సాంఘిక చిత్రంలో.. పౌరాణిక గీతం!
ఎన్టీఆర్‌ (కృష్ణుడు), జగ్గయ్య (అర్జునుడు), దేవిక (సుభద్ర)లతో ‘అనుపమ’ సంస్థ నిర్మాత- దర్శకుడు కె.బి.తిలక్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించాలనుకున్న పౌరాణిక చిత్రం ‘శ్రీకృష్ణార్జున’. అన్నీ సిద్ధం చేసుకొని, కొంత భాగం చిత్రీకరించారు కూడా. అంతలో ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ల కాంబినేషన్‌లో ‘గుండమ్మ కథ’ (7.6.1962) విడుదలై అఖండ విజయం సాధించడంతో అగ్రనటులతో ‘కృష్ణార్జున’ తీస్తే వాణిజ్యపరంగా బాగుంటుందన్న ఆలోచన తిలక్‌కి వచ్చింది. అప్పటికే కొంతమేర పూర్తయిన తమ ‘కృష్ణార్జున’లో అర్జునుడి వేషం వేస్తున్న మిత్రుడు జగ్గయ్యని ఒప్పించి, ఆ వేషం కోసం అక్కినేనిని అడిగారట తిలక్‌. ప్రతిపాదన వింటూనే ‘‘ఎన్టీఆర్‌ పక్కన పౌరాణికంలో వేయడం కష్టమేమోనండీ’’ అని సందేహించారట ఏయన్నార్‌. చిత్రం ఏమిటంటే ఏయన్నార్‌ అలా అన్న కొద్దిరోజుల్లోనే కె.వి.రెడ్డి సొంత సంస్థ జయంతి పిక్చర్స్‌ పతాకంపై ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ (9.1.1963)లో ఎన్టీఆర్‌తో కలిసి నటించడం, ఆ చిత్రం ఘన విజయం సాధించడం జరిగిపోయాయి. ఓ సందర్భంలో తిలక్‌ తనకు ఎదురైనప్పుడు ‘‘కె.వి.రెడ్డి గారు మా ‘అన్నపూర్ణ’ సంస్థ తొలి చిత్రం ‘దొంగరాముడు’ చేసి పెట్టారు. ఆయన అర్జునుడి పాత్ర వేయమని అడిగితే కాదనలేకపోయాను’’ అని అక్కినేని సర్దిచెప్పారట. ఆగిపోయిన తన డ్రీం ప్రాజెక్ట్‌ ‘శ్రీకృష్ణార్జున’లోని జగ్గయ్య, దేవికలపైన చిత్రించిన ‘‘నీవూ నేను జాబిలీ..’’ (ఆరుద్ర, పెండ్యాల, ఘంటసాల, సుశీల) పాటంటే తిలక్‌కి ఎంతో ఇష్టమట. అందువల్ల వేరే సంస్థ వారికి తాను తీసి పెట్టిన ‘చిట్టి తమ్ముడు’ (21.12.1962) సాంఘిక చిత్రంలో స్వప్న సన్నివేశాన్ని కల్పించి, జగ్గయ్య, దేవికలు నటించిన ఆ పౌరాణిక యుగళ గీతాన్ని వృథాపోనివ్వకుండా వినియోగించుకున్నారాయన.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.