నటరత్న నందమూరి ‘ఉమ్మడి కుటుంబం’
మన దేశంలో ఆర్యుల కాలం నుంచి ఉమ్మడి కుటుంబ వ్యవస్థే ఆనవాయితీ. పురాణాల్లో రామలక్ష్మణులు, ఇతిహాసాల్లో పంచపాండవులు అన్నదమ్ముల అన్యోన్యానికి ఆదర్శమూర్తులుగా నిలిచారు. సమాజం పురోగమించాలంటే ఉమ్మడి కుటుంబాల్లో సహజీవనం, సహకారం మెండుగా ఉండాలి. ఈర్ష్యా ద్వేషాలు లేకుండా కలిసిమెలసి మెలగాలి. అయితే ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు తిలోదకాలు మొదలైన రోజుల్లో నందమూరి తారక రామారావు నాటకీయతను జోడిస్తూ రామకృష్ణ: ఎన్‌.ఎ.టి కంబైన్స్‌ సొంత సంస్థ తరపున ‘ఉమ్మడికుటుంబం’ పేరుతో సినిమా నిర్మించారు. ‘తోడుదొంగలు’ (1954) సినిమా నిర్మించిన 13 ఏళ్ల విరామం తరువాత ఎన్టీఆర్‌ యోగానంద్‌ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ఇది. ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయి వేరుకాపురం పెట్టి అందులో వైభోగం ఉందనుకునే వెర్రితనానికి, ఉమ్మడి కుటుంబంలో ఉంటూ, చాటుగా డబ్బును మూటలు కట్టుకోనే కోడళ్లకు ఈ సినిమా ఒక గుణపాఠం. అంతేకాదు... అంతస్తులను బట్టి అల్లుళ్లను ఆదరించే అత్తగార్లకు, ఇంట అలిగి అత్తగారి ఇళ్లను చేరుకొనే అల్లుళ్లకు, చెప్పుడు మాటలకు, తప్పుడు నడతలకు చెంపపెట్టుగా తీర్చిదిద్దిన సినిమా ‘ఉమ్మడి కుటుంబం’. ఈ సినిమా 1967, ఏప్రిల్‌ 20న విడుదలై 15 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. విజయవాడ దుర్గా కళామందిరంలో ఏకంగా 197 రోజులు ప్రదర్శితమై రజతోత్సవం జరుపుకుంది. ఈ సినిమా విశేషాలు కొన్ని...


* నటుడుగా, నిర్మాతగా, దర్శకునిగా...
ఎన్టీ రామారావుది ఒక విశిష్టమైన గ్రాఫ్‌. నటుడుగా పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, సాంఘిక చలనచిత్ర విభాగాలలో అత్యధిక సినిమాలలో నటించిన ఘనత ఎన్టీఆర్‌ది. 1953లో ‘పిచ్చిపుల్లయ్య’ సినిమాతో నిర్మాణరంగంలో కూడా అడుగుపెట్టి 1992 ‘సామ్రాట్‌ అశోక’ సినిమా వరకు తమ్ముడు త్రివిక్రమరావు, తనయుడు హరికృష్ణ నిర్మాణ సారధులుగా 28 సినిమాలు నిర్మించడం ఎన్టీఆర్‌కే సాధ్యమైంది. ఒకవైపు నటుడిగా రాణిస్తూ పద్దెనిమిది సినిమాలకు దర్శకత్వం బాధ్యతలు నిర్వహించిన ఘనత కూడా ఆయనదే! ‘తోడుదొంగలు’, ‘ సీతారామ కల్యాణం’, ‘వరకట్నం’ సినిమాలకు జాతీయస్థాయి బాహుమతులు లభించగా ‘రాజు-పేద’, ‘లవకుశ’ వంటి సినిమాలకు రాష్ట్రపతి ప్రశంసలు లభించాయి. రామారావు నటించిన మూడు వందల రెండు సినిమాలలో 275 సినిమాలు హిట్లే. వాటిలో సగానికి పైగా శతదినోత్సవాలు జరుపుకున్నాయి. 94 సినిమాలు మూడు వందల రోజులు ఆడితే, 85 సినిమాలు రజతోత్సవాలు జరుపుకున్నవే! 197 రోజులు ఆడిన ‘ఉమ్మడి కుటుంబం’ సినిమా కూడా ఆ కోవలోనిదే. ఇక కృష్ణుడు అంటే రామారావే. పదిహేడు సినిమాలలో కృష్ణుడుగా రాణించిన రామారావు రావణబ్రహ్మ, సుయోధనుడు వంటి ప్రతినాయక పాత్రలు కూడా పోషించి రాణించడం చిన్న విషయం కాదు. అలా ఇతరులకు సాధ్యం కాని రీతిలో ఎన్టీ రామారావు విజయాలు సాధించి తెలుగు సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఆయన ఓ కారణజన్ముడు. ఎన్టీఆర్‌ పుట్టిన రోజును ‘కళాకారుల దినోత్సవం’గా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించి ఎన్టీఆర్‌ రుణం తీర్చుకుంది.


* ‘ఉమ్మడి కుటుంబ’ కథ
అది ఒక చిన్న ఊరు. అందులో గడుసుమిల్లి వారి ఉమ్మడి కుటుంబం ఉంటోంది. తల్లి (హేమలత) సంరక్షణలో నలుగురు కొడుకులు ఉంటున్నారు. పెద్దవాడు నాగయ్య (రేలంగి) పొరుగూరిలో గుమస్తా ఉద్యోగం చేస్తూ కుటుంబ భారం మోస్తున్నాడు. అతని భార్య (సూర్యకాంతం)కి ఒక కొడుకు కిట్టు (రాజ్యలక్ష్మి). భర్త సంపాదనంతా ఉమ్మడి సంసారానికే ఖర్చై పోతోందని ఆమె ఆవేదన. రెండవ వాడు చంద్రం (సత్యనారాయణ) ఉన్న రెండెకరాలు పండిస్తూ కుటుంబానికి కొమ్ముకాస్తున్నాడు. అతని భార్య కాంతం (ఎస్‌.వరలక్ష్మి). పిల్లలు లేరు కనుక ఒళ్లు వంచి పనిచేయాల్సిన అవసరమేముందని తలచే మనస్తత్వం కలది. మూడవ వాడు ముకుందం (ప్రభాకరరెడ్డి). అత్తవారు ఇచ్చిన కట్నం సొమ్ముతో డాక్టరీ పూర్తి చేశాడు. కుటుంబ ఆశలన్నీ అతనిమీదే. అతని భార్య రమ (సావిత్రి) అత్తగారికి చేదోడు వాదోడుగా ఇంటిపనిలో సాయం చేస్తూ ఉంటుంది. ఇక ఆఖరివాడు రాముడు (ఎన్టీఆర్‌). పనీ పాట లేకుండా తిరుగుతున్నాడు. అయితే రాముడికి వదిన రమ అంటే గౌరవం, కిట్టు అంటే ప్రాణం. సంక్రాంతి పండగరోజు కాంతం చేసిన గొడవతోను, భార్య రమ సంసార పక్షపు పద్ధతులు నచ్చక పోవడంతోను ముకుందం పట్నం వెళ్లిపోయాడు. నాగయ్య అప్పులు తీర్చలేక భూమి కౌలుకు ఇచ్చి వ్యవసాయం తీసేశాడు. పట్నం వెళ్లిన ముకుందం మోహిని (ఎల్‌.విజయలక్ష్మి) అనే విలాసిని వలలో పడి పైసా కూడా ఇంటికి పంపకుండా ఇంటినే మరిచిపోయాడు. తోడికోడళ్ల మధ్య సయోధ్య కుదరక చంద్రం భార్య కాంతం పుట్టింటికి పయనమైంది. చంద్రం కూడా ఆమె వెంటే నడిచాడు. ఇల్లు గడవడం కష్టమైపోయింది. నాగయ్య భార్య గౌరి ఉమ్మడి ఇంటిని తడికలు పెట్టి వేరు చేసింది. వదిన రమను అన్న ముకుందానికి అప్పగించాలని మద్రాసు బయలుదేరి వెళ్లాడు. అక్కడ రాముడికి శారద (కృష్ణకుమారి) అనే ఒక జమీందారు (నాగభూషణం) అమ్మాయితో పరిచయమైంది. రాముడి ఇంటి పరిస్థితి, అన్న ముకుందం మోహిని వలలో చిక్కుకోవడం తెలుసుకుంది. మోహినికి బుద్ధిచెప్పి ముకుందానికి కళ్లు తెరిపించేందుకు రాముడిని నవనాగరీకుడిగా తీర్చిదిద్ది, అతన్ని ఒక జమీందారుగా భ్రమింపజేసేలా తయారుచేసి మోహిని వద్దకు పంపింది. రాముడు మోహినిని ప్రేమిస్తున్నట్లు నమ్మించి, ముకుందానికి ఆమె మీద విరక్తి కలిగేలా చేశాడు. అక్కడ పల్లెటూరులో రమ ఒంటరిగా ఉండడంతో పశుపతి (అల్లురామలింగయ్య) ఆమెను బలాత్కరించబోయాడు. అవమానం భరించలేక ఆమె ఆత్మహత్యకు పూనుకుంటే అత్త సముదాయించి, ఆమెను ముకుందానికి అప్పగించేందుకు మద్రాసు బయలుదేరింది. అక్కడ అత్తవారిల్లు చేరిన చంద్రానికి అవమానం జరిగింది. రాముడు, శారద కలిసి పరిస్థితులు చక్కదిద్ది ముకుందాన్ని, రమను కలిపారు. విడిపోయిన ఉమ్మడి కుటుంబాన్ని ఒక తాటిమీదకు తెచ్చారు. రాముడు, శారదలకు వివాహం జరపడంతో సినిమాకు శుభం కార్డు పడింది. ఇతర ముఖ్యపాత్రల్లో ముక్కామల, రాజబాబు, వాణిశ్రీ, ఛాయాదేవి నటించారు. సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే ఎన్టీఆర్‌ సమకూర్చగా జూనియర్‌ సముద్రాల సంభాషణలు, రవికాంత్‌ నగాయిచ్‌ ఛాయాగ్రాహణం బాధ్యతలు నిర్వహించారు. ఎన్టీఆర్‌కు సన్నిహిత మిత్రుడు యోగానంద్‌ దర్శకత్వం నిర్వహించారు.

* రాజు సంగీత సందోహం
ఎన్‌.ఎ.టి.సంస్థ ఆస్థాన సంగీత దర్శకులు టి.వి.రాజు ‘ఉమ్మడి కుటుంబం’ సినిమాకు సంగీతం అందించగా విజయా కృష్ణమూర్తి సహకారం అందించారు. ఈ సినిమాలో రెండు అంతర్నాటకాలు ఉన్నాయి. మొదటిది ‘సతీ సావిత్రి’, ‘క్షీరాబ్దిపైతేలు శ్రీహరి పానుపు’ అనే సీస పద్యంతో ప్రారంభమయ్యే ఈ నాటకంలో యముడు (ఎన్టీఆర్‌)కు పద్యాలు ఘంటసాల, సావిత్రిగా నటించిన వాణిశ్రీకి పద్యాలు కనకం ఆలపించగా మాటలు ఎవరికివారే చెప్పుకున్నారు. రాజబాబు సత్యవంతుడుగా కనిపిస్తాడు. రెండవ నాటకం ‘లంకా దహనం’. ఇందులో రావణుడుగా ఎన్టీఆర్‌ నటించగా సీత పాత్రను వాణిశ్రీ, ఆంజనేయుడి పాత్రను రాజబాబు పోషించారు. పద్యాలు ఘంటసాల, తిలకం ఆలపించారు. కొసరాజు రాసిన ‘తస్సాదియ్యా తస్సాదియ్యా తమాషైన బండి’ పాటను ఎన్టీఆర్, కృష్ణకుమారి మీద చిత్రీకరించారు. ఈ పాట మధ్యలో వచ్చే మాటలను ఎన్టీఆర్‌ పలకడం విశేషం. ఘంటసాల, సుశీల ఆలపించిన ‘బలే మోజుగా తయారైన ఓ పల్లెటూరి బుల్లెబ్బాయి’; ‘చెప్పాలని ఉంది... దేవతయే దిగివచ్చి మనుషులలో కలసిన కథ చెప్పాలని ఉంది’ అనే రెండు సినారె పాటల్ని ఒకే సెట్‌ మీద దర్శకుడు యోగానంద్‌ విభిన్నంగా చిత్రీకరించారు. సినారె రాసిన మరో పాట ‘హలో మై డియర్‌ హలో’ను ఎల్‌.విజయలక్ష్మి, ఎన్టీఆర్‌ల మీద చిత్రీకరించారు. ఘంటసాల పాడిన ‘చేతికి చిక్కావే పిట్టా నువ్వు చచ్చినా నిన్నొదిలిపెట్ట’ పాటలో కూడా ఎన్టీఆర్‌ గళం కలిపారు. దీనిని ఎల్‌.విజయలక్ష్మి, ఎన్టీఆర్‌ల మీద చిత్రీకరించారు. ఇక టైటిల్‌ సాంగ్‌ ‘కుటుంబం ఉమ్మడి కుటుంబం... చల్లని హృదయాలకు చక్కని ప్రతిబింబం’ను ఘంటసాల, లీల ఆలపించారు. ఈ సినిమాలో పాటలన్నీ జనరంజకమైనవే.

* మరిన్ని విశేషాలు
- నటరత్న నట జీవితంలో పెనవేసుకుపోయిన సినిమా ప్రదర్శనశాల విజయవాడలోని దుర్గా కళామందిరం. ఎన్టీఆర్‌ నటజీవితం అంకురార్పణకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన థియేటర్‌ దుర్గా కళామందిరం. 1949లో ఎన్టీఆర్‌ నటించిన తొలిచిత్రం ‘మనదేశం’, 1993లో నటించిన ఎన్టీఆర్‌ చివరి చిత్రం ‘శ్రీనాథ కవిసార్వభౌమ’ కూడా ఈ హల్లోనే ప్రదర్శితమయ్యాయి. అలాంటి దుర్గా కళా మందిరంలో ‘ఉమ్మడి కుటుంబం’ సినిమా 197 రోజులు ప్రదర్శితమై రికార్డు సృష్టించింది. ‘ఉమ్మడి కుటుంబం’ సినిమాకు ముందు నిర్మించిన ఎన్టీఆర్‌ సొంత చిత్రం ‘శ్రీక్రిష్ణ పాండవీయం’ 113 రోజులు, తరువాత నిర్మించిన ‘వరకట్నం’ 100 రోజులు ఈ సినిమా హాలులోనే ఆడడం విశేషం. ఈ సినిమా హాలులో మొత్తం 63 ఎన్టీఆర్‌ సినిమాలు ప్రదర్శితం కాగా, అందులో 31 చిత్రాలు శతదినోత్సవం, తొమ్మిది చిత్రాలు రజతోత్సవం జరుపుకోవడం కూడా విశేషమే.


- సొంత బ్యానర్‌ మీద ఎన్టీఆర్‌ పుష్కర కాలం తరువాత నిర్మించిన తొలి సాంఘిక చిత్రం ‘ఉమ్మడి కుటుంబం’. 1955లో ‘జయసింహ’ తరువాత ఎన్టీఆర్‌ వరుసగా ‘పాండురంగ మహత్య్మం’ (1957), ‘ సీతారామ కల్యాణం’ (1961), ‘గులేబకావళి కథ’ (1962), ‘శ్రీకృష్ణపాండవీయం’ (1966) నిర్మించారు. వీటి తరువాత నిర్మించిన సాంఘిక చిత్రం ‘ఉమ్మడి కటుంబం’.

- ‘ఉమ్మడి కుటుంబం’ చిత్రం తరువాత స్వీయ దర్శకత్వంలో ‘శ్రీరామ పట్టాభిషేకం’, ‘చాణక్య శపథం’ నిర్మిస్తానని ఎన్టీఆర్‌ ప్రకటించారు. కానీ ఏ కారణం చేతనో 1969లో ‘వరకట్నం’ సాంఘిక చిత్రాన్ని స్వీయదర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చలనచిత్ర బహుమతి లభించింది. ఆ తరువాత ‘తల్లా పెళ్లామా’ సినిమా వచ్చింది. ‘ఉమ్మడి కుటుంబం’ సినిమా విడుదలైన పది సంవత్సరాలకు ‘చాణక్యచంద్రగుప్త’ (1977), ఆ తరువాత 1978లో ‘శ్రీరామ పట్టాబిషేకం’ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.

- దర్శకుడు యోగానంద్‌ 1955లో ‘జయసింహ’ సినిమాకు దర్శకత్వం వహించారు. పన్నెండేళ్ల తరువాత మరలా ఎన్టీఆర్‌ సొంత సినిమా ‘ఉమ్మడి కుటుంబం’కు దర్శకత్వం నిర్వహించడం కూడా ఒక విశేషమే.

- ఎన్టీఆర్‌ నిర్మించిన తొలి చిత్రం ‘పిచ్చిపుల్లయ్య’ (1954) సినిమాలో నటించిన 13 సంవత్సరాల విరామం తరువాత నటి కృష్ణకుమారి ‘ఉమ్మడి కుటుంబం’ సొంత సినిమాలో నటించింది. ‘బభ్రువాహన’ (1964) సినిమాలో ఎన్టీఆర్‌కు కథానాయికగా నటించిన ఎస్‌.వరలక్ష్మి ఈ సినిమాలో క్యారక్టర్‌ నటిగా అభినయించడం, అలాగే ఎన్టీఆర్‌కు పాపులర్‌ జోడీగా గుర్తింపు పొందిన సావిత్రి కూడా వదిన పాత్రలో సహాయక పాత్రను పోషించడం కూడా వింతలే!

- ‘ఉమ్మడి కుటుంబం’ సినిమాలో లంకాదహనం అంతర్నాటకం ఉంది. కొసరాజు రాఘవయ్య చౌదరి రచించిన ఈ నాటకంలో పద్యాలను ఘంటసాల, మాధవపెద్ది, ఎం.ఆర్‌.తిలకం ఆలపించగా ఎన్టీఆర్‌ సంభాషణలు పలికారు. అలాగే సతీసావిత్రి అంతర్నాటకంలో ఘంటసాల, ఎం.ఆర్‌.తిలకంతో పాటు ఎన్టీఆర్‌ కూడా సంభాషణలు పలికారు. ‘చేతికి చిక్కావే పిట్టా నువ్వు చచ్చినా నిన్నొదిలి పెట్ట’ అనే ఘంటసాల పాడిన పాటలో మధ్య వినిపించే మాటలు పలికింది కూడా ఎన్టీఆర్‌!

- ‘మంచిమనసులు’ వంటి సినిమాలో విలన్‌గా రాణించిన నాగభూషణం ఇందులో ఎస్‌.వి.రంగారావు వంటి నటుడు పోషించవలసిన పాత్రను పోషించడం ఎన్టీఆర్‌ సమయోచిత నిర్ణయానికి ప్రతీక అని చెప్పవచ్చు. అయితే ఇందులో అల్లు రామలింగయ్య సావిత్రిని బలాత్కరించబోయే సన్నివేశం మాత్రం కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.


- ఈ సినిమా అవుట్‌డోర్‌ సన్నివేశ చిత్రీకరణను మద్రాసుకు చేరువలోవున్న తెలుగు ప్రాంతం ‘తడ’ పట్టణంలో జరిపారు.

- ఆచారం షణ్ముఖాచారి


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.