రచన రమణీయం... నిర్వహణ స్మరణీయం!
article image(ముళ్ల‌పూడి వెంకట రమణ వర్ధంతి ఫిబ్రవరి 24)
‌‘‌‘ఫిల్మిం‌డియా’‌’‌ పత్రిక సంపా‌ద‌కుడు, ప్రచు‌ర‌ణ‌కర్త బాబు‌రావు పటేల్‌ తన పత్రి‌కలో చిత్ర సమీక్షలు రాసే‌వాడు.‌ ఎక్కు‌వగా హిందీ చిత్రాల గురించి.‌ ఆ సమీక్షలు చదివి, బాగుం‌దంటే ఆ చిత్రం చూసే‌వారు ప్రేక్ష‌కులు.‌ అతను బాగు‌లే‌దంటే −‌ అంతే.‌ అంతటి ప్రామా‌ణి‌కంగా ఉండేవి ఆయన చిత్రస‌మీక్షలు.‌ అంత కూలం‌క‌షంగా, నిశి‌తంగా విమ‌ర్శిం‌చిన సంపా‌ద‌కుడే చిత్రం నిర్మిస్తే? కచ్చి‌త‌మైన ఒక మంచి సినిమా వస్తుం‌దని అను‌కుంటాం కదా −‌ కాని, ‌‘‌‘ద్రౌ‌పది’‌’‌ పేరుతో బాబు‌రావు చిత్రం నిర్మించి, విడు‌దల చేస్తే అది ఘోరంగా పరా‌జయం పొందింది.‌ అంటే, విమ‌ర్శిం‌చడం, సమీక్షిం‌చడం వేరు −‌ తానే రంగం‌లోకి దూకడం వేరూ.‌ వంట బాగా‌లే‌దని విమ‌ర్శిం‌చిన వాళ్లని వంట చెయ్య‌మని చెప్తే? −‌ అలాగే ఉంటుంది సినిమా కూడా.‌

అయితే, ముళ్ల‌పూడి వెంక‌ట‌ర‌మణ కూడా ఆంధ్ర వార పత్రి‌కలో తెలుగు సిని‌మాల్ని విమ‌ర్శిస్తూ రాసే‌వారు.‌ ఒక్కో‌సారి ఉతికి ఆరేసి, ఇస్త్రీ చేసే‌సే‌వారు.‌ సినిమా కథలు బాగు‌లే‌వని రాసిన సమీక్ష‌కుడు తానే కథ తయారు చేస్తే? అయితే, బాబు‌రావు పటే‌ల్‌లాంటి పరి‌స్థితి ఇక్కడ ఎదు‌ర‌వ‌లేదు.‌ ఆ కథ బాగుం‌దని, ఆ సినిమా (దాగు‌డు‌మూ‌తలు) రచన బాగుం‌దని ప్రశం‌సలు వచ్చాయి.‌ తదా‌దిగా, ఆయన సినిమా రచ‌యి‌తగా స్థిర‌ప‌డ్డారు.‌ కాని, ఈ రచ‌యి‌తలో ఒక నిర్మాత కూడా ఉన్నా‌డని తర్వాత తెల‌సింది.‌ ముందు నుంచీ ఆయన చిత్రని‌ర్మాణ విధా‌నాలు ప£‌రి‌శీ‌లి‌స్తు‌న్నారు.‌

article imageరక్త‌సం‌బంధం (1962), దాగు‌డు‌మూ‌తలు (1964) రచ‌నల తర్వాత రమణ ఆలో‌చన ఇంకో‌వేపు వెళ్లింది.‌ ‌‘దాగు‌డు‌మూ‌తలు’‌ జరు‌గు‌తు‌న్న‌ప్పుడే ఆదు‌ర్తికి రమణ మీద సద్భావం ఏర్పడి ‌‘మూగ‌మ‌న‌సులు’‌ (1964) చర్చ‌లకు తీసు‌కు‌న్నారు.‌ ఈ సినిమా విజ‌యంలో రమణ పాలు కూడా ఎక్కువే ఉంది.‌ అలాగే ‌‘తేనె‌మ‌న‌సులు’‌ (1965) కూడా.‌ ‌‘ప్రేమించి చూడు’‌ (1965) ముళ్ల‌పూడి రచ‌నతో విజయం సాధిం‌చిన సినిమా.‌ బాపుకి సినిమా మీద అవ‌గా‌హన.‌ కొత్త‌ కో‌ణంలో సినిమా తీసి చూపిం‌చా‌లని తపన.‌ ఆయన ఏ శాఖ‌లోనూ పని‌చె‌య్య‌క‌పో‌యినా, మంచి మంచి సిని‌మాలు చూసి, ఒక భావం ఏర్పాటు చేసు‌కు‌న్నారు.‌ ముళ్ల‌పూడి రాసిన ‌‘సాక్షి’‌ కథని తెర‌మీద చూపిం‌చా‌లన్న ఆశ చెల‌రే‌గింది.‌ కొద్ది‌పాటి ఖర్చుతో 28 రోజుల్లో ‌‘సాక్షి’‌ పూర్తి చేసింది ఈ ద్వయం.‌ ఇక్కడ నిర్మాణ భాగంలో రమణ చేయూత ఎక్కువ.‌ దాంతో, ఆయన్ని రచ‌యి‌త‌గానే తెలి‌సిన వాళ్లు నిర్మా‌తగా కూడా ఎంత సాధ‌కుడో అర్థం చేసు‌కు‌న్నారు.‌ రమణ సినిమా రచ‌నలు ఒక పక్కన పెడితే, నిర్మా‌తగా ఆయన పథ‌కాలు, ఏర్పాట్లు, విజ‌యాలు ఇంకో పక్కన మరీ నిల‌బ‌డ‌తాయి.‌

‌‘ఇత‌రులు ఏంచేస్తే మనం బాధ‌ప‌డ‌తామో, అది ఇత‌రు‌లకి మనం చెయ్య‌కుండా ఉండ‌డమే పర‌మ‌ధర్మం’‌ అని మహా‌భా‌ర‌తంలో చెప్పి‌న‌ట్టుగా−‌ ‌‘ఇతర నిర్మాణ సంస్థల్లో ఎలాంటి లోపాలు కని‌పి‌స్తాయో ఆ లోపా‌లను మన కంపె‌నీల్లో కని‌పిం‌చ‌కూ‌డదు’‌ అనేది రమణ సూత్రం.‌ అంచేత, ఆయన నిర్వ‌హణ వ్యవ‌హా‌రాలు అంత కచ్చి‌తంగా ఉండేవి.‌
బంగారు పిచ్చిక (1968), బుద్ధి‌మం‌తుడు (1969), బాల‌రా‌జు‌కథ (1970), సంపూ‌ర్ణ‌రా‌మా‌యణం (1972), అందా‌ల‌రా‌ముడు (1973), ముత్యాల ముగ్గు (1975), సీతా‌క‌ల్యాణం (1976), గోరం‌త‌దీపం (1978), కృష్ణా‌వ‌తారం (1982), బుల్లెట్‌ (1985), పెళ్లి‌పు‌స్తకం (1991), పెళ్లి‌కొ‌డుకు (1994).‌.‌.‌ ఈ చిత్రా‌ల‌న్నిం‌టికీ రమణే నిర్మాణ నిర్వ‌హణ.‌ అయితే గోరంత దీపం, కృష్ణా‌ వ‌తారం, బుల్లెట్, పెళ్లి‌పు‌స్తకం, పెళ్లి‌కొ‌డుకు చిత్రా‌లకు మాత్రమే నిర్మా‌తగా ముళ్ల‌పూడి వెంక‌ట‌ర‌మణ అని ఆయన పేరుం‌టుంది.‌ తక్కిన చిత్రా‌లకు నిర్మా‌తల పేరు వేరే ఉన్నా, అన్నీ రమణ నిర్వ‌హ‌ణ‌లోనే జరి‌గాయి.‌ పారి‌తో‌షి‌కాలు మాట్లాడ్డం దగ్గ‌ర్నుంచి అన్నీ ఆయనే చూసే‌వారు.‌ అను‌కున్న ప్రకారం అంద‌రికీ అలా తేదీల ప్రకారం చెల్లిం‌చేసే వారు.‌ సిని‌మాల్లో ప్రతి నిర్మాతా ఒక రూపాయి మిగు‌ల్చు‌కో‌వా‌లని చూస్తాడు.‌ ప్రతి నటి, నటుడు ఒక రూపాయి ఎక్కువ అడ‌గా‌ల‌ను‌కు‌ంటారు.‌ కాని రమణ ఔదా‌ర్యా‌నికి ఒక ఉదా‌హ‌రణ.‌

‌‘అందాల రాముడు’‌ మొదలు పెట్టే‌ముందు ఆయన నాకు ఫోన్‌లో షూటింగ్‌ తేదీలు చెప్పారు.‌ కృత‌జ్ఞ‌తలు చెప్పా‌లని వాళ్ల ఆఫీ‌సుకి వెళ్లాను.‌ ‌‘‌‘ఇప్పు‌డెంత తీసు‌కుం‌టు‌న్నారు?’‌’‌ అని అడి‌గారు.‌ ‌‘‌‘ఐదు‌వేలు’‌’‌ అన్నాను.‌ ఆ రోజుల్లో సినిమా మొత్తా‌నికి డబ్బు మాట్లా‌డే‌వారు ఎన్ని రోజు‌లైనా.‌ ‌‘‌‘అదేం‌టం‌టడీ? ఇంకా ఐదు‌వే‌లేనా? మీలాంటి వాళ్లు కాస్త అడ‌గాలి.‌ మీకు, సాక్షికీ, రాధా‌కు‌మా‌రికీ పారి‌తో‌షికం పెంచు‌తాను.‌ మీకు ఆరు‌వేలు.‌ ఇందండి అడ్వాన్సు’‌’‌ అన్నా‌రా‌యన.‌

నేన‌న్నాను:‌ ‌‘‌‘నేను ఐదు అడి‌గితే నిర్మా‌తలు నాలు‌గిస్తాం, మాకు బడ్జె‌ట్‌లే‌దనే రోజుల్లో మీరు వెయ్యి ఎక్కువ ఇస్తారా! ధన్య‌వా‌దాలు’‌’‌.‌
article image‌‘అందాల రాముడు’‌ సినిమా రాజ‌మండ్రి దగ్గర్లో గోదా‌వరి ఒడ్డున ఉన్న దేవీ‌పట్నం దగ్గర తీశారు.‌ అలాంటి అవుట్‌ డోర్‌ ఏర్పాట్ల గురిం‌చి ఎన్నడూ విన‌లేదు, చూడ‌లేదు! గోదా‌వరి ఒడ్డున వున్న పెద్ద స్థలాన్ని చదును చేయించి, తాత్కా‌లిక గదులు నిర్మిం‌చారు.‌ టాయి‌లెట్లు కట్టారు.‌ ప్రతి గది‌లోనూ మంచాలు, కుర్చీలు, టేబుళ్లు.‌ అక్కి‌నేని దగ్గ‌ర్నుంచి అంద‌రమూ అక్కడే.‌ నాగ‌భూ‌షణం, అల్లు‌రా‌మ‌లిం‌గయ్య, రాజ‌బాబు ఒక పక్క, స్త్రీ పాత్రధా‌రు‌లంతా ఒక‌పక్క.‌ మధ్యలో పెద్ద డైనిం‌గ్‌హాలు.‌ 15 రోజులు షూటింగ్‌.‌ గోదా‌వరి నుంచి గొట్టాల ద్వారా పుష్క‌లంగా నీరు.‌ అది రేవు కాదు.‌ అందరూ దిగి, లాంచ్‌ ఎక్కాలి.‌ అందు‌కని, దిగ‌డా‌నికి మెట్లు కట్టిం‌చారు.‌ ఇలా ఎన్నో సౌక‌ర్యాలు, ఏర్పాట్లు.‌ ఎవరూ ఏ దానికీ ఇబ్బంది పడ‌కూ‌డదు! అదే ఆయన సూత్రం! ప్రతి‌రోజూ, ఉదయం 4:‌30 నిమి‌షా‌లకు స్పీక‌ర్స్‌లో దేవుడి పాటలు విని‌పిం‌చే‌వారు.‌ 5 గంట‌ల‌కల్లా ప్రొడక్షన్‌ పరి‌వారం అంద‌రికీ కాఫీలు అందిం‌చే‌వారు.‌ ఒక‌రోజు నాకు షూటింగు లేదు.‌ బస దగ్గరే ఉండి‌పో‌యాను.‌ 10 గంటల వేళ, అలా తిరు‌గుతూ ఉంటే రమణ గదిలో నిద్రపోతూ కని‌పిం‌చారు.‌ అదే అడి‌గాను అక్క‌డ‌వున్న బాయ్‌ని.‌ ‌‘‌‘ఏమో‌నండి.‌.‌.‌ రాత్రి రెండు‌గం‌ట‌ల‌కొచ్చి పడు‌కు‌న్నారు’‌’‌ అన్నాడు.‌ కాస్సే‌ప‌టికి లేచారు.‌ నేను అడి‌గాను, దానికి ఆయన చెప్పి‌నది.‌

‌‘‌‘రాత్రి తొమ్మి‌ది‌గం‌టల వేళ పాలు విరి‌గి‌పో‌యా‌యని వంట‌వాళ్లు చెప్పారు.‌ ఎలా! తెల్ల‌వా‌రే‌స‌రికి అంద‌రికీ కాఫీలు ఇవ్వాలి.‌ ఇవ్వ‌క‌పోతే, ఆలస్యం అవు‌తుంది.‌ అడు‌గు‌తారు.‌ మేనే‌జర్ని పంపితే లాభం‌లే‌దని నేనే రాత్రి రాజ‌మండ్రి వెళ్లాను.‌ కొన్ని షాపులు మూసే‌స్తు‌న్నారు.‌ ఒక తెలి‌సిన ఆయన్ని పట్టు‌కొని, పాల‌పొడి డబ్బాలు అమ్మే షాపు తీయించి, డబ్బాలు కొని కార్లో వేసు‌కొని, తీసు‌కొచ్చి వంటి‌వా‌ళ్లని లేపి, ఇచ్చే సరికి 2 గంట‌ల‌యింది.‌ ఆ పాలతో కాఫీలు ఇచ్చే‌స్తారు అమ్మయ్య అను‌కొని అప్పుడు పడు‌కు‌న్నాను’‌’‌.‌ ఈ సంగతి ఎవ‌రికీ తెలీదు.‌ ఆయన చెప్ప‌లేదు.‌ ‌‘‌‘పాలై‌పో‌యాయి కాఫీలు లేవు సర్దు‌కోండి’‌’‌ అని చెప్పే తత్వం కాదు ఆయ‌నది.‌

తెల్ల‌వా‌రు‌జా‌మున అంద‌రికీ వేళకి కాఫీలు అందాయి కానీ, వెన‌కాల ఉన్న నిర్మాత చిత్త‌శుద్ధి ఎంతమం‌దికి తెలుసు?

సాధా‌ర‌ణంగా ఒక రోజు అవు‌ట్‌డోర్‌ షూటింగ్‌ ఉంటే, అక్కడే ఎండలో నిల‌బడి, లేదా చెట్టు నీడనో ఇంత అన్నం తినేస్తాం.‌ కానీ రమణ ఒక్క‌రో‌జైనా సరే, షామి‌యా‌నాలు వేయిం‌చేవారు.‌ టేబుళ్లు, కుర్చీలూ, వేయిం‌చేవారు.‌ పద్ధ‌తిగా భోజ‌నాలు పెట్టే‌వారు.‌ ఒక‌సారి నేను బాయ్‌ని పిలిచి కాఫీ కావా‌లని అడి‌గాను.‌ అది ఆయన విని, ఆ బాయ్‌తో అన్నారు:‌ ‌‘‌‘మన వాళ్లు ఎవరూ కాఫీ కావాలి, టీ కావాలి అని అడ‌గ‌కూ‌డదు.‌ మీరే వెళ్లి అడు‌గుతూ ఉండండి.‌.‌.‌ కాఫీ తెమ్మం‌టారా?టీ తెమ్మం‌టారా? అని.‌ అది మర్యాద వాళ్లు మన అతి‌థులు’‌’‌.‌

పారి‌తో‌షి‌కాల చెల్లింపు విష‌యాల్లో కూడా రమణ చాలా పద్ధ‌తిగా ఉండే‌వారు, అను‌క్నుది అను‌కున్న నాటికి ఇవ్వడం ఆయన సూత్రం.‌ అయితే ‌‘గోరం‌త‌దీపం’‌ సినిమా పరా‌జయం పొంద‌డంతో, నాయిక వాణి‌శ్రీకి కొంత డబ్బు బాకీ పడ్డారు.‌ ఆమె కూడా పట్టిం‌చు‌కో‌లేదు.‌ రెండేళ్ల తర్వాత బాకీ‌ఉన్న పైకాన్ని చెక్కు వేసి వాణి‌శ్రీకి పంపిం‌చారు.‌ ఆమెకు అర్థం కాలేదు.‌ ‌‘‌‘ఎందు‌కిది? దేనికి?’‌’‌ అని అడి‌గితే, ‌‘‌‘బాకీ ఉన్న సొమ్ము’‌’‌ అన్నారు.‌

‌‘‌‘నేను మరి‌చి‌పో‌యాను’‌’‌ అని ఆమె అంటే, ‌‘‌‘నేను మరి‌చి‌పో‌లే‌దమ్మా’‌’‌ అన్నారు రమణ.‌ రచ‌యి‌తగా ఎంత నిబ‌ద్ధత ఉందో, నిర్మా‌తగా కూడా అంతి నిబ‌ద్ధత, దక్ష‌త‌గల వారు ముళ్ల‌పూడి వెంక‌ట‌ర‌మణ.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.