హడావుడిగా ఒక్కరోజులో పాట
.వి.ఎం వారి మూగనోము’ (1969) షూటింగ్‌ పూర్తయిన తర్వాత అందులో ఏఎన్నార్‌, జమునల మధ్య ఓ యుగళ గీతం నిర్మాత మెయ్యప్పన్‌కి నచ్చలేదట. హీరో నాగేశ్వరరావును ఓ సారి చూసి చెప్పమన్నారట. ఏయన్నార్‌ కూడా చిత్రీకరణ బాగా లేదని చెబుతూ, నిర్మాత కోరిక మేరకు రీషూట్‌ చేసేందుకు కాల్షీట్‌ ఇచ్చారట. అయితే మెయ్యప్పన్‌కు పాట సాహిత్యం కూడా నచ్చలేదట. దీంతో తమ సంస్థ హిందీలో నిర్మించిన ‘దో కలియా’ (తెలుగులో ‘లేతమనసులు’) లోని ‘తుమ్హారీ నజర్‌..’ పాట ట్రాక్‌ని బయటకు తీసి, గీత రచయిత దాశరథితో పాట రాయించి తెల్లవారేసరికల్లా పాట రికార్డ్‌ చేయించామని సంగీత దర్శకుడు గోవర్ధనంతో చెప్పారట. మర్నాడు ఉదయం దాశరథి పల్లవి, ఓ చరణం రాసి తీసుకు వచ్చారట. స్టూడియోలో ఘంటసాల, సుశీల వాటిని పాడుతూ ఉంటే ఆయన బయట కూర్చుని మిగిలిన చరణాలు రాసి పాట పూర్తి చేశారట. సాయంత్రానికల్లా పాట పూర్తికాగానే ఆ రాత్రి జమునతో సోలో షాట్స్‌ బిట్స్‌గా తీసి, మర్నాడు ఉదయాన్నే వచ్చిన ఏయన్నార్‌తో కాంబినేషన్‌ షాట్స్‌ తీసి, చిత్రీకరణ పూర్తిచేశారట. అలా హడావిడిగా రూపుదిద్దుకున్న - ‘ఈ వేళ నాలో ఎందుకో ఆశలు..’ యుగళ గీతం ప్రేక్షకాదరణ పొందడం విశేషం.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.