19 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ‘నువ్వు నాకు నచ్చావ్‌’

‘నువ్వు నాకు నచ్చావ్‌’ ఈ పేరు వినగానే ప్రేమ కంటే ముందు పొట్ట చెక్కలయ్యే కామెడీ గుర్తుకొస్తుంది. సినిమా అంటే కామెడీ ఉండాలనే ధోరణిలో కాకుండా కథలోనే నవ్వు సన్నివేశాలు ఒదిగిపోయిన సినిమా ఇది. ఈ చిత్రం థియేటర్లలో వినోదం పంచి 19 ఏళ్లు గడిచింది. 2001 సెప్టెంబరు 6న విడుదలైంది ఈ చిత్రం. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు ఓసారి నెమరువేసుకుందాం. శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై దర్శకుడు విజయ్‌ భాస్కర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రచన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. ఈ సినిమాకు ఆయన మాటలే కీలకం. ఆయన రాసిన ప్రతి డైలాగ్‌ ప్రేక్షకుడ్ని ఆలోచింపజేస్తుంది. ఇందులోని పాటలు శ్రోతలను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. సంగీత దర్శకుడు కోటి స్వరాలు, సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అంతగా కుదిరాయి. వెంకటేశ్వర్లు(వెంకీ)గా వెంకటేష్‌, నందుగా ఆర్తి అగర్వాల్‌ ఇద్దరూ పోటీపడి నటించారు. ఆర్తికి ఈ సినిమాతోనే టాలీవుడ్‌కు పరిచమైంది. తొలి చిత్రంతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రకాశ్ రాజ్‌- వెంకటేశ్‌, బ్రహ్మానందం- వెంకటేశ్‌ మధ్యసాగే సంభాషణలు వచ్చినపుడు నవ్వు ఆపుకోవడం చాలా కష్టం. సునీల్‌ చేసిన బంతి పాత్ర ఎప్పటికీ గుర్తిండిపోతుంది. ఆర్తి అత్తగా ప్రముఖ నటి సుహాసిని నటన ప్రేక్షకుడ్ని కట్టిపడేస్తుంది. ఎం.ఎస్‌ నారాయణ, సుధ, హేమ, పృథ్వీ,ఆషా షైనీ తమ తమ పాత్రలతో మెప్పించారు.ఈ చిత్రంలోని కొన్ని ఫేమస్‌ డైలాగ్స్‌:

* నీకు ప్రేమ కావాలి, మీ నాన్నకు పరవు కావాలి, మా నాన్నకు మీరు కావాలి.. అంటే ఈ పెళ్లి జరగాలి, నవ్వు వెళ్లి పోవాలి, నన్ను మరిచిపోవాలి.

* నేను అమెరికా వెళ్లి డబ్బు సంపాదించి కారు కొంటాను. దాని పక్కన నిలబడి ఓ ఫొటో దించుకుని పంపించాలి. అంతేకానీ దాంట్లో మా నాన్నని ఎక్కించుకుని తిరగ్గలనా?లేదు    అదే మా ఊరిలో వ్యవసాయం చేసుకుంటే కనీసం మా నాన్నను స్కూటర్‌ ఎక్కించుకుని తిరగ్గలను అది నాకు హ్యాపీగా ఉంటుంది.

* ప్రేమ ఫలానా టైంకి ఫలానా వాళ్ల మీదే పుడుతుందని ఎవరు చెప్పగలరన్నయ్య? అదే తెలిస్తే ఏ ఆడపిల్ల ఆ టైంకి ఇంట్లో నుంచి బయటకు వెళ్లదు. ఇలా అందరి ముందు దోషిలా నిలబడదు.

* పెళ్లికొచ్చి అక్షింతలు వేసేవాడు ముఖ్యమా? నీ కూతురు మెడలో తాళి కట్టేవాడు ముఖ్యమా?


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.