ఎన్టీఆర్‌ తొలి ద్విపాత్రాభినయ చిత్రం ‘రాముడు-భీముడు’
‘‘మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ...పట్టుదలే వుంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి వుంటే మనుషులు ఋషులౌతారు. మహాపురుషులౌతారు..’’ అంటూ ‘అడవిరాముడు’ సినిమాలో వేటూరి చెప్పిన సూక్తి దగ్గుబాటి రామానాయుడికి అతికినట్లు సరిపోతుంది. ఎందుకంటే ఆయన సినీ చరిత్రలో ఒక అలుపెరుగని యోధుడు. 13 భాషల్లో 130కి పైగా సినిమాలు నిర్మించి గిన్నిస్‌ ప్రపంచ రికార్డు సృష్టించిన విశిష్ట వ్యక్తి. దాదా సాహెబ్‌ ఫాల్కే, పద్మభూషణ్‌ వంటి కీర్తి చంద్రికలు నీడలా ఆయన వెన్నంటి వచ్చాయి. అలాంటి రామానాయుడి తొలి అడుగుజాడ ‘రాముడు భీముడు’ చిత్రం. ఈ సినిమా 21 మే, 1964న విడుదలై విజయ దుందుభి మోగించింది. ఆ సినీ పాత మధురాలను పునశ్చరణ చేసుకుంటే...


క్లుప్తంగా కథా నేపథ్యం
‘ఇది ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం కథ. ఇద్దరు అన్నదమ్ములు, రాముడు-భీముడు జమిందారు బిడ్డలు. చిన్నతనంలో తప్పిపోయి విడివిడిగా పెరుగుతారు. రాముడు నాటకాల రాయుడు. బావ పన్నే దురాగతాలకు బలి కాబోయిన రాముణ్ణి, భీముడు అతని స్థానంలోకి వచ్చి కాపాడి ఇల్లు చక్కదిద్దుతాడు. సినిమా వేగవంతమైన మలుపులు తిరిగి, ఒకరు జమునను, మరొకరు ఎల్‌.విజయలక్ష్మిని పెళ్లాడటంతో సుఖాంతమౌతుంది.


మూడేళ్ళ అజ్ఞాతం నుంచి వెలుగులోకి
రచయిత డి.వి.నరసరాజు ‘ది ప్రిజనర్‌ ఆఫ్‌ జెండా’ అనే క్లాసిక్‌ని, వేదం వేంకటరాయ శాస్త్రి ‘ప్రతాపరుద్రీయం’ నాటకాన్ని మధించి తొలుత ఒక జానపధ కథ అల్లారు. ఆ కథను నిర్మాత మిద్దె జగన్నాథరావు, దర్శకుడు కమలాకర కామేశ్వరావులకు వినిపిస్తే, అలాంటి కథనే ఎన్టీఆర్‌ ‘నాడోడి మణ్ణన్‌’ పేరుతో కలర్‌ సినిమాగా తీసారని, అది తెలుగులోకి డబ్‌ కావచ్చునని చెప్పి తప్పుకోవడంతో రాజు కథ అటకెక్కింది. తరువాత 1959లో ‘ది స్కేప్‌ గోట్‌’ నవల ఆధారంగా జంట పాత్రలు గల ఒక సాంఘిక కుటుంబ కథను తయారుచేసి ‘రాముడు-భీముడు’గా పేరుపెట్టి, మరలా వారిద్దరికీ సరసరాజు వినిపించారు. కథ నచ్చిన జగన్నాథరావు అక్కినేనితో సినిమాగా తీద్దామని ప్రయత్నిస్తే, అప్పటికే ‘తాషేర్‌ ఘర్‌’ ఆధారంగా ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్న ‘ఇద్దరు మిత్రులు’ సినిమా నిర్మాణంలో వుండటంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. భరణీ రామకృష్ణ, సారథి ఫిలిమ్స్‌ రామకృష్ణా ప్రసాద్‌లతో సహా అందరూ ఆ స్క్రిప్టుని వద్దన్నవారే. ఇది జరిగిన మూడేళ్ల తరువాతగానీ ‘రాముడు-భీముడు’ సినిమా స్క్రిప్టు వెలుగు చూడలేదు. అది కూడా రామానాయుడు తీసుకున్న సాహసోపేత నిర్ణయంతోనే సాధ్యమైంది!


సినీచిత్ర బ్రహ్మనాయుడు
రామానాయుడు కారంచేడులో మోతుబారి ఆదర్శ యువరైతు. ముక్కుసూటి మనస్తత్వం. యుక్త వయసులోనే రైల్‌ మిల్లు నిర్వహించారు. కానీ అతని వేగానికి ఇవన్నీ చిన్న వ్యాపకాలే అనిపించి, 1961లో ఇటుకల వ్యాపారం చేద్దామని మద్రాసు వచ్చారు. అది నచ్చక, రియల్‌ ఎస్టేట్‌ వ్యవహారాలు చక్కదిద్దుతూ, బంధువు కొసరాజు రాఘవయ్య చౌదరి చొరవతో సినీనిర్మాణం వైపు మొగ్గుచూపారు. దర్శకుడు గుత్తా రామినీడు నిర్మిస్తున్న ‘అనురాగం’ చిత్రానికి తన వూరి వారితో భాగస్వామిగా చేరి, సినీ నిర్మాణపు మెలకువలు. సాధక బాధకాలు ఔపోసన పట్టారు. ఆ సినిమాలో తన వంతు పెట్టుబడి పాతికవేలు పోయింది. మొక్కవోని ఆత్తవిశ్వాసంతో 1962 చివర్లో సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థను నెలకొల్పి మిత్రుడు జె.సుబ్బారావుని భాగస్వామిగా చేర్చుకొని చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రామానాయుడికి ఓటమి భయం లేదు. కష్టపడటం ఒక్కటే తెలుసు. కొసరాజు సలహాపై తాపీ చాణక్యను ముందుగానే దర్శకునిగా అనుకున్నారు. వాహిని స్టూడియోలో పరిచయమైన నరసరాజుని మాటల రచయితగా నిర్ణయించి కథాన్వేషణలో ఒక నెలరోజులపాటు ఇద్దరూ ఎన్నో తమిళ సినిమాలు పరిశీలించారు. ఏవీ నచ్చలేదు. చివరికి నరసరాజు వద్ద వున్న ‘రాముడు-భీముడు’ స్క్రిప్టు ప్రస్తావనకి రాగా, నాయుడు మెరీనా బీచ్‌ తీరంలో చాణక్యతోపాటు గంటన్నరసేపు ఆ కథ విన్నారు. తొలి చర్చల్లోనే కథ ఒకే అయ్యింది. ఎన్టీఆర్‌తో మాట్లాడి, ఆయన ఒప్పుకుంటే సినిమాగా తీద్దామని నిర్ణయించుకున్నారు. కథ విని ఎన్టీఆర్‌ ఓకే చేసి కాల్‌ షీట్లు ఇచ్చారు. అదే వేగంతో జమున, యస్వీఆర్, రాజనాల, రేలంగి, రమణారెడ్డి, సూర్యకాంతం, గిరిజ వంటి నటీనటుల్ని బుక్‌ చేసేసారు. ఎన్టీఆర్‌ సిఫారసుపై యల్‌.విజయలక్ష్మిని రెండో హీరోయిన్‌గా తీసుకున్నారు. ‘అనురాగం’ చిత్రానికి సంగీతం సమకూర్చిన పెండ్యాలను సంగీత దర్శకుడిగా నియమించారు. అయితే, చాణక్యకు దర్శకత్వ బాధ్యతలు కట్టబెట్టటం విషయంలో మాత్రం రామానాయుడు నిర్ణయాన్ని కొందరు శ్రేయోభిలాషులు తప్పుబట్టారు. కారణం, అప్పటికే చాణక్య దర్శకత్వం వహించిన తొమ్మిది సినిమాలు వరుసగా విఫలమయ్యాయి. అయినా నాయుడు నిర్ణయం మారలేదు. తన మొదటి ప్రయత్నంలోనే ఒక ఫ్లాప్‌ చిత్రాల దర్శకుడిని, మూడేళ్లుగా మూలపడివున్న ఒక సినిమా స్క్రిప్టుని నమ్మి, పెట్టుబడిపెట్టి, సినిమా తీసిన సాహసవంతుడు రామానాయుడు.


రాముడు-భీముడు నిర్మాణం
ఎన్టీఆర్‌ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన అపురూప సాంఘిక హాస్య చిత్రం ‘రాముడు-భీముడు’. ఎన్టీఆర్‌ 1963 ఆగస్టు నుంచి ఈ సినిమాకి కాల్షీట్లు ఇచ్చారు. ఈలోగా జెమిని వాసన్‌ ఎన్టీఆర్‌తో ‘ఆడబ్రతుకు’ సినిమా ప్రారంభించడంతో కాల్షీట్లు దూరం జరిగాయి. వాసన్‌ సినిమా తొలి షెడ్యూలు జరిగాక వాయిదా పడటంతో ఎన్టీఆర్‌ తనకు ఖాళీ వున్నప్పుడల్లా రామానాయుడు సినిమాకి కాల్షీట్లు సర్దేవారు. నవంబరు 16న ‘రాముడు-భీముడు’ తొలి షూటింగు వాహినీ స్టూడియోలో ఆరంభమైంది. రెండో షెడ్యూలులో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు వద్ద రెండు పాటలు చిత్రీకరించారు. వేలాదిమంది కార్మికుల మధ్య కొసరాజు రాసిన ‘దేశమ్ము మారిందోయ్, కాలమ్ము మారిందోయ్‌’’ పాటను, రివర్‌ వ్యూ గెస్టుహౌసు వద్ద ‘‘తళుకు తళుకుమని గలగలసాగే తరుణీ ఇటురావే’’ అనే సినారె పాటను ఎన్టీఆర్‌ - యల్‌.విజయలక్ష్మిల మీద మూడు రోజుల్లో చిత్రీకరించారు. తరువాత షెడ్యూళ్లు విజయ-వాహిని స్టూడియోలో, కోడంబాకం తదితర పరిసర ప్రాంతాల్లో జరిగాయి. నాయుడు పక్కా ప్రణాళిక వలన అనుకున్న షెడ్యూలు కన్నా సినిమా ముందే పూర్తై, 1964 మే 21న 30 కేంద్రాల్లో విడుదలైంది. విజయా, వాణీ ఫిలింస్‌ పంపిణీ చేయగా అన్ని కేంద్రాల్లోనూ 10 వారాలు పైగా సూపర్‌ హిట్‌గా ఆడి, 10 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంటుంది. ఆ రోజుల్లో ఈ చిత్ర నిర్మాణానికి ఆరున్నర లక్షలు ఖర్చుకాగా రెట్టింపు లాభాలు వచ్చాయి. విజయా వాళ్లు తమిళ హక్కులు కొని ఎమ్జీఆర్‌తో ‘ఎంగవీట్టు పిళ్ళై’గా తీస్తే, అక్కడ కూడా పెద్ద హిట్టయింది. విజయా బ్యానర్లోనే 1967లో ఇదే సినిమాని హిందీలో ‘రామ్‌ ఔర్‌ శ్యామ్‌’గా తీస్తే, అది సూపర్‌ హిట్‌ అవడమే కాకుండా, హీరో దిలీప్‌ కుమార్‌ ఇమేజినే మార్చేసింది. మలయాళంలో ‘అజయ్‌-విజయ్‌’గా సూపర్‌ హిట్టయింది. ఒరియాలో కూడా అంతే! ఒక తెలుగు సినిమా అనేక భాషల్లో రీమేకై విజయం సాధించడం ఒక ఎత్తైతే, ఆ అడుగుజాడల్లోనే తరువాత కాలంలో ‘సీతా ఔర్‌ గీతా’ జైసే కో తైసా,’ ‘గంగమంగ’, ‘బుల్లెమ్మ బుల్లోడు’ వంటి సినిమాలు వచ్చాయి. సినిమా క్లైమాక్స్‌లో మాస్క్‌ షాట్‌ తీసే టైం లేకపోవటంతో సత్కనారాయణను ఎన్టీఆర్‌కి డూపుగా పెట్టి షూట్‌ చేసారు. రామానాయుడు కూడా ఈ సినిమాలో లాయరు వేషంలో నటించారు.


ఇద్దరు సావాసగాళ్లు
ఈ సినిమాలో నటించడానికి అంగీకారం తెలియజేసిన నాటి నుంచి ఎన్టీఆర్‌ రామానాయుడుతో సన్నిహితంగా మెలిగారు. ఇద్దరూ ఒకరినొకరు ‘బ్రదర్‌’ అనే పిలుచుకునేవారు. కాల్షీట్లతో పనిలేకుండా, తను ఖాళీగా వున్నప్పుడల్లా నాయుడికి ఫోనుచేసి షూటింగ్‌ షెడ్యూలు పెట్టుకోమనేవారు. అందుచేతనే సినిమా నిర్మాణం నాలుగు నెలలలోపే ముగిసింది. ఈ సినిమా విడుదల తేదీ మాత్రం ఎన్టీఆర్‌ జీవితానికి ముడిపడివుంది. బసవరామతారకంతో ఎన్టీఆర్‌ పెళ్లి 1942 మే 21న జరిగింది. ఎన్టీఆర్‌కి తొలి మేకప్‌ టెస్ట్‌ 1947 మే 21న శోభనాచల స్టూడియోలో జరిగింది. ‘రాముడు-భీముడు’ సినిమా 1964 మే 21న విడుదలైంది. ఎన్టీఆర్‌ భీముడుగా మొదటిసారి వేషం వేసింది ఈ సినిమాలోనే. తరువాత ‘పాండవ వనవాసము’ చిత్రంలో పూర్తిస్థాయి భీముడి పాత్ర ధరించి మెప్పించారు.


పాటల విన్యాసం
పెండ్యాల సంగీతంలో ఈ సినిమా పాటలన్నీ సూపర్‌ హిట్లే! శ్రీశ్రీ రాసిన ‘‘ఉందిలే మంచికాలం ముందు ముందున, అందరూ సుఖపడాలి నందనందనా’’ పాటను ఘంటసాల, సుశీల బృందం ఆలపించారు. ఈ పాట ద్వారా ‘‘అందరికోసం ఒక్కడు. ఒక్కడికోసం అందరూ నిలవాలి’’ అనే సందేశాన్ని ఫ్యాక్టరీ వార్షికోత్సవం సందర్భంగా కార్మికులకు గుర్తుచేస్తారు. ఇక సినారె రాసిన మూడు పాటలు ట్యూన్లకు రాసినవే! ఎన్టీఆర్, జమునల మీద తీసిన ‘‘తెలిసిందిలే, తెలిసిందిలే... నెలరాజ నీరూపు తెలిసిందిలే’’ పాటను అభేరి రాగంలో స్వరపరిచారు. జమున మనసు తెలియని భీముడి పాత్రలోని ఎన్టీఆర్‌ ‘‘కనులేమిటో, ఈ కథ యేమిటో శ్రుతి మించి రాగాన పడుతున్నది’’ అంటూ సందేహం వెలిబుచ్చడం పాటలోని విశేషణం. ‘‘అదే నాకు అంతు తెలియకున్నది, ఎదోలాగు మనసు లాగుతున్నది’’ అనే యుగళగీతాన్ని సింధు భైరవి రాగంలో పెండ్యాల స్వరపరిచినా, పాట మొత్తం పాశ్చాత్యశైలిలో ఫాస్ట్‌ బీట్‌లోనే సాగుతుంది. మూడో పాట ఎన్టీఆర్, విజయలక్ష్మి పాడుకునే ‘‘తళుకు తళుకుమని గలగల సాగే తరుణీ ఇటురావే’’ అనే డ్యూయట్‌. ఈ పాటలో ‘‘రమ్మనకు. పగలే నను రారమ్మనకు’’ అనే ప్రయోగముంది. కపిల కాశీపతి అనే సెన్సారు ఆఫీసరు దీనికి అభ్యంతరం తెలిపారు. ‘‘పగలు రావద్దంటే, సాయంత్రమో, రాత్రో రమ్మన్నట్లే కదా! కర్పూర వసంతరాయలు వంటి గొప్ప కావ్యాన్ని రాసిన మీరు రాసే పాటలో అన్యార్థానికి అవకాశం వుండకూడదని నా అభిప్రాయం’’ అని కాశీపతి సినారెకి చెప్పగా. ఆయన ఆత్మీయతకు వివశులైన సినారె, వెంటనే ఆ లైనుని ‘‘ఇపుడే నను రా..రమ్మనకు’’ అని మార్చారు. అప్పటికే పాటచిత్రీకరణ జరిగిపోవడంతో లిప్‌ మూవ్మెంటుని మాత్రం సరిచేయలేక పోయారు. కొసరాజు రాసిన ప్రబోధగీతం ‘‘దేశమ్మ మారిందోయ్‌. కాలమ్ము మారిందోయ్‌’’ పాటలో ‘‘అక్రమాలకు, అసూయలకు ఆనకట్ట ఇదేఇదే. త్యాగమంటే ఇదే ఇదే. ఐకమత్య మిదేఇదే. నిజమౌ శ్రమజీవివంటే నీవెనోయ్, నీవేనోయ్‌’’ అంటూ పాట నడుస్తుంటే, ఆనకట్ట నిర్మాణంలో కూలీల శ్రమ కళ్లకద్దినట్టు షూట్‌ చేసారు. ‘‘సరదా సరదా సిగరెట్టు. ఇది దొరల్‌ తాగు బల్‌ సిగరెట్టు’’ అనే పేరడి సాంగుని రేలంగి. గిరిజలమీద చిత్రీకరించారు. అయితే ‘‘ఈ సిగరెట్టుతో ఆంజనేయుడు లంకా దహనం చేసాడు’’ అనే ప్రయోగం మీద మాత్రం చాలా విమర్శలు వచ్చాయి. మరో కొసరాజు పాట ‘‘ఫో ఫో మామా పొమ్మికన్, నా సమీపమునకిక రావలదు. రాతగదు’’ కూడా పేరడీనే. ఈ సినిమాలో పద్యాలు కూడా చాలా సరదాగా వుంటాయి. మరొక విశేషమంటే... ఈ సినిమా కోసం ఆరుద్ర రాసిన పాట ‘‘తలచుకొంటే మేను పులకరించేను, తమకు తామే కనులు కలలుగాంచేను’’ కూడా ఎన్టీఆర్, జమున మీద షూట్‌ చేసారు. కానీ నిడివి ఎక్కువ కావడంతో సినిమాలో వాడలేదు. రామానాయుడు తీసిన రెండో సినిమా ‘ప్రతిజ్ఞా పాలన’లో ఆ పాటను వాడుకున్నారు. ‘ప్రతిజ్ఞాపాలన’ సినిమాకు మాస్టర్‌ వేణు సంగీత దర్శకులైనా, సినిమా క్రెడిట్స్‌లో పెండ్యాల పేరు కూడా వేసి రామానాయుడు తన సంస్కారాన్ని చాటుకున్నారు. లాస్ట్‌ బట్‌ నాట్‌ ది లీస్ట్‌.. ‘‘రాముడు భీముడు’ సినిమా ఒక సువర్ణికా సుగంధం...ఒక సంచలన ప్రభంజనం!

- ఆచారం షణ్ముఖాచారి


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.