అరవై ఐదేళ్ళ ‘పెద్దమనుషులు’!
వాహినీ సంస్థ కె.వి.రెడ్డి దర్శకత్వంలో ‘భక్తపోతన’ (1943) నిర్మించిన తరువాత ఒక ఒప్పందానికి వచ్చింది. ఒక సినిమా కె.వి.రెడ్డి తీస్తే తరువాత సినిమా బి.ఎన్‌.రెడ్డి తీయాలి. ఇది కంపెనీ మూల పురుషుడైన మూలా నారాయణ స్వామి చేసిన ఏర్పాటు. ఈ ఏర్పాటు ప్రకారం, ‘పోతన’ తరువాత బి.ఎన్‌. ‘స్వర్గసీమ’ (1946) తీశారు. తర్వాత కె.వి. ‘యోగివేమన’ (1947) తీశారు. ‘వేమన’కి అఖండమైన పేరు ప్రతిష్టలొచ్చినా పెన్నిధి లభించలేదు. సంస్థకి మూలధనం కావాలి. అవి జానపద చిత్రాల రోజులు. ఒక జానపదం నిర్మిస్తే కాసులు రాలవచ్చన్న అభిప్రాయంతో ఉన్నప్పుడు - అలాంటి సినిమా తీయ్యడం తనకి చేతకాదని బి.ఎన్‌.అంటే కె.వి.రెడ్డే ‘గుణ సుందరి కథ’ ఆరంభించారు. ఇది 1949లో విడుదలైంది. శతదినోత్సవాలు జరుపుకుని వాహినికి ధనరాసులు చేకూర్చి పెట్టింది. అప్పుడు బి.ఎన్, ‘మల్లీశ్వరి’ (1951) తీశారు. ఈ చిత్రం నష్టం తీసుకురాలేదుగాని లాభాలు తేలేదు. కె.వి. విజయవారికి ‘పాతాళభైరవి’ (1951) తీసారు. ఆయన ఎప్పుడూ ఒకేసారి, ఒక్క చిత్రమే తీస్తారు. ‘‘ఐ డోన్ట్‌ హేవ్‌ టూ బ్రెయిన్స్‌’’ అనేవారు. ‘మల్లీశ్వరి’ తరువాత కె.వి. వాహిని వారికి చిత్రం తియ్యాలి. ఏవో కొన్ని అంతర్గత కారణాల వల్ల బి.ఎన్‌.రెడ్డి ‘బంగారుపాప’ ఆరంభిస్తే కె.వి.రెడ్డి ‘పెద్దమనుషులు’ ఆరంభించారు. రెండూ వాహిని వారివే - రెండూ 1954లోనే వాచ్చాయి. (పెద్దమనుషులు విడుదల మార్చి 11, 1954).


* కేవీ మొదటి సాంఘికం
‘పెద్దమనుషులు’ కె.వి.రెడ్డి మొదటి సాంఘిక చిత్రం. దీనికి ఒక రచయిత కావాలి. ఆయన విధానం ఏమిటంటే రచయిత కూడా, తనతోపాటే వుంటూ తను దృష్టి సారించినట్టుగా ఆ సినిమా మీదనే దృష్టి పెట్టుకోవాలి. నాగేంద్రరావు విజయలో నెల జీతం మీద వున్నారు. సముద్రాల రాఘవాచార్యులు ఖాళీగా లేరు. మంచి ఆలోచన చెయ్యగల రచయితల కోసం ఆలోచిస్తూ వుండగా కాజ వెంకట్రామయ్య - డి.వి.నరసరాజు పేరు సూచించాలని అనుకున్నారు. కానీ ప్రత్యక్షంగా చూపించాలని భావించి నరసరాజు రాసిన ‘నాటకం’ నాటక ప్రదర్శన చూపించారు. ‘పాతాళభైరవి’ శతదినోత్సవాల సందర్భంగా బృందం అంతా విజయవాడలో వున్నప్పుడు ఖాళీగా ఉన్న ఆదివారం ఉదయం ప్రదర్శించారు. ఆ సంవత్సరం తెనాలిలో జరిగిన ఆంధ్ర నాటక కళా పరిషత్తు నాటక పోటీల్లో ‘నాటకం’కి ఉత్తమరచన, ప్రదర్శన బహుమతులు వచ్చాయి. కె.వి.రెడ్డికి నరసరాజు రచనా విధానం నచ్చింది. అలా నరసరాజు ఏ ప్రయత్నం లేకుండానే - ‘పెద్దమనుషులు’కి రాసే అవకాశం వచ్చింది!

పెద్ద స్టార్సుని పెట్టుకోకుండా, తక్కువ బడ్జెట్‌లో ‘పెద్దమనుషులు’ తియ్యాలని - ఆలోచించి రామచంద్ర కాశ్యప, ఎ.వి.సుబ్బారావు, చదలవాడ కుటుంబరావు, వంగర, గౌరీనాథ శాస్త్రి వంటి వారిని ముఖ్యపాత్రలకి ఎన్నిక చేశారు. లింగమూర్తి, శ్రీరంజని ముఖ్య పాత్రల్లో ఉన్నారు. సినిమాలో మున్సిపల్‌ ఛైర్‌మన్‌ పాత్ర ప్రధానమైనది. ముందుగా, చిత్తూరు, నాగయ్యని, యస్‌.వి.రంగారావుని ఆ పాత్రకి అనుకున్నారుగాని, చివరి నిమిషంలో గౌరీనాధ శాస్త్రిని నిర్ణయించారుట.


* ఊరి రాజకీయలు...
ఊళ్లను పాలించే మునిసిపాలిటీలోని అక్రమాల్ని, అరాచకాల్నీ తీసుకుని వ్యంగ్య ధోరణిలో ‘పెద్దమనుషులు’ చిత్రాన్ని రూపొందించారు. కౌన్సిలర్ల స్వార్ధం ఎలా ఉంటుందో, వాళ్ల అవినీతి ఎలా ఉంటుందో ఈ చిత్రం చెప్పింది. ‘పెద్దమనుషులు’ అంటే నిజమైన అర్ధం కాదు. వ్యంగ్యార్ధం వచ్చేలా ఆ పేరు పెట్టారు. అయితే, ఆరంభంలోనే ఈ చిత్ర నిర్మాణానికి ఆటంకాలు వచ్చాయి. ఈ సినిమా కళాదర్శకుడు ఎ.కె.శేఖర్‌ సెట్స్‌కి స్విచెస్‌ వేసి, ఫ్లోర్స్‌ కావాలని నాగిరెడ్డిని అడిగితే ఆయన తిరస్కరించారుట. చేసేది లేక, ‘పెద్దమనుషులు’ని రేవతి స్టూడియోలో నిర్మించారు. ‘‘వాహిని వారి చిత్రానికి వాహిని స్టూడియోలో అవకాశం లేకపోవడం ఏమిటని?’’ అని తీసిన వాళ్లు అనుకున్నారు. ఇందులో వ్యంగ్య ధోరణిలో ఉన్న పాటలు రాయాలి. ఎవరి చేత రాయించాలి? అని ఆలోచిస్తున్నప్పుడు, నరసరాజు, కొసరాజు రాఘవయ్య చౌదరి పేరు సూచించారట. కొసరాజు ఎప్పుడో ‘రైతుబిడ్డ’లో పాటలు రాసి, వేషంవేసి, తన ఊరు వెళ్లిపోయారు (1939). ఈ సినిమాకి ఆయన్ను రప్పించి పాటలు రాయిస్తే కొసరాజు తిరిగి వెనక్కి చూడకుండా మద్రాసులో స్థిరపడి, వేలాది పాటలు రాశారు. అలా - ‘పెద్దమనుషులు’ చిత్రం డి.వి.నరసరాజు వంటి గొప్ప రచయితనీ, కొసరాజు వంటి పాటల రచయితనీ - తీసుకువచ్చింది.


* పకడ్బందీ ప్రణాళిక...
కె.వి. తను తియ్యదలచుకున్న ఏ కథనైనా క్షుణ్ణంగా చర్చిస్తారు. లోపాలన్నీ సర్దుకుంటారు. స్క్రీన్‌ప్లే రాసుకోవడంలో ఎంతో జాగ్రత్త వహిస్తారు. అన్నీ అయ్యాక పూర్తిగా తృప్తి చెందాక, సంబాషణలు రాయిస్తారు. దృశ్యానికి కొలతలు వేస్తారు. సంభాషణలు నిడివి ఎక్కువైతే తగ్గిస్తారు. ఈ విధానానికి ఎన్ని రోజులు, నెలలు పట్టినా సరే, నిరీక్షించవలసిందే. తాను దర్శకుడు గనక ఒక్క దర్శకత్వం మీదనే ఆలోచన నిలుపుకోరు. నిర్మాణం కూడా చూసుకుంటారు. షూటింగ్‌ తేదీలు ఏఏ రోజున ఏఏ దృశ్యాలు తియ్యాలి - అవన్నీ రాసుకుంటారు. ఇది సినిమా శాస్త్రం. ఆ శాస్త్రాలు తెలిసిన, పాటించిన ఏకైక దర్శకుడు కె.వి.రెడ్డే.


* కదనుతొక్కిన కథనం...

‘పెద్దమనుషులు’ కథాంశం ఊళ్లో ఉన్న మునిసిపల్‌ ఛైర్‌మెన్, కౌన్సిలర్ల ఆగడాలు అయితే, రామదాసు అనే ఉత్తముడు కూడా కౌన్సిలర్లలో ఉండి తన పత్రిక ద్వారా అక్రమాలు బయటపెడుతూ ఉంటాడు. అతని మీద తక్కినవారికి మంట. కౌన్సిలర్లలో ఒకడు - ఆలయ పూజారి. ఆలయంలోని ద్వజస్థంభం కింద నిదులున్నాయని - కనిపెడతాడు. ఛైర్‌మెన్‌ ధర్మారావు వితంతువు చెల్లెలు - తన కారు డ్రైవరుతో సంబంధం పెట్టుకుందని - అతన్ని తుపాకీతో కాల్చి చంపేస్తాడు ధర్మారావు. అయితే రామదాసు ఆ నేరాన్ని తన మీద వేసుకుని జైలుశిక్ష అనుభవిస్తాడు. ధర్మారావు అతను చేసిన త్యాగాన్ని లక్ష్య పెట్టకుండా కత్తి కడతాడు. అనాధ శరణాలయం నిర్వాహకురాలితో సంబంధం అంటకడతాడు. ధర్మారావు, ఇతర కౌన్సిలర్లు రామదాసు తమ అక్రమాల్ని బయటపెడతున్నాడని కక్ష పెట్టుకుంటారు. చివరికి గుడిలో ఉన్న నిధి కోసం ఆశపడి - ధర్మారావు, అనుయాయులు రాత్రివేళల్లో తవ్వుతూ ఉండగా పునాదులు కూలి మరణిస్తారు.


* కథ... ఓ క్లాసిక్‌
ఈ సినిమా కథ - ఒక క్లాసిక్‌. ఇందులో ఇతర పాత్రల్లో ఛైర్‌మన్‌ తమ్ముడు శంకరయ్యది గొప్ప పాత్ర. పిచ్చివాడిలా తిరుగుతున్నా అన్న అన్యాయాల్ని దులిపేస్తూ ఉంటాడు. ఈ పాత్రదారి రేలంగి - మహాద్భుతంగా నిర్వహించాడు. రేలంగిని ఎప్పుడు అడిగినా - తను ధరించిన వేలాది పాత్రల్లో తనకి బాగా నచ్చిన పాత్ర - తిక్క శంకరం పాత్రేనని చెప్పేవారు. ఈ సినిమాలో హీరో అంటూ లేడు. ధర్మారావు కొడుకు - రామదాసు కూతురు మీద ప్రేమ పెంచుకుంటాడుగాని, డ్యూయెట్లు పాడడం, పార్కుల్లో విహరించడం చెయ్యడు. ఆమె పాత్ర అంధురాలు. రామచంద్ర కాశ్యప, శ్రీరంజని పాత్రలో నటించారు. గౌరీనాథశాస్త్రి ఛైర్‌మన్‌ పాత్రలో ఎక్కడా అతి చెయ్యకుండా ఏమీ ఎరగనివాడిలా ఎంతో సహజంగా నటించారు. చదలవాడ, ఎ.వి.సుబ్బారావు, వంగర కౌన్సిలర్లు. నటనలో ఎవరికివారే. చిత్రంలో ఎక్కడా నినాదాలు గానీ, దీర్ఘ సంబాషణలుగానీ వుండవు. వ్యంగ్యంతో కూడిన ఎన్నో సంభాషణలు హాయిగా నవ్విస్తాయి. అసలు సినిమా వేరే - వ్యంగ్యం. ‘పెద్దమనుషులు’ అనే పేరు వ్యంగ్యం స్ఫురించేలా పెట్టారు. అప్పట్నుంచి ‘పెద్దమనిషి’ అంటే - అర్ధం మారిపోయింది. చాలామంది వ్యంగ్యార్ధంగాలోనే వాడేవారు. వాడుతున్నారు. మొదట్లో ‘వాహినీ’ వారి ‘పెద్దమనుషులు’ అని ప్రకటనలు ఇవ్వాలనుకుంటే - ఒకసారి పెద్దలు హేళన చేశారుట. షూటింగ్‌ జరుగుతున్న సమయంలో కె.వి.రెడ్డి, నరసరాజు వాహిని స్టూడియోకి వెళ్తే వీళ్లని చూసిన పెద్దలు ‘అదిగో వస్తున్నారు- వాహిని ‘పెద్దమనుషులు’ అన్నారుట. అప్పుడు కె.వి. - నరసరాజు ఇద్దరూ ‘‘ఇదేదో డేంజర్‌లా వుంది. మనం జాగ్రత్తపడదాం’’ అని - ప్రకటనల్లో అలా వెయ్యకుండా - ‘‘పెద్దమనుషులు: ఇది వాహిని వారి చిత్రం’’ అని వేశారు. ‘క్లాస్‌’ చిత్రం అని ముద్రపడింది. కానీ, ఆ రోజుల్లో సినిమా చూసిన - అనేకమంది సినిమా అభిమానులు - ‘నభూతో నభవిష్యత్‌’ అన్నారు. అయితే అందరూ అనుకుంటున్నట్లు ఇది ‘‘పిల్లర్‌ ఆఫ్‌ ది సొసైటీ’’ పుస్తకానికి అనుకరణ కాదని, తాము కథంతా అనుకున్న తరువాత ఆ పుస్తకం చదివామనీ నరసరాజు చెప్పేవారు. నరసరాజు మాటలు, కొసరాజు పాటలూ ప్రసిద్ధి గడించాయి. కొసరాజు ‘నందామయ’ పాటలోని రాజకీయనాయకుల్ని ఉద్దేశిస్తూ ‘‘గొర్రెల్ని తినువాడు గోవింద కొడతాడు, బర్రెల్ని తినువాడు వస్తాడయా’’ లాంటి విసుర్లు జనాల్ని ఆకర్షించాయి. అలాగే ‘శివశివమూర్తివి గణనాధ’లో ‘ఒక్కసారి మంత్రి చెయ్యి గణనాథా’ లాంటి చరణాలకు ప్రేక్షకులు చప్పట్లు కొట్టేవారు. చదలవాడ చేత చెప్పించిన ‘‘సొంత డబ్బుతో ఎన్నాళ్ళు చేస్తాం ప్రెజాసేవ’’, పత్రిక చూసి, ‘‘మన ఫోటోలు పడ్డట్లు లేవే’’ లాంటి సంభాషణలు దైనందిన జీవితంలో చోటు చేసుకున్నాయి. అరవై సంవత్సరాల క్రితం వచ్చిన ‘పెద్దమనుషులు’ సినిమాని ఇవాళ చూస్తే - ఎంతో కొత్తగా, తాజాగా కనిపిస్తుంది. తెలుగు సినిమా తల్లి ధరించిన ఆభరణాల్లో ‘పెద్దమనుషులు’ కూడా ఒక ముఖ్య ఆభరణం!

- రావి కొండలరావు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.