'పూలరంగడు' పోయి 'ఆత్మగౌరవం' వచ్చే..

అన్నపూర్ణ వారి ‘పూలరంగడు’ (24-11-1967) అదే సంస్థ నిర్మించిన ‘ఆత్మగౌరవం’ (18-03-1966) కన్నా ముందే తెరకెక్కి ఉండాల్సింది. అంతేకాదు దర్శకుడిగా కె.విశ్వనాథ్‌కి ‘పూలరంగడు’ తొలి చిత్రం కావాల్సింది. కానీ అలా జరగకపోవడం వెనుక ఓ కథ ఉంది. అదేంటంటే తొలుత అనుకున్న ‘పూలరంగడు’ కథ హీరో ఏఎన్నార్‌కి నచ్చలేదు. కథను ఎంపిక చేసుకొని తర్వాత టైటిల్‌ని ఖాయం చేయడం అన్నపూర్ణ అధినేత దుక్కిపాటి మధుసూదనరావుకి అలవాటు. దీనికి విరుద్ధంగా ఆయనకి ‘పూలరంగడు’ టైటిల్‌ నచ్చి, కె.విశ్వనాథ్‌ని దర్శకుడిగా తీసుకొని, టైటిల్‌కి అనుగుణంగా కథ రాయమని ముళ్లపూడిని కోరారట. ముళ్లపూడి అల్లిన కథ విషాదాంతం కావడంతో ఏఎన్నార్‌కి నచ్చక పోవడంతో చిత్రం వాయిదా పడింది. హీరోకి నచ్చేలా కథ రూపొందేవరకు దుక్కిపాటి కసరత్తులు మొదలు పెట్టారు. ఆలోగా యద్దనపూడి సులోచనారాణి రాసిన ‘ఆత్మగౌరవం’ కథ రంగ ప్రవేశం చేసింది. అది అందరికి నచ్చటంతో నిర్మాణ రథం కదిలింది. దర్శకుడిగా విశ్వనాథ్‌కి మొదటి చిత్రంగా ‘పూలరంగడు’ బదులు ‘ఆత్మగౌరవం’ రికార్డులోకి ఎక్కింది.

- శ్రీవత్స


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.