ఫలించని బి.ఎన్‌. ‘పూజాఫలము’
సినిమా అనేది ఒక వ్యాపారం. కానీ, దానిని ఒక కళారూపమని నమ్మి కాసులు రాల్చే సాధనం కాదని నిరూపించి, ఆచరించిన మహనీయుడు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి అనే బి.ఎన్‌.రెడ్డి. ఆయన రూపొందించిన ప్రతి చిత్రమూ ఒక కళాఖండమే. కళాకారునికి సమాజం పట్ల గురుతర బాధ్యత ఉందని.. అశ్లీల సంభాషణలు, అసభ్యకరమైన పాటలు చిత్రరంగాన్ని మలినపరిచే అంశాలని నినదించి, నమ్మిన విలువలకు పట్టంకట్టిన ధీశాలి. సాహితీ ప్రపంచంలో వర్థిల్లిన దేవులపల్లి కృష్ణశాస్త్రి వంటి గొప్ప కవులను సినీరంగానికి పరిచయం చేసినది బి.ఎన్‌.రెడ్డి. ‘‘వాహినీ సంస్థ చిహ్నమే ఒక సెన్సార్‌ సర్టిఫికేట్‌’’ అని సెన్సార్‌ సభ్యుడే ఆ రోజుల్లో ప్రశంసించారంటే అంతకన్నా కితాబు బి.ఎన్‌.కి ఏం కావాలి? సృజన చెడిన ఒక సున్నిత మనస్కుడైన కళాకారుడు ఎంత వ్యాకులత చెందుతాడో అర్థవంతంగా చిత్రీకరించిన కళాఖండమే బి.ఎన్‌.దర్శకత్వం వహించిన శంభూ ఫిలిమ్స్‌ వారి ‘పూజాఫలము’ సినిమా, నూతన సంవత్సర కానుకగా జనవరి 1, 1964న విడుదలైన ఈ సినిమా 55 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా అందిస్తున్న వ్యాసమిది.

                                   

చిత్రకథ ఏంటంటే...
మధు (నాగేశ్వరరావు) జమీందారు బిడ్డ. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి తాతగారి చెంత నౌకర్ల చేతుల్లో పెరుగుతాడు. మితభాషి. సంగీత ప్రియుడు. అతని జీవితంలోకి ముగ్గురు విభిన్న మనస్తత్వాలు గల మగువలు తారసపడతారు. వారిలో వాసంతి (జమున) చురుకుగల యువతి. సున్నిత మనస్కుడైన మధు జీవితంలో ప్రణయ భావావేశం మొగ్గలు తొడిగి, అది చిగురించిన వేళ వెన్నెలలు కురిపించినట్లే చేసి అర్థాంతరంగా మధుకి దూరమవుతుంది. చనిపోయిన తన అన్నను మధులో చూచుకొని చనువు పెంచుకుందే కానీ, మధు ఊహించినట్లు అతనిని ప్రేమించి కాదు. వాసంతి రాసిన ఉత్తరాన్ని చదివి ఖిన్నుడైన మధు నిరాశకు లోనవుతాడు. తరువాత అతని జీవితంలోకి తన ఎస్టేటు వ్యవహారాలు చూసే దివాను రామకృష్ణయ్య (గుమ్మడి) కూతురు సీత (సావిత్రి) ప్రవేశించి అతనిలో అనురాగం చిగురింపజేస్తుంది. విచిత్ర మనస్కుడైన మధు తన మనసులోని భావాల్ని సీతకు చెప్పుకోలేక చిక్కుల్లో పడతాడు. చెదిరిన మధు హృదయానికి సీత ఒక ఆదర్శనారిలాగే ఉపశమనం కలిగిస్తుంది. అంతలోనే వచ్చిన అవాంతరంలో పట్టుతప్పిన మధు నీలనాగిని (ఎల్‌.విజయలక్ష్మి) అనే వగలాడి చేతుల్లో చిక్కి, బంధువు గోవిందయ్య (రమణారెడ్డి) ఆస్తి కోసం వేసిన దావాలో ఇరుక్కుంటారు. చివరకు మధు దావా నెగ్గగా, గోవిందయ్య మధుని లారీ ప్రమాదానికి గురిచేస్తాడు. మధుకి మతి భ్రమిస్తుంది. దివాను, వాసంతి భర్త (జగ్గయ్య) సహాయంతో స్వస్థత పొంది మధు సీతను స్వీకరిస్తాడు. సీత చేసిన పూజకు ఫలప్రాప్తి దక్కుతుంది.

                               
విశేషాంశాలు
ఈ సినిమా కథకు మూలం మునిపల్లె రాజు రచించిన ‘పూజారి’ నవల. డి.వి.నరసరాజు సంభాషణలు, స్క్రీన్‌ప్లే సమకూర్చారు. శంభూ ఫిలిమ్స్‌ పతాకంపై ‘నమ్మినబంటు’ చిత్రాన్ని నిర్మించిన యార్లగడ్డ వెంకన్న చౌదరి మేనల్లుడు దగ్గుబాటి లక్ష్మీనారాయణ చౌదరి నిర్మాత. ముప్పై సంవత్సరాల సినీ చరిత్రలో బి.ఎన్‌.రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలు కేవలం పదకొండే అంటే నమ్మశక్యం కాదు. అందులో ‘భాగ్యరేఖ’ (పొన్నలూరి బ్రదర్స్‌) చిత్రం తరువాత బయట సంస్థకు దర్శకత్వం వహించిన చిత్రం ‘పూజాఫలము’ ఒక్కటే. మిగతా తొమ్మిది సినిమాలు వాహినీ బ్యానర్‌పై బి.ఎన్‌. నిర్మించినవి కావటం గమనార్హం. బి.ఎన్‌.రెడ్డి దర్శకత్వంలో అక్కినేని నటించాలని అభిలషించటం కూడా ఈ చిత్రానికొక కారణంగా చెప్పుకోవచ్చు. బి.ఎన్‌.కి సంతృప్తి కలిగించినదీ చిత్రం ‘పూజాఫలము’. కానీ బాక్సాఫీసు వద్ద దెబ్బతింది. ‘రాజమకుటం’ చిత్రం పరాజయం తరువాత ఐదేళ్లకు చేపట్టిన ‘పూజాఫలము’ సినిమా కూడా బాగా ఆడకపోవడంతో బి.ఎన్‌. మరో మూడేళ్ల దాకా మరో చిత్రం జోలికి వెళ్ళలేదు. తరువాత తీసిన సినిమా ‘రంగుల రాట్నం’ (1967) ఢంకా భజాయించింది. ‘పూజాఫలము’ ఆసాంతం సీరియస్‌గా సాగుతుంది. ‘పునర్జన్మ’ సినిమాలో మతిభ్రమణం చెందినట్లే ఈ చిత్రంలో కూడా అక్కినేనికి అదే జరుగుతుంది. ఆ సినిమాలో అక్కినేని కళాకారుడు. సితార్‌ విద్వాంసుడు. ఇక్కడ కూడా ఆయన కళాకారుడే. వయోలిన్‌ విద్వాంసుడు కూడా. బహుశా ‘పునర్జన్మ’ చిత్ర పరాజయం ‘పూజాఫలము’పై ప్రభావం చూపి చిత్ర విజయానికి గండికొట్టి ఉండవచ్చు. ఈ సినిమాలో సీరియస్‌ సన్నివేశాలు వచ్చినప్పుడల్లా దివాణంలో శాండ్లియర్‌ సింబాలిక్‌గా తిరుగుతూ ఉంటుంది. హెడ్మాస్టరు పాత్రలో ధ్వన్యనుకరణ చక్రవర్తి నేరేళ్ళ వేణుమాధవ్, అక్కినేని తాతగా దగ్గుబాటి రాఘవయ్య చౌదరి కనిపిస్తారు. రమణారెడ్డి, రేలంగి, పొట్టి ప్రసాద్‌ వంటి హాస్యనటులు ఈ సినిమాల్లో ఉన్నా, వారి నటన పాత్రలకే పరిమితమై హాస్యాన్ని అందించలేకపోయింది. ముఖ్యంగా పొట్టి ప్రసాద్‌ని స్కూల్‌ ఫైనల్‌ విద్యార్థిగా చిత్రీకరించటం, స్కూల్‌ విద్యార్థిగానే రాజశ్రీతో ప్రేమాయణం సాగించటం సహజ విరుద్ధమనిపిస్తుంది. నాగేశ్వరరావు వయోలిన్‌ వాయించే విధానం ఎంతో సహజంగా ఉంటుంది. ప్రముఖ వాయులీన విద్వాంసులు పరూర్‌ గోపాలక్రిష్ణన్‌ వద్ద నాగేశ్వరరావు ఈ చిత్రం కోసం ఫిడేలుపై వేళ్లు ఎలా కదపాలో శిక్షణ తీసుకున్నారు. ఫిడేలు సంగీతమే ఈ చిత్రానికి హైలైట్‌. జమున పియానో మీద ‘‘పగలే వెన్నెలా’’ పాట పాడితే, వైవిధ్యం చూపటానికి సావిత్రి చేత అదే పాటను సితార మీద పలికిస్తారు. పేకేటి శివరాం పాత్ర దేవదాసు చిత్రంలో భగవాన్‌ పాత్రను తలపింపజేస్తుంది. అత్యద్భుత కథాంశంతో తీర్చిదిద్దినా ఈ సినిమా ఎందుకో జనానికి ఎక్కలేదు. కేవలం విజయవాడ, గుంటూరులో మాత్రం 100 రోజులు ఆడింది.
సలలిత రాగసుధలు
ఈ సినిమాకి సంగీతం ఆయువుపట్టు. ముఖ్యంగా పరూర్‌ గోపాలక్రిష్ణన్‌ వాయులీన విన్యాసం వెలకట్టలేనిది. ఈ చిత్రంలో మొత్తం 10 పాటలున్నాయి. ‘‘పగలే వెన్నెలా.. జగమే ఊయలా’’ పదప్రయోగం విలక్షణంగా ఉండి శాశ్వతత్వాన్ని సంతరించుకొంది. ‘పూల ఋతువు’, ‘కన్నెవాగు’, ‘తేనెజల్లు’ వంటి సినారె మార్కు ప్రయోగాలు పాటకు వన్నె తెచ్చాయి. బి.ఎన్‌.రెడ్డి ఈ పాటను తనకు నచ్చేదాకా సినారె చేత తిరగ రాయించి, సాలూరు రాజేశ్వరరావు చేత ‘‘కన్నులుంటే’’ అనే పదాన్ని సాగదీసి ఆలపించేలా హిందోళ రాగంలో స్వరరచన చేయించారు. అందుకే ప్రకృతి అందాలను వర్ణించే ఈ పాట ఈ రోజుకీ అజరామరమే! ఈ పాట వెంటనే వినిపించే ఘంటసాల గీతం ‘‘నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో.. తెలియరాని రాగమేదో తీగసాగె నెందుకో’’ కూడా సినారె రచనే. జమున పాడిన ‘‘పగలే వెన్నెలా’’ పాటకు ‘కౌంటర్‌ సాంగ్‌’ ఈ శుద్ధ సావేరి రాగంలో సాగే పాట. పూదోటలో విహరిస్తూ ప్రకృతి అందాలకు మైమరచి హీరో పరవశంతో పాడే పాట ఇది. మరో సినారె గీతం ‘‘ఎందు దాగి ఉన్నవో బృందావిహారీ.. నీ పాద ధూళినై నిలువనీయవోయి’’ని సావిత్రి మీద చిత్రీకరించారు. పరోక్షంగా తన ప్రేమను సావిత్రి వ్యక్తపరిచే ఈ గీతాన్ని రాజేశ్వరరావు అభేరి రాగంలో స్వరపరిచారు. పాట చిన్నదే అయినా చాలా బాగుంటుంది. సావిత్రి పాడే మరో పాట ‘‘అందేనా ఈ చేతల కందేనా చందమామ ఈ కనులకు విందేనా’’ దేవులపల్లి రచన. ‘‘తలపు దాటనీక మనసుతలుపు వేయగలనుగానీ.. కలువ పేదబ్రతుకులోన వలపు తేనె నింపినా’’ ప్రయోగం ఎంత గొప్పదో, సుశీల ఆలాపన కూడా అంతే గొప్పగా ఉంటుంది. ఘనం శీనయ్య కీర్తన ‘‘శివదీక్షాపరురాలనురా.. నేశీలమింతైన విడువజాలనురా’’ జానకి ఆలపించింది. నృత్య దర్శకుడు పసుమర్తి కృష్ణమూర్తి ఈ కీర్తనను ఎల్‌.విజయలక్ష్మి సంప్రదాయ నృత్యానికి సరిపడే విధంగా రూపొందించారు. జానకి ఆలపించిన సినారె జావళి ‘‘మదనా మనసాయెరా.. పరువము పొంగె తరుణము నేడు మరి మరి నీకై రాబోదురా’’ కూడా అభేరి రాగంలో రాజేశ్వరరావు స్వరపరిచారు. ఈ పాటకు ఎల్‌.విజయలక్ష్మి నృత్యం బాగుంటుంది. ఇంకా స్వర్ణలత, సత్యారావు పాడిన ‘‘వన్నె చిన్నెలదీ గులాబీ’’ అనే కవ్వాలీ పాట; కొసరాజు రాయగా వసంత పాడిన ‘‘వస్తావు పోతావు నాకోసం’’ పాట కూడా సిన్నివేశాలకు సరితూగేవే!

                         
ముక్తాయింపు
ఇప్పుడొస్తున్న చిత్రాలు ‘న్యూవేవ్‌’ కాదు ‘న్యూడ్‌ వేవ్‌’ చిత్రాలని ఒకానొక సందర్భంలో బి.ఎన్‌.రెడ్డి చమత్కరించారు. సినిమా విజయవంతం కానంత మాత్రాన బి.ఎన్‌. విలువ తగ్గలేదు. పద్మభూషణ్, దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారాలు ఆయన్ని వరించాయి.

- ఆచారం షణ్ముఖాచారి  


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.