నగేష్‌ దశ మార్చిన సర్వర్‌ సుందరం
తెలుగు చలనచిత్ర చరిత్రలో ‘ఆహుతి’ (1950) తొలి అనువాద చిత్రం. హిందీలో జునార్కర్‌ నిర్మించిన ‘నీరా అవుర్‌ నందా’ సినిమాను భాషాంతీకరణ ప్రక్రియ ద్వారా ‘ఆహుతి’ పేరుతో అనువాద చిత్రంగా మహాకవి శ్రీశ్రీ మలిచారు. తర్వాత డబ్బింగ్‌ ప్రక్రియ క్రమంగా పుంజుకొని ఇతర భాషల్లో, ముఖ్యంగా తమిళ భాషలో విజయవంతమైన సినిమాను తెలుగులోకి అనువదించడం మొదలైంది. ఆ పరంపరలోనే 1964లో విడుదలై చరిత్ర సృష్టించిన ఏవీఎం వారి తమిళ చిత్రం ‘సర్వర్‌ సుందరం’ సినిమాను నెల్లూరు కనకమహల్‌ అధినేత, ప్రముఖ మల్లయోధుడు కాంతారావు పహిల్వాన్‌ అదే పేరుతో తెలుగులోకి అనువదించి జులై 29, 1966న విడుదల చేశారు. ప్రముఖ తమిళ హాస్యనటుడు నగేష్‌ దశ మార్చిన ఈ సినిమా తమిళంలో శతదినోత్సవం చేసుకోగా, తెలుగులో 60 రోజులకు పైగా ఆడి విజయవంతమైంది. 53 వసంతాలు పూర్తి చేసుకున్న ‘సర్వర్‌ సుందరం’ చిత్ర విశేషాలు ఇవీ...

అనువాద చిత్రాలు - అనిసెట్టి
అనువాద ప్రక్రియ కష్టమైనదే. కేవలం మాటలను అనువదించడమే కాకుండా, అటు కథాగమనం దెబ్బతినకుండా, నటీనటుల పెదవుల కదలికలకు,హావభావాలకు అనుగుణంగా, తెలుగుదనం ఉట్టిపడేలా రూపకల్పన చేయాలి. అలా తొలిసారి దక్షిణ భారతదేశంలో ఏవీఎం సంస్థవారు కన్నడ సినిమా ‘హరిశ్చంద్ర’ను తమిళంలోకి డబ్‌ చేశారు. అలాగే జెమిని వాసన్‌ తమిళ సూపర్‌ హిట్‌ ‘చంద్రలేఖ’ను కొన్ని మార్పులతో హిందీలోకి అనువదించి ఆ రోజుల్లోనే రెండు కోట్ల వ్యాపారాన్ని చేశారు. అనువాద చిత్రాలు వచ్చిన తొలి రోజుల్లో శ్రీశ్రీ, ఆరుద్ర, పినిశెట్టి, అనిపెట్టి, బలిజేపల్లి వాటికి మాటలు, పాటలు అందించారు. బలిజేపల్లి లక్ష్మీకాంత కవి (జీవితనౌక, సింగారి), సముద్రాల (పరాశక్తి, స్త్రీ జీవితం) వంటి సీనియర్‌ రచయితలు కూడా అనువాద చిత్రాల రచనలో తలదూర్చినవారే! అనువాద రచనలకు పేరెన్నికగన్న అనిపెట్టి సుబ్బారావు తొలుత మావూరు, చరమాంకం, శాంతి వంటి నాటకాలు రాసి పేరు తెచ్చుకున్నారు. తమిళంలో విజయవంతమైన దేవర ఫిలిమ్స్‌ వారి ‘నీలమలై త్తిరుడన్‌’ సినిమాను రవి ఫిలిమ్స్‌ వారు ‘కొండవీటి దొంగ’ పేరుతో అనువాదం చేసినప్పుడు ఆ చిత్రానికి మాటలు, పాటలు సమకూర్చారు. మాయామశ్చీంద్ర (హిందీ), వీరసింహ (కన్నడ), సీత (మల యాళం) వంటి పరభాషా చిత్రాలు 150కి పైగా తెలుగులోకి అనువదించారు. తమిళ డబ్బింగ్‌ సినిమాలు ‘మావూరి అమ్మాయి’, ‘పతివ్రత’, ‘స్త్రీ శపథం’, ‘పాప పరిహారం’, ‘ప్రాయశ్చిత్తం’, ‘దొంగనోట్లు’కు పినిశెట్టి మాటలు, పాటలు సమకూర్చిన తరువాత సర్వర్‌ సుందరం అనువాద చిత్రానికి మాటలు, పాటలు రాసే అవకాశం వచ్చింది. అది అనిసెట్టికి మంచి భవిష్యత్తును ప్రసాదించింది. తమిళంలో ఈ సినిమాను ఏవీయం అధినేత మెయ్యప్ప చెట్టియార్‌ నిర్మించగా కృష్ణ-పంజు దర్శకత్వం నిర్వహించారు.

సర్వర్‌ సుందరం కథ
సుందరం (నగేష్‌) సినిమా నటుడు కావాలని మద్రాసు వచ్చి, తన ప్రయత్నాలు ఫలించక పోవడంతో గ్రీన్‌లాండ్స్‌ హోటల్లో సర్వర్‌గా పనికి కుదురు తాడు. ఆ హోటల్‌ యజమాని చక్రవర్తి (మేజర్‌ సుందరరాజన్‌) కూతురు రాధ (కె.ఆర్‌.విజయ). సుందరం తన హాస్య చతురతతో అందరినీ నవ్విస్తూ ఉంటాడు. సుందరం తల్లి (ఎస్‌.ఎన్‌.లక్ష్మి) అతణ్ణి ఎంతో ఆప్యాయంగా చూసుకుంటూ ఉంటుంది. ఒకసారి మహాబలిపురం విహారయాత్రకు వెళుతున్న బృందానికి తను పనిచేసే హోటలు తరఫున భోజన సదుపాయాలు సమకూర్చే పనిమీద వెళ్లిన సుందరానికి అక్కడ రాధ తారసపడుతుంది. ఆమె తన హోటల్‌ యజమాని కూతురని అతడికి తెలియదు. రాధ తన స్నేహితురాళ్లతో హోటల్‌కు వచ్చినప్పుడు సుందరంతో ఆప్యాయంగా మాట్లాడుతుంది. అది చూసి రాధ తనను ప్రేమిస్తోందని సుందరం గాలిలో మేడలు కట్టుకుంటాడు. సుందరం తన ప్రాణ స్నేహితుడు రాఘవరావు (ముత్తు రామన్‌)ను తను పనిచేసే హోటల్లో యధాలాపంగా కలుస్తాడు. సమాజంలో మంచి పలుకుబడి కలిగిన రాఘవరావు, రాధను ప్రేమిస్తాడు. వారిద్దరికీ వివాహం చేయాలని రాధ తండ్రి నిర్ణయిస్తాడు. ఆ సంగతి తెలియని సుందరం, తను రాధను ప్రేమిస్తున్నట్లు రాఘవరావుకు చెబుతాడు. అది తెలిసి ఖిన్నుడైన రాఘవరావు తన ప్రేమను త్యాగం చేసేందుకు సిద్ధపడతాడు. తన పలుకుబడిని ఉపయోగించి సుందరం చేత రాత్రింపగళ్లు కృషి చేయించి పెద్ద సినిమా స్టార్‌ని చేస్తాడు. సుందరానికి సిరి సంపదలతో బాటు పేరు ప్రఖ్యాతులు దక్కుతాయి. రాఘవరావు ప్రేమత్యాగం చేస్తూ సుందరంను పెళ్లాడమని రాధకు నచ్చచెబుతాడు. రాధ సుందరాని కేవలం ఒక సోదరునిగా భావించానని చెబుతుంది. సుందరం ఒక సినిమా షూటింగులో బిజీగా ఉండగా అతని తల్లి మెట్లమీద నుంచి దొర్లిపడి చనిపోతుంది. సుందరానికి చివరి చూపుకూడా దక్కదు. సుందరానికి రాధ-రాఘవరావుల ప్రేమ విషయం తెలుస్తుంది. వారిద్దరినీ కలిపి, సినిమా నటుడిగా కన్నా హోటల్‌ సర్వర్‌గా పనిచేస్తున్నప్పుడే సంతోషంగా ఉన్నానని చెబుతూ, సర్వర్‌ దుస్తులు ధరించి మరలా హోటల్లో వెయిటర్‌ అవతారమెత్తడంతో సినిమా ముగుస్తుంది.


గొప్పపాటలు
విశ్వనాథన్‌ - రామ్మూర్తి జంట సంగీతం అందించిన చివరి చిత్రాల్లో సర్వర్‌ సుందరం ఒకటి. తెలుగు డబ్బింగ్‌ పనులు వీరిద్దరి తరఫున పామర్తి నిర్వహించారు. ఇందులో పాటలన్నీ హిట్టే. ‘‘సిలై ఎడుత్తాన్‌ ఒరు తిన్న పెణ్ణుట్టు’’ పాటను ‘‘కటిక శిలే ఒక కన్నె పడుచై ఇలలోనే దివి వెలయించే’’గా అనువదించి సుశీల పాడగా కె.ఆర్‌.విజయ బృందం మీద మహాబలిపురం శిల్పాలయాల వద్ద చిత్రీకరించారు. ‘‘ఆవళుకెణ్న్ణ అళగియ ముగం అవశు కెణ్ణా’’ పాటను ‘‘నవయువతీ స్నేహమతీ’’గా ఘంటసాల పాడారు. చిత్రీకరణలో మాత్రం టి.ఎం.సౌందరరాజన్‌ పాడుతూ అభినయిస్తారు. ‘‘పోగపోగ తెరియుం ఇంద పూవై వాసం పురియుం’’ అంటూ పి.బి. శ్రీనివాస్‌, సుశీల పాడిన యుగళ గీతాన్ని ‘‘పూత పూచె హృదయం, ఇది పొంగిపోవు  పరువం’’గా ముత్తురామన్‌, విజయ మీద చిత్రీకరించారు. ‘‘తత్తయ్‌ నెంజుమ్‌ ముట్టుత్తిల్లె’’ పాటను తెలుగులో ‘‘కన్నె డెందం మోహాలందే కరుగదా’’గా మలిచారు. విజయ చిలుకతో మాట్లాడుతూ పాడే పాట ఇది. ఆ చిలక పలుకులు పలికింది ఎల్‌.రాఘవన్‌ మిగతా రెండు పాటలు ‘‘మోహిని ఇలపై వెలసేనేయమ్మా’’ (సుశీల, ఈశ్వరి); ‘‘పాడిపంటలు పొంగి పొర్లినది ఆనాటి భారతం’’ (మాధవపెద్ది, పిఠాపురం, ఈశ్వరి) పాటలు కూడా మధురాలే!


మరిన్ని విశేషాలు...
* ప్రఖ్యాత దర్శకుడు కె. బాలచందర్‌ ‘సర్వర్‌ సుందరం’ పేరుతో ఒక నాటకం రాసి తనే దర్శకత్వం వహిస్తూ ఎన్నో ప్రదర్శనలు ఇచ్చేవారు. ఇందులో నగేష్‌, మేజర్‌ సుందరరాజన్‌, ఎస్‌.ఎస్‌.లక్ష్మి ముఖ్యపాత్రలు పోషించేవారు. ఆ నాటకాన్ని చూసిన మెయ్యప్ప చెట్టియార్‌ కొద్దిపాటి మార్పులతో సినిమాగా తీసేందుకు ఉపక్రమించారు. తమిళ మాతృకలో కథ, మాటలు, స్క్రీన్‌ప్లేలకు రూపునిచ్చింది కూడా బాలచందరే! ఈ సినిమాకు తనే దర్శకత్వం నిర్వహిస్తానని బాలచందర్‌ ముందుకు వచ్చినా, మెయ్యప్ప చెట్టియార్‌ మాత్రం సీనియర్‌ దర్శకులైన కృష్ణన్‌-పంజులకే ఆ బాధ్యతలు అప్పగించారు.తమిళ సినిమా డిసెంబర్‌ 11, 1964న విడుదలైంది. ఒకటిన్నర సంవత్సరం తరవాత తెలుగు డబ్బింగ్‌ వర్షన్‌ విడుదలైంది.* నగష్‌ నటించిన నానుం ఒరుపెణ్‌ (1963) సినిమా చూశాక అతణ్ణే దృష్టిలో ఉంచుకొని బాలచందర్‌ సర్వర్‌ సుందరం నాటకాన్ని రూపొందించారు. 1949లో దర్శకులు కృష్ణన్‌-పంజు నల్లతంబి అనే సినిమాలో హాస్యనటుడు ఎన్‌.ఎస్‌.కృష్ణన్‌ని హీరోగా నటింపజేశారు. మరలా హాస్యనటుణ్ణి హీరోగా పెట్టి అలాంటి సినిమా తీయాలని కృష్ణన్‌-పంజు బాలచందర్‌ను కోరాడు. షూటింగు నిమిత్తం సేలం వెళుతున్నప్పుడు వారు నగేష్‌కు ఈ విషయం చెప్పారు. అలా సర్వర్‌ సుందరం కథ ఒక నాటకంగా ముందు తయారై, ఆ నాటకం విజయవంతమయ్యాక సినిమాగా రూపొందింది.* ఈ సినిమా చూస్తున్నంతసేపు చార్లీ చాప్లిన్‌ సిటీ లైట్స్‌ (1931) నిశ్శబ్ద చలన చిత్రం గుర్తురాక మానదు.

* ఒరిజినల్‌ సర్వర్‌ సుందరం సినిమాలో ‘‘ఆవళుకెణ్ణా అళగియ ముగం ఆవళుకెణ్ణా’’ పాటను టి.ఎం.సౌందరరాజన్‌ పాడుతుండగా ఆర్కెస్ట్రా నిర్వహిస్తూ సంగీత దర్శకుడు ఎం.ఎస్‌.విశ్వనాథన్‌ దర్శనమిస్తారు. డబ్బింగ్‌ చిత్రంలో ఈ పాటను ‘‘నవ యువతీ స్నేహమతీ నవయువతీ’’గా ఘంటసాల పాడుతారు. చిత్రంలో మాత్రం సౌందర్‌ రాజనే పాడుతూ కనిపిస్తారు. ఈ పాట విశ్రాంతి అవగానే వస్తుంది. ఆర్కెస్ట్రా టీమ్‌లో నంజప్ప (ఫ్లూట్‌), జోసెఫ్‌ కృష్ణ (వయోలిన్‌), ఫిలిప్స్‌ (గిటార్‌), శ్యాం (వయోలిన్‌) కనిపిస్తారు. ఈ పాటను పది నిమిషాల్లోనే స్వర పరచడం విశేషం.

* విశ్వ నటచక్రవర్తి ఎస్‌.వి.రంగారావు, ప్రముఖ నటి మనోరమ ఇందులో సినిమా షూటింగులో పాల్గొంటున్న నిజమైన నటీనటులుగా కనిపిస్తారు. తమిళ గేయ రచయిత వాలి భార్య రమణి తిలకం, గాయకుడు సౌందర్‌రాజన్‌ కూడా ఇందులో అతిథి పాత్రల్లో కనిపిస్తారు.

* ఈ సినిమాలో తొలిసారి తెర వెనుక సినిమా నిర్మాణంలో ఉండే స్టూడియో సెట్టింగుల పని తీరు, పాట రికార్డింగు, గుర్రపు స్వారీ సన్నివేశ చిత్రీకరణ, కృత్రిమ వర్షం కురిపించే విధానం వంటి వివిధ అంశాలను చూపడాన్ని ఆ రోజుల్లో విశేషంగా చెప్పుకున్నారు.

* సర్వర్‌ సుందరం సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్ర బహుమతి, ఉత్తమ తమిళ చిత్రంగా ఫిలింఫేర్‌ బహుమతి లభించాయి.

* ఈ సినిమా అటు నగేష్‌కు, ఇటు బాలచందర్‌కు తమిళ చలనచిత్ర రంగంలో నిలదొక్కుకొనేందుకు ఉపకరించింది. తర్వాతి కాలంలో బాలచందర్‌ దర్శకత్వంలో నీర్‌ కుమిళి, మేజర్‌ చంద్రకాంత్‌, అనుబవిరాజా అనుబవి, ఎదిర్‌ నీచల్‌ సినిమాలలో హీరోగా, తామరై నెంజెం, పూవా తలైయ, నూట్రుక్కు నూరువంటి ఎన్నో బాలచందర్‌ సినిమాలలో కమేడియన్‌గా నగేష్‌ నటించారు.

* సర్వర్‌ సుందరం తమిళ మాతృకను హిందీలో మెహమూద్‌తో మై సుందర్‌ హూగా, కన్నడంలో జగ్గేష్‌తో సర్వర్‌ సోమన్నగా పునర్నిర్మించారు.

* సర్వర్‌ సుందరం సినిమా తర్వాత 1965లో అయిరత్తిల్‌ ఒరువన్‌ సినిమాకు సంగీతం అందించాక విశ్వనాథన్‌-రామూర్తి విడిపోయారు. అందుకు
కారణం సర్వర్‌ సుందరం సినిమా అంటే నమ్ముతారా? ఈ సినిమాలో ‘‘ఆవళుకెణ్ణా’’ పాటను విశ్వనాథన్‌ - రామ్మూర్తి కలిసి సంగీతం నిర్వహిస్తున్నట్టు చిత్రీకరించాలి. చిత్రీకరణ రోజు బొంబాయి నుండి నౌషాద్‌ ఆలి స్టూడియోకి వచ్చారు. ఈ పాట రికార్డింగు చిత్రీకరణ చూస్తానని అనడంతో నిర్మాత మెయ్యప్ప చెట్టియార్‌ విశ్వనాథన్‌- రామ్మూర్తిలకు కబురంపారు. విశ్వనాథన్‌ ఆర్కెస్ట్రా నిర్వహిస్తుండగా చిత్రీకరణ జరిపారు. గిట్టనివాళ్లు రామ్మూర్తికి విశ్వనాథన్‌ కావాలనే అలా చేశారని చాడీలు మోశారు. అంతకు ముందు వీరిద్దరూ శ్రీధర్‌ దర్శకత్వంలో నిర్మించిన ‘కళయ్‌ కోవిల’్ సినిమా ఫ్లాప్‌ కావడం అగ్నికి ఆజ్యం తోడయింది. ఇది కాకుండా విశ్వనాథన్‌ ఎల్‌.ఆర్‌.ఈశ్వరిని ఎక్కువగా ప్రోత్సహించడం రామ్మూర్తికి నచ్చలేదు. ఈ కారణాలతో ఇద్దరూ విడిపోయారు. అందుకు సర్వర్‌ సుందరం వేదిక కావడం మాత్రం దురదృష్టమే!

,


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.