ఆ పాట ఉండకపోతే ‘మురారి’ చేయనన్నారట!
దర్శకుడు కృష్ణవంశీ, కథానాయకుడు మహేష్‌ బాబు కలయికలో రూపొందిన అద్భుత దృశ్య కావ్యం ‘మురారి’. ఓ గండం నుంచి హీరో ఎలా బయట పడతాడా? అని ప్రేక్షకులకు ఆద్యంతం ఉత్కంఠ కలిగించే కథతో వచ్చి ఎంతటి విజయం అందుకుందో తెలిసిందే. మహేష్, సోనాలి బింద్రే కెమిస్ట్రీ ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది. మణిశర్మ సంగీతం మరో ప్రధానం బలం. ఇందులోని ప్రతిపాట ఓ ఆణిముత్యమే అనడంలో అతిశయోక్తి కాదు. 2001 ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘మురారి’ బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించాడు. నేటితో ఈ సినిమా 19 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు మీ కోసం...


మహేష్‌ అప్పటికే యాక్షన్‌ హీరో. తెలుగు కమర్షియల్‌ సినిమాలకు ఓ పద్ధతి ఉంటుందనే విషయం తెలిసిందే. అదే క్లైమాక్స్‌ ముందు మాస్‌ గీతం ఉండటం. దానికి భిన్నంగా దర్శకుడు కృష్ణవంశీ క్లాసిక్‌ సాంగ్‌ ‘అలనాటి రామచంద్రుడి’ని పెట్టాలనుకున్నారు. కానీ, అందరూ వద్దని సూచించారట. మహేష్‌ ఇదే అనుకున్నా.. దర్శకుడికి చెప్పలేకపోయాడు. ఈ విషయం కాస్త కృష్ణ దగ్గరకు వెళ్లింది. ‘‘చివర్లో మాస్‌ సాంగ్‌ ఉండకపోవడం సరైంది కాదు. అనవసరంగా ప్రయోగం చేస్తున్నావు’’ అని కృష్ణ సమాధానమిచ్చారు.


‘‘ఇప్పుడు మనకు రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి.. ఈ క్లాస్‌ సాంగ్‌తో నన్ను సినిమా పూర్తి చేయించడం. రెండు.. ఈ చిత్రాన్ని వదిలేసి వెళ్లిపోవడం. మీరు కమర్షియల్‌ సాంగ్‌తో విడుదల చేసుకోండి. నా పేరు కూడా వేయొద్దు. ఎందుకంటే నేను చేసే ఈ పాట దశాబ్దాల పాటు ఉండిపోతుంది. మీ అబ్బాయి కెరీర్‌కు కావాలంటే పెట్టుకోండి. నేను వెళ్లిపోతా’ అని కృష్ణవంశీ అనడంతో కృష్ణ ఒప్పుకొన్నారు. సినిమా థియేటర్లకు వచ్చాక ఆ పాట గురించి ఎంతోమంది ప్రశంసల జల్లు కురింపించారు.


అందుకే ‘మురారి’ టైటిల్‌ పెట్టాం:
ఈ చిత్రం మన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతుంది. కొన్ని సన్నివేశాల్లో మహేష్‌ రూపం ముగ్ధ మనోహరంగా ఉంటుంది. ఆయన్ను చూడగానే బృందావనం గుర్తొచ్చింది. అందుకే ‘మురారి’ టైటిల్‌ పెట్టామని ఓ సందర్భంలో తెలిపారు దర్శకుడు.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.