‘ఫరవాలేదు... కూర్చోండి. మీరు మా ‘ఫాస్టర్‌’ లాంటివారు అంటుంది. కంగారుపడిన ఎన్టీఆర్‌ ‘‘అంటే ఫాదర్‌ లాంటివారు’’ అని సర్ది చెబుతాడు. అలాగే ‘‘మీ నాన్న పేరేమిటమ్మా’’ అని అడిగితే ‘‘పాల్‌’’ అని మేరి చెబుతుంది. ‘‘గోపాల్‌’’ అని సర్దిచెప్పడం ఎంటీరావు వంతు అవుతుంది. అలా సినిమా ఆసాంతం ఎన్టీఆర్‌ మేరి పొరపాట్లను కప్పిపుచ్చుతూ వస్తుంటాడు. ఈ పూర్తిస్థాయి కామెడీ సినిమాని కేవలం వినోదమనే దృష్టితో చూడాలేగాని లాజిక్‌ ఎంచకూడదు. మతవిశ్వాసాలను ప్రగాఢంగా నమ్మే మేరి ‘‘రాగసుధారస పానముజేసి- రంజిల్లవే ఓ మనసా’’ అనే త్యాగరాయ కృతిని పాడటం సమంజసం కాకపోయినా సంగీత పాఠాలు చెప్పడానికి అవి అవసరమనుకుంటే సరిపోతుంది. ‘‘బాలనురా మదనా- విరి తూపులు వేయకురా’’ అనే జావలి కోసం జమున చేత నృత్యదర్శకులు పసుమర్తి కృష్ణమూర్తి భరతనాట్యం చేయించారు. ఈ నృత్యం కోసం పసుమర్తి జమున చేత రోజూ రెండు గంటలపాటు సాధన చేయించారు. ఆ భారతనాట్యం ఎంత హిట్టయిందంటే, జమున నృత్యభంగిమతో ఆ రోజుల్లో క్యాలెండరు కూడా వచ్చింది. అక్కినేని అసిస్టెంటుగా పూర్తి నిడివి పాత్రలో నటించిన బాలకృష్ణకు ఒక్క డైలాగు ఉండదు. అదే దర్శకుని ప్రతిభ. సినిమాలో కనిపించే మహాలక్ష్మి చిన్న నాటి ఫొటో నాగిరెడ్డి తమ్ముడు ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్‌ కొండారెడ్డి కూతురుది. అప్పాపురం స్కూలు, బస్‌స్టాపు సన్నివేశాలను చందమామ బిల్డింగ్‌లో తీసారు. ‘మిస్సమ్మ’ సినిమా పదమూడు కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుంది.ఈ సినిమాను తొలి ద్విభాషా చిత్రంగా పరిగణించాలి. అంతకు ముందు వచ్చిన ‘పాతాళభైరవి’, ‘పెళ్లిచేసిచూడు’ సినిమాలను సమాంతరంగా తీసినా నటీనటులు మాత్రం మారలేదు. కానీ ‘మిస్సమ్మ’ తమిళ వెర్షన్‌ ‘మిసియమ్మ’లో ఎన్టీఆర్‌ పాత్రను జెమిని గణేశ్‌ అక్కినేని పాత్రను తంగవేలు, రేలంగి పాత్రను సారంగపాణి, రమణారెడ్డి పాత్రను నంబియార్, బాలకృష్ణ పాత్రను కరుణానిధి పోషించారు. తెలుగు సినిమా విడుదలైన రెండు రోజులకు తమిళ వెర్షన్‌ విడుదలైంది. ‘మిస్సమ్మ’ ఎ.వి.ఎం.సంస్థ యజమాని మెయ్యప్ప చెట్టియార్‌ హిందీలో ‘మిస్‌మేరీ’గా తీసేందుకు హక్కులు కొన్నప్పుడు ఎల్వీప్రసాదే హిందీలో కూడా దర్శకత్వం వహించాలని నాగిరెడ్డి షరతు పెట్టారు. అలా ‘మిస్‌ మేరీ’, దర్శకుడిగా ప్రసాద్‌కు తొలి హిందీ చిత్రమైంది. హిందీలో ఎన్టీఆర్‌ పాత్రను జెమినిగణేష్, అక్కినేని పాత్రను కిశోర్‌కుమార్, సావిత్రి పాత్రను మీనాకుమారి, జమున పోషించారు. మూడు భాషల్లోనూ ఈ సినిమా విజయవంతమైది. ఈ సినిమాలకు తమిళంలో తంజై రామయ్యదాసు, హిందీలో రాజేంద్ర కృషన్‌ మాటలు, పాటలు సమకూర్చారు. మరాఠీలో కూడా ‘మిస్సమ్మ’ నిర్మితమవడం విశేషం. మిస్సమ్మ సినిమాలో హీరో, హీరోయిన్‌ పాత్రలను రివర్సు చేసి కథ రాసి రావి కొండలరావు బాపు-రమణల చేత తీయించిన ‘పెళ్లిపుస్తకం’ సినిమా విజయవంతమవటమే కాకుండా ఆయనకు ఉత్తమ కథా రచయితగా ప్రభుత్వ నంది పురస్కారాన్ని అందించింది.


సాలూరు సంగీత సౌరభాలు
మిస్సమ్మ సినిమా పాటల రచయిత పింగళి నాగేంద్రరావు విశ్వరూపం చూపిస్తే, సంగీత బాణీలు కట్టడంలో సాలూరు రాజేశ్వరరావు కూడా తన తడాఖా చాటారు. రాజేశ్వరరావు పాటలు ఎంత గొప్పగా అమరాయంటే, హింది ‘మిస్‌ మేరీ’లో ‘‘బృందావనమది అందరిదీ, గోవిందుడు అందరి వాడేలే’’ పాట ట్యూనును హేమంత్‌కుమార్‌ యధాతధంగా వాడి ‘‘బ్రిందావన్‌ కా కృష్ణ కన్హయ్య సబ్‌కీ ఆంఖోం కా తారా’’ అంటూ ఆరభి రాగంలోనే స్వరపరచారు. అనేక అదృశ్య కారణాల వలన ఘంటసాల ఈ సినిమాకు పనిచేయలేదు. సాధారణంగా విజయావారి సినిమాలకు ‘‘శ్రీ’’ అక్షరంతో మొదలయ్యే పాటను తొలిసారి రికార్డు చెయ్యడం అలవాటు అలా రూపుదిద్దుకున్నదే ఆనంద భైరవి రాగంలో అమరిన సీమంతం పాట ‘‘శ్రీ జానకీదేవి సీమంతమలరే- మహాలక్ష్మి సుందర వదనారముగనరే’’,.


ఆడవారి మనస్తత్వాన్ని అద్దంలా చూపే ‘‘ఔనంటే కాదనిలే... కాదంటే ఔననిలే... ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే’’ పాటను పీలూ రాగంలో ఏయం.రాజా పాడగా ఆకార్డియన్‌ బిట్లతో రాజేశ్వరరావు అందంగా స్వరపరచారు. జమున భరతనాట్యం చేసిన జావలి ‘‘బాలనురా మదనా... విరి తూపులు వేయకురా’’ని ఖరహరప్రియ రాగంలో సుశీల చేత సశాస్త్రీయంగా పాడించి మెప్పించారు. ఇక మగవారి బుద్ధిని పాటలో వర్ణించే ‘‘తెలుసుకొనవె చెల్లీ- అలా నడుచుకొనవె చెల్లీ’’ పాటను హిందుస్తానీ ఫక్కీలో బేహాగ్, యమన్, ఖమాచ్‌ రాగాల మేళవింపుతో స్వరపరచారు. ఈ పాటకు జవాబుగా ఎన్టీఆర్‌ పాడే ‘‘తెలసుకొనవే యువతీ- అలా నడుచుకొనవే యువతీ’’ పాటను మెహనరాగంలో సమ్మోహనంగా రాజా చేత పాడించి హిట్‌ చేసారు. ‘‘కరుణించు మేరి మాతా- శరణింక మేరీ మాతా’’ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. జయాజయవంతి రాగంలో వినిపించే ఈ పాటను క్రైస్తవ పడికట్టు పదాలతో బాటు చర్చిబెల్స్, బైబ్రోఫోన్, పియానో వంటి వాయిద్యాలు ఉపయోగించి అజరామరం చేసారు. ఈ పాట నిత్య నూతనంగా ఇప్పటికీ క్రైస్తవ దేవాలయాల్లో విరివిగా వినిపిస్తూ వుండటం విశేషం. ‘‘కావాలంటే ఇస్తాలే- నావన్నీ ఇక నీవేలే’’ పాటను పీలూ రాగంలో స్వరపరచి, రేలంగి చేత కవ్వాలీ పద్ధతిలో హార్మోనియం వాయింపజేసారు. ప్రణయ కలహంలా అగుపించే యువళగీతం ‘‘రావోయి చందమామ మా వింతగాధ వినుమా’’ పాటలో పల్లవి, చరణాలు ఒకే ట్యూనులో వినిపిస్తాయి. భీంప్లాస్‌ రాగంలో మట్లు కట్టిన ఈ పాటను ఎన్టీఆర్, సావిత్రిలపై చిత్రీకరించారు. సింధుభైరవి రాగంలో వచ్చే ‘‘ఏమిటో ఈ మాయా... ఓ... చల్లని రాజా వెన్నెలరాజా’’ పాట సినిమాలో వినిపించే ఆఖరి గీతం. వెన్నెల మహిమలు తెలిపే ఈ పాటకు మార్కస్‌ బార్ట్‌లే అద్దిన ఫొటోగ్రాఫీ అందాలు చూసి తీరవలసిందే కానీ చెప్పవలసినవి కాదు. ఇందులో రేలంగి స్వయంగా పాడిన ‘‘ధర్మం చెయ్‌ బాబూ... కాణి ధర్మం చెయ్‌ బాబూ’’, సీతారాం సీతారాం సీతారం జై సీతారాం’’ పాటలు ప్రేక్షకులకు బోనస్‌ పాటలు. ఎప్పుడు విడుదల చేసినా కూడా ఈ సినిమా బాగా ఆడింది.


-ఆచారం షణ్ముఖాచారి


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.