అపార్థాల అల్లిక జిగిబిగి ‘మురళీ కృష్ణ’
వ్యక్తులందరూ మంచివారే. కానీ సమాచార లోపం అనుమానాలకు ఆస్కారమిచ్చింది. అపార్థాలు చేసుకున్న పాత్రలన్నీ అనవసరంగా ఆవేదన భారాన్ని మోశాయి. భార్యను అమితంగా ప్రేమించే భర్త, ఆమె మనస్థితిని అర్థం చేసుకోలేక ఆమె సుఖమే కోరుకుంటూ దూరంగా వెళ్లి మనోవ్యధ కలిగించిన అంశమే సీనియర్‌ దర్శకుడు పి.పుల్లయ్య సొంత సినిమా ‘మురళీ కృష్ణ’ ఇతివృత్తం. ముఖ్య పాత్రలన్నీ సమష్టిగా కూర్చొని చర్చించుకొని ఉంటే 14 రీళ్ల సినిమా చూడవలసి ఉండేది కాదు సరికదా, పుల్లయ్య సినిమాకు మలుపుల పురి పెట్టే శ్రమని కూడా తగ్గించుకొని ఉండేవారు. అపార్థాలు, అనుమానాల కారణంగా పర్యవసానాలు ఎంత తీవ్రతను చూపిస్తాయో చెప్పే ప్రయత్నం చేసిన పుల్లయ్య సఫలీకృతుడే, కానీ, ఈ చిత్ర విజయానికి కొన్ని అవాంతరాలు తప్పలేదు. బాక్సాఫీసు బద్దలుకొట్టే సినిమాల ముందు ‘మురళీ కృష్ణ’ వంటి సినిమాలు నిలువలేవని, విజయవంతం కావలసిన సినిమాలు కూడా ఒకోసారి అపజయం పాలవుతాయని చెప్పిన ‘మురళీ కృష్ణ’ ఫిబ్రవరి 14, 1964న విడుదలై 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.


కథ సాగిందిలా..
మాజీ మిలిటరీ అధికారి భయంకరం (యస్వీ రంగారావు) గారాల కూతురు మురళి (జమున), ఆమె స్నేహితురాలు శ్రీలత (శారద). ఇద్దరూ కలిసి ఒక చిత్రకళా ప్రదర్శనకు వెళ్లి ‘మాతృమూర్తి’ అనే చిత్రపటాన్ని చూసి ప్రభావితమవుతారు. ఆ చిత్రం లిఖించిన వ్యక్తి లక్ష్మీకాంతం (హరనాథ్‌)ని మహిళ అని భ్రమించి కలకత్తాలో ఉన్న అతనితో మురళి కలం స్నేహం చేస్తుంది. సినిమా కథకు మూలాధారం ఈ సంఘటనే. ఇదిలా ఉండగా, ఒక కార్నివాల్‌లో అప్రయత్నంగా మురళికి డాక్టర్‌ కృష్ణ (అక్కినేని)తో పరిచయమై అది ప్రేమగా మారుతుంది. ఇద్దరికీ పెళ్లవుతుంది. అన్యోన్యంగా ఉంటారు. అనుకోకుండా మురళికి లక్ష్మీకాంతం నుంచి ఉత్తరం వస్తుంది. అందులో తను లక్ష్మీకాంతం పేరుగల పురుషుడినని, ఆమెను ప్రేమిస్తున్నానని ఉంటుంది. శ్రీలత ఆ ఉత్తరం చదివి మురళిని హెచ్చరించి అతనితో ఉత్తరాయణానికి స్వస్తి చెప్పమంటుంది. కానీ, మురళికి అతనిపై జాలి కలిగి తన స్థానంలో శ్రీలతను ఉంచి, ఆమెనే మురళిగా భ్రమింపజేసి వాళ్లిద్దరినీ కలపాలనుకొని ఉత్తరాయణం కొనసాగిస్తుంది. మెడికల్‌ కాన్ఫరెన్స్‌కి కలకత్తాకి వెళ్లిన కృష్ణ తన చిన్ననాటి స్నేహితుడైన లక్ష్మీకాంతాన్ని కలిసినప్పుడు అతడు తన ఉత్తర ప్రేమాయణాన్ని ప్రస్తావిస్తాడు. ఆమె కృష్ణ ఉండే ఊళ్లోనే ఉంటోందని, ఎలాగైనా తమ ఇద్దరికీ పెళ్లి జరిపించాలని కృష్ణని కోరతాడు. అసలు విషయం తెలియని కృష్ణ- మురళి లక్ష్మీకాంతానికి ఉత్తరం రాయడం గమనిస్తాడు. లక్ష్మీకాంతం తనకు మురళిని గురించి చెప్పిన విషయాలన్నీ రీలులా తిరుగుతాయి. పెళ్లయ్యాక కూడా మురళి లక్ష్మీకాంతాన్ని కోరుకుంటోందని భ్రమపడి అడ్డు తొలగాలని నిర్ణయించి, మారుమూల ప్రాంతాల్లో వైద్య సహకారమందించేందుకు వెళ్లిపోతాడు. వివాహ సమయంలో తాళి కట్టాల్సిన భర్త మరణించడంతో మానసిక అభాగ్యురాలిగా ముద్రపడిన పూర్ణిమ (గీతాంజలి)పై జాలితో, ఆమె తండ్రి వైకుంఠం (గుమ్మడి)కు ఉపశమనం కలిగించాలని, కృష్ణ పూర్ణిమను పెళ్లాడే త్యాగానికి సిద్ధపడతాడు. శ్రీలత లక్ష్మీకాంతానికి జరిగిన విషయం చెప్పడంతో వారిద్దరికీ వివాహం జరుగుతుంది. తండ్రి భయంకరం మరణించడంతో మురళి, కృష్ణ వద్దకు చేరుతుంది. అపార్థాలు తొలగి మురళీ కృష్ణ ఒకటౌతారు. కథ సుఖాంతం.


సినిమారిష్టాలు
‘మురళీ కృష్ణ’ సినిమాకి కథ సమకూర్చింది దర్శకుడు పుల్లయ్య రెండో కూతురు రాధ. ఆచార్య ఆత్రేయ సంభాషణలు సమకూర్చగా పుల్లయ్యే స్వయంగా స్క్రీన్‌ప్లే రాసి అద్భుతమైన టెంపోతో కథ నడిపించారు. హరనాథ్‌కి ‘లక్ష్మీకాంతం’ అనే ఆడ పేరు, జమునకు ‘మురళి’ అనే మగపేరు పెట్టి సినిమా తీశారు. ఈ పేర్ల పితలాటకం లేకుంటే సినిమానే లేదు. ప్రతి సన్నివేశంలోనూ తరువాత ఏమి జరుగుతుందో అనే సస్పెన్స్‌ చోటుచేసుకుంది. సినిమాని ఆకర్షణీయంగా తీసినా కొన్ని చెప్పుకోలేని పరిస్థితులు చిత్ర విజయానికి గండి కొట్టాయి. ఈ సినిమా విడుదలకు సరిగ్గా పక్షం రోజుల ముందు బాబూ మూవీస్‌ వారి ‘మూగ మనసులు’ సినిమా అమలాపురం, తణుకు, భీమవరం వంటి చిన్న పట్టణాల్లో కూడా విడుదలై పల్లెటూరి జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంది. పైగా పూర్తి నిడివి అవుట్‌ డోర్‌ (కొన్ని సన్నివేశాలు మినహా) సినిమా కావడంతో జనానికి కొత్తదనం కనిపించి ఆదరించారు. ఇందులో ‘గౌరి’గా నటించిన జమున పాత్ర విరబూసిన బంతిపువ్వులా, నవ్వుతూ, గెంతుతూ, జలపాతంలా ఉరకలు వేస్తూ ఉండటం చూసిన ప్రేక్షకులు, ‘మురళీ కృష్ణ’లో జమున పాత్రను జీర్ణించుకోలేకపోయారు. బహుశా అందువల్లే ఈ చిత్రం 9 వారాలు మించి ఆడలేకపోయింది. ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే ‘మురళీ కృష్ణ’ సినిమా తొలి రన్‌లో ఆర్జించిన వసూళ్లు ఆరు లక్షలకు లోపే. దాంతో పుల్లయ్యకు పెట్టుబడులు మాత్రమే వచ్చాయి. ఇదే సినిమా 1974 సెకండ్‌ రన్‌లో విజయవంతంగా ఆడి తొమ్మిది లక్షలకు పైగా వ్యాపారం చేసింది. అందుకు కారణం ఘంటసాల మరణం. ఒక్క ‘అల్లూరి సీతారామరాజు’, ‘కోడెనాగు’ సినిమాలు మినహాయిస్తే 1974లో విడుదలైన సినిమాల్లో ఘంటసాల పాటలు లేవు. ‘మురళీ కృష్ణ’ సినిమాలో ఘంటసాల ఆలపించిన పాటలు ప్రేక్షక దేవుళ్లను కట్టిపడేశాయి. ముఖ్యంగా ‘నీ సుఖమే నే కోరుతున్నా’ పాట చరణాల్లో ఘంటసాలను ప్రేక్షకులు గుర్తుచేసుకున్నారు. ‘అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని.. జరిగేవన్నీ మంచికనీ, అనుకోవడమే మనిషి పని’ అనే ఫిలాసఫీని ఘంటసాల మరణానికి అన్వయించుకున్నారు. ఈ సినిమాలో జరిగే సంఘటనలన్నీ అసందర్భంగా ఉండేలా జనం భావించారు. చిత్రంలో పాత్రలన్నీ మంచి స్వభావం గలవే. దుష్ట పాత్రలు లేనే లేవు. సినిమా కేవలం పుల్లయ్య ప్రతిభతో, అక్కినేని, జమునల అద్వితీయ నటనతో నడిచిందే కానీ కథాబలంతో మాత్రం కాదు. కారణాలకేంగాని ‘మురళీకృష్ణ’ సినిమా తరువాత అక్కినేని 15 చిత్రాల్లో నటించినా జమున మాత్రం ఎక్కడా కనబడదు. మళ్లీ 1967లో ‘పూలరంగడు’లో మాత్రమే కనిపిస్తుంది. అక్కినేనికి ‘పూజాఫలము’ చిత్రం కోసం జపాన్‌ దేశం నుంచి తెప్పించిన విగ్గునే వాడటంతో ఆకర్షణీయంగా కనిపించారు. గీతాంజలికి మాత్రం మంచి భవిష్యత్తు కల్పించిన సినిమా ‘మురళీ కృష్ణ’ చిత్రం సింహభాగం సారథి స్టూడియోలో నిర్మించగా పాటల చిత్రీకరణ మాత్రం అవుట్‌ డోర్‌లో జరిపారు.


మాస్టర్‌ పాటల మాయాజాలం
‘మురళీ కృష్ణ’ సినిమాకి పాటలు పెద్ద ఎసెట్‌. మాస్టర్‌ వేణు పద్మశ్రీ సంస్థకు, ముఖ్యంగా పుల్లయ్య దంపతులకు చాలా ఇష్టుడు. పుల్లయ్య సినిమాలకి మాస్టర్‌ వేణు అందించే సంగీతం విశిష్టంగానూ, వినూత్నంగానూ ఉంటుంది. మొదటి పాట దాశరథి రాయగా జమునారాణి బృందం పాడిన ‘ఘల్లుఘల్లని గజ్జెలు మోగాలి.. మొనగాడికే ఝల్లనిపించాలి’ పాటను ఎల్‌.విజయలక్ష్మి నాట్యం చెయ్యగా చిత్రీకరించారు. అక్కినేని, జమున, శారద పాల్గొన్న కార్నివాల్‌లో భాగంగా ఈ పాట సాగుతుంది. వెంపటి సత్యం సమకూర్చిన నృత్యరీతులు, విజయలక్ష్మి నాట్యంలో మమేకమై పూవుకు తావి అబ్బిన చందాన అహ్లాదంగా ఉంటాయి. ఈ సినిమాలో రెండు యుగళ గీతాలున్నాయి. రెండూ నారాయణరెడ్డి రాసినవే కావటం విశేషం. ‘కనులు కనులు కలిసెను, కన్నె వయసు పిలిచెను.. విసురులన్ని పైపైనే, అసలు మనసు తెలిసెను’ పాటను అక్కినేని, జమునలపై గార్డెన్‌లో, సముద్ర తీరపు ఇసుకతిన్నెల్లో చిత్రీకరించారు. ఈ పాట సాగినంతసేపు ఒక పరిణతి చెందిన యువతి చూపే కొంటె భావాలను జమున అద్భుతంగా ఆవిష్కరించింది. ‘దొండపండు వంటి పెదవి పిండుకొనుట ఎందుకు’, ‘నడిచినంత పిడికెడంత నడుము వణికిపోవును’, ‘కలిగిన కోపమంత కౌగిలిలో తీరును’ వంటి సినారె మార్క్‌ పద ప్రయోగాలకు జమున చూపిన హావభావాలు ముచ్చటగొలుపుతాయి. తన సంగీత గురువు నౌషాద్‌ని మరిపిస్తూ మాస్టర్‌ వేణు ఈ పాటను ఆభేరి రాగంలో స్వరపరచి రంజింపజేశారు. ఇక రెండో యుగళ గీతం ఒక భావ గీతం లాంటిది. ‘ఊ అను.. ఊఊ అను, ఔనను.. ఔనౌనను.. నా వలపంత నీవని.. నీవే నని.. ఊ అనూ’ పల్లవితో మొదలయ్యే ఈ పాట విషయంలో చిన్న విశేషం జరిగింది. విభిన్నంగా ఉండాలని, కొత్తగా ధ్వనించాలని సినారె ఈ పల్లవి రాశారు. మాస్టర్‌ వేణు రకరకాల బాణీలు కడుతుండగా పుల్లయ్యకు చిర్రెత్తింది. ‘ఏంటయ్యా ఒకరు ఊ అంటే మరొకరు ఊహూ అంటూ ఎంతసేపు ఈ లాగుడూ, పీకుడూ, ఇదేం పాటయ్యా’ అంటూ విసుక్కున్నారు. సినారె అప్పుడు తరువాత లైనులు ‘నా వలపంతా నీవని.. నీవేనని’ అని హీరో అంటే ‘నా వెలుగంతా నీదని.. నీదేనని’ పుల్లయ్యకు వినిపించి ‘ఈ మాటలు నేరుగా చెప్పిస్తే వైవిధ్యమేముంటుంది? అసలు విషయాన్ని దాచిపెట్టి ముందు ఇద్దరిచేతా ఊ కొట్టిద్దామని నా భావన’ అని చెబితే పుల్లయ్య సినారెని మెచ్చుకొని ఆ పాటను ‘ఊ’ అనిపించేశారు. మోహన రాగంలో ఇమిడిన ఈ పాటను అక్కినేని, జమునపై ఊటీలో గార్డెన్‌ వద్ద చిత్రీకరించారు. ‘పచ్చని ఆశల పందిరి నీడల వెచ్చగ కాపురముందామా’ అని జమున అంటే ‘కౌగిలి వీడక, కాలము చూడక కమ్మని కలలే కందామా’ అనే అక్కినేని అనునయింపు ఎంత సొంపుగా ఉంటుందో చెప్పలేం. మిగిలిన నాలుగు పాటలూ ఆత్రేయ రాసినవే. ఆల్‌టైం హిట్‌ ‘నీ సుఖమే నే కోరుతున్నా.. నిను వీడి అందుకే వెళుతున్నా’ పాటను వేణు ఆభేరి రాగంలో స్వరపరిచారు. ఇండోర్‌లో చిత్రీకరించిన ఈ పాటలో అక్కినేని చూపే ఆవేదన కన్నీరు తెప్పిస్తుంది. ‘వలచుట తెలిసిన నా మనసుకు- మరచుట మాత్రం తెలియనిదా- మనసిచ్చినదే నిజమైతే- మన్నించుటయే రుజువు కదా’ అనే మనసు కవి భావం వర్ణనాతీతం. మరొక పాట ‘ఏమని ఏమని అనుకుంటున్నది- నీ మనసేమని కలగంటున్నది’ పాటను గీతాంజలి తన భావనలను మనసునడిగి సంశయలబ్ధి పొందే విధంగా చిత్రీకరించారు. ‘మెరమెరలాడే వయసున్నది- అది బిరబిర చెరచెర పరుగెడుతున్నది.. మిసమిసలాడే సొగసున్నది- అది గుసగుసలెన్నో చెబుతూ ఉన్నది’ అంటూ మనసు కలే కలల ఫలితాన్ని తెలుసుకుంటూ గీతాంజలి విభిన్నంగా నటించిన తీరు అభినందనీయం. ఇది కూడా ఇండోర్‌ చిత్రీకరణే. గీతాంజలి కోసమే ఒక వీణ పాటను వేణు రాగమాలికగా మలిచారు. ‘మోగునా ఈ వీణా.. మూగవోయిన రాగ హీన.. అనురాగ హీన’ అనే పల్లవిని బిలావస్‌ ఖాన్‌ తోడి రాగంతో మొదలిడి, ‘ఆదిలోనే అపశ్రుతి పలికెను.. నాదమంతా ఖేదమాయెను’ అనే మొదటి చరణాన్ని భాగేశ్వరి రాగంలో, ‘దేవుడు లేని కోవెలగా, జీవితమంతా శిథిలము కాగా’ అనే రెండు చరణాల్ని చంద్రకోస్‌ రాగంలో స్వరపరచి అందమైన పాటగా వినిపించారు. జమున సమక్షంలో గీతాంజలి అనునయిస్తూ జమున పాడే సుశీల గీతం ‘వస్తాడమ్మా నీ దైవము- వస్తుందమ్మా వసంతము’ జమున పెల్లుబికే దుఃఖాన్ని పైకి కనిపించకుండా గీతాంజలికి అభయమిస్తూ ఈ పాటకు చేసే అభినయం అద్వితీయమే! మాధవ్‌ బుల్‌బులే ఫొటోగ్రఫీ, పద్మశ్రీ బ్యానర్‌ని అత్యుత్తమ స్థాయిలో నిలబెట్టిన చిత్రం ‘మురళీ కృష్ణ’.

- ఆచారం షణ్ముఖాచారి


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.