ఈ పాటకి నేను డ్యాన్స్‌ చేయాలా? : ఎన్టీఆర్‌
article image
చిన్న వయ‌సు‌లోనే నిర్మా‌తగా మారిన అశ్వ‌నీ‌దత్‌ ఎన్టీ‌ఆర్‌కి వీరా‌భి‌మాని.‌ అందుకే వైజ‌యంతీ మూవీస్‌ తొలి సమ‌ర్ప‌ణగా ఎన్టీ‌ఆర్‌తో ‌‘ఎదు‌రు‌లేని మనిషి’‌ నిర్మిం‌చారు.‌ 1976లో విడు‌దలై నూరు రోజుల పండుగ చేసు‌కున్న ఆ చిత్రం ఎన్టీ‌ఆర్‌ గెట‌ప్‌ను మార్చే‌సింది.‌ అందు‌లోని ఆయన కాస్టూ‌మ్స్, విగ్, బాడీ లాంగ్వేజ్, స్టెప్స్‌ లాంటివి మరో ఇన్నిం‌గ్స్‌కు పునా‌దులు వేశాయి.‌ ఎన్టీ‌ఆర్‌ రిటై‌రయ్యే వరకు ఆ గెటప్‌ కొన‌సా‌గింది.‌ ‌‘ఎదు‌రు‌లేని మనిషి’‌ చిత్రీ‌క‌రణ ‌‘కసిగా ఉంది.‌.‌.‌’‌ పాటతో మొద‌ల‌యింది.‌ షూటిం‌గ్‌కి వచ్చిన ఎన్టీ‌ఆర్‌ ఆ పాట వింటూనే అశ్వ‌నీ‌ద‌త్‌ను పిలి‌పించి ‌‘నేను ఈ పాటకు డ్యాన్స్‌ చేయాలా’‌ అని అడి‌గా‌రట.‌ అశ్వ‌నీ‌దత్‌ సిగ్గుతో తల‌వం‌చు‌కుని ‌‘సార్‌ నేను మీ అభి‌మా‌నిని.‌ నా అభి‌మాన నటుడు ఎలా ఉండాలో.‌.‌.‌ ఏ గెట‌ప్‌లో కని‌పిస్తే బాగుం‌టుందో నాలో కొన్ని ఆలో‌చ‌న‌లు‌న్నాయి.‌ వాటి ప్రకారం కథ తయారు చేసు‌కుని మిమ్మల్ని ఇలా చూపిం‌చ‌ద‌ల్చు‌కు‌న్నాను.‌ నాలాంటి అభి‌మా‌నులు మీకు ఎంతో మంది ఉన్నారు.‌ వారంతా తప్ప‌కుండా ఈ కొత్త‌ద‌నాన్ని ఆహ్వా‌ని‌స్తారు’‌ అన్నా‌రట.‌ అశ్వ‌నీ‌దత్‌ అభి‌మా‌నాన్ని, నిజా‌యి‌తీని మెచ్చు‌కున్న ఎన్టీ‌ఆర్‌ వయ‌సును కూడా లెక్క చేయ‌కుండా వాణి‌శ్రీతో కలసి స్టెప్స్‌ వేశారు.‌ అశ్వ‌నీ‌దత్‌ అంచనా నిజ‌మైంది.‌ ఎన్టీ‌ఆర్‌ కొత్త ట్రెండ్‌ మొద‌లైంది.‌ ‌‘ఎదు‌రు‌లేని మనిషి’‌ శత‌ది‌నో‌త్సవం నాడు ఎన్టీ‌ఆర్‌ మాట్లా‌డుతూ ‌‘అశ్వ‌నీ‌దత్‌ ఇచ్చిన డ్రెస్‌ వేసు‌కు‌న్నాను.‌ విగ్గు తగి‌లిం‌చు‌కు‌న్నాను.‌ ఆయన ఒక అడుగు ఎగ‌ర‌మంటే మరో అడుగు ఎక్కువ ఎత్తుకు ఎగిరాను.‌.‌’‌ అంటూ ప్రజల్లో మారిన అభి‌రు‌చు‌లకు అను‌గు‌ణంగా తానూ మారా‌నని చెప్పారు.‌ Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.