ప్రేమ జ్వాలకు సైయన్న లేడి కన్నుల చిన్నది
చిత్రం: శ్రీవిఠల్‌ కంబైన్స్‌ వారి ‘అగ్గివీరుడు’ (17-10-1969)
గీత రచన: డా।।సి.నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, సుశీల
సంగీతం: విజయా కృష్ణమూర్తి
అభినయం: ఎస్‌.టి.రామారావు, రాజశ్రీ

ui

లేడి కన్నులు రమ్మంటే, లేత వలపులు జుమ్మంటే ।।2।।
ఓ లమ్మీ ...సై... ఓ లమ్మీ ...సై.... ఓ లమ్మీ ....సైసైసై ...ఓ లమ్మీ ...సై...
కన్నె మనసే నీదైతే, కలికి వెన్నెల తోడైతే ।।2।।
ఓ రబ్బీ ...సై ...ఓ రబ్బీ ...సై... ఓ రబ్బీ ....సైసైసై ... ఓ రబ్బీ ...సై...

వాగులా గలగలా ఉరికీ, తీగలా మెలికలు తిరిగీ ।।2।।
గుండెలో అల్లుకుపొతే, గువ్వలా గుసగుస పెడితే ।।2।।
ఓ లమ్మీ....సై... ఓ లమ్మీ ...సై... ఓ లమ్మీ ...సైసైసై ... ఓ లమ్మీ ...సై...
కన్నె మనసే నీదైతే, కలికి వెన్నెల తోడైతే ।।2।।
ఓ రబ్బీ ...సై... ఓ రబ్బీ ...సై... ఓ రబ్బీ ...సైసైసై .... ఓ రబ్బీ ...సై...

వాలుగా చూపులు చూసీ, పూలపై బాసలు చేసీ ।।2।।
ముద్దుగా ఉందామంటే, ఇద్దరం ఒకటేనంటే ।।2।।
ఓ రబ్బీ... సై... ఓ రబ్బీ... సై... ఓ రబ్బీ.... సైసైసై .... ఓ రబ్బీ ...సై...
లేడి కన్నులు రమ్మంటే, లేత వలవులు జుమ్మంటే
ఓ లమ్మీ ...సై ...ఓ లమ్మీ ...సై...ఓ రబ్బీ ...సై ... ఓ రబ్బీ ...సై...
ఓ రబ్బీ ...సైసైసై ...సైసై

జానపదబ్రహ్మ విఠలాచార్య పేరు వినని పాతతరం సినిమా అభిమానులు వుండరనేది వాస్తవం. విఠలాచార్య కన్నడిగుడు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుపాలైన స్వాతంత్య్ర సమరయోధుడు. హసన్‌లో టూరింగ్‌ టాకీస్‌ నడుపుతూ 1944లో శంకర్‌ సింగ్‌ అనే స్నేహితునితో కలిసి మైసూరులో ‘మహాత్మా పిక్చర్స్‌’ అనే సంస్థను నెలకొల్పి ‘జగన్మోహిని’ అనే కన్నడ సినిమా నిర్మించారు. అలా 1953 వరకు పద్దెనిమిదికి పైగా విజయవంతమైన కన్నడ సినిమాలు నిర్మించారు. తరవాత విఠల్‌ ప్రొడక్షన్స్‌ పేరుతో చిత్రనిర్మాణ సంస్థను స్థాపించి కన్నడంలో ‘కన్యాదానం’ సినిమా నిర్మించారు. ఆపైన మద్రాసుకు మకాం మార్చి తెలుగు, తమిళ సినిమాల నిర్మాణంలో స్థిరపడ్డారు. ‘వద్దంటే పెళ్లి’, ‘జయవిజయ’, ‘పెళ్లిమీద పెళ్లి’, ‘కనకదుర్గ పూజామహిమ’, ‘వరలక్ష్మివ్రతం’, ‘మదనకామరాజు కథ’, ‘గురువును మించిన శిష్యుడు’ చిత్రాలు నిర్మించి, ఎన్‌.టి.రామారావుతో ‘బందిపోటు’(1963) సినిమాతో అద్భుత జానపద చిత్రాల దర్శకునిగా స్థిరపడ్డారు. ‘అగ్గిపిడుగు’, ‘అగ్గిబరాటా’, అగ్గిదొర’ చిత్రాలకు దర్శక నిర్మాతగా, ‘పిడుగురాముడు’, ‘కదలడు-వదలడు’, ‘గండికోట రహస్యం’ వంటి చిత్రాలకు దర్శకుడిగా అద్భుత జానపద చిత్రాలను నిర్మించి జానపద బ్రహ్మగా పేరు తెచ్చుకున్నారు. ఎన్‌.టి.రామారావుతో ఏకంగా 19 సినిమాలు నిర్మించడం విఠలాచార్యకే సాధ్యమైంది. ఈ సినిమాల తరవాత శ్రీవిఠల్‌ కంబైన్స్‌ సంస్థ పేరుతో తన కుమారుడు బి.వి.శ్రీనివాస్‌ను నిర్మాతగా చేర్చి యన్టీఆర్‌తో ‘నిన్నేపెళ్ళాడుతా’ సాంఘిక సినిమా నిర్మించారు. విజయా సంస్థలో ఆర్కెస్ట్రాగా పరిచయం చేసిన విఠలాచార్య, ‘నిన్నేపెళ్ళాడుతా’ సినిమాలో కూడా అతనికి సంగీత దర్శకత్వం నిర్వహించే అవకాశం కల్పించారు. ఆ తర్వాత శ్రీవిఠల్‌ కంబైన్స్‌ పతాకంపై నిర్మించిన ‘అగ్గివీరుడు’ సినిమాకు కూడా విజయా కృష్ణమూర్తినే సంగీత దర్శకునిగా తీసుకున్నారు. ఇందులో ఎన్టీఆర్‌, రాజశ్రీ జంటగా నటించగా, ఇతర ముఖ్యపాత్రలను రామకృష్ణ, మిక్కిలినేని, ముక్కామల, రావి కొండలరావు, విజయలలిత, మీనాకుమారి తదితరులు పోషించారు. ఈ సినిమాలో డా।। సి.నారాయణరెడ్డి సంగీత దర్శకుడు ఇచ్చిన ట్యూనుకు ‘లేడికన్నులు రమ్మంటే, లేతవలపులు జుమ్మంటే ఓలమ్మీ సై’ అనే పాట రాయగా ఘంటసాల, సుశీల ఆ పాటను ఆలపించారు. ఎన్టీఆర్‌, రాజశ్రీ మీద చిత్రీకరించిన ఈ పాటకు ఒక హిందీ పాట మాతృక కావడం విశేషం. ఇంటర్నేషనల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ వారు 1967లో హరివాలా దర్శకత్వంలో ‘లాట్‌ సాహెబ్‌’ సినిమా నిర్మించారు. శంకర్‌ జైకిషన్‌ ఆ సినిమాకు సంగీత దర్శకులు. షమ్మికపూర్‌, నూతన్‌ జంటగా నటించిన ఈ చిత్రంలో హజ్రత్‌పురి రచించిన ‘తన్‌ మె అగ్ని మన్‌ మె చుబన్‌, కాంప్‌ ఉఠా మేరా భీగా బదన్‌, ఓ రబ్బా ఖైర్‌....ఓ రబ్బా ఖైర్‌’ అనే పాటను మహమ్మద్‌ రఫీ, ఆశాభోస్లే ఆలపించగా, షమ్మికపూర్‌, నూతన్‌ మీద చిత్రీకరించారు. ఈ పాటకు మక్కీకి మక్కీ మన తెలుగు పాట. ఆరంభ సంగీతం, ఇంటర్లూడ్‌ బిట్లను అక్కడక్కడా మినహాయిస్తే పాట పల్లవి, చరణాలు కూడా కాపీ చేసినవే కావడం గమనార్హం. తెలుగు పాట హిందీ పాటకన్నా కొంచెం వేగంగా కదులుతుంది తప్పితే బాణీలో మార్పుండదు. హిందీ పాటను ఒక జలాశయం వద్ద చిత్రీకరిస్తే, తెలుగు పాటను ఒక ఉద్యానవన సెట్‌లో చిత్రీకరించారు. ఇంకా చెప్పాలంటే లాట్‌ సాహెబ్‌ పాట సాంఘిక చిత్రంలోది కాగా తెలుగు పాట జానపద చిత్రంలోనిది. అయితే తెలుగు పాటను పాడేటప్పుడు ఘంటసాల కొంత ఇబ్బంది పడ్డారనే విషయం పాటను వింటుంటే తెలిసిపోతూ వుంటుంది. ఆపాట వేగం అందుకు కారణమై ఉండొచ్చు. షమ్మి కపూర్‌ భార్య గీతాబాలి ఒక పంజాబీ సినిమాలో నటిస్తుండగా స్మాల్‌ పాక్స్‌ సోకి చనిపోయింది. ఆమె గౌరవార్ధం లాట్‌ సాహెబ్‌ సినిమా గీతాబాలికి అంకితమిచ్చారు. ఇదీ ‘లేడికన్నుల’ పాట నేపథ్యం

- షణ్ముఖ
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.