అలనాటి పలనాటి చరిత్రకు అసమాన దర్పణం!

బలమైన కథ, పటుత్వమైన కథనం, ఉత్తమ నటన, చక్కని సంగీతం, మంచి ఛాయాగ్రహణం సమకూరితే జనరంజకమైన సినిమాలు రూపొందుతాయి. అలాంటిదే అనురూపా ఫిలిమ్స్‌ వారు గుత్తా రామినీడు దర్శకత్వంలో నిర్మించిన ‘‘పల్నాటి యుద్ధము’’ చారిత్రాత్మక చిత్రం. మహాభారత గాధను పోలిన ‘పల్నాటి వీరచరిత్ర’ తెలుగువారికి సొంతం. ఎప్పుడో పన్నెండో శతాబ్దంలోనే అంటరానితనం నిర్మూలనకు, సర్వమత సామరస్యానికి జీవితాన్ని అంకితం చేసిన మహా పురుషుడు ‘పల్నాటి బ్రహ్మనాయుడు’. అతడు చేపట్టిన పవిత్ర ఉద్యమానికి అడ్డు తగులుతూ పల్నాడు నాశనానికి ‘నాయకురాలు నాగమ్మ’ కారణమవుతుంది. పశుబలం కంటే సిద్ధాంత బలమే గొప్పదని నిరూపించిన ‘పల్నాటి యుద్ధము’ సినిమా 1966 ఫిబ్రవరి 18న విడుదలై విజయం సాధించింది. ఈ సినిమా విశేషాలు కొన్ని...


చరిత్రలో నిలిచిపోయిన కథ...

పల్నాడుకు రాజధాని గురజాల. ఆ పల్నాటి సీమ, అనుగురాజు కుమారుడు నలగామరాజు (గుమ్మడి) పాలనలో వుంది. నలగామరాజు సవితి తల్లి విద్యాలదేవి (హేమలత). ఆమె కుమారులు నరసింహరాజు (రాజనాల), మలిదేవుడు (బాలయ్య). ఆ రాజ్యానికి అనుగురాజు కాలం నుంచీ వీరవైష్ణవుడైన బ్రహ్మనాయుడు (యన్‌.టి.రామారావు) మహామంత్రి. బ్రహ్మనాయుడి భార్య ఐతాంబ (అంజలీదేవి). వీరికి లేకలేక కలిగిన సంతానం బాలచంద్రుడు (హరనాథ్‌), బ్రహ్మనాయుడు సర్వ మానవ సమానత్వానికి, అహింసాతత్వానికి, శాంతి స్థాపనకు, శాంతి స్థాపనకు కట్టుబడిన వ్యక్తి. ఆ రోజుల్లోనే మాచెర్ల చెన్నకేశవ స్వామి ఆలయంలో హరిజనులకు ఆలయ ప్రవేశం కల్పించిన సంస్కరణ శీలి. అంతేకాదు హరిజన వర్ణానికి చెందిన కన్నమనాయుని (మిక్కిలినేని) సైన్యాధిపతిగా నియమించాడు. తన కుమారుడు బాలచంద్రుడు పుట్టినప్పుడు జ్యోతిష్కులు అతడి వలన పల్నాడు నాశనం కానుందని చెబితే, రాజ్యక్షేమం కోసం బాలచంద్రుని చంపించమని వేగులను పురమాయించిన ధీశాలి. కానీ, సైన్యాధ్యక్షుడు కన్నమనాయుడు ఆ బాలుని కాపాడి, రహస్యంగా పెంచుతాడు. ఓసారి బ్రహ్మన్న చేత అవమానానికి గురైన గోపమంత్రి (కె.వి.యస్‌.శర్మ) కక్ష సాధించే పథక రచన చేస్తాడు. చిట్టగామాలపాడు గ్రామంలో ధనవంతురాలైన నాగమ్మ (భానుమతి)ను ఆశ్రయించి, ఆమె నలగామరాజు దగ్గర మూడు రోజుల రాజ్యాధికారాన్ని పొందేలా చేస్తాడు. ఆమె నలగామరాజు మనసు మార్చివేయడంతో కినుక వహించిన బ్రహ్మన్న తన పదవిని వదులుకుంటాడు. తల్లి కోరిన విధంగా నలగామరాజు మాచెర్ల రాజ్యాన్ని తమ్ముడు మలిదేవుని పరం చేస్తాడు. బ్రహ్మనాయుడు మలిదేవుని పక్షం వహిస్తాడు. కొమ్మరాజు (ముక్కామల) పుత్రుడు అలరాజు (కాంతారావు)కు నలగామరాజు కూతురు పేరిందేవి (వాసంతి)తో వివాహానికి నాగమ్మ ఏర్పాట్లు చేస్తుంది. పెళ్లి సందర్భంగా గురజాలలో కోడిపందేలు జరుగుతాయి. ఆ కపట కోడి పందెంలో మలిదేవరాజు, బ్రహ్మన్నలు ఓడిపోయి ఏడు సంవత్సరాల అరణ్యవాస శిక్షకు గురవుతారు. కన్నమనాయుడు బాలచంద్రుని బ్రహ్మన్న వద్దకు తీసుకొనివస్తాడు. కన్నమనాయుడు కూతురు మాంచాల (జమున)తో బాలచంద్రుని వివాహం జరుగుతుంది. అరణ్యవాసానంతరం మలిదేవరాజు అలరాజును రాయబారిగా నలగామ రాజు వద్దకు పంపగా, నాగమ్మ ప్రోద్బలంతో నరసింహారాజు అతనికి విషమిచ్చి చంపిస్తాడు. దానితో యుద్ధం అనివార్యమవుతుంది. మలిదేవుడు, బ్రహ్మన్న కారంపూడిలో నలగామరాజుతో యుద్ధం చేస్తారు. మాంచాల తన భర్త బాలచంద్రుని కూడా యుద్ధానికి పంపుతుంది. యుద్ధంలో అందరూ హతులౌతారు. చివరికి బ్రహ్మనాయుడు, నలగామరాజు, కన్నమనాయుడు, నాగమ్మ మాత్రమే మిగులుతారు. బ్రహ్మనాయుడు రాజ్యాన్ని విడిచి గుత్తికొండ బిలంలో తపస్సు చేసుకునేందుకు వెళ్లిపోవడంతో సినిమా ముగుస్తుంది.

సంగీత సాహిత్య సౌరభాలు....
* ఘంటసాలతో బాటు సుశీల, జానకి, స్వర్ణలత, వసంత, బాలమురళీకృష్ణ, పి.బి.శ్రీనివాస్, మాధవపెద్ది, పిఠాపురం, గోపాలం పాటలు, పద్యాలు పాడడం విశేషం. మల్లాది రామకృష్ణశాస్త్రి ఆరు పాటలు రాయగా, గుర్రం జాషువా పన్నెండు పద్యాలు రాశారు. సాలూరు రాజేశ్వరరావు సంగీతం సమకూర్చారు.


*
బాలచంద్రుడు పుట్టిన సందర్భంగా స్వర్ణలత, వసంత బృందం ఆలపించే మల్లాది రామకృష్ణశాస్త్రి గీతం ‘‘వెలుగొచ్చెనే లేత వెలుగొచ్చెనే... కలవారి లోగిలికి కళ వచ్చెనే... పండు తెలిజేజె సిగపూవు దిగివచ్చెనే’’ పాటను స్వరకల్పన చేస్తున్నప్పుడు ‘‘తెలిజేజె’’ అంటే అర్థం తెలియక దర్శకుడు మల్లాదిని అడిగారట. ‘‘తెలిజేజె’’ అంటే శివుడని. ‘‘సిగపూవు’’ అంటే శివుని సిగలో అలంకారమై వుండే నెలవంక అని వివరించారట మాల్లాది. ఈ పాట చివరిలో ‘‘జాను తెనుగూ మ్రోగు వీరగీతాలకు... నీ పేరే పల్లవి కావాలి’’ అంటూ బాలచంద్రునికి దీవెనలందించడం మల్లాది ప్రతిభ.

* మల్లాది రచించిన మరోగీతం ‘‘జయ శంభో శివశంకరా... జగదీశా స్వయంభో ప్రభో’ గీతంలో నాగమ్మ భక్తితత్పరత, దేశభక్తి ద్యోతకమవుతాయి. టైటిల్స్‌లో బి.గోపాలం పాడిన పులుపుల శివయ్య గీతం ‘‘శాతవాహన తెలుగు - చక్రవర్తుల శౌర్యమిదె బ్రహ్మ్యమిదే’’లో పల్నాటి వీరకథను క్లుప్తంగా తెలియజేస్తుంది. ఆరుద్ర రాసిన ‘‘ఒక మేఘం వచ్చింది - నా చంద్రుని దాచినది’’ పాటను సుశీల, జానకి ఆలపించగా జమున, వాసంతిలపై చిత్రీకరించారు.


జాతీయ స్థాయి గుర్తింపు:


*
చరిత్రతో, భావోద్వేగాలతో ముడిపడిన ఈ కథను అనురూపా ఫిలిమ్స్‌ బ్యానర్‌ మీద టి.హనుమంతరావు, యార్లగడ్డ లక్ష్మయ్య చౌదరి, దగ్గుపాటి సూర్యనారాయణ కలిసి నిర్మించారు. సదాశివబ్రహ్మం, కొడాలి గోపాలరావులు  రాయగా, గుత్తా రామినీడు దర్శకత్వం వహించారు.

* ఇందులో యన్టీఆర్, భానుమతి పోటిపడి నటించారు. నాయకురాలు నాగమ్మగా భానుమతి తనకుతానే సాటి అని నిరూపించుకుంది.

* పులుపుల శివయ్య రచించిన ప్రసిద్ధ పల్నాటి గేయాల్ని టైటిల్స్‌లో వాడుకున్నారు.

* ఇది జాతీయ స్థాయిలో ప్రాంతీయ విభాగంలో ఉత్తమ చిత్రంగా నిలిచింది.

* నాగమ్మగా నటించిన భానుమతికి రాష్ట్రపతి బహుమతి లభించింది.


మహాభారతంలో పోలికలెన్నో:

పల్నాటి చరిత్రకి, మహాభారత కథకు ఎన్నో పోలికలు కనిపిస్తాయి. భారతంలో సుయోధనుని పాత్ర నలగామరాజుకు సరిపోతుంది. నాయకురాలు నాగమ్మ పాత్ర శకునికి, ధర్మరాజు పాత్ర మలిదేవునికి, అభిమన్యుని పాత్ర బాలచంద్రునికి సరిపోయేలావుంటుంది. ఇక కృష్ణుడికి బ్రహ్మనాయుడి పాత్రకు సారుప్యముంది. భారతంలో మాయాజూదంలో పాండవులు రాజాన్ని కోల్పోతే, పల్నాటి చరిత్రలో కపట కోడిపందెంలో ఓడి మలిదేవుడు రాజ్యభ్రష్టుడయ్యాడు. పాండవులు పన్నెండేళ్లు అడవులపాలైతే, మలిదేవుడు ఏడు సంవత్సరాలు అడవిపాలవుతాడు.


తొలినాటి ‘పల్నాటి యుద్ధం’ విశేషాలు..
* తెలుగులో వచ్చిన తొలి చారిత్రాత్మక చిత్రంగా ‘‘పల్నాటి యుద్ధం’’ (1947) చరిత్రపుటలకెక్కింది. నిర్మాత గూడవల్లి రామబ్రహ్మం ఈ చిత్రాన్ని తన భార్య శారదాంబ పేరిట ‘‘శారదా ప్రొడక్షన్స్‌’’ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రానికి న్యూటోన్‌ స్టూడియోకి చెందిన జితేన్‌ బెనర్జీ, దిన్షా టెహరానీ భాగస్వాములు, వీరద్దరూ ఈ సినిమాకు వరసగా ఛాయాగ్రహణం, శబ్దగ్రహణం నిర్వహించారు.

* సినిమా మొదలై పదిశాతం తయారయిందో లేదో రామబ్రహ్మం పక్షవాతంతో మంచాన పడ్డారు. ఆ తరువాత నిర్మాణ బాధ్యతలు రామబ్రహ్మం బావమరిది కోగంటి వెంకట సుబ్బారావు చేపట్టారు. అలాగే దర్శకత్వ బాధ్యతలను ఎల్‌.వి.ప్రసాద్‌ చేపట్టారు.

* కారెంపూడి దేవాలయంలో భద్రపరిచిన అలనాటి ఆయుధాలకు నకళ్లు తయారు చేయించి ఈ సినిమాలో వాడారు. సినిమా విడుదలకు ముందే 1946 అక్టోబరులో రామబ్రహ్మం కాలం చేయడంతో సినిమాను రామబ్రహ్మం దంపతుల స్మృతికి అంకితమిచ్చారు. రామబ్రహ్మం మరణించాక ఆ సంస్థ ఆర్థికంగా చితికిపోవడంతో యల్‌.వి.ప్రసాద్‌ బొంబాయిలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి మరాఠీలో వచ్చిన ‘‘చందారావు మోరే’’ చారిత్రాత్మక సినిమాలోని దృశ్యాలను సంపాదించి, యుద్ధ సన్నివేశాలకు అనుసంధానించారు. అలా సినిమాను తక్కువ ఖర్చుతో పూర్తి చేశారు.
* అటు అక్కినేనికి, ఇటు ఘంటసాలకు ‘‘పల్నాటి యుద్ధం’’ కేవలం ఐదవ సినిమా కావడం విశేషం. రామబ్రహ్మం బ్రహ్మనాయుడు పాత్రకు తొలుత నాగయ్యను అనుకున్నా, ఆయన వేరే సినిమాలతో తలమునకలుగా వుండడంతో ఆ పాత్ర గోవిందరాజుల సుబ్బారావుకు దక్కింది.

* ఇందులో అక్కినేని తన పాటలను తానే పాడుకున్నారు. ఈ చిత్రం దేశ స్వాత్రంత్య్రానంతరం 1947 సెప్టెంబర్‌ 24న విడుదలై జయభేరి మ్రోగించింది. ఇందులో పల్నాటి బ్రహ్మనాయుడుగా గోవిందరాజుల సుబ్బారావు, నాగమ్మగా కన్నాంబ, నలగామరాజుగా శ్రీవత్స, నరసింహరాజుగా లింగమూర్తి, బాలచంద్రుడుగా అక్కినేని నాగేశ్వరరావు, మాంచాలగా యస్‌.వరలక్ష్మి ప్రభుతులు నటించారు.

- ఆచారం షణ్ముఖాచారిCopyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.